#31 సేపియన్స్. విశ్వదర్శనం.

October 21, 2020

ఆంగ్ల సాహిత్యంలో non fiction చదివే వారికి Yuval Noah Haraari రాసిన Sapiens పుస్తకం తప్పక తెలిసి ఉంటుంది. అమెరికా మాజీ రాష్ట్రపతి ఒబామా తో సహా, ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, Sapiens ను తప్పక చదవ వలసిన 21 వ శతాబ్దపు గ్రంథంగా కీర్తించారు. ఇంతకీ Sapiens కు అంత ప్రతిష్ట ఎందుకొచ్చిందంటే, చరిత్ర (History), మానవ శాస్త్రం (Anthropology) ని సమన్వయముచేస్తూ, పురాతన మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు, మానవ పరిణామ క్రమాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు.

ఆంగ్ల సాహిత్యంలో non fiction చదివే వారికి Yuval Noah Haraari రాసిన Sapiens పుస్తకం తప్పక తెలిసి ఉంటుంది.

అమెరికా మాజీ రాష్ట్రపతి ఒబామా తో సహా, ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, Sapiens ను తప్పక చదవ వలసిన 21 వ శతాబ్దపు గ్రంథంగా కీర్తించారు.

ఇంతకీ Sapiens కు అంత ప్రతిష్ట ఎందుకొచ్చిందంటే, చరిత్ర (History), మానవ శాస్త్రం (Anthropology) ని సమన్వయముచేస్తూ, పురాతన మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు, మానవ పరిణామ క్రమాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు.

‘ఇది మానవుడి ప్రగతే’ అని మనం నిస్సందేహంగా నమ్మే కొన్ని పరిణామాలను యువల్ ప్రశ్నిస్తాడు. ఉదాహరణకు, వ్యవసాయంతో ఆహార భద్రతను సాధించడం మానవుడి గొప్ప విజయాల్లో ఒకటి అనేది అందరి అంగీకారం పొందిన విశ్లేషణ. కానీ మానవుడు వ్యవసాయాన్ని లోబరచుకోలేదని, వ్యవసాయమే మానవుడిని లోబరుచుకున్నదని వాదిస్తాడు యువల్.

సంచార జాతులుగా ఆది మానవులు ఆహరం దొరికే చోట్ల విహరించే వారు. రోజుకు కొన్ని గంటలు శ్రమిస్తే, అందరికి కావలసిన ఆహరం సమకూరేది, దాంతో సమూహంలో ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపగలిగేవారు. ఆయా కాలాల్లో పండే కందమూలాలు తినటంవలన వారికి మెరుగైన వ్యాధినిరోధక శక్తి కూడా  ఉండేది.

ఎప్పుడైతే వ్యవసాయం చేయడం మొదలెట్టారో, అప్పటి నుంచి సంచరించటం మానేశారు. ఆహారం పండించడం కోసం నిరంతరం శ్రమిస్తూ, అప్పటివరకు తెలియని గొడ్డుచాకిరికి మానవుడు బానిస అయ్యాడంటాడు యువల్. పైగా వ్యాధులూ యుద్దాలూ కూడా ఒక చోట స్థిరపడడం తర్వాతే మొదలయ్యాయని యువల్ సూత్రీకరిస్తాడు.

ఈ పుస్తకం చదివినప్పుడు తెలుగులో గొప్ప విజ్ఞానం, తత్త్వ రచనలపై ఆసక్తి కలిగింది. సంక్లిష్టమైన ఖగోళ, భౌతిక విషయాలను అరటిపండు ఒలిచి అందించిన చందంగా నండూరి రామ్మోహన్ రావు గారు వ్రాసిన ‘విశ్వరూపం’ గురించి తెలిసింది. అణు శాస్త్రవేత్త శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, అంతరిక్ష పరిశోధకులు డా.మహీధర నళిని మోహన్ విజ్ఞాన రచనల గురించి తెలిసిన తర్వాత, వాటిని శ్రవణ రూపంలో అందించడం తన బాధ్యత గా  దాసుభాషితం  భావించింది.

ఇలా ఆలోచిస్తున్న సందర్భంలోనే, ఒక దాసుభాషితం అభిమాని నండూరు రామ్మోహ న రావు  గారు వ్రాసిన ‘విశ్వదర్శనం’ రచనను దాసుభాషితం లో అందించే వెసులును చూడమని సూచించారు.

పాశ్చాత్య, భారత తత్త్వ చింతనను విడివిడిగా విశ్లేషిస్తూ ‘విశ్వదర్శనం’ ను రామ్మోహనరావు గారు రెండు భాగాల్లో వ్రాసారు.

Viswadarsanam 1
Tap to listen


భారత తత్త్వ చింతన పుస్తకం, ఆర్యుల పూర్వరంగంతో ప్రారంభమై వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, చార్వాకం, భగవద్గీత మొదలైన వాటిని చర్చించి, జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో  ముగుస్తుంది. పశ్చిమ దేశాల తాత్వికులు పరలోకం కంటే ఇహలోకానికి,  భారతీయ తాత్వికులు ఇహలోకం కంటే పరలోకానికి ఎందుకు, ఎలా ప్రాధాన్యతనిచ్చారో ఈ గ్రంధం చర్చిస్తుంది.

ఈ గ్రంథాన్ని శ్రవణ రూపంలో అందించడానికి నండూరి రామ్మోహన్రావు గారి కుటుంబం ను సంప్రదించినపుడు వారు ఆనందంగా అంగీకరించారు. 6 భాగాలున్న  శ్రవణ పుస్తక మొదటి భాగం ఈవారం  విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము.

గుఱ్ఱం జాషువా

Jashuva Gurram Visleshana
Tap to listen

కళ్యాణి సినిమాలో ‘లలిత కళారాధనలో’ అనే మంచి పాట ఉంది. దానిలో కవులను హీరో కీర్తిస్తుంటే, కవిత్వం పోతనకు త్యాగయ్యకు పేదరికం తప్ప ఏమి ఇచ్చిందనీ, కడుపు నింపని కళలెందుకని హీరోయిన్ ప్రశ్నిస్తుంది.

శ్రీనాధుడు, అష్టదిగ్గజాలు తప్ప కవులలో చాలా మంది పేదరికం అనుభవించిన వారే. వారి అందరిలోకి గుఱ్ఱం జాషువా పేదరికం మరీ దయనీయం. ఎందుకంటే ఆయన తన ఆర్థిక దారిద్యంతో పాటు ఇతరుల భావ దారిద్యాన్ని కూడా అనుభవించారు.

జాషువా నిమ్న కులంలో పుట్టారు. అందులో ఆయన ప్రమేయం ఏమీలేదు.

జాషువా చిన్నతనంలో కొప్పరపు సుబ్బారావు గారి అవధానం జరిగిన సభలో తాను వ్రాసుకున్న పద్యాలను చదవడానికి వేదికనెక్కగా,  అంటరాని వాడు కవిత్వం రాయడమూ, వేదికనెక్కి చదవడం కూడానా అనే ఈసడింపు బాల జాషువాను చాలా బాధించింది.

పెద్దయిన తర్వాత కూడా కుల వివక్ష వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.

ʹనా కవితా వధూటి వదనంబు నెగాదిగాజూచి, రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి, ʹ భళీ భళీ ʹ యన్నవాడే ʹ మీ
రేకుల ʹ మన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో
బాకున క్రుమ్మినట్లుగును పార్థివ చంద్ర; వచింప సిగ్గగున్ ʹ

అని ఆవేదన చెందారు.

కానీ ఈ అవమానాలేవి ఆయనకు తన పాండిత్యం మీద తనకున్న నమ్మకాన్ని పోగొట్టలేకపోయాయి. అందుకనే,

ʹగవ్వకు సాటిరాని పలు గాకుల మూకలసూయ చేత నన్నెవ్విధి దూరినన్‌ నను వరించిన శారద లేచిపోవునే?ʹ

అనగలిగాడు.

దళితుడుగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న జాషువా కవిత్వంలో నిజానికి కాఠిన్యం ఉండాలి. అది న్యాయం కూడా. కానీ ఆయన కవిత్వంలో కరుణ పొంగుతుంది.

అయన కవిత్వంలో కాఠిన్యం ఉంటే, అది కేవలం వివక్ష ఎదుర్కునే వారికే ఉపయోగ పడేది. కరుణ రసం వల్ల అది నలుగురిలోకి వెళ్ళింది. సమాజాన్ని ఆలోచించేలా చేసింది. సిగ్గున్న వారిని తల దించుకునేలా చేసింది. చివరికి ఆయనకు దక్కవలసిన గౌరవం తెచ్చింది.

జాషువాను భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ తో సత్కరించింది. కానీ, అగ్ర కులానికి చెందిన మహా పండితుడు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రే స్వయంగా జాషువాకి గండపెండేరం తొడగడం, పద్మభూషణ్ కంటే గొప్ప గౌరవంగా జాషువా భావించి ఉంటారు.

ఈ వారం సాహిత్య విశ్లేషణ శీర్షికలో డా. మృణాళిని గారు శ్రీ గుఱ్ఱం జాషువా మీద చేసిన విశ్లేషణను వింటే జాషువా ను ఇంకా చదవాలనే పట్టుదల పెరుగుతుంది.

తురగా జానకీరాణి కథలు.

Turaga Janaki Rani Kathalu
Tap to listen

మా చిన్నతనంలో ఎండాకాలం సెలవుల్లో శని, ఆదివారాలు తప్పకుండా   చేసే పని, మధ్యాహ్నం రేడియోలో బాలానందం కార్యక్రమం వినడం. అదేమిటో కానీ ఆ సమయానికే ఎప్పుడు కరంటు పోయేది. గాలి కోసం  గడప దగ్గరే చాప వేసుకు పడుకుని  ట్రాన్సిస్టరులో ఆ కార్యక్రమాలను వినే వాళ్ళం.

ప్రతీ బాలానందం కార్యక్రమంలో రేడియో అక్కయ్య, అన్నయ్య తప్పకుండ ఉంటారు. ఈ అన్నయ్య/అక్కయ్య అనేవి బ్రహ్మ పదవుల్లాంటివి. అంటే వీరు ఏ ఒక్కరో కాదన్నమాట. మొదటి రేడియో అక్కయ్య శ్రీమతి న్యాయపతి కామేశ్వరి. ఆ పరంపరలో మరో తరానికి రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి.

రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేసి నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదులుతారు శ్రీమతి తురగా జానకీరాణి.

ఆ రోజుల్లో బాలానందం, ఎందరో బాలబాలికలకి సభా కంపం  పోగొట్టి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మాట్లాడటానికి, వారి లోని సృజనాత్మకత వెలుగు చూడటానికి  ప్రధాన వేదిక.  లాయర్లు, సినీ తారలు, NRIలు వివిధ రంగాల్లో ఈనాటి ప్రముఖులు ఎందరో తమకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో తమ అనుబంధాన్ని సందర్భం వచ్చినపుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటారు.

శ్రీమతి తురగా జానకీ రాణి వందకి పైగా కథలు వ్రాశారు. చాలావరకు నిత్య జీవితంలో ఆమెకు తారస పడిన మనుషులూ, సంఘటనలే ఆమె రచనలకు ప్రేరణగా, కథలకు వస్తువులుగా నిలిచాయి.

ఆమె కథల్లో పాత్రల మధ్య పరస్పర ప్రేమలకు, కుటుంబ విలువలకు, ప్రాధాన్యం ఉంటుంది. క్లిష్టమైన జీవితంలో స్త్రీలు ఎన్ని కష్టాలను దాటి వచ్చి, అలా సంతోషంగా ఉండ గలుగుతున్నారో కదా అని ఆమెకు అనిపించినా ప్రతిసారీ ఒక కథ రూపు దిద్దుకునేది.

వస్తు, వర్ణన పరంగాను, కల్పనాశిల్ప చాతుర్య పరంగాను, కథన నైపుణ్య పరంగాను, సహజ జీవిత చిత్రణ పరంగాను వన్నె కెక్కిన శ్రీమతి తురగా జానకీరాణి కథలు ఇపుడు శ్రవణ రూపంలో దాసుభాషితం యాప్ లో మీరు వినవచ్చు.


Image Courtesy :
Christopher Wink