అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జిల్లా విద్యా శాఖాధికారిగా పనిచేసి 2004 లో ఉద్యోగ విరమణ చేశాను. పుస్తక పఠనం, రచన, అప్పుడప్పుడు సినిమాలు, సంగీతం అభిరుచులు. హైద్రాబాదుతో దాదాపు 50 ఏళ్ళ అనుబంధం.
తెలుగు అంటే వల్లమాలిన అభిమానం.
పదవీ విరమణ తరువాత నా శ్రీమతితో భారత దేశంలో దాదాపు అన్నీ క్షేత్రాలని దర్శించాను. ఇతరులకు ఉపయుక్తంగా ఉంటుందని మా యాత్రలలో విశేషాలను గ్రందీకరించాను. మా కుటుంబ సభ్యులు, ఆ పుస్తకం చదివి రికార్డు చేస్తే, పని చేసుకుంటూ కూడా పుస్తకం చదివినట్టు ఉంటుంది కదా, అని ఒక సూచన చేసారు.
తెలుగు చదవడం వచ్చిన వారికే శ్రవణ పుస్తకం ఇంత ఉపయోగకరంగా ఉంటే , ఇక తెలుగు చదవడం రాని తెలుగు వారికి ఇంకెంత మేలో కదా అనిపించి, 2014 నుంచి అలా నాకు నచ్చిన పుస్తకాలను, ఆ రచయితల అనుమతితో, నా గళంలో రికార్డు చేయడం మొదలు పెట్టాను.
వాటిని దాసుభాషితం పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమాలకి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వారి నుంచి విశేష స్పందన అందింది. గత రెండేళ్లలోనే, దాసుభాషితానికి ప్రపంచ వ్యాప్తంగా 90 వేల పైచిలుకు శ్రవణాలు నమోదైయ్యాయి. చాలా మంది శ్రోతలు కార్యక్రమాలను వినటమే కాకుండా, ఇమెయిల్, ఫోన్ ద్వారానో లేక స్వయంగానో నన్ను అభినందించారు కూడా.
ఏ విధమైన ప్రచారమూ లేకుండా మారుమూల దేశాల్లో ఉన్న చిన్న పట్టణాల నుంచి సయితం, ఈ కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తమ మాతృభాష పట్ల ప్రవాసంలో ఉంటున్న తెలుగు వారికి ఉన్న ఆర్తి, తపన తెలుస్తున్నది.
అయితే దాసుభాషితం శ్రోతలు ఒక సూచన కూడా చేశారు. నేను ఎప్పటికప్పుడు నూతన సంచికలు రూపొందిస్తున్నాను కానీ, Soundcloud ద్వారా, కోరుకున్న పూర్వ సంచిక వద్దకు వెళ్లి తక్షణమే వినే వెసులుబాటు ఉండటం లేదు. శ్రోతల అభిమానాన్ని బాధ్యతగ గుర్తిస్తూ, వారి సూచనలకు అనుగుణంగా దాసుభాషితం వినటం ఇంకా సులువు చేసేందుకు, కార్యక్రమాలను ఆరు శాఖలుగా విభజించి, వాటిని Radio, Podcast, App ద్వారా అందించటానికి నిర్ణయించాను.
ఇంకా, కేవలం నేను ఇప్పటి వరకు చేసిన కృషికి ఆవాసం మాత్రమే కాకుండా, ప్రపంచంలో తెలుగు భాషా, కళాభిమాని ఎక్కడున్నా, మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో, సాంకేతికతతో తెలుగు వైభవాన్ని సులువుగా ఆనందించేట్టు చేసి, తద్వారా తెలుగు కళలన్నింటికీ విశాల ప్రయోజనం అందివ్వాలనే స్పృహతో, దాసుభాషితం ని తెలుగు సంగీత సాహిత్య కళా వేదికగా రూపకల్పన చేయడం జరిగింది.
ఈ కృషి మీకు సంతోషాన్ని ఇచ్చి నలుగురితో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
నన్ను సంప్రదించదలఁచుకుంటే, క్రింద మెసెంజర్ ను వాడండి. తప్పక ప్రతిస్పందిస్తాను.