#36 తెలుగును చక్రవర్తిని చేసిన త్యాగరాజు

Meena Yogeshwar
August 26, 2021

వ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక అభ్యున్నతికి సోపానాలను చూపించిన దార్శినికుడు, ఎందరికో గురుతుల్యుడు, సంగీత త్రయంలో ముఖ్యుడు అయిన త్యాగరాజు తన కీర్తనల ద్వారా ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పంచి పెట్టాడు. ఆయన చూపించిన మార్గంలో నడిచి, ఎందరో జనులు త్యాగధనులుగా, కీర్తి తారలుగా ఈ లోకాన నిలిచారు. ఈ గురుపౌర్ణమి నాడు గురుముఖ్యుడు అయిన ఆ మహానుభావుడు చెప్పిన విషయాలను స్మరించుకుందాం.

జులై 24, శనివారం, గురు పౌర్ణిమ.

వ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక అభ్యున్నతికి సోపానాలను చూపించిన దార్శినికుడు, ఎందరికో గురుతుల్యుడు, సంగీత త్రయంలో ముఖ్యుడు అయిన త్యాగరాజు తన కీర్తనల ద్వారా ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పంచి పెట్టాడు. ఆయన చూపించిన మార్గంలో నడిచి, ఎందరో జనులు త్యాగధనులుగా, కీర్తి తారలుగా ఈ లోకాన నిలిచారు. ఈ గురుపౌర్ణమి నాడు గురుముఖ్యుడు అయిన ఆ మహానుభావుడు చెప్పిన విషయాలను స్మరించుకుందాం.

శాస్త్రీయ కర్ణాటక సంగీతం అనగానే ఎవరికైనా గుర్తుకువచ్చేవి మూడు విషయాలు. భాష అనగానే తెలుగు, వాగ్గేయకారుడు అనగానే త్యాగరాజు, పాట అనగానే ఎందరో మహానుభావులు.

ఏ భాషకి చెందిన వారైనా కర్ణాటక సంగీతం పాడాలంటే తెలుగులో త్యాగరాజు రాసిన కీర్తనలను నేర్చుకోకుండా వారి అభ్యాసం పూర్తి అవ్వదు అనేది నిర్వివాదాంశం. తెలుగును సంగీత సామ్రాజ్యంలో అంతటి మేరు సమానమైన సింహాసనం మీద పట్టాభిషేకం చేశాడు త్యాగరాజు. 

కేరళకు చెందిన గొప్ప సంగీత విద్వాంసుడు సత్కళ గోవింద మారర్ ఒకసారి త్యాగరాజు ఎదుట కచేరీ చేశారట. ఆయన గాన మాధుర్యంలో మునిగిపోయిన త్యాగరాజుకు వెంటనే ఎందరో మహానుభావులు అనే పదజాలం స్ఫురించిందిట. ఘన రాగ పంచరత్న కీర్తనలలో ఆఖరిదైన ఈ కీర్తన అలా పుట్టిందట.

చందురుని వంటి ముఖం కలిగిన, మన్మధుడంతటి అందగాడైన, హొయలు మీరిన నడక కలిగిన ఆ శ్రీరామచంద్రుని మేను, నామ, పరాక్రమ, ధైర్య, శాంత మానసములను, అతని సత్య వచన పాలనను ఎల్లప్పుడూ కీర్తించేవారందరూ మహానుభావులేనట.

భాగవత, రామాయణ, గీత, శ్రుతి, శాస్త్ర, పురాణములలోని మర్మములనూ, శివ, శాక్తేయ, సౌర, గాణపత్య మొదలైన అన్ని మతాలలోని సారాన్ని తెలుసుకొని, ముప్పై మూడుకోట్ల దేవతల అంతరంగాన్నీ అర్ధం చేసుకుని, చిరాయువులై, యశము కలిగినవారందరూ మహానుభావులేనట.

సూర్య, చంద్ర, దిక్పాలకులు, కిన్నెర, కింపురుషులు, దేవతలు, ప్రహ్లాద, నారద, తుంబురులు, పవనసుతుడైన హనుమంతుడు, ఫాలమున చంద్రుణ్ణి ధరించే శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, భక్తులు, మహర్షులు, గురువులు అందరూ శ్రీరామును ఎల్లప్పుడూ తమ మనస్సున జపిస్తూ ఉంటారు కాబట్టి వారందరూ మహానుభావులేనట.

హరి గుణాలనే మణులను కలిగిన నగలను మెడలో ధరించే భక్తులు, తెలివితో, చెలిమితో, కరుణ కలిగి, జగమంతటినీ అమృతమయమైన దృష్టితో బ్రోచేవారు అందరూ మహానుభావులేనట. తన మనస్సును స్వామివారి పాదాలకు ఒక పుష్పంలాగా సమర్పించి, సద్భక్తి కలిగి, సన్మార్గములో నడిచేవారందరూ మహానుభావులేనట.

స్వర, లయ, తాళ, రాగాలను తెలిసినవారు, పతిత పావనుడైన పరమాత్ముని నిజమార్గాన్ని ఎల్లప్పుడూ గానం చేసేవారూ, శ్రీరాముని మనస్సును తెలుసుకుని ఆయన గుణ భజన చేస్తూ అనందం అనుభవించేవారందరూ మహానుభావులేనట.

ఈ ఒక్క పాటతో త్యాగరాజు తన జీవిత తత్త్వాన్ని మొత్తాన్నీ చెప్పేశాడు అనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ పాట మొత్తం శ్రీరామ కీర్తనము, ఆ నామాన్ని జపించే వారి కీర్తనమే ఉంటుంది. అది ఆయన జీవితంలోని అతి ప్రధానమైన భాగం.

ఇక రెండవ భాగం సంగీతం. నాదోపాసన మాత్రమే జీవన్ముక్తికి మార్గమని త్యాగరాజు మనసా, వాచా, కర్మేణా నమ్మేవారు. దీనికి ఆయన కీర్తనల్లోనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. "రాగ సుధా రస పానము చేసి రంజిల్లవే మనసా" అనే కీర్తనలో "సదాశివ మయమగు నాదోంకార స్వర విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు" అంటాడాయన. సంగీతాన్ని సాక్షాత్ శివ స్వరూపంగా వర్ణిస్తాడు ఈ కృతిలో. 

"సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా" అంటాడు మరొక కీర్తనలో. నటరాజు, ఆయన సభలో సంగీతానికి ముఖ్యుడైన భృంగి, సమీరజ అంటే వాయువు కుమారుడైన హనుమ, తమిళ భాషకు, స్తోత్ర వాఙ్మయానికీ ఆద్యుడైన అగస్త్య మహర్షి, నాదోపాసన చేసి పార్వతీదేవిని పుత్రికగా పొందిన మాతంగ ముని వీరందరూ ఉపాసించే సంగీత జ్ఞానము వినా సన్మార్గము లేదు అంటాడు త్యాగరాజు. నవ విధ భక్తి మార్గాలలో ఒకటైన కీర్తనం ద్వారా సరాసరి ఆ పరమాత్మను చేరవచ్చు అనేది త్యాగరాజు సిద్ధాంతం. దానినే ఈ ఎందరో మహానుభావులు కీర్తనలో కూడా పునరుద్ఘాటించాడు.

తరువాతది ప్రవర్తన. "తెలివితో, చెలిమితో, కరుణగల్గి, జగమెల్లను సుధా దృష్టితో బ్రోచువారెందరో మహానుభావులు" అన్నాడాయన ఈ కీర్తనలో. నిజంగా మనుష్యుడైన వాడికి, సంఘంలో జీవించేవాడికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణాలు ఇవే కదా. ఈ గుణాలను తమలో రోజురోజుకీ వృద్ధి చేసుకునేవారి వలన సమాజం ఎంతో మెరుగు అవుతుంది అనేది అక్షర సత్యం. 

ఇంతే కాదు "సాధించెనే మనసా" అనే కీర్తనలో సద్భక్తుల నడతలు ఎలా ఉంటాయో వివరించాడు. చక్కగా దేవుని పూజ చేసుకుని, కోపాన్ని అదుపులోపెట్టుకుని, చెడ్డవారితో స్నేహం పెంచుకోకుండా, కష్టం కలిగితే తాళుకుని, తట్టుకుని, ఎల్లప్పుడూ ఆ త్యాగరాజు నుతించే శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాలని చెప్పాడు. ఎన్నో కీర్తనల్లో మన ప్రవర్తనను సవరించుకునే విధానాలను త్యాగరాజు పొందుపరిచాడు. అవి తెలుసుకుని పాటించడమే మన పని.

ప్రజ్ఞా ప్రభాకరం


Prajna Prabhakaram
Tap to listen


లభ్యమవుతున్న చరిత్రలో ఉపయోగింపబడిన తొలి తెలుగు పదం ‘నాగబూ’ ను కనుక్కోవడం, తొలి తెలుగు శాసనం, తొలి తెలుగు రచయిత్రి తిమ్మక్కపై పరిశోధన, అన్నమాచార్య కీర్తనల పరిష్కారం, తొలి తెలుగు విమర్శనా వ్యాసం రాయడం వంటి ఎన్నో ఘనతలను సాధించిన కవి, పండితుడు, భాషా పరిశోధకుడు, చరిత్రకారుడు, విమర్శకుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి జీవిత విశేషాలను "ప్రజ్ఞా ప్రభాకరం" అనే ఆత్మకథగా రాసుకున్నారు. ఈ వారం ఈ పుస్తకాన్ని శ్రవణ రూపంలో తీసుకువస్తున్నాం. అంతటి మేధావి తన జీవితాన్ని ఎలా నడిపారో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారో తప్పక వినండి.


అనుభవాలూ జ్ఞాపకాలూనూ 2

Anubhavalu Jnapakaloonu 2
Tap to listen


'అనుభవాలూ జ్ఞాపకాలూనూ రెండవ భాగంలో శ్రీపాదవారి తండ్రి తెలుగు చదవడం, తెలుగులో కవిత్వం అల్లడంపై నిషేధం విధించడం వల్ల దొంగతనంగా పుస్తకాలు చదవడానికి ప్రయత్నించే విధానం అబ్బురపరుస్తుంది. తన జీవితకాలపు స్నేహితుడు మల్లిడి సత్తిరెడ్డిగారిని కలిసిన తీరు, శ్రీపాదవారిని తెలుగు చదవడానికి, రాయడానికి ఆయన ప్రోత్సహించిన విధానం ఈ భాగంలో వినవచ్చు. పద్య రచనపై వ్యామోహం తీరి, వచన రచనలో దిగిన వైనాన్ని, ఇంకా రెడ్డిగారి ప్రోత్సాహంతో మొదటి పుస్తకాన్ని అచ్చువేయించుకోవడం. ఇలాంటి ఎన్నో విశేషాలు శ్రీపాద వారు ఈ భాగంలో చెప్పబోతున్నారు.


సముద్రాల రాఘవాచార్య 

Samudrala Sr. Visleshana
Tap to listen


'వినుడు వినుడు రామాయణగాధా వినుడీ మనసారా' అంటూ రామాయణాన్ని ఒక్క పాటలో ఇమిడింపజేశారు. 'దరికి రాబోకు రాబోకు రాజా' అంటూ తిడుతోందో, పొగుడుతోందో తెలియనంత నర్మగర్భంగా ద్రౌపది చేత కీచకుణ్ణి తిట్టించారు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూనే 'జగమే మాయ బ్రతుకే మాయ' అనే జీవిత సత్యాన్ని వెల్లడించారు. 'ఎందుకోయీ తోటమాలీ అంతులేనీ వేదనా' అంటూ విప్రనారాయణుణ్ణి ప్రశ్నించారు. తెలుగు సినీ సాహిత్య జగత్తులో మరపురాని పాటలను, మాటలను అందించిన కవి, దర్శకుడు, నిర్మాత శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారి గురించి ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి సి.మృణాళిని గారు అందించే విశ్లేషణను విని ఆనందించండి.

సాంత్వన - విశ్రాంతి

Saantvana Meditation
Tap to listen


వయసుతో, వృత్తితో సంబంధం లేకుండా ఇవాళ ప్రతివారికి ఉండే సాధారణ ఇబ్బంది ఒత్తిడి. ప్రీస్కూలు చదివే పిల్లల దగ్గర నుంచి జీవితంలో మలి మజిలీలో విశ్రాంతి తీసుకోవాలనుకునే పెద్దల వరకూ ప్రతీవారూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. విచారకరమైన విషయం ఏమిటంటే తాము ఒత్తిడి వల్ల బాధపడుతున్నామనే విషయం కూడా చాలామంది గుర్తించలేకపోతున్నారు. గైడెడ్ ఇమేజరీ థెరపీ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే విధానాన్ని నిపుణురాలు, రచయిత్రి శ్రీమతి యల్లాప్రగడ సుధామాధవి గారు ఎంతో సులువైన పద్ధతిలో వివరించారు. సాంత్వన- విశ్రాంతి అనే ఈ ఆడియో ఈ వారం మన ముందుకు రాబోతోంది. ఈ ఆడియోలో చెప్పిన పద్ధతిలో సాధన చేయడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుందాం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఆడియోను విని, అందులో చెప్పినట్టు చేసి చూడండి. మీరు చాలా మెరుగ్గా ఫీల్ అవుతారు. ఇది తప్పకుండా పని చేస్తుంది. నాకు పని చేసింది. మీరూ ప్రయత్నించి చూడండి. ఎలా అనిపించిందో మాకు మెయిల్ ద్వారా చెప్పండి.

కొత్త విషయాన్ని మనకి తెలియజేసే ప్రతివారిలోనూ గురువును దర్శించుకుంటూ, మనకు జ్ఞాన బాటను చూపించిన ప్రతి గురువుకూ వందనాలు అర్పించుకుంటూ, ఆ గురువులకు గురువులైనవారికి, ఈ జగత్తుకే గురువైన ఆ పరబ్రహ్మకూ ఈ గురుపౌర్ణమి సందర్భంగా సాష్టాంగ ప్రాణామాలు అర్పిస్తోంది మన దాసుభాషితం.

Image Courtesy :
Wikipedia