#37 తెలుగులో తెలుగు ఎంత?

Meena Yogeshwar
August 26, 2021

ట్విట్టర్ లో జరిగిన చర్చ (రచ్చ?) నేపధ్యం లో. 'అమ్మ' ఏ భాషకి చెందిన పదం? అదేమి ప్రశ్న తెలుగే కదా అని అంటాం కదా. కానీ కాదు. అమ్మ అనే పదం ప్రాకృత భాషా కుటుంబానికి చెందిన 'పాళీ' అనే భాష నుండి తెలుగులోకి వచ్చింది. అలాగే తండ్రికి తత్సమమైన 'అయ్య' అనే పదం కూడా పాళీ నుండి తెచ్చుకున్నదే. చాలామంది భాషావేత్తలు వేరే భాషల నుండి వచ్చిన పదాలని ఏరివేసి, అచ్చతెలుగు పదాలను మాత్రమే వాడాలి అని అంటే అది సబబు కాదు. ఎందుకంటే అప్పుడు అమ్మ, అయ్యలను కూడా వదిలేసుకోవాలిగా.

'అమ్మ' ఏ భాషకి చెందిన పదం? అదేమి ప్రశ్న తెలుగే కదా అని అంటాం కదా. కానీ కాదు. అమ్మ అనే పదం ప్రాకృత భాషా కుటుంబానికి చెందిన 'పాళీ' అనే భాష నుండి తెలుగులోకి వచ్చింది. అలాగే తండ్రికి తత్సమమైన 'అయ్య' అనే పదం కూడా పాళీ నుండి తెచ్చుకున్నదే. చాలామంది భాషావేత్తలు వేరే భాషల నుండి వచ్చిన పదాలని ఏరివేసి, అచ్చతెలుగు పదాలను మాత్రమే వాడాలి అని అంటే అది సబబు కాదు. ఎందుకంటే అప్పుడు అమ్మ, అయ్యలను కూడా వదిలేసుకోవాలిగా.

ఈ మధ్య ట్విట్టర్‌, ఇతర సామాజిక వేదికల్లో తెలుగులోని అన్య భాషా పదాలు తీసివేయాలని చర్చలు జరుగుతున్న నేపధ్యంలో అచ్చ తెలుగు అంటే ఏమిటి, అన్య భాషా పదాలు తెలుగులోకి ఎందుకు, ఎలా వచ్చాయి, ఈ సంగమానికి మొదలు ఎప్పుడు అని విచారించుకోవడం తెలుగు వారి కర్తవ్యం.

దాదాపుగా రెండు వేల ఏళ్ళకు పూర్వం నుండి ప్రవహిస్తున్న జీవనది 'తెలుగు' భాష. ఎక్కడో కొండల్లో చిన్న ధారగా మొదలైన గోదావరి, దారిలో ఎన్నో ఉపనదులను, పిల్లకాలువలను కలుపుకుని ఒక గొప్ప మహా నదిగా రూపాంతరం చెందినట్టే తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబంలో పుట్టిన ఒక చిన్న భాష. తనకు దారిలో కలిసిన మిగిలిన భాషల నుండి ఎన్నో పదాలను తనలో ఇముడ్చుకుని ముందుకు పోతోంది.

ఇక్కడ ద్రావిడ అంటే భారత ద్వీప కల్పం (peninsula) మాత్రమే కాదు. ఉత్తర భారత దేశం లో ఉన్న ప్రాంతాలు కూడా.  
తెలుగుకు మూలం అయిన ద్రావిడ భాషా కుటుంబంలో నాలుగు విభాగాలు ఉన్నాయి.

1. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం
2. దక్షిణ మధ్య ద్రావిడ భాషా కుటుంబం
3. మధ్య ద్రావిడ భాషా కుటుంబం
4. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం

ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో కురుఖ్, మల్టో, బ్రహుయి భాషలు ప్రస్తుతం మిగిలి ఉన్న భాషలు. కురుఖ్ భాష ఝార్ఖండ్, చత్తీశ్‌గఢ్, ఒడిశా, బెంగాల్, అస్సాం, బీహార్, త్రిపుర వంటి భారతీయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, ఉత్తర బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రదేశాలలోనూ, నేపాల్, భూటాన్లలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 20 లక్షల ప్రజల నాలుకల మీద ఇప్పటికీ బ్రతికి ఉంది. మాల్టో భాషను ఝార్ఖండ్, బెంగాల్, బీహార్‌లలోని కొందరు ప్రజలు మాట్లాడుతున్నారు. ఇక బ్రహయీ భాషను పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లలో కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ 20లక్షల పై చిలుకు ప్రజలు మాట్లాడుతున్నారని అంచనా.

దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో ఒల్లరి, దురువా, కోలామీ, నాయకీ వంటి భాషలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోనూ, చత్తీశ్‌గఢ్ లోని బస్తర్ లోనూ, మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాల్లోని ప్రజలు మాట్లాడతారు.

దక్షిణ మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి తెలుగు భాష పెద్దన్న వంటిది. అతి ఎక్కువ మంది మాట్లాడుతున్న ద్రావిడ భాషగా నిలిచింది మన భాష. నల్లమల ప్రాంతంలో చెంచు జాతి వారు మాట్లాడే చెంచు భాష మన తెలుగుకు ఒక శాఖగా చెప్పవచ్చు. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు గోండు, కొండ, ముఖ, మండ, పెంగొ, కువి, కోయి వంటి భాషలు ఉన్నాయి. ఈ భాషలు ఎక్కువగా గిరిజన జాతులకు చెందిన వారి మాతృబాషలు అని భాషా చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్ర ప్రాంతంతో పాటు ఒడిశా, ఝార్ఖండ్, చత్తీశ్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ భాషలను మాట్లాడే వారు ఉన్నారు.

ఇక దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో తమిళం, మళయాళం, కన్నడం, కురువ, కొడవ, కోట, తోడ, తుళు, కుడియ వంటి భాషలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంతో పాటు గోవా, మహారాష్ట్ర, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషలను మాట్లాడేవారు ఉన్నారు. 

ఇన్ని భాషలు కలిగిన ఈ ద్రావిడ భాషా కుటుంబంలో అన్నిటికన్నా ఎక్కువమంది మాట్లాడే భాష మాత్రం తెలుగే. అలాగే ఎక్కువ ఇతర భాషా పదాలు, ఆలోచనలు, సంప్రదాయాలు, సంస్కృతులు కూడా మన భాషలోనూ, మన సంప్రదాయంలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల భౌగోళిక అమరిక దీనికి ప్రధాన కారణం. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతం ఇతర ప్రాంతాలకు ముఖద్వారంగా నిలుస్తుంది. అందుకే ఏ భాష అయినా, సంస్కృతి అయినా మనల్ని దాటుకుని, మనలో ఇమిడేవి ఇచ్చి మాత్రమే వేరే చోటకి వెళ్తుంటాయి.

తెలుగు భాషపై ఎన్నో భాషల ప్రభావం ఉంది. ముఖ్యంగా ప్రాకృత భాషలు, సంస్కృత భాషల పదాలు మన తెలుగులో చాలానే కనిపిస్తాయి. ఇక పారశీ, ఉర్దూ, అరబ్బీ, హిందీ, ఆంగ్ల భాషల పదాలు కూడా మన భాషలో ఇమిడిపోయాయి. 

మనం రోజూవారీ వాడే కొన్ని పదాలను సాధారణంగా అచ్చ తెలుగు పదాలు అనేసుకుంటాం. అనువాదానికి తత్సమంగా వాడే తర్జుమా అనే పదం అరబిక్ భాషా పదం. ఫలానా వారు ఇలా అన్నారు అంటాం. ఆ ఫలానా అనేది కూడా అరబిక్ నుండి తెలుగులోకి వచ్చిందే. తాజా అనే పదం పారశీక పదం. రుమాలు కూడా పారశీక పదమే.

ఇక సంస్కృత ప్రభావం తెలుగు మీద చాలా విపరీతంగా ఉంది. దీనికి ప్రముఖ ద్రావిడ భాషావేత్త సురేష్ కొలిచాల గారు తెలుగు కోరా వేదికగా చాలా చక్కని ఉదాహరణలు ఇచ్చారు. ఆయన ప్రకారం తెలుగులో అసలు అనే అక్షరమే లేదుట. ద్రావిడ భాషలో హృదయాన్ని ఇదయం, ఎద అని వ్యవహరిస్తారు. కానీ సంస్కృత ప్రభావం వల్ల తెలుగులో హ అనే అక్షర లోపాన్ని సవరించేందుకు తరువాతి కాలంలో వర్ణమాలలో ఈ అక్షరాన్ని చేర్చారట. అందుకే అడల్ అనే పదం హడల్‌గా మారిపోయింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే సంస్కృతంతో సహా అన్ని భాషలలోనూ ఆరతి అయితే మనవాళ్ళ దురతిసవరణ(hyper-correction) వల్ల హారతి అయింది.

బస్సు, రైలు, కారు, రోడ్డు, వాచీ, ఫోను వంటి పదాలతో తెలుగులోకి ఆంగ్లం కూడా వచ్చి చేరింది. కొందరు బొత్తిగా విపరీతాలకు పోయి, వాటిని తెలుగీకరించాలని ఉత్సాహపడి తెలుగు కానీ వేరే భాషలోకి అనువదిస్తారు. రైలుని ధూమశకటం అనడం వల్ల అది తెనుగీకరించబడిందా, సంస్కృతీకరించబడిందా అని కూడా ఆలోచించరు. ఇక రౌండు టెబుల్ సమావేశాన్ని గుండ్రపు బల్ల సమావేశం అనీ, ఎయిర్ హోస్టెస్‌ని గాలి గుమ్మ అని విచిత్ర అనువాదాలు చేసే వారూ ఉన్నారు. 

ఇలాంటి పర భాషా పదాలను ఇముడ్చుకోలేకపోవడమే భాషకి లోటు అవుతుంది కానీ కలుపుకోగలగడం కాదు. అందుకే మన విభక్తులు వంటి వాటిలోకి ఇమిడిపోయిన పదాలను అలాగే వాడటం బాగుంటుంది. అంటే బస్సు అన్నప్పుడే అది మన తెలుగు పదం అయిపోతుంది. ఎందుకంటే మన విభక్తిలోకి లోబడింది కదా. అలా కాదు అని దాన్ని ఏరివేయాలనుకోవడం సరి కాదు.

ఇక ఈ విషయంలో మరో రకం అతివాదులు ఉన్నారు. వారికి తెలుగును టెల్గూ చేసేదాకా సంతృప్తి ఉండదు. తెలుగులో లేని పదాలను ఇతర భాషల నుండి తెచ్చుకోవడం భాష పెరగడానికి ఎంత అవసరమో, తెలుగులో ఉన్న పదాలను వాడకుండా వాటి స్థానంలో వేరే భాషా పదాలను వాడటం అంత ప్రమాదకరం. కుర్చీ, బల్ల, పళ్ళెం వంటి పదాలను మానేసి చైర్, టేబుల్, ప్లేట్ అంటూ వాడటం ఆయా తెలుగు పదాలకు అన్యాయం చేయడమే అవుతుంది. శ్రీపాద వారు తన ఆత్మకథ అనుభవాలూ-జ్ఞాపకాలూనులో వివరించినట్టు తెలుగును పూర్తిగా పక్కన పెట్టి సంస్కృతాన్నో, ఆంగ్లాన్నో నెత్తినెక్కించుకోవడం కూడా సరైన పని కాదు. 'అతి సర్వత్ర వర్జయేత్' అని ఊరికే అన్నారా పెద్దలు.

భాష, నది పుట్టినప్పుడు చిన్నగానే ఉంటాయి. తమ ప్రయాణంలో పెద్దవి అవుతూ పోతాయి. నదిలోని ప్రవాహాన్ని సవరించడానికి ఆనకట్టలు కట్టినట్టే, భాషా ప్రవాహాన్ని మలుపు తిప్పడానికి స్థల, కాలాలకు అనుగుణంగా కొందరు వైతాళికులను భాషే వెతుక్కుంటుంది. తమ పట్టుదల, సూక్ష్మ దృష్టి, సమయ అవగాహన వంటి వాటి వల్ల భాషకు కొత్త మలుపుని చూపించగల పురుషాకారాన్ని వారు సాధించుకుంటారు. ముద్రణ, అక్షరాశ్యతపై అవగాహన వంటివి పెరిగినప్పుడు అందరికీ అక్షరం తేలికగా చేరువ అవ్వాలి అంటే అది వ్యవహారిక భాష అనే రూపం దాల్చాలి అని సంఘంలో వచ్చిన చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురజాడ అప్పారావు గారు వంటి మహాపురుషులను కాలమే ఎంచుకుంది.

అదే విధంగా ఈ ఇతర భాషా పదాల సంస్కరణ విషయంలో కూడా తప్పకుండా ఒక సంధి కాలం వచ్చి తీరుతుంది. అప్పుడు ఆ సంస్కరణ సాధించే పనిముట్టుగా ఎవరిని కాలం ఎన్నుకుంటుందో ఇప్పుడు ఎవరం చెప్పలేం.

మనం నదికి వెళ్తాం, పుణ్యస్నానాలు చేస్తాం, ఈతలు కొడతాం, పసుపు-కుంకుమలు ఇచ్చి పూజ చేస్తాం. దీన్నంతటినీ నదీ సేవ అనలేము. అలాగే మనం భాషని చదువుకుంటాం, అందులో ఏవో రచనలు చేస్తాం, దాని గురించి నలుగురికీ చెప్తాం. మరి దీన్నంతటినీ భాషా సేవ అని చెప్పుకోవడంలో ఔచిత్యం ఏమిటి? ఒక జాతికి జీవాన్ని ఇవ్వగల నది అయినా, భాష అయినా మనకి ఇచ్చేదే ఉంటుంది తప్ప మన వాటికి ఇవ్వగలిగినది ఏమీ లేదు, గౌరవం తప్ప.

అందుకే, అభిమానంతోనే అన్నా, దాసుభాషితం భాషా సేవ చేస్తోందని ఎవరన్నా అంటే, మేము పొంగిపోము.


అనుభవాలు-జ్ఞాపకాలూను 3

Anubhavalu Jnapakaloonu 3
Tap to listen


అలా తన మాతృభాష అయిన తెలుగు కోసం స్వంత వారిని సైతం ఎదిరించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ అనుభవాలూ-జ్ఞాపకాలూను మూడవ భాగం ఈ వారం విడుదల కాబోతోంది. శ్రీపాద వారు అటు ప్రాచీన సంప్రదాయానికీ, ఇటు ఆధునికతకూ మధ్య వారధి వంటి వారు. మంచి ఎక్కడ కనపడితే దానిని అనుసరించడానికి ఆయన ఎప్పుడూ ముందే ఉండేవారు. అందుకే వేషధారణ మార్పు విషయంలో ఆధునికతను ఎంచుకున్నారు ఆయన. ఇక హోటలు భోజనం విషయమై ఆయనకు ఉన్న ఆలోచనలు ఈ మూడవ భాగంలో వినవచ్చు. ఇలా ఆధునికతను ఇష్టపడే ఆయన పూర్వ కాలం పెళ్ళిళ్ళలో కవులను, పండితులను, గురువులను సత్కరించుకునే సదస్యమనే తంతు అంతరించిపోవడంపై ఎంతో విచారపడతారు కూడా. వధూవరులకు బంధువులు కానుకలు ఇచ్చే సంప్రదాయం తగ్గిపోవడంపై కూడా ఆయన బాధ వ్యక్తం చేస్తారు. ఇలా రెండు వ్యతిరేక దిశలు గల వాకిళ్ళలో నిలబడిన శ్రీపాద వారిని ఈ భాగంలో దర్శించండి.


కృష్ణ పక్షం- శుక్ల పక్షం


Krishna Paksham Sukla Paksham
Tap to listen


తెలుగులో హాస్య రచనలు చేసిన స్త్రీ రచయితలు చాలా తక్కువ. వారిలో అగ్రగణ్యురాలు అని చెప్పుకోదగ్గ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. సున్నితమైన భావోద్వేగాలు, గుర్తుండిపోయే చతురత, ఎన్నిసార్లైనా నవ్వించగలిగే హాస్య పటిమ ఆమె రచనల స్వంతం. ఆమె కలం నుండి వచ్చిన కృష్ణ పక్షం-శుక్ల పక్షం నవల కూడా ఈ లక్షణాలన్నిటినీ తగు మోతాదులో కలిగి ఉంటుంది. ఈసారి ఈ బుజ్జి నవల మీ ముందుకు రాబోతోంది. వినేయండి మరి.

కాలాతీత వ్యక్తులు - విశ్లేషణ

Kaalaateeta Vyaktulu
Tap to listen


తెలుగు సాహిత్యంలో గొప్ప నవలల సరసన సగర్వంగా తల ఎత్తుకుని నిలబడగలిగే నవల కాలాతీత వ్యక్తులు. పేరుకు తగ్గట్టుగానే ఈ నవలలోని పాత్రలు అన్నీ కాలానికి అతీతమైనవే. ఏ తరంలోనైనా ఇలాంటి పాత్రలు మనకి తారసపడుతూనే ఉంటారు. కాలాతీత వ్యక్తులు లాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం అంటే ఒక మహిళా రచయితగా డాక్టర్ పి.శ్రీదేవి గారు ఎంతో సాహసం చేశారు అనడంలో సందేహం లేదు. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి సి.మృణాళిని గారు చేసిన విశ్లేషణ ఈ వారం విడుదల కాబోతోంది. మృణాళిని గారి సుమధుర స్వరంలో ఆమె ఎంతో నికార్సుగా రాసిన ఈ విశ్లేషణని విని ఆనందించండి.



Image Courtesy :
Jr Korpa on Unsplash