#41 దాసుభాషితం 2.0 ఒక కారాంజి.

Dasu Kiran
August 26, 2021

దాసుభాషితం నూతన చిహ్నం (లోగో) ఆవిష్కరణ, కథ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం… ఇలా మొదలవుతుంది బిల్వాష్టకం. శివుడి లోనే కాదు, ఈ సృష్టిలో మనకి ఎక్కడ చూసిన త్రయత్వం కనిపిస్తుంది. మూడు ప్రాథమిక రంగులు – ఎరుపు, ఆకుపచ్చ, నీలం మూడు అవస్థలు – జాగృత, స్వప్న, సుషుప్తి మూడు కాలాలు – భూత, వర్తమాన, భవిష్యత్తు మూడు గుణాలు – సత్వం, రజస్సు, తమస్సు మూడు సమయాలు – పగలు, రాత్రి, సంధ్య/వేకువజాము మూడు శరీరాలు – స్థూల, సూక్ష్మ, కారణ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా కనిపిస్తాయి మనకు.

దాసుభాషితం నూతన చిహ్నం (లోగో) ఆవిష్కరణ, కథ.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం… 

ఇలా మొదలవుతుంది బిల్వాష్టకం.

శివుడి లోనే కాదు, ఈ సృష్టిలో మనకి ఎక్కడ చూసిన త్రయత్వం కనిపిస్తుంది.
మూడు ప్రాథమిక రంగులు  – ఎరుపు, ఆకుపచ్చ, నీలం
మూడు అవస్థలు – జాగృత, స్వప్న, సుషుప్తి
మూడు కాలాలు – భూత, వర్తమాన, భవిష్యత్తు
మూడు గుణాలు – సత్వం, రజస్సు, తమస్సు
మూడు సమయాలు – పగలు, రాత్రి, సంధ్య/వేకువజాము
మూడు శరీరాలు – స్థూల, సూక్ష్మ, కారణ

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా కనిపిస్తాయి మనకు.

దీనికి శీర్షికలో చెప్పినదానికీ సంబంధం ఉంది.  


భాషా, సాహిత్యం, కళలకు నెలవుగా ఎదుగుతున్న దాసుభాషితంలో, ఈ సంవత్సరం జనవరి మాసంలో ఒక మథనం ప్రారంభమైనది. వీటి పరమార్థం ఏమిటని.

దాసుభాషితం లక్ష్యం 


కేవలం వినోదమే కాకుండా, ఒక మనిషి సమగ్ర శ్రేయస్సుకు దోహద పడడమే భాష, సాహిత్య, కళల పరమార్ధం అని తోచింది (ఇది గత పదేళ్లుగా నా జీవితంలో జరిగిన అనుకూల మార్పుల ప్రభావం వల్ల అయ్యుండచ్చు). అపుడు దాసుభాషితం ఉనికికి కూడా ఇంకా ఉన్నతమైన లక్ష్యం ఉండాలనిపించింది. ఆ లక్ష్యం దాసుభాషితం స్ఫూర్తిని, ఉన్నతిని, సాఫల్యాన్ని, అంటే సమగ్ర శ్రేయస్సును అందించే కారాంజి (fountain) గా పూర్ణపరివర్తనం చెందటమే అనిపించింది.

నూతన మార్గం 


కొత్త లక్ష్యం ఆవిష్కారమవగానే, తదనంతరం చేయవలిసిన మార్పులు అసంకల్పితంగానే చకచకా అతి స్పష్టంగా స్ఫురించ సాగాయి.
 
ముఖ్యంగా, సమగ్ర శ్రేయస్సు అంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎదగడం. అన్నీ  బావుండి ఏ ఒక్క విషయంలో వెనుకబడినా జీవితం ఆనందంగా ఉండదు. ఈ విషయంలో నా స్వానుభవం ద్వారా వ్యక్తిగత ఎదుగుదలకు సాహిత్యం, వృత్తిలో ఎదగడానికి బిహేవియరల్ సైన్స్, ఆధ్యాత్మిక అభివృద్ధికి అద్వైతాల ప్రభావం చాలా ఉన్నట్టు గ్రహించాను.  

అందుకోసం ఈ మూడూ విషయాల్లో నాణ్యమైన కాంటెంట్ ను నిపుణులతో తయారు చేయించాలి. ఇంకా, ఇపుడు యాప్ లో ఉన్న కాంటెంట్ అంతా ఎక్కువ శాతం Long-form కాంటెంటే. అంటే ఒక పుస్తకం వినడానికి కొన్ని గంటలు వెచ్చించాలి. 2 నిమిషాల్లో, అర గంటలో ఇమిడే కాంటెంట్ ను అందించాలి. ఇందుకోసం మేము టైటిల్స్ తో పాటు రెండు కొత్త విభాగాలను రూపొందించాము. వాటిని Moments (భావన) లని, Lessons (పాఠాలు) అని పిలుస్తున్నాము.   

నిర్మాణం


ఈ కొత్త మార్గం మీద పూర్తిగా దృష్టి పెట్టడానికి ఈబుక్స్, రేడియో, పబ్లిషింగ్ రంగాల పై చేస్తున్న, చేద్దామనుకుంటున్న కార్యాలను ప్రస్తుతానికి నిలిపివేశాము.

ప్రస్తుతం యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. ఈ కొత్త విభాగాలను కూడా యాప్ లో ఇమిడిస్తే మరింత చేటు జరుగుతుందని, యాప్ ను మళ్ళీ పూర్తిగా పునర్నిర్మించడమే ఉత్తమమని నిపుణులు సూచించారు. ఆ సూచన మేరకు యాప్ ను పునర్నిర్మించడానికి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థకు ప్రాజెక్ట్ అందించాము. నిర్మాణం Sep 1, 2021 నుంచి ప్రారంభమౌతుంది.

వినియోగ అనుభూతికి (User Experience) పెద్ద పీట వేస్తూ నూతన యాప్ ను డిజైన్ చేయమని ఒక ప్రతిభావంతమైన డిజైన్ కంపెనీ కి బాధ్యతలను అప్పగించాము. కొత్త యాప్ రూపు రేఖలను ఈ లింక్ ద్వారా మీరు చూడవచ్చు. Laptop లో చూస్తే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.


చిహ్నం 


సాధారణంగా rebranding అనగానే మనకు మొదట స్ఫురించేది లోగో.
అయితే, ఇది చివరిగా చేసేది.

ఒక సంస్థ చిహ్నం (లోగో) రాజముద్ర వంటిది. అది సంస్థ ఆత్మకు ప్రతిరూపమై, విశ్వసనీయత పెంపొందిస్తుంది. ‘దా’ అంటూ సంప్రదాయ అక్షర శైలిలో ఆహ్వానించిన ప్రస్తుత లోగో పరివర్తనం చెంది దాసుభాషితం నూతన లక్ష్యాన్ని ప్రతిబింబించాలి.

దీనికీ పెద్ద కసరత్తే చేశాము.

దాసుభాషితం లక్ష్యం, స్ఫూర్తిని, ఉన్నతిని, సాఫల్యాన్ని అందించే కారాంజి అవటమని కూడా ముందు చెప్పకున్నాము. మీరు గమనిస్తే, ముందు చెప్పిన త్రయత్వం పైన చెప్పిన విషయాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. కొత్త చిహ్నం ఆ త్రయత్వాన్ని మమేకం చేసుకోవాలి. ఇంకా, కొత్త చిహ్నం దాసుభాషితం శ్రేయస్సును పెంచే జ్ఞాన (knowledge) సాధనం (resource) అనిపించాలి.

చాలా మంచి బ్రాండ్ లకి ఐడెంటిటీ కూర్చిన ముంబయికి చెందిన డిజైనర్ కు ఇదే చెప్పాము.  
ఎక్కువ తర్జనభర్జనలు లేకుండానే మేమందరం అంగీకరించిన చిహ్నం ఇది.


Dasubhashitam new logo


ప్రాథమిక రంగుగా (Primary color) కొద్ది మార్పులతో నీలమే ఉంచి, రెండవ రంగుగా (Secondary color) ఉత్తేజాన్నిచ్చే కోరల్ ను ఎంపిక చేశాము. జ్ఞాన సాధనానికి చిహ్నంగా పుస్తకము కారాంజిగా మారటము, శ్రేయస్సుకు చిహ్నంగా రెండవ రంగులో ఉషస్సును చూపించడం జరిగింది.

ప్రస్తుత దాసుభాషితం లోగోలో పొన్నాల ఖతి (font) వాడబడింది. దాన్ని రూపొందించింది శ్రీ అప్పాజీ అంబరీష దర్భ గారు. ఈ ఖతి చాలా అందమైన నగీషీలతో సంప్రదాయంగా ఉంటుంది. కానీ అలంకారిక ఖతి కాకుండా తెలుగు నుడికార అందం చూపిస్తూనే ఆధునికంగా కనబడే ఖతి అయితే మేము ఎంచుకున్న చిహ్నానికి సరిపోతుందని అనిపించింది.

అంబరీష గారే కొత్త ఖతిని ఎంచుకోవడంలో సహకరించారు. ఆయన ఖతిని మేము వదిలేస్తున్నా ఆయన మాకు సహకరించారు. అదీ రుసుము ఏమీ తీసుకోకుండా మాకు సహాయం చేయడం ఆయన మంచి మనస్సుకు తార్కాణం. వారికి ధన్యవాదాలు.  

ఇక జింగల్ ను మార్చే అవసరం కనపడలేదు. ప్రతిభావంతుడు, యువకుడు వశిష్ఠ రామ్ కూర్చిన ‘బాణీ’, అతని చెల్లెలు సింధుభైరవి ‘వాణి’ దాసుభాషితం శ్రోతలకు చిరపరచితమే.

వెరసి, దాసుభాషితం కొత్త అనిమేషన్ ఇది.

 



దాసుభాషితం కొత్త పంథా, యాప్ రూపురేఖలు, చిహ్నం, యానిమేషన్ ఎలా ఉన్నాయి? 
మీ స్పందనను తెలుపగలరు. 

మరొక ముఖ్యమైన విషయం. కొత్త యాప్ అందుబాటులోకి రావడానికి కనీసం ఇంకో 3 నెలలు పడుతుంది. దాసుభాషితం వేదికలలో కొత్త లోగో కనబడటం దగ్గర నుంచి యాప్ వరకూ జరిగే మార్పులు మీకు నెమ్మదిగా కనిపిస్తాయి.


ఇల్లాలి ముచ్చట్లు - 1

Illali Mutchatlu 1
Tap to listen


'ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం' అని స్తుతించారు ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తవంలో. ఈ లోకంలో ఉన్న అశేషమైన గృహాలలో కొలువుదీరిన గృహిణిలందరి రూపంలోనూ ఉన్నది సాక్షాత్ ఆ లక్ష్మీదేవి అంశే అనేది ఆ ఆది గృహస్తు అయిన శంకరుని సన్యాస రూపమైన శంకరాచార్యుల వారి తీర్మానం. ఇల్లాలే కదా అని తీసి పారేస్తారు మనలో చాలామంది. కానీ ఈ దేశానికి చిన్న సైజు నమూనా లాంటి ఇంటిని వేయి హస్తాలతో పాలిస్తుంది ఆమె. ఇంటి ధన, ధాన్య, శాంతి, బాహ్య వ్యవహారాలు, శిశు సంరక్షణ ఇలా లెక్కలేనన్ని శాఖలకు జీతం భత్యమే కాదు కనీసం గుర్తింపు కూడా లేని మంత్రి ఇల్లాలు. అలాంటి ఆమె గుండెల్లో ఎన్నో మధురానుభూతులు, ఎన్నో కష్ట నిష్ఠూరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో గుర్తింపులు, ఎన్నో నిర్లక్ష్యాలు విలువైన గనులలాగా ఉంటాయి.

వాటిని జాగ్రత్తగా తవ్వి తీసి, పాఠకుల ముందు ఉంచారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు. మగవారు తమ భార్యలను పిలిచే పిలుపులో కూడా కావలసినంత అవమానాన్ని చొప్పించగలరు అని ఆమె చెప్తుంటే నిజంగా సమాజంలో భార్య అనే మనిషిని, ఒక వస్తువుగా ఎలా చూస్తున్నారో అని గమనించి, బాధ పడతాం. మనసు ముక్కలయ్యే కష్టాన్ని కూడా వ్యంగంగా చెప్పే తీరు ప్రతీవారినీ ఆసక్తికి గురిచేస్తుంది. ఆమె మాటలన్నీ తూటాల్లా తగిలి, మన సమాజంలో జరిగే హిప్పోక్రసీ మీద కోపం రావడం ఖాయం. కానీ ఇవన్నీ స్త్రీ గొంతు ద్వారా ఒక పురుషుడు మాట్లాడుతున్నారు అని గుర్తొచ్చినప్పుడు సుబ్రహ్మణ్యశర్మ గారి మీద ఎనలేని గౌరవం ఏర్పడుతుంది మనకు. ఆడవారే పూర్తిగా ఆడవారి కోణంలో నుంచి రాయడం కష్టమైన ఆ రోజుల్లో శాస్త్రి గారు ఆడవారి అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు మనసును హత్తుకుంటుంది. ఈ వారం ఈ ముత్యాల దండలో నుండి కొన్ని ముత్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఆడవారైతే ఇందులో మీ అనుభవాలు ఎన్నో లెక్కించుకోండి, మగవారైతే మీ చుట్టూ ఉన్న ఆడవారిని వందలో ఒక శాతమైనా అర్ధం చేసుకోవడానికి ఈ కళ్ళద్దంలో నుంచి చూసే ప్రయత్నం చేయండి.


పొన్నియిన్ సెల్వన్ - 2

Ponniyin Selvan Telugu 2
Tap to listen


అన్ని పనులలోనూ అత్యంత కష్టమైనవి గూడఛర్యం, రాయబారం. ఇవి ఎంత ముఖ్యమైనవి అంటే భవిష్యత్‌లో జరిగే ఎలాంటి పరిణామాలైనా ఈ రెండు విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. రామాయణంలో హనుమ, మహాభారతంలో కృష్ణుడు ఈ రెండు పనుల విశిష్టతను మనకు చాటి చెప్పారు.

చోళుల చరిత్రలో కలికితురాయి వంటి చక్రవర్తి అరుళ్‌మొళి వర్మ వద్దకు వార్తాహరుడిగా బయలుదేరిన వంతిదేవుడు నడుచుకున్న తీరు కూడా ఎంతో ప్రముఖమైనది. తన ఉనికిని సాధ్యమైనంత వరకూ దాచుకుంటూ జాగ్రత్తగా మసులుకున్న వంతిదేవుడు ఊహించని అభాండాన్ని మోయాల్సిరావడాన్ని ఈ భాగంలో వినబోతున్నాం. తరువాతి కాలంలో అరుళ్‌మొళి వర్మ పాలనకు ఎన్నో రాజకీయ, పాలనా సలహాలను ఇచ్చి, అతణ్ణి చరిత్రలో గొప్ప చక్రవర్తిగా నిలబెట్టిన వారిలో ముఖ్యురాలైన అతని అక్క కుందవాయి పాత్ర ఎంతటి లోతు, విస్తీర్ణం కలదో కూడా ఈ భాగంలో మనకి అర్ధం అవుతుంది.

క్షణ క్షణానికీ మారే మలుపులుతో, బిగువైన కథనంతో సాగే ఈ నవల రెండవ భాగం ఈ వారం మన ముందుకు వస్తోంది. చరిత్ర చెప్పే పాఠాలను వినడానికి మీరు సిద్ధమా మరి.


ఆరుద్ర - విశ్లేషణ

Tap to listen


'ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట' అని అడిగే అమ్మాయిలు, 'ఈ మౌనం.. ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా' అంటూ విరహ యాతన పడే అబ్బాయిలు, 'ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర' అంటూ జీవిత సత్యాలు చెప్పే అనుభవజ్ఞులు, 'రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ' అంటూ వాపోయే ఇల్లాళ్ళూ, 'కల చెదిరిందీ కథ మారిందీ' అంటూ గరళాన్ని తాగే దేవదాసులూ, 'కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమ లేని కానలో' అని తల్లిదండ్రుల కోసం పరితపించే చిన్నారులు, ఇలా ఎందరికో ఆయన కలమే ఆసరా. ఇందరి బాధనూ, ప్రేమనీ, విరహాన్నీ, కోపాన్ని తన సిరాలో కలుపుకున్న కవి ఆరుద్ర.

కథలు, నవలలు, నాటకాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలలో తన వాణి వినిపించిన ఆరుద్ర ఈ పాటల తోటను మాత్రం ఎన్నో సొబగులను అద్ది మరీ పెంచారు. తెలుగు సినీ జగత్తులో ఎప్పటికీ మిలమిలలాడుతూనే ఉండే ఈ ధృవతార గురించి ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు డాక్టర్ సి.మృణాళిని గారు చెప్పే సంగతులను ఆమె విశ్లేషణలో విందాం. తేనలూరే తన స్వరంతో మరింత తియ్యటి పాటలనందించిన ఆరుద్ర గారి గురించి ఆమె చెప్పే కబుర్లలో ఈదులాడుదామా.