యమహా నగరి కలకత్తా పురి అని చూడాలని ఉంది సినిమాలో మెగాస్టార్ చిరంజీవిలా పాట పాడుతూ మా బెంగళూరు యాత్రా విశేషాల గురించి చెప్పాలని ఉందండి. కానీ నాకు గిటారు రాదు, అంత సాహిత్యమూ పాడలేను. అందుకే నా కళ్లతో చూసిన బెంగళూరుని మీకు వివరిస్తాను. బెంగళూరులో మేం చూసిన మ్యూజియమ్స్, ఫోటోగ్రఫీ గాలరీలు, చిత్రకళా ప్రదర్శనశాలలు మరిన్ని వివరాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
మేం ఉదయం 8:00 గంటలకి రైలు దిగి మధ్యాహ్నాం 1:30 కి ఇంటికి చేరి అడుగడుగునా కుంభకోణం కాఫీ తాగలేదని ట్రాఫిక్ గురించి తిట్టుకుంటూ చేసిన మజిలీ గురించి సవా లక్ష చెప్పాలని ఉంది. కానీ ఇలాంటి ట్రాఫిక్ విషయాలు, ఆర్టికల్సు మీరు సవా సేరు లక్షలు చదివి ఉంటారు, చూసి ఉంటారూను. ఎందుకొచ్చిన గోల. అది వదిలేద్దాం.
బెంగళూరు మొత్తం ఒక్క రోజులో తిరిగి వచ్చేయొచ్చు అన్న నా కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చెప్తాను వినండి. మా కిరణ్ సార్ బెంగళూరులో మా ప్లాన్స్ అడిగినపుడు. సార్ మేం కేవలం ఒక్క రోజులో బెంగళూరు చూసి రావడానికి ఏదో ఓ చోట బెంగళూరు బస్ పాస్ తీసుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక బస్ ఎక్కేస్తాం, ఎవరూ మమ్మల్ని టికెట్ అడగరు. మేం దిగాలి అనుకున్న చోట బస్ దిగి సందర్శనం చేస్తాం. ఈ విధంగా మ్యూజియంలు, పార్కులు, రెస్టారెంట్లు, మాల్స్, టెంపుల్స్ ఇలా అన్ని ఒక్క రోజు సులభంగా కవర్ చేసేస్తాం అని చెప్పాను. మా కిరణ్ సార్ నవ్వుకుని ఏమోయ్ లక్ష్మి విన్నావా! రామ్ ఏమన్నాడో “దిస్ సిల్లీ ఫెల్లో థింకింగ్ దట్ హి కెన్ కవర్ మేజర్ పార్ట్స్ ఆఫ్ బెంగళూరు ఇన్ వన్ డే” ఆహా ఆ ఊహే ఎంత బాగుంది అని నవ్వుకున్నారు.
కట్ చేస్తే అక్టోబర్ 13-2025 ఉదయం 8:30 కి రైల్వే స్టేషన్ లో దిగి, క్యాబ్ ఎక్కి ముళ్లూరు బయలు దేరి, 12 అవ్వొస్తున్నా గమ్యానికి చేరుకోలేదు. మా కిరణ్ సార్ మాకోసం క్యాబ్ పంపారు. సర్ మేము యహలంకా రైల్వే స్టేషన్ లో దిగాం అని చెప్పాను. మీనక్క వెనకాల నుంచి మొట్టికాయ వేసి అది యహలంక, శ్రీలంక కాదు యలహంక అని అనేసరికి మా ఇద్దరికీ గొడవ. యహలంకే అంటాను నేను, కాదు యలహంక అంటారు మీనక్క మా ఇద్దరి గొడవని L.కపిల, ఎలకపిల్ల గొడవలాగా చూసి నవ్వుకుంటారు మా ప్రభ అక్క.
ఎట్టకేలకి మా కిరణ్ సార్ వాళ్ల ఇంటికి చేరుకున్నాం. అది ఒక మంచి కమ్యూనిటీలో ఉన్న ఇండివిడ్యుయల్ విల్లా. ఎంత బాగుందో. ఒక వారం రోజులు ఇక ఇక్కడే అనేసరికి మనసుకి ఎంతో శాంతి కలిగింది. ఒక రోజు వంకాయని ఏం చేయాలో మీనక్క, దోసకాయని ఏం చేయాలో ప్రభ అక్క ప్రణాళిక వేసుకున్నారు. కాయగూరలు, పన్నీరు, కొబ్బరి పాలు అన్నిటినీ కలిపేసి బంగాళా భౌ భౌ లాగా కొబ్బరి కోకో పులావ్ ఎలా చేయాలో అందరం కలిసి మరో రోజు ప్లాన్ చేసుకుని, ఆ విధానం అంతా షూటింగ్ చేసి, రీల్స్ చేసి, వంటలు చేసుకుని తిన్నాం.
ఆ రీల్ లింక్ ఈ వ్యాసం చివర్లో ఉంటుంది.
తర్వాత రెండు రోజులూ, ఉదయం, సాయంత్రం జిడ్డు కృష్ణమూర్తి గారి రిషివ్యాలి స్కూల్ వాతావరణంలా ఉన్న ఆ కమ్యూనిటీలో వాకింగులు, కబుర్లు. మానసిక, శారీరిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ప్రవర్తనా శాస్త్రం గురించి చర్చించుకుంటూ, దాసుభాషితం ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికల ఆలోచనలు పంచుకుంటూ నడిచాం. మిగతా సమయం, సోఫాల్లో కూర్చుని మీనక్క పుస్తకాలు ముందేసుకుని చదువుతుంటే, ప్రభ అక్క అప్పటికే రికార్డ్ చేసిన కొన్ని పుస్తకాల ఆడియో ఎడిటింగ్ చేస్తున్నారు. నేను వాటికి ఆర్ట్ వర్క్స్, ఇంకా కొన్ని వీడియో ఎడిటింగ్ వర్క్ చేస్తూ కూర్చున్నాను. ఇదే సమయంలో ఒక రచయిత దాదాపు 500 లకు పైగా అనువాదం చేసిన చిట్టి చిట్టి ఓషో తాత్విక కథల పర్మిషన్స్ నీ సాధించాము. త్వరలో వాటిని చిట్టి చిట్టి ఇడ్లీలలా వేడి, వేడిగా పబ్లిష్ చేస్తాం. వినడానికి సిద్ధంగా ఉండండి.
ఇప్పుడు మా బెంగళూరు సందర్శన గురించి చెప్తాను. అసలు ఏ గొప్ప ఊరి గురించి అయినా తెలుసుకోవాలి అంటే ఆ ఊరి మనుషులతో, మాట్లాడుతూ, అలా పొన్నియన్ సెల్వన్ లో వల్లవరాయ వంతి దేవుడిలాగా మజిలీలు చేసుకుంటూ పోవాలి ఏమో. మనకి అంత సమయం లేదు. అందుకే మేం ఎంచుకున్న ప్రదేశాలు బెంగళూరు మ్యూజియంలు.
నేను మా ప్రభక్కనీ, మీనక్కని బాగా మోటివేట్ చేసేసి, వాళ్లు అవసరమా అని అడుగుతున్నా, ఒక రేంజ్ లో స్పీచ్ ఇచ్చి బెంగళూరు కస్తూర్బా రోడ్ లో ఉన్న ప్రభుత్వ మ్యూజియంకు తీసుకు వెళ్లాను. అడుగు పెట్టాక తెలిసింది ఆ మ్యూజియంని మరమ్మత్తులు చేస్తున్నారట. మొత్తం బాగు చేయడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందిట. ప్రభ అక్క, మీనా అక్క నన్ను దుబాయ్ సీను సినిమాలో రవితేజ బ్రహ్మనందాన్ని చూసినట్లు అరెహో అంటూ చూశారు. ఇక పక్కనే ఉన్న విశ్వేశ్వరయ్య మ్యూజియం కి వెళ్దాం అని చెప్పే ధైర్యం నాకు రాలేదు.
అందుకే అటు నుంచి న్యూయార్క్ కి సెంట్రల్ పార్క్ ఎలాగో, బెంగళూరు కి అలాంటి కబ్బన్ పార్క్ కి వెళ్లి, అక్కడ కాసేపు ఆహ్లాదంగా విహరించి, ఆహ్లాదం ఎక్కువై Existential crisis కి గురై అక్కడ ఉన్న లైబ్రరీ లోకీ వెళ్లి కాసేపు తిరిగాం. తెలుగు పుస్తకాలు లేవు కానీ అంత పెద్ద పుస్తకాల మహా సముద్రంలో నాకు హెర్మాన్ కుల్కే అనే ఆయన రాసిన Kings and cults అనే పుస్తకం తళుక్కున మెరిసి నా చేతిలో పడి నన్ను ఆశ్చర్య పరిచింది.
ఈ Kings & cults అన్న పుస్తకం గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రధానంగా రాజులు ఎలా ఎదిగారో, రాజ్య విస్తరణ ఎలా చేశారో, వారి కాలంలో పూజా, క్రతువుల ద్వారా మనుషుల్లో నమ్మకాలు పెంచి పోషించి వాటిని Legitimate అంటే ఒక ప్రామాణికంగా, ఒక ధర్మరీతిగా పెంపొందించి వాటిని జనాలు నమ్ముతుండగా క్రమశిక్షణతో వాటిపైన రాజ్య విస్తరణ ఎలా చేశారో ఉంటుంది. కాకపోతే ఈ పుస్తకం చాలా భాగం కళింగ గజపతి రాజుల గురించి, జగన్నాథ ఆరాధన గురించి ఎక్కువగా ఉంది. మధ్య మధ్యలో ఇదే రీతిన విజయ నగర, చోళ సామ్రాజ్యాల ప్రస్తావన, ఇంకా అటునుంచి కాంబోడియాలో ఉన్న ఆంగ్ కోర్ వాట్ వరకూ ఈ Legitimacy తీరు గురించి ఉంది. పుస్తకం కొందామని ఓ ఫోటో తీసుకుని వచ్చాను.
https://www.flipkart.com/kings-and-cults/p/itmdyu6ygvchwgzb
తర్వాత ఇక బయటికి వచ్చి పక్కనే ఉన్న సామ్రాట్ చాళుక్య హోటలో లో భోజనం చేసి, హోటల్ బయట ఉన్న సామ్రాట్ చాళుక్య పులకేశి 2 పాలరాతి విగ్రహంతో ఒక ఫోటో దిగాను. ఈయన మా ఏలూరు పక్కనే ఉన్న వేంగి సామ్రాజ్యాన్ని జయించి అతని తమ్ముడికి పాలనకి ఇచ్చాడని విన్నాను. అదే నేటి పెదవేగి.
భోజనం చేసి పక్కనే ఉన్న కర్ణాటక చిత్రకళా పరిషత్ కి వెళ్ళాము. అబ్బా అక్కడ ఉన్న చిత్రకళలను చాలా సేపు చూస్తూ ఉండిపోయాము. ముఖ్యంగా మా ప్రభ అక్క అయితే అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగ డోర్ లోపలకి వెళ్లి చూస్తున్నట్లు చూస్తున్నారు. ఏవో పెట్టాలి కాబట్టి అక్కడ కొన్ని డిస్ప్లే కి పెట్టారు, కొన్ని నేల మీదనే అలా ఉంచేశారు. అచ్చంగా నేల మీద పడేసిన నేలమాళిగ సంపదలా. కొంచం ముందుకు పోయి చూద్దుము కదా అక్కడ ఒక గది తెరిచి ఉంది. అది 7వ నేలమాళిగ లాగా. చాలా మంది కళాకారులు గీసిన అద్భుతమైన పెయింటింగ్స్ అందులో సర్ది ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి అలా డిస్ప్లే కి పెట్టి తీస్తూ ఉంటారనుకున్నాను.
ఆ చిత్రకళా పరిషత్ కి మేం వెళ్లిన రోజు ప్రవేశ ద్వారం దగ్గర గదిలో Artist Sayeeda Ali గారు గత మూడు సంవత్సరాల్లో వేసిన 30 కి పైగా గొప్ప hand paintings ని ప్రదర్శన కి ఉంచారు. అవి ఎంతగానో బాగున్నాయి.
https://www.sayeedaali.com/mywork
ఇక తర్వాతి రోజు విశ్వేశ్వరయ్య మ్యూజియంలో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సెక్షన్స్ ని చకచకా చూసేసి, భోజనం చేసేసి పక్కనే ఉన్న మిగతా మ్యూజియంలకి వెళ్ళాము. ఏమయ్యా రామయ్యా అసలు ఒక్కరోజులో 3, 4 మ్యూజియంలు ఎవడైనా చూస్తాడా అయ్యా అని మీనా అక్క మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా చూపులు కలసిన శుభవేళ సినిమాలో సుత్తి వీరభద్రం గారు ఉద్యోగం అడగడానికి వచ్చిన కుర్రాళ్ళని కిలోమీటర్లకి, కిలోమీటర్లు తీసుకెళ్లి హైదరాబాద్ పొలిమేరలో వదిలేసినట్లు మీనా అక్కని నడిపించాము. ఆ మ్యూజియంలో ఉన్న వాటి గురించి ఆహ నాపెళ్లంటలో నూతన ప్రసాద్ ఆయన బయోగ్రఫీ చెప్పినట్లు ప్రతీది వివరించాను. బెంగళూరు పేలస్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్లు ఉచితంగా ఆడియో గైడ్ ఫోన్ ఇస్తాను అన్నా వద్దని వారించి, నేను క్రితం జన్మలో వడయార్ వంశస్థుడనని, ఈ ఆస్తి అంతా నాదే అని, బెంగళూరు పేలస్ లో అణువణువూ,పేరడీ, గారడీ ఆడియో గైడింగులా, వాకింగ్ స్టాండప్ కామెడీ చేసాను. వాట్ ఏ విజన్. వాటే థాట్ పిచ్చెక్కి పోయారు మీనా అక్క, ప్రభ అక్క ఇద్దరూ. చివరికి పాపం సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాను అనుకోండి.
కానీ మీనా అక్కకి మ్యూజియం అంటేనే జీవితంలో విరక్తి కలిగింది.
Museum of Art and Photography (MAP) అనే మ్యూజియం కి వెళ్ళాము. అందులో Tickets అని ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ ఉంది. ఒక డిజైనర్ గా నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది ఈ TICKETS floor. 17వ శతాబ్ద కాలంలో వాణిజ్యం, టెక్స్టైల్స్ బిజినెస్ విపరీతంగా ఊపు అందుకుంటున్న కాలంలో వచ్చాయి ఈ టికెట్స్. వీటి గురించి చెప్పాలి అంటే ఇదే ఒక న్యూస్ లెటర్ అయ్యి కూర్చుంటుంది. అందుకే చాలా క్లుప్తంగా వివరిస్తాను. వివరణకి సంబంధించిన లింక్ కింద ఇస్తాను.
మనకి చందన బ్రదర్స్, CMR, South India shopping mall, ZUDIO, ZARA ఇలా కొన్ని వందల, వేల రకాల బట్టల షాపులు, ఫ్యాషన్స్ ఉన్నాయి కదా. ఆ 17వ శతాబ్ద కాలంలో బ్రిటిష్, పోర్చగీస్ ఇంకా ఎన్నో దేశాల వాళ్లు ఇటు నుంచి అటు, అటు నించి ఇటూ తిరుగుతూ వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్ని లక్షల ట్రేడ్ మార్కులు, అంటే లోగోలు పుట్టుకొచ్చాయి. ఆ లోగోలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ మ్యూజియం వాళ్లు. డిజైన్ కోర్ ప్రిన్సిపల్స్ లో ఒకటి డిజైన్ చాలా సింపుల్ గా ఉండాలి అన్నది (ఉదా :- ఆపిల్ కంపెనీ లోగో) అసలు ఆ రూల్ వాళ్లు పాటించనే లేదు. చాలా చాలా అట్టహాసంగా ఉన్నాయి ఆ ట్రేడ్ మార్క్ లు. వాటిని తయారు చేయడానికి అప్పట్లోనే ప్రపంచ నలుమూలలా ట్రేడ్ మార్క్ డిజైనర్లు వెలిశారు, దాన్ని వారి కెరీర్ గా మలుచుకున్నారు. కానీ ఆ ట్రేడ్ మార్క్ లోగోలు ఎంత గందర గోళంగా, ఎంత అనవసర సమాచారంతో ఉండేవో చెప్పడం కంటే చూపించడం నయం. కింద ఉన్న చిత్రం లాంటి కొన్ని వేల చిత్రాలు ఈ MAP మ్యూజియంలో పెట్టారు.

నాకు జెలసీ కలిగించిన ఆర్ట్ గాలరీ బెంగళూరు లో ప్రభుత్వ మ్యూజియం పక్కన ఈ మధ్యనే 2025 లో ప్రారంభించిన కళా తపస్వి కే.వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ. కన్నడవారు వారి కళాకారులని ఎంత బాగా గౌరవించుకున్నారో కదా అనిపించింది. ఆయన వేసిన అరుదైన చిత్రాలు, Budha & his disciples, ooty river reflections చూసి మతి పోయింది. ప్రభ అక్కకి చిత్ర కళలు అంటే చాలా ఇష్టం. ఆవిడ వెంకటప్ప గారి Ooty river reflections చూసి ఈయన అసలు మనిషేనా, దేవుడా అని ఆశ్చర్యపోయారు.
.jpeg)

వెంకటప్ప గారు బ్రిటిష్ రాణి దగ్గర ఇంటర్న్ షిప్ చేస్తూ గీసిన చిత్రాలు, ఎల్లోరా శిల్పాల పై ఆయన చేసిన స్టడీ ప్రకారం వేసిన స్కెచ్ డ్రాఫ్టులు, కాల క్రమేణా ఆయన పెయింటింగ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడి చేతితో చెక్కిన శిల్పాలు, ఆయన వాడిన టూల్స్ అన్నీ జాగ్రత్తగా ఆ ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. ఆయన వేసిన చిత్రాలు, కళలు ఇంకా చేర్చబోతున్నారు.
మన బాపూ గారూ, వడ్డాది పాపయ్యగారి చిత్రాలను, ఆర్టిస్ట్ కరుణాకర్ గారి చిత్రాలను సేకరించి మన విజయవాడలోనో, తెలంగాణాలోనో మంచిగా ఒక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తే బాగుండును కదా అనిపించింది. ఒక రంగంలో అవార్డులు, బహుమతులు పొందిన తెలుగు, లేదా భారతీయ స్థాయి ఫోటోగ్రాఫ్ లను కూడా పెడితే ఇంకా బాగుండును కదా, మన తెలుగు వాడి చేతి కళ చాలా మందికి తెలుస్తుంది అనిపించింది. ఈ నేత్ర దాహం ఎప్పటికి తీరుతుందో మరి.
ఇక ఇంతే మా ప్రయాణపు సంగతులు. మీరు చెప్పండి ఇంకా మేం, బెంగళూరు లో ఏం చూస్తే బాగుండేది, మేం చూసి వర్ణించిన వాటి పైన మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాలు.
అలాగే మా టీమ్ మొత్తం కలిసి చేసిన కొబ్బరి కోకో కొబ్బరి పాల పులావ్ వీడియోని ఈ instagram Link లో చూసి, ఈ ఆదివారం మీరూ మీ ఇంట్లో ట్రై చేయండి. లింక్ :-
https://www.instagram.com/reel/DQhXRWYD9Fk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
MAP మ్యూజియంలో ఉన్న TICKETS సమాచారం లింక్.
అభినందనలతో,
రామ్ కొత్తపల్లి.


