మా నాన్నగారు సూరంపూడి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు. టైలర్‌తో కుట్టించుకున్న సాదారకం చొక్కా ప్యాంటు, కొద్దిగా అరిగిపోయిన మామూలు చెప్పులు, భుజానికి చేతిసంచీ వేసుకుని, కాలినడకనో, పాత హీరో సైకిల్ మీదనో తిరిగిన రమణ మాస్టారు సామాన్యుడు అన్న పదానికి నిలువెత్తు రూపంలా ఉండేవారు. ఆయనేమీ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించలేదు. వ్యాపార సంస్థలు నెలకొల్పలేదు. ప్రభుత్వ పదవుల కోసం పోటీచేయలేదు. జాతీయ స్థాయి అవార్డుల కోసమైతే ప్రయత్నించనేలేదు. మరి జీవించిన ఆ డెబ్భై సంవత్సరాల కాలంలో ఏం చేశారు?
చాలామందిలానే రోడ్డు మీద వెళ్తూ దారిన కనబడే పళ్ళబుట్ట దగ్గర ఆగి పళ్ళు కొనుక్కునేవారు. ఎవరి దగ్గర ఏం కొనుక్కున్నా వాళ్ళందరి ఊరూ పేరూ గుర్తుపెట్టుకుని పలకరించేవారు. కానీ, ఓరోజు రోడ్డుపక్కన జామపళ్ళు అమ్ముకునే ముసలాయన కళ్ళు దిగాలుగా కనిపిస్తే "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగారు. కూతురికి క్యాన్సర్, ఆమె భర్త వదిలేశాడు, చిన్న బాబు ఉన్నాడు. ఇప్పుడామె పనిచేయలేకపోతోంది. అందరికీ తానే ఆధారం. కనీస వైద్యం చేయించే స్తోమతు కూడా లేదు. అదీ విషయం. తెలుసుకున్న రమణ గారు ఊరుకోలేదు. పత్రికలో ఈ విషయాన్ని గురించి రాశారు. తన కోసం వాడుకోని పరిచయాలన్నీ ఇందుకోసం ఉపయోగించారు. వ్యక్తులు, సంస్థలు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించేలా కృషిసాగించారు. అలా లక్షలాది రూపాయలు ఆ ముసలాయన ఖాతాలో పోగుపడేవరకూ విశ్రమించలేదు. ఇంతలో క్యాన్సర్ ఆసుపత్రి ఒకటి ముందుకువచ్చి ఉచితంగా ఆ పేదరాలికి వైద్యం చేసింది. ఆపైన రెండున్నర సంవత్సరాల పాటు ఆమె బ్రతికింది. ఉచిత వైద్యం లభించడంతో వైద్యం కోసం వచ్చిన డబ్బు ఆమె కొడుకు చదువుకు ఉపయోగపడింది. ఆమె మరణించాకా ఆ జామపళ్ళు అమ్మే పెద్దాయన రమణ గారికి కృతజ్ఞతలు చెప్తూ "మా అమ్మాయి వైద్యం చేయించినా పోయింది. చేయించకపోయినా బహుశా ఇదే టైముకి పోయేదేమో. కానీ, నాకు బ్రతికినంతకాలం నాలాంటివాడికి కూతురుగా పుట్టి వైద్యం దక్కక పోయింది కదా అన్న బాధ ములుకులా పొడిచేది. మీరు ఆ బాధ లేకుండా చేశారు." అన్నాడు.
భారతదేశంలో కొన్ని లక్షలు, కోట్లమందిలాగానే కుటుంబాన్ని నడపడం కోసం అర్థరాత్రి వరకూ తాపత్రాయపడేవారు. బాధ్యతల బరువులు, సంసారంలోని ఈతిబాధలూ, జీవితం కొట్టిన దెబ్బలూ, మనుషుల రెండు ముఖాలు ఆయనకు చాలానే అనుభవం. కానీ, దానికోసం తన ఇష్టాలను, అభిరుచులను చంపుకోలేదు. నిష్కల్మషమైన తన నవ్వును వదులుకోలేదు, ఎదుటివారిని నవ్వించగల తన ప్రజ్ఞను విడిచిపెట్టలేదు. అర్థరాత్రి గడిచాకా తన నాటక రంగ మిత్రులతో కలసి తాము వేయబోయే నాటకానికి రిహార్సల్స్ కానిచ్చేవారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల తాను సినిమాల్లోకి రాకముందు రాసిన "ఏక్ దిన్ కా సుల్తాన్" అనే నాటకంలో ఆఫీసులో పనిచేస్తున్నవారిని అదరగొట్టి బెదరగొట్టే వెంకటరత్నం పాత్ర వేసి కడుపుబ్బా ఎలా నవ్వించారో గుర్తే. ఎన్ని వేదికలపైనో చిన్న చిన్న స్కిట్స్ వేసి అందరి మనస్సుల్లోని ఒత్తిడినీ మాయం చేసేవారో గుర్తే. బ్రహ్మానందం ప్రముఖ సినీనటుడిగా కాక అత్తిల్లో తెలుగు మాస్టారిగా ఉన్నరోజుల్లో తానూ ఆయనా కలిసి ఎలాంటి ప్రాక్టికల్ జోకులు వేసి పదిమందినీ ఆశ్చర్యపరిచేవాళ్ళమో ఆయన చెప్తూండడం గుర్తే. జీవితం ఎన్ని ముళ్ళదారుల్లో ఆయన్ని నడిపించినా నవ్వుల పువ్వులు విరబూయించే తత్త్వాన్ని మాత్రం లాగేసుకోలేకపోయింది.

వృత్తిపరంగా చూస్తే వేలాదిమంది ఉపాధ్యాయుల్లో ఆయనా ఒకరు. కానీ, బడిపిల్లలకు ప్రభుత్వం పచ్చరంగు లాగూ, పచ్చగళ్ళ చొక్కా యూనీఫాంగా ఇస్తే, తాను కూడా పచ్చరంగు ప్యాంటూ, పచ్చగళ్ళ చొక్కా కుట్టించుకుని, ఆ బట్టల్లోనే బడికి వెళ్ళి పాఠాలు చెప్పి యూనిఫాం అన్న పదానికి సిసలైన నిర్వచనాన్ని తెలిపిన గురువు ఆయన. ఒక కుర్రాడిని ఊరు ఊరంతా వెర్రివాడనీ, అవిటిమనిషి అనీ ముద్రవేసి చదువుకూ, గౌరవప్రదమైన బ్రతుక్కీ దూరంచేసి పశువుల కాపరి చేసి వదిలిపెడితే, అసలు "నీ కాలికి ఏ సమస్యా లేదు. నడువు" అని నడిపించి, టీనేజీలోకి వచ్చేసిన కుర్రాడితో అఆలు దిద్దించి, కొన్నేళ్ళలోనే ముందు ఏడోతరగతి, తర్వాత పదోతరగతి చదివించి పాస్ చేశారు. ఆ కుర్రాడు ఈరోజు విదేశాల్లో వృత్తినిపుణుడై, పెళ్ళిచేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నాడు. సుదీర్ఘమైన వృత్తి జీవితంలో ఇలాంటి కథలు ఎన్నో. అందుకే, "అవార్డులకు దరఖాస్తు చేసుకోవడం అవమానకరం" అని భావించిన మనిషికి, ఆయన దరఖాస్తు చేసుకోనక్కరలేకుండానే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వయంగా వరించాయి.
చాలామందిమి జేబులో వెయ్యి రూపాయలు ఉంటే ఓ పదిరూపాయలు దానం చేస్తాం. అవతలి వ్యక్తి అవసరం మన స్తోమత కన్నా చాలా ఎక్కువ ఉంటే ఇవ్వగలిగింది ఇచ్చి ఊరుకుంటాం. కానీ, రమణ మాస్టారు మాత్రం అందుకూ భిన్నమే. సినిమాలూ, టీవీలూ, సోషల్ మీడియా జనం తీరికవేళను పంచుకుంటున్న సందడిలో రంగస్థల కళలు చితికిపోతున్నాయనీ, రంగస్థల కళలనే నమ్ముకుని, వాటి కోసం జీవితాన్ని అర్పించిన కళాకారులు ఆర్థికంగా ఏ దిక్కూలేకుండా అయిపోతున్నారనీ గమనించి రెపరెపలాడుతున్న వారి జీవితాలకు ఓ కాపుకాసే ప్రయత్నం చేశారు. ప్రతీ నెలా రంగస్థల కళలే వృత్తిగా బ్రతికిన ఒక నిరుపేదను తాడేపల్లిగూడెం తీసుకువచ్చి, వారికి ఆర్థిక సత్కార కార్యక్రమం ఏర్పాటుచేసేవారు. అదే వేదిక మీద ప్రసిద్ధులైన ఉద్యోగులకో, ప్రఖ్యాతులైన రాజకీయ నేతలకో, ఇంకేదో రంగంలో పేరున్నవారికో గౌరవ సత్కారం కూడా పెట్టేవారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జనంతో హాలు నిండేది. అప్పుడు, ముందుగా ఆర్థిక సత్కార గ్రహీత అయిన కళాకారుని (లేదా కళాకారిణి) ఘనత, సమాజానికి కళల ద్వారా వారి సేవ, ఇప్పుడు వారి దుస్థితి తెలియజేసి ఎంతో కొంత దానం చేయమని ప్రోత్సహించేవారు. ఒకరు ఐదొందలు ఇస్తే, ఇంకొకరు రెండొందలు, మరొకరు వెయ్యి. అలా వచ్చిన డబ్బంతా అక్కడే లెక్కకట్టి వారికి ఉపయోగపడేలా అందించేవారు. వారికి కనీసం రూ.30 వేల నుంచి వేళ బావుంటే దాదాపు రూ.70 వేల వరకూ వచ్చేది. ఆ డబ్బు కొన్ని నెలల పాటు వారు గడపడానికో, డయాలసిస్ వంటి వైద్యాల కోసమో, ఆడపిల్ల పెళ్ళి కోసమో, కొన్ని దురదృష్టకరమైన సందర్భాల్లో కళాకారులు మరణిస్తే కుటుంబానికో ఉపయోగపడేవి.
ఇలా చెప్తూ పోతే - చాలానే చేశారు. సమాజానికే కాదు కుటుంబానికి కూడా. చిన్నకొడుకుగా పుట్టినా మూడు దశాబ్దాల పాటు తల్లినీ, అక్కచెల్లెళ్ళనూ చూసుకున్నారు. ఇంజనీరింగ్ - మెడిసిన్ జ్వరం తగిలి ఏ కళల వైపూ పిల్లలను తల్లిదండ్రులు చూడనివ్వని 2000 దశాబ్దాంలో పిల్లలమైన మాకు సాహిత్యాన్ని వారసత్వంగా పంచి ఇచ్చారు, నచ్చిన పనిచేసే స్వేచ్ఛనిచ్చారు. తన మాట, తన ఆలోచన నచ్చిన మిత్రులను తెలిసో తెలియకో ప్రభావితం చేశారు. ఎందరో నాయకులతో సన్నిహిత సంబంధాలున్నా వారిని స్వలాభం కోసం ఉపయోగించుకోలేదు. నిజాయితీ అన్నదేదో ఉద్ధరింపు అనుకోలేదు, జీవిత విధానంగా మలచుకున్నారు. అవార్డులూ, ఆస్తులూ, పదవులూ, సంస్థలూ - కొలవలేని సామాన్యమైన అసాధారణ జీవితాన్ని జీవించారు. తన చుట్టూ ఉన్న సమాజానికే కాదు భావి తరాలకు కూడా నేర్చుకోవాలంటే నేర్చుకునేందుకు ఎంతో మిగిల్చి - గురుపౌర్ణమి రోజున హఠాత్తుగా వెళ్ళిపోయారు.
పవన్ సంతోష్ సూరంపూడి