అచ్చ తెలుగువాడు త్యాగయ్య రాముడు

Meena Yogeshwar
May 1, 2024

రెండు తరాల క్రితం తెలుగునాడును వదిలిపెట్టి, శరభోజీ అనే మరాఠీ రాజుగా ఉన్న, ఇంగ్లీషు వాళ్ళ ప్రధాన పరిపాలన కొనసాగుతున్న, ముస్లిం రాజుల దండయాత్రలు చవి చూసిన, నేర్చుకునే శిష్యులతో సహా అత్యధిక శాతం తమిళిలున్న తమిళ ప్రాంతంలో, తెలుగులో కీర్తనలు చేయడం గొప్పే. తెలుగు నేర్చుకుంటే తప్ప తన కీర్తనలు నేర్పను అని శిష్యులకు షరతు పెట్టడం గొప్పే. రాసిన కొన్ని వేల కీర్తనల్లో, మిగిలిన 800 కీర్తనల్లో పట్టుమని పది కూడా సంస్కృతం తప్ప పరభాషా పదాలు వాడకపోవడం...

తెలుగు మాతృభాషగా కలిగిన వాడు తెలుగులో పాటలు రాయడం కూడా గొప్పేనా? గొప్పే. రెండు తరాల క్రితం తెలుగునాడును వదిలిపెట్టి, శరభోజీ అనే మరాఠీ రాజుగా ఉన్న, ఇంగ్లీషు వాళ్ళ ప్రధాన పరిపాలన కొనసాగుతున్న, ముస్లిం రాజుల దండయాత్రలు చవి చూసిన, నేర్చుకునే శిష్యులతో సహా అత్యధిక శాతం తమిళిలున్న తమిళ ప్రాంతంలో, తెలుగులో కీర్తనలు చేయడం గొప్పే. తెలుగు నేర్చుకుంటే తప్ప తన కీర్తనలు నేర్పను అని శిష్యులకు షరతు పెట్టడం గొప్పే. రాసిన కొన్ని వేల కీర్తనల్లో, మిగిలిన 800 కీర్తనల్లో పట్టుమని పది కూడా సంస్కృతం తప్ప పరభాషా పదాలు వాడకపోవడం గొప్పే. గొప్పే. ముమ్మాటికీ గొప్పే.

ఈ ఒక్క కారణంతోనైనా తెలుగువారు తలెత్తుకుని ‘త్యాగరాజు మావాడు, ఆయన పెట్టిన భిక్షే నేడు కర్ణాటక సంగీతంలో తెలుగుకు అగ్రస్థానం’ అని గర్వంగా చెప్పుకోవాల్సిన మాట. అన్నమయ్య, రామదాసు కూడా అచ్చ తెలుగులో కీర్తనలు రాశారు కదా, త్యాగరాజు గొప్పేంటి అంటారా? ఏదైనా కచేరీకి వెళ్ళి చూడండి. కొమ్ములు తిరిగిన తమిళ, మలయాళ, కన్నడ భాషాభిమానులైనా, త్యాగరాజు రాసిన తెలుగు కీర్తన లేనిదే కర్ణాటక సంగీత కచేరీ పూర్తి చేయడం అత్యంత అరుదు. దాదాపుగా జరగదనే చెప్పుకోవాలి. అంతలా తన కీర్తనల ద్వారా తెలుగుకు అగ్ర తాంబూలం ఇప్పించిన త్యాగరాజు గొప్పే.

తెలుగు పలుకుబడులు, సామెతలు, వ్యాకరణం త్యాగరాజ కీర్తనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. హిందీ వాళ్ళు గణేశ్ జీ, కాన్హా జీ అంటూ దేవుడికి మర్యాద ఇస్తారు. ఇటు తమిళంలోనూ కామాక్షి అమ్మాళ్, అరుణాచలేశ్వరర్ అంటూ గౌరవం ఇస్తారు. ఎటొచ్చీ తెలుగువారికి దేవుడెప్పుడూ దగ్గరివాడే. కనదుర్గమ్మ, భద్రాచల రాముడు ఇలా ఏకవచనంతో పిలవడం వల్ల దేవుళ్ళని తమవారిగా చేసుకోవడం మనకలవాటు.

ఇదే అలవాటు త్యాగరాజ కీర్తనల్లోనూ గమనించవచ్చు. ‘నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా, నిన్ను బాసి అరనిమిషమోర్వనురా’ అనే కీర్తన చూస్తే రాముణ్ణి తన సొంత వాడిని చేసుకుని ‘రా’ అంటు సంబోధిస్తాడు. ఇలాంటి కీర్తనలు కోకొల్లలు. ‘ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారాధించిరిరా నరవరు’, ‘ఎవరిచ్చిరిరా శరచాపము, నీ నికకులాబ్ధి చంద్ర’, ‘దుడుకుగల నన్నే కొడుకు బ్రోచురా’, ‘కనకన రుచిరా కనకవసన’ వంటివి వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అలాగే ‘అయ్యా’ అంటూ సంబోధించడం కూడా ఎన్నో కీర్తనల్లో కద్దు. ‘చెంతనె సదా యుంచుకొనవయ్య, మంతుకెక్కు శ్రీమంతుడౌ హనుమంతు రీతిగ శ్రీకాంత’, ‘నీ వంటి దైవము నే గాన నీరజాక్ష శ్రీరామయ్య’, ‘నిన్నె నెర నమ్మినానురా ఓరామ రామయ్య’, ‘బాగాయెనయ్యా నీ మాయలెంతో బ్రహ్మకైన గొనియాడ దరమా’, ‘మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ, మేలైన సీతాసమేత మా భాగ్యమా’ వంటివాటిలో ఈ అయ్య పద ప్రయోగం మనం చూడవచ్చు. తెలుగునాట దేవుని పట్ల అత్యంత వాడుకలలో ఉన్న ఈ రెండు పదప్రయోగాలను వాడడంతో రాముణ్ణి మరింత తెలుగు దేవుణ్ణి చేయడంలో త్యాగరాజు కృషి అనన్యసామాన్యం.

ఇక తెలుగు పలుకుబడులు, సామెతలు కూడా త్యాగరాజు కీర్తనల్లో విరివిగా దొరుకుతాయి. దేశీయ రాగంలోని ‘రూకలు పదివేలున్న జేరెడు నూకలు గతికాని ఓ మనసా, కోకలు వెయ్యున్న కట్టుకొనుటకొకటి కాని ఓ మనసా’ కీర్తన పూర్తిగా సామెతలతో నిండిపోయి ఉంటుంది. నాటకురంజి రాగంలో స్వరపరచిన ‘మనసు విషయ నట విటులకొసంగిన’ కీర్తనలోని చరణాలన్నీ కూడా సామెతలతోనే ఉంటుంది. తెలుగుపై త్యాగరాజుకున్న పట్టు ఒక విధంగా ఇలాంటి కీర్తనల్లో బయటపడితే, ఎన్నో శబ్ధాలంకారాలు, అంత్యానుప్రాసలు నిండిపోయిన కీర్తనలు ఆయనకున్న వ్యాకరణ బలాన్ని చూపిస్తాయి.

‘రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ’ పాటలో ప్రతీ చరణం అంత్యానుప్రాసతో అత్యంత సుందరంగా ఉంటుంది. ‘మోసబోకు వినవే సత్సహ వాసము విడకే’ కీర్తనలోని మొదటి చరణంలో రెండో పదానికి తరువాతి వాక్యంలోని రెండో పదానికి అద్భుతమైన వృత్యానుప్రాసాలంకారం వేశారు త్యాగరాజు. చిన్ననాటి నుండి తల్లి ఉగ్గుపాలతో పాటుగా నేర్పిన రామదాసు కీర్తనల ప్రభావమో ఏమో కానీ, ఆయనలాగానే తన కష్టసుఖాలను రాముడికి నివేదించడానికి జనసామాన్య భాషనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు త్యాగరాజు.

ప్రతి నెల దాసుభాషితం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో భాగంగా మే నెల మొదటి శనివారం నాలుగవ తేదీ యాదృచ్ఛికంగా త్యాగరాజస్వామి 257వ జయంతి నాడు, ఉదయం 9.30గంటలకు ‘త్యాగరాజ హృదయధ్వని’ పేరుతో ప్రసంగం జరగనుంది. సంగీత రసవిశ్లేషకులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారు త్యాగరాజ సాహిత్యంలోని లోతులను మనకు ఆవిష్కరించనున్నారు. ఎందరో తెలుగు సాహితీకారులచే చిన్నచూపు చూడబడ్డ త్యాగరాజ సాహిత్యంలో ఎంతటి గాఢత ఉందో ఐదు దశాబ్ధాలుగా విజయభాస్కర్ గారు వివరించడమే జీవిత ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే ఈ ప్రసంగం ద్వారా మన దాసుభాషితం శ్రోతలకు త్యాగరాజును మరింత దగ్గరగా పరిచయం చేయనున్నారు.

టామ్ జోన్స్ - విశ్లేషణ

ప్రపంచ సాహిత్యంలో నవల అనే కొత్త ప్రక్రియ ప్రవేశానికి తెరి తీసిన సాహిత్య సృష్టలలో ముఖ్యుడు హెన్రీ ఫీల్డింగ్. నాటకం నుండి నవలకు మొగ్గిన తొలితరం నవలాకారుడు అతను. అతను రాసిన వాటిలో బాగా ప్రఖ్యాతి చెందిన నవలల్లో టామ్ జోన్స్ ఒకటి. ఇతర నవలాకరుల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన నవలగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ పుస్తకం. విడుదలైన మొట్టమొదటి ఏడాదే నాలుగుసార్లు పునర్ముద్రితమై బెస్ట్ సెల్లర్ గా నిలిచింది ఈ నవల.

Tap to Listen

మానవ ప్రకృతిలోని సంక్లిష్టతను విశదపరచే ఉద్ధేశ్యంతో ఈ నవల రాస్తున్నట్టు హెన్రీ తొలిమాటల్లో ప్రస్తావించాడు. అయితే చాలావరకూ తన లక్ష్యాన్ని చేరుకున్నా, కథలో పెద్దగా బరువు లేకపోవడం, బాగా విస్తారంగా ఉండడం, ముగింపు అసహజంగా ఉండడం వలన ఈ నవల నేటి తరానికి పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ, తొలి తరం నవలగా, ఒక కొత్త ప్రయోగంగా చూసినప్పుడు దీనికి అంతటి గౌరవం, ఆదరణ దక్కడంలో విశేషం మనకి అర్ధం అవుతుంది. 

సంక్షిప్తంగా వివరించాలంటే ధనవంతులైన అన్నాచెల్లెళ్ళు పెంచుకున్న అనాధ బాలుడు ‘టామ్ జోన్స్’ జీవిత విశేషాలే ఈ నవల కథాంశం. ఇందులో ఆ అన్నాచెల్లెళ్ళు, చెల్లెలి భర్త, కొడుకు, పక్క ఎస్టేట్ యజమాని కూతురు వంటివారు అత్యంత ప్రముఖ పాత్రలు. వీరి వల్ల టామ్ జీవితం, టామ్ వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ఈ నవల. ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ నవలపై చేసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. తొలితరం నవల కథా కమామిషు ఏమిటో ఈ విశ్లేషణ విని తెలుసుకోవచ్చు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :