అమ్మమ్మకు కూడా అర్ధమయ్యే ‘AI Talk’

Ram Kottapalli
December 4, 2023

కృత్రిమ మేధ (AI) ఒక పెద్ద అలలాగా లేచి ప్రపంచానికి తన ఉనికిని అప్పుడే తెలియజేస్తున్న రోజులు. Open AI సంస్థ విడుదల చేసిన కృత్రిమ మేధకు పోటీగా గూగుల్ తన అమ్ముల పొదిలో ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న Bard AI ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి గూగుల్ AI మీద పరిశోధనలు చేస్తున్నా, దాన్ని పూర్తిగా ప్రపంచానికి విడుదల చేయకపోవడానికి కారణం ...

కృత్రిమ మేధ (AI) ఒక పెద్ద అలలాగా లేచి ప్రపంచానికి తన ఉనికిని అప్పుడే తెలియజేస్తున్న రోజులు. Open AI సంస్థ విడుదల చేసిన కృత్రిమ మేధకు పోటీగా గూగుల్ తన అమ్ముల పొదిలో ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న Bard AI ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి గూగుల్ AI మీద పరిశోధనలు చేస్తున్నా, దాన్ని పూర్తిగా ప్రపంచానికి విడుదల చేయకపోవడానికి కారణం AI సమాజానికి చేసే కీడు వల్లనే. కీడెంచి మేలెంచమన్నారు కదా మరి. 

Bard AI విడుదలకు కొద్ది రోజుల ముందు ఒక అమెరికన్ TV చానెల్ తో జరిగిన ఇంటర్వ్యూ లో సుందర్ పిచాయ్ కి జర్నలిస్ట్ కి జరిగిన సంభాషణ ఇలా ఉంది. 

సుందర్ - ప్రస్తుతం నిర్మితం అవుతున్న కృత్రిమ మేధ తన నిర్మాణం కోసం దానంతట అదే చాలా విషయాలు తెలుసుకుంటుంది. కొన్ని సందర్భాలలో దానికి చెప్పని, కమాండ్ ఇవ్వని విషయాలు కూడా తెలుసుకుంటుంది. ఇక్కడ AI కి Black Box అనే అంశం ఒకటి ఉంది. అది మాకింకా పూర్తిగా అర్ధం కాలేదు. మనం ఒకటి అడిగితే అది ఒకటి ఎందుకు చెప్తుందో ! ఒకటి చూపించు అంటే ఇంకోటి ఎందుకు చూపిస్తుందో ! మనం చెప్పలేం. 

జర్నలిస్ట్ - ఏంటి ? మీకు ఆ కృత్రిమ మేధ ఇంకా పూర్తిగా అర్ధం కాలేదా ? కాకపోయినా మీరు దానిని సమాజంపైకి వదిలారా ?

సుందర్ - మనం దీన్ని ఈ దృష్టి కోణంలో చూద్దాం. మనం ఒక మానవ మేధస్సు ఎలా పని చేస్తుందో కూడా అర్ధం చేసుకోలేదు. ఏ క్షణం లో మానవ మేధస్సు దేని గురించి ఆలోచిస్తూ దేన్ని సృష్టించాలి అనుకుంటుందో మనం అంచనా వెయ్యలేం. కృత్రిమ మేధ కూడా అలాంటిదే. ప్రస్తుతం నిర్మితం అవుతున్న కృత్రిమ మేధ Algorithams ద్వారా ఎన్నో విషయాలను, నేర్చుకుంటుంది, చిత్రాలను చూస్తుంది, గుర్తు పడుతుంది. ఈ విషయ పరిజ్ఞానం ద్వారా సృష్టించడం, తేడాని గుర్తించడం, తప్పు జరిగితే కారణం తెల్సుకోవడం, చివరగా అసలు జ్ఞానాన్ని పొందు పరచడం చేస్తుంది. ఆ తర్వాత మానవులమైన మీ లాంటి వారు, నాలాంటి వారు కృత్రిమ మేధ సృష్టిని process చేసి, గమనించి దాని పని తీరుని ఇంకా మెరుగు పరచడం చేయవచ్చు.  ప్రస్తుతం కృత్రిమ మేధ పట్ల జరగాల్సిన అభివృద్ది అదే. అందుకే ఇప్పుడు మేం దాన్ని విడుదల చేస్తున్నాం. 

సుందర్ పిచాయ్ చెప్పినట్లే Algorithams ద్వారా, తనని వాడే వినియోగదారుల ద్వారా, తనంతట తానుగా కూడా కృత్రిమ మేధ నిరంతరం నేర్చుకుంటేనే ఉంటోంది, చిత్ర కళలో ప్రపంచంలోని చిత్రకారుల శైలి మొత్తాన్ని అర్ధం చేసుకుని అందుకు తగ్గ చిత్రాలు క్షణాల్లో గీసి ఇస్తుంది, రచనలో ప్రఖ్యాతి గాంచిన రచయితల శైలి ఆకళింపు చేసుకుని వ్యాసాలు రాసి ఇస్తోంది. తప్పుగా చెప్తున్నావ్ ఈ సమాచారం సరైంది కాదు అంటే క్షమించండి నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అని బదులు ఇస్తోంది. 

ఇలాంటి మేధస్సు తో ఈ కృత్రిమ మేధ ఇప్పుడు అన్ని రంగాలలో వ్యాప్తిస్తుంది. చిత్ర కళ, రచన, సంగీతం, వాయిస్ క్లోనింగ్, వీడియో ఎడిటింగ్, వైద్యం, వ్యాపారం, ఇలా ఇందు గలదు అందు కలదు అని సందేహం వలదు అన్నట్లు అన్ని విభాగాల్లోనూ కొత్తగా జన్మిస్తూ తనని తాను సృష్టించుకుంటూ, ఆ సృష్టిని మళ్ళీ ప్రతి సృష్టి చేసుకుంటూ విస్తరిస్తోంది. 

ఇప్పుడు AI ఒకటో తరగతి పిల్లాడి హోమ్ వర్క్ చేసి పెట్టగలదు, సుప్రీం కోర్టు జడ్జి తీర్పుని రాసి పెట్టగలదు. చిత్రాలు గీసి రంగులద్ది సినిమాలు తీయగలదు. అది కూడా మానవుడి కంటే వేగంగా. మరి మనిషి ఉద్యోగాలు పరిస్థితి ఏంటి? కట్ట తెగిన నదిలాగా విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న

 AIని సృష్టించిన వాళ్ళైనా కళ్ళాలు వేయగలరా? వేసినా ఆగే స్థితిలో అది ఉందా? 

AI ఎన్ని రంగాలలో విస్తరించింది, దాని శక్తి సామర్ధ్యాలు ఏమిటి, ఒక అమ్మాయి పూర్తి సోషల్ మీడియా సమాచారంతో ఆమె మానసిక ప్రవర్తనని అంచనా వేసి ఆమె ఆత్మహత్యకి పాల్పడకుండా ఆపే స్థితికి చేసరుకున్న AI పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, AI ఒక వేళ మానవాళి పై ఆధిపత్యం సాధించే దిశగా సాగితే మన ముందున్న మార్గాలు ఏమిటి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మన అమ్మమ్మకి కూడా అర్ధమయ్యే రీతిలో దాసుభాషితం Co-founder, CEO దాసు కిరణ్ గారు ఈ నెల ప్రసంగంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం పూర్తి వీడియో పైన ఉంది చూడండి. 

అభినందనలు,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :