జీవితంలో ప్రతీ క్షణం ఒక surprise gift. ఒక్కోసారి ఆ బహుమతి మనం బాగా కోరుకున్నది కావచ్చు. ఒక్కోసారి మనం ఊహించనిది, ఇష్టం లేనిది కావచ్చు. మనకి నచ్చినా, నచ్చకపోయినా ఆ బహుమతి మనకి వచ్చే తీరుతుంది. పైగా, ఆ జరిగేదంతా మన మంచి కోసమే జరుగుతుంది. కానీ, ఆ క్షణానికి మనకి ఎంతో అన్యాయం జరిగిందని మనం భావిస్తాం, కానీ భవిష్యత్తులో ఆ జరిగిపోయిన క్షణం తాలూకూ మంచినే అనుభవిస్తాం. Life is a great secret.
అలా అనుకున్నది జీవితంలో జరగని ఒక అమ్మాయి, తన దేశానికి యుద్ధసమయంలో అన్యాపదేశంగా సహాయపడగలిగింది. ఆ అమ్మాయి జీవితాన్ని పరిశీలిస్తే, ప్రతీ మలుపూ ఆమెకు అన్యాయమే చేస్తోందని బాధగా అనిపిస్తుంది. నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం ఎంతో బాధాకరంగానే గడిచింది. అయితే, ఆమె నమ్ముకున్న, ఆమెను నమ్ముకున్న కుటుంబం, వారి వ్యాపారం, తద్వారా దేశ క్షేమానికి ఆమె బాధాకరమైన జీవితమే పునాది అయింది. ఆమె ప్రతి త్యాగం ఆ కుటుంబ, వ్యాపారాలకు వెన్నుముకల్లో ఎముకుల్లా ఉపయోగపడ్డాయి.
1940ల్లో మార్షియా డెవెన్ పోర్ట్ పిట్స్ బర్గ్ నగరంలోని ఒక సంపన్న కుటుంబం, వారి ఇంట్లో పని చేసే మేరీ అనే అమ్మాయిల కథను మొదటి ప్రపంచ యుద్ధం, pearl harborలపై దాడి వంటి వాటి నేపధ్యాలలో ఇమిడ్చి రాశారు. అలాగే సామాజిక అంతరాలపై కూడా ఈ నవల చర్చిస్తుంది. 1873లో మేరీ అనే అమ్మాయి స్కాట్ కుటుంబానికి పనిమనిషిగా చేరిన సమయంలో మొదలయ్యే ఈ నవల, 1940ల్లో స్కాట్ పరిశ్రమ, ఆయుధాల తయారీ కోసం శత్రు రాజ్యం చేతిలో పడిపోకుండా మేరీ కాపాడడంతో ముగుస్తుంది. 70ఏళ్ళ కాలంలో మేరీ పనిమనిషే అయినా, స్కాట్ కుటుంబాన్ని కాపాడుకొచ్చిన తీరు, ఆ కుటుంబం కోసం తన ప్రేమ, జీవితం త్యాగం చేయడమే ఈ నవల కథాంశం.
ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో ఉంటాయా? ఒకళ్ళ కోసం తన జీవితాన్ని ఇంత సంతోషంగా ధారబోసేవాళ్ళు ఉంటారా అని మనం ఆశ్చర్యపడతాం. కొందరైతే, ఆ కాలంలో చేశారు, ఇప్పుడు అలా ఉండేవాళ్ళు ఎవరు? అని కూడా అనుకుంటారు. కానీ సరిగ్గా గమనిస్తే, ప్రతి తరంలోనూ ఎన్నో కుటుంబాల్లో ఇలా తమవారి కోసం జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. కానీ ఆ త్యాగం అవసరమా? వేరే వాళ్ళ కోసం మనం ఎంతవరకూ త్యాగం చేయవచ్చు? అనే ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. ఈ వారం ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీచందూర్ గారు రాసిన విశ్లేషణ విడుదల అవుతోంది.
ఈ దీపావళికి ఇంత భారమైన నవలా పరిచయాన్ని అందించడం అవసరమా అని ఒక సమయంలో మేము ఆలోచించాం. కానీ ఆత్మపరిశీలనకు అవకాశమిచ్చే ఇలాంటి కథలను తెలుసుకోవడానికి పండుగను మించిన అవకాశం ఉండదు అనిపించింది. అందరికీ దాసుభాషితం తరఫున దీపావళి శుభాకాంక్షలు.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.