అసలు ఫెమినిజం అవసరమా ?

Ram Kottapalli
March 4, 2024

స్త్రీలపై అత్యాచారాలు, ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంట్లో ఎదుర్కుంటున్న ఒత్తిళ్లు, తల్లిదండ్రుల నుంచి, భర్త నుంచి, అత్తామామల నుంచి ఎదుర్కునే చిత్ర విచిత్ర వివిధ రకాల ఇబ్బందులు, “నువ్వు ఇది చేయ్, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు” అంటూ గీసే గీతలు, జడ్జ్ చేసే వాళ్ళు కోకొల్లలు. వీటన్నిటి మధ్య నుంచి.....

‘ఫెమినిజం’ అనే పదం వినని, చూడని సమాజాన్ని ఊహించలేం. కానీ ఆ సమాజం అసలు ఫెమినిజం అంటే ఏం అనుకుంటుందో ఈ మార్చి నెలలో జరిగిన ప్రసంగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 

కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష ఇంకా ఎన్నో వివక్షలు ఈ ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాలలోనూ ఉన్నాయి. “నువ్వు ఆ కులం వాడివి నీకు ఇక్కడ ఉద్యోగం లేదు”, “నువ్వు ఆ రంగువాడివి నీకు ఇక్కడ ఆస్తులు ఉండకూడదు, “నువ్వు ఇక్కడ బానిసగా ఉండాలి”, “నువ్వు ఆ మతం వాడివి మా దేశం నుండి పో” అన్న మాటలు మనం చరిత్రలో ఎన్ని చూసాము? ఎన్ని చూస్తూనే ఉన్నాము? కులం పేరిట ఎన్ని హత్యలు జరిగాయో మనం చూసాము. నల్లవాడు ఫస్ట్ క్లాసు టికెట్ ప్రయాణం చేస్తున్నాడు అని రైలు లోంచి తోసివేయబడిన గాంధీగారి నిజ జీవిత కథ విన్నాము. నేటికీ మతపరమైన గొడవలు, కల్లోలాలూ, అల్లర్లు ప్రతీ రోజూ వార్తల్లో చూస్తున్నాము. వీటన్నిటి పట్ల పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలు వలన ఎన్నో తరాలు Progress అయ్యాయి. అవి మనల్ని ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకొచ్చాయి, ఇంకా మంచి స్థితికి తీసుకెళ్తాయి. కానీ వీటన్నిటిలో కలిసి ఒక అంతర్వాహినిగా సాగుతున్నది లింగ వివక్ష. అంటే అన్నిటినీ ఒక circle with in circle గా గీస్తే, ప్రతీ circle లోనూ లింగ వివక్ష జరుగుతూనే ఉన్న ఒక కామన్ విషయం. 

ఎన్నో పోరాటాల తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక కూడా, కుల రిజర్వేషన్లు ఏర్పాడ్డాక కూడా, మత సామరస్యం వెల్లి విరిశాక కూడా, ఇంకా కుల, మత, వర్ణ వివక్షలు అక్కడక్కడ మనకి కనిపిస్తున్నట్లు లింగవివక్ష అనేక రూపాలలో మనకి కనిపిస్తుంది. స్త్రీలపై అత్యాచారాలు, ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంట్లో ఎదుర్కుంటున్న ఒత్తిళ్లు, తల్లిదండ్రుల నుంచి, భర్త నుంచి, అత్తామామల నుంచి ఎదుర్కునే చిత్ర విచిత్ర వివిధ రకాల ఇబ్బందులు, “నువ్వు ఇది చేయ్, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు” అంటూ గీసే గీతలు, జడ్జ్ చేసే వాళ్ళు కోకొల్లలు. వీటన్నిటి మధ్య నుంచి కాలువలో కమలంలా ఒక స్త్రీ ఎలా వికసించగలదు ? అందుకు స్త్రీ వాదం అవసరం ఉందా లేదా ? వివక్షల పట్ల పోరాటం చేసి స్వాతంత్ర్యం, ఉద్యోగం, రిజర్వేషన్ సాధించుకున్న మనిషికి సాటి మనిషే అయిన స్త్రీ ఎదుర్కుంటున్న సమస్యల పట్ల పోరాటం చేసి హక్కులు సాధించే హక్కు కలిగి ఉండకూడదా అనేది ఒక ఫండమెంటల్ ప్రశ్న. 

స్వాతంత్ర్యం కోసం పోరాడినపుడు “మీకు స్వాతంత్ర్యం ఎందుకు మీకు మీరుగా పాలించుకోలేరు, మేము మిమ్మల్ని ఉద్దరించి పెడతాం” అన్నారు బ్రిటీష్ వారు. కానీ పరుల పాలనలో చితికిపోయిన మన పూర్వీకులకే తెలుసు ఆ కష్టం. వర్ణ వివక్ష పట్ల తిరుగుబాటు చేసినపుడు తెలుపే నలుపు కంటే గొప్ప అని నియంతృత్వం చలాయించారు తెల్లవారు. కానీ ఆఫ్రికా దేశం నుండి ఓడల్లో అపహరించుకు రాబడి బానిసలుగా మగ్గిపోయిన నల్లవారికే తెలుసు ఆ బాధ ఏమిటో. ఇక కుల వివక్ష, మత వివక్ష ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిపైన ఎప్పుడూ పోరాటాలు ఉంటూనే ఉన్నాయి. 

అదే విధంగా లింగ వివక్ష కూడా ఉంది. చాలా మందికి లింగ వివక్ష ? అలాంటిదేం లేదే అని అనిపించవచ్చు. “అదేంటి మా ఇంట్లో ఆడవారికి పూర్తి స్వేచ్చ ఇస్తామే అలాంటిదేం లేదే” అనుకోవకచ్చు. అసలు ఈ ఫెమినిజం, స్త్రీవాదం అవసరమా అనుకోవచ్చు. అసలు ఫెమినిజం అంటే ఏంటి దేని మీద ఈ పోరాటం అని కూడా అనిపించవచ్చు. అందుకే అసలు ఈ ఫెమినిజం ఏంటి? ఎందుకు ఉంది? ఎందుకు ఉండాలి? దీని వల్ల తరతరాలుగా స్త్రీల జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? అసలు ఫెమినిజం అవసరమా? లాంటి ఎన్నో విషయాలపైన ఈ women month లో జరిగిన ప్రసంగంలో ప్రముఖ Instagrammer శ్రీ మౌనిక జగ్గాల గారు ప్రసంగించారు. ఈ ప్రసంగం రికార్డింగ్ వీడియో ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఈ వారంలో విడుదల అవుతుంది. 

అప్పటికీ మీకు అసలు ఫెమినిజం ఎందుకు అనే అనుమానం మిగిలిపోతే, ఒకసారి మీ అమ్మగారి దగ్గరకో, మీ భార్య దగ్గరకో, అక్కా చెల్లెళ్ళ దగ్గరకో వెళ్ళి అడగండి. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పని చేయకూడదు’ అనో ‘నువ్వు ఆడపిల్లవి కాబట్టీ ఇలా ఉండకూడదూ’ అనో జీవితంలో ఒక్కసారి అయినా విన్నారో లేదో. కళ్ళు తెరిపించే విషయాలు చెప్తారు. 85 ఏళ్ళ వయసు వచ్చి, చీర కట్టుకునే ఓపిక లేక, నైటీ కట్టుకుంటే నలుగురూ ఏమనుకుంటారో అనుకునే అమ్మమ్మలు, నానమ్మలు ఎందరు ఉన్నారో తెలుసా? ఒకవేళ కట్టుకున్నా సెల్ఫ్ గిల్ట్ తో ఎలా నలిగిపోతున్నారో తెలుసా? ఒకసారి వారిని అడిగి చూడండి ‘social conditioning’, ‘బట్టలు కట్టుకోవడంపై ఆంక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. 

అభినందనలు,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :