ఈ మధ్య ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అని సినిమా వచ్చింది. అందులో అనుష్క తాను షెఫ్ అవ్వాలని చిన్నప్పట్నుంచీ కలలు కని, కష్టపడి చదువుకుని పనిచేసి షెఫ్ అయింది అని చెప్తుంది. వెంటనే నవీన్ పోలిశెట్టి ‘అదేంటి మీరు డైరెక్ట్ గా షెఫ్ అయిపోయారా? మన దేశ సంప్రదాయం ప్రకారం ముందు ఇంజినీరింగ్ చేసి, ఆ తరవాత మన కలల్ని నిజం చేసుకోవాలి కదా?’ అని అడుగుతాడు. ‘నేను చిన్నప్పట్నుంచి ఛార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనే అనుకునేవాణ్ణి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చివరికి సి.ఎ అయ్యాను’ అని మావారు మా పెళ్ళిచూపుల్లో నాతో చెప్పినప్పుడు నేను ఇంచుమించుగా పైన నవీన్ చెప్పినలాంటి డైలాగ్ నే మనసులో అనుకున్నాను.
ఇదేంటి జనాలు ఇంటర్మీడియట్ విధిగా చదివినట్టుగా ఇంజినీరింగ్ కూడా చదవట్లేదా ఈ మధ్య. మనం అలాగే నాలుగేళ్ళు అగ్నికి ఆహుతిచ్చాంగా అనిపించింది. అప్పటికీ మా నాన్నగారు మర్యాదగా చెప్పారు నాకు మూడేళ్ళు డిగ్రీ చదువుకో అమ్మా, ఆ తరువాత నీకు ఎలా అనిపిస్తే ఆ వైపు కెరీర్ ని నిర్మించుకోవచ్చు అని. మనం వింటామా? మన సంస్కృతి, సంప్రదాయాలు మంటలో కలిసిపోవూ, ఇంజినీరింగ్ అనే మంటలో మన నాలుగేళ్ళ విలువైన సమయాన్నీ కలపకపోతే?
అంటే, ఇంజినీరింగ్ చదివిన, చదువుతున్న, చదవాలనుకుంటున్నవారందర్నీ నేను కించపరచడం లేదు. వారికి ఆ చదువు సరైనదనుకుంటే వారు చదవడంలో ఇసుమంత తప్పు ఉందని నేను అనను. మీరే చెప్పండి, ఏంత పెద్ద దెబ్బలాటలో అయినా గెలవగలిగిన నేను, ఏడెనిమిదులు ఎంతో చెప్పి అప్పుడు వాదించు అని మా ఆయన అనగానే, పిల్లిలా నోరుముసుకునే నాకు ఇంజినీరింగ్ అవసరమా?
అన్ని సబ్జెక్ట్లలోనూ 95కి పైన తెచ్చుకుంటూ, లెక్కల్లో మాత్రమే లెక్క, పరీక్ష తప్పకుండా తల కాచుకుంటూ పదవ తరగతి దాకా గెంటుకు వచ్చిన నేను ఎం.పి.సి, ఇంజినీరింగ్ చదివిన సంఘటనలు వింటే మీరే చెప్తారు ఆ పరిస్థితులు మీ పగవాళ్ళకి కూడా రాకూడదు అని. దారుణం కాకపోతే, నేను ఇంటర్ లో చేరే ముందు సంవత్సరమూ, నా తరువాతి సంవత్సరమూ కూడా మా తాడేపల్లిగూడెంలోని అన్ని కాలేజీల్లో బై.పి.సి ఉండి, నేను చదివే ఏడాది మాత్రం ఉండకపోవడాన్ని ఏమనాలి? లెక్కల దేవుడికి నా మీద పీకల దాకా పగ లేకపోతే, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి నాకే ఎందుకు వస్తుంది చెప్పండి.
సరే, ఆ గండం ఎలాగో గట్టెక్కాం అనుకుంటే, మా నాన్నగారు చెప్పినట్టు ముచ్చటగా డిగ్రీ చేసుంటే పోయేదానికి ఇంజినీరింగ్ లో చేరాను. చేరి ఏం చేశాను? నాలుగేళ్ళు నేను సైతం ప్రపంచాగ్నికి ఆహుతివ్వడం తప్ప. ఆ తరువాత ముక్కూ మొహం తెలియని కోడింగ్ ఉద్యోగాల వేటలో మరో రెండేళ్ళు కూడా మండబెట్టడం తప్ప. నిజంగా ఆ ఆరేళ్ళు మరిన్ని పుస్తకాలు చదివి ఉంటే, ఇప్పుడు నేను చాలా యాదృచ్ఛికంగా, అసలు ఏ మాత్రం ప్లాన్ చేయకుండా, నా అదృష్టం కొద్దీ నాకు దొరికిన ఈ ఉద్యోగానికి ఇంకెంత బాగా ఉపయోగించేది చెప్పండి. సరే, నేను చెప్పే ఈ లొల్లాయి కబుర్లకేం కానీ, నిజంగా కెరీర్ గైడెన్స్ సరిగ్గా లేక, నా చుట్టుపక్కలే ఎందరో ఇబ్బంది పడడం చూశాను.
దానికి మా నాన్నగారే ఉదాహరణ. ఆయన బి.ఎ చదివే రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొత్తానికి తెలుగులో బంగారు పతకం గెలుచుకున్నారట. నాలాగా కాకుండా, ఆయన అన్ని సబ్జెక్ట్ లలోనూ చాలా మంచి మార్కులు తెచ్చుకుని, ఎన్నో పతకాలు కూడా సాధించారు. అయితే, మా పెద్దనాన్న ఎప్పుడూ అనే మాట నన్ను భలే బాధ పెడుతుంది. ‘నాకేమి తెలుసే పన్నుల లెక్కలు రాసుకునేవాడిని, మీ నాన్న చాలా బాగా చదివేవాడు. సరైన దారి చూపించేవారు లేక ఇలా బడిపంతులయ్యాడు కానీ, ఏ కలెక్టరో అవ్వాల్సినవాడు’ అని అనేవాడు ఆయన.
మా మావయ్య ఒకరు కూడా ఇలానే కెరీర్ విషయంలో గైడ్ చేసేవారు లేక కెరీర్ లో చాలా ఎదురుదెబ్బలు తిన్నాడు. తనకి సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అంటే చాలా ఇష్టం. లెక్కల్లో దిట్ట. తను ఇంటర్ పూర్తిచేసిన సమయంలో అంటే 90ల్లో ఇంజినీరింగ్ గురించి సరిగ్గా చెప్పేవారు లేకపోయారు. మా మావయ్య వాళ్ళ నాన్నగారు ఆడిటింగ్ వైపు ఉండడం వలన తనకు అస్సలు ఇష్టం లేని అప్పటి I.C.W.A చదివించారు. కొన్నాళ్ళు అటు పని చేసి, ఎన్నో ఎదురుదెబ్బలు తిని, తన అదృష్టం కొద్దీ మంచి మెంటార్ లు దొరకడం వలన సాఫ్ట్ వేర్ కోర్సులు చేసి, ఇప్పుడు పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఆ కెరీర్ గైడెన్స్ ఏదో తన ఇంటర్లోనే దొరికి ఉంటే, ఈ పాటికి తనో స్టార్టప్ కంపెనీ ఓనర్ అయ్యేవాడేమో.
ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వగలను. కానీ అసలు విషయం ఏమిటంటే, దాసుభాషితం లక్ష్యం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో మా వంతు సాయం అందించడమే మా కర్తవ్యం. అందుకే, ఉద్యోగపరంగా మీ ఎదుగదలకు ఉపయోగపడే ప్రసంగాన్ని ఈ ఫిబ్రవరి నెలలో నిర్వహించబోతున్నాం.
సాఫ్ట్వేర్ SAP రంగంలో చాలా అనుభవం ఉన్న ప్రముఖ SAP Consultant దేవి ప్రసాద్ గారిచే వచ్చే నెల “కెరీర్ పై స్పష్టత” అనే ప్రసంగం నిర్వహిస్తున్నాము. మీకు గనుక ట్విట్టర్ అదే X లో అకౌంట్ ఉంటే మీకు @Sap4telugu అనే హ్యాండిల్ సుపరిచితమే అయి ఉంటుంది. ఎంతో మంది కెరీర్ కి మార్గ నిర్దేశం చూపించిన దేవి ప్రసాద్ గారు ఈ ట్విట్టర్ ఖాతా నుంచి పొట్ట చెక్కలయ్యేలా మీమ్స్ వేస్తారు. మీమ్స్ ద్వారా కెరీర్ గైడెన్స్ కి చక్కటి సందేశం ఇవ్వడం వీరి ప్రత్యేకత. ప్రస్తుతం విప్లవాత్మకంగా ముందుకు పరిగెడుతున్న IT రంగం గురించి, అత్యంత వేగంగా వేళ్లూనుకుంటున్న AI సాంకేతిక రంగం గురించి అందులో అందిపుచ్చుకోగలిగిన అవకాశాల గురించి ఎన్నో విషయాలు ఈ ప్రసంగంలో మీరు వింటారు.
ఫిబ్రవరి 1వ తారీఖు, శనివారం ఉదయం 9.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఈ ప్రసంగం గూగుల్ మీట్ లో జరగనుంది. మన డిజైన్ అసోసియేట్ రామ్ కొత్తపల్లి ఈ ప్రసంగం నిర్వహిస్తాడు.

టెస్ - విశ్లేషణ
కొందరి జీవితాలను చూస్తే, మనం ఎంత సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నామో అర్ధమవుతుంది. అచ్చంగా తిండి, బట్ట, గూడు వంటి అత్యంత నిత్యావసరాలకు కూడా నోచుకోని వారిని చూస్తే, మనం ఉబుసుపోక ఆర్డర్ పెట్టి, సగం తిని పారేసిన ఆహారం గురించి పునరాలోచించాలనిపిస్తుంది. ఆలోచించాలి కూడా. మనం చాలా sarcastic గా, చాలా సరదాగా ‘మరీ సినిమా కష్టాల్లా ఉన్నాయిరా బాబూ ఆమె కష్టాలు’ అని తీసిపారేస్తాం. కానీ అలా జీవిస్తున్నవారి నుండి మనం ఏం నేర్చుకోగలం అనేది నిమిషమైనా ఆలోచిస్తామా?
ఈ టెస్ నవల విశ్లేషణ విన్నప్పుడు ఒక కన్నెపిల్లని తల్లిదండ్రులు అలా ఎవరి ఇంట్లోనో పన్లో పెట్టి, వెనుతిరిగి ఆమె యోగక్షేమాలు కూడా కనుక్కోకుండా ఉంటారా? అనిపిస్తుంది. ఉంటారు. నేను చూశాను అలాంటివాళ్ళని. ఆమె సంపాదించి పంపే డబ్బులే కావాలి కానీ, ఆమె పడే కష్టాలు వారికి అనవసరం. మా ఇంట్లో పనిచేసి, డబ్బులు కోసం దుబాయ్ కు పనికివెళ్ళిన అమ్మాయి కష్టాలు నా కళ్ళారా చూశాను. ఆమె తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది కదా అని దుబాయ్ లో ఒకరి ఇంటికి పూర్తి సమయం పనిమనిషిగా పంపారు.
అక్కడ వాళ్ళు ఆమె ఫోన్, పాస్ పోర్ట్ లాక్కుని ఆమె చేత కాంట్రాక్ట్ లో లేని పనులు కూడా చేయించుకుంటూ హింసిస్తున్నారు. ఆమెను మానసికంగా, శారీరికంగానే కాక, లైంగికంగానూ ఆమెను హింసించారు. ఆమె ఆటో కష్టంపై వారి పక్కింటివారి సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుంది. ఇలాంటివారిని చూస్తేనే మనకున్న వాటి విలువ మనకు తెలుస్తుంది.

అలాంటి అమ్మాయి టెస్ కథే ఈ నవల. కొన్ని దశాబ్దాల నుంచి కొందరు ఆడపిల్లల జీవితాల్లో ఏ మాత్రమూ మార్పు రాలేదు అని ఈ కథ తెలియజేస్తుంది మనకి. ఈ విషాదకరమైన నవలపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి మాలతి చందూర్ గారు రాసిన విశ్లేషణ విడుదల అవుతోంది. తరతరాల ఆ కన్నీటి గాథ మీకు ఏమి నేర్పిందో నాతో పంచుకోవడం మర్చిపోకండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.