చిన్ని పాప - అన్నమయ్య.. నేడే చూడండి..

Meena Yogeshwar
July 9, 2024

నేడే చూడండి రెండవ భాగం విడుదల అవుతోంది. అలనాటి తారల గురించి, వారి ఉద్ధాన పతనాల గురించి చాలా వివరంగా, కారణాలతో సహా వివరించిన భాగం ఇది. నింగికెగిసి, నేలకొరిగినవారు కొందరైతే, శాశ్వతంగా తారామండలంలో నిలిచిపోయిన వారు మరికొందరు. వారి ప్రయాణాన్ని...

1997 జూన్ నెలలో ఒక శుక్రవారం. 

సయమం: ఉదయం 8గంటల 30నిమిషాలు. 

ప్రాంతం: అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో గరువు ప్రాంతంలోని వందల సంవత్సరాల పెంకుటింటి ఈశాన్య భాగంలోని కాఫీ వసారా అనబడే నేటి బెడ్రూం కం హాలు.

ఈ సురాగాలు ఈనాడు సరాగాలు అంటూ వచ్చిన కార్యక్రమంలో ‘అదివో….. ఓ ఓ ఓ గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా… అదివో అల్లదివో శ్రీహరివాసమూ’ అంటూ పాట వస్తోంది. చిలకాకుపచ్చ బుల్లి గౌను వేసుకున్న నాలుగున్నరేళ్ళ చిన్నపిల్ల పైకప్పులో ఉన్న చిన్న కన్నం చూపిస్తూ తనకు వచ్చినట్టు ఆ పాటకి డ్యాన్స్ లాంటిది చేస్తోంది. చేతిలో ఉన్న మినపట్టును అలాగే పట్టుకుని, సగం అట్టు నములుతున్న నోటితోనే పాట పాడుతూ ఓ ఓ అని వచ్చినప్పుడు గిరగిరా తిరుగుతూ డ్యాన్స్ చేస్తోంది.

‘తినేటప్పుడు అలా గెంతకూడదే, గొంతుకు అడ్డం పడుతుందీ’ అంటోంది వాళ్ళ బామ్మ. వంటింట్లోంచి వచ్చి ఈ సీను సగం ఇష్టంగా, సగం కంగారుగా చూస్తున్న వాళ్ళమ్మ పెద్ద జడ ముందుకు వాల్తుండగా, ఈ బుజ్జి పిల్ల దగ్గరకి వచ్చి ‘స్కూలుకి వెళ్ళవా? రిక్షా వచ్చేస్తుంది. మీ రోజీ మిస్ నీకోసం ఎదురుచూడదూ పాపం, త్వరగా తిను’ అంటూ కాస్త కోపం, కాస్త ప్రేమ కలిపిన గొంతులో హెచ్చరికగా చెప్తోంది.

అప్పుడే ఆ పాప మెదడులో ఒక మెరుపు తట్టింది. స్కూలుకు బయలుదేరుతున్న వాళ్ళ నాన్నగారి కాళ్ళు పెనవేసుకుని 

‘నాన్నగారూ, ఈవాళ నేను స్కూలుకి వెళ్ళనండి. మీరూ వెళ్ళద్దు’.

‘మానేసి ఏం చేద్దాం? బాదంపప్పులు ఏరుకుని కొట్టుకు తిందామా?’ అంటూ వెక్కిరింతగా నవ్వారు వాళ్ళ నాన్నగారు. 

‘కాదు నాన్నగారూ, అత్తిలి వెంకట్రామా థియేటర్ లోకి అన్నామయ్యా సినిమా వచ్చిందంట కదండీ. నన్ను తీసుకుళ్ళండి నాన్నగారూ’. 

‘అది అన్నామయ్యా, విన్నామయ్యా కాదు చిన్నీ, అన్నమయ్య. గొప్ప వాగ్గేయకారుడు తెలుసా? అలా పేరు తప్పు పలకకూడదు అమ్మా. పైగా వచ్చిందంట ఏమిటి? వచ్చిందట అనాలి’ అన్నారు.

‘కావాలంటే పలక మీద పదిసార్లు Imposition రాస్తాను నాన్నగారూ, ఈవాళ 11గంటల ఆటకి నన్నూ, అమ్మని తీసుకువెళ్ళరా ప్లీజ్’ అంటూ అమాయకమైన కళ్ళతో నాన్నగారిని బోల్తా కొట్టించబోయింది ఆ పాప.

‘ఈవాళ స్కూలుకు సెలవు లేదు కదమ్మా, ఆదివారం వెళ్దాం.’

‘మీరు అలాగే అంటారు, ఆదివారం ఏదో హరికథ ఉంది వెళ్ళాలి అని మొన్నే అన్నారు కదా. అది మానేసి సినిమాకొస్తారేంటి. ఏం రారు. అందుకే ఇప్పుడే వెళ్దాం.’

‘తప్పమ్మా, అలా స్కూలు మానేయకూడదు. సరస్వతీ దేవికి కోపమొస్తుంది. మా స్కూలుకి నేనొక్కణ్ణే మేస్టార్ ని కదా. నేను మానేస్తే పాపం పిల్లలందరూ ఏడవరూ. ఆదివారం తీసుకెళ్తానన్నానుగా. వదులు, ప్యాంట్ ఇస్త్రీ పోతుంది. నాకు ఆలస్యమైపోయింది. వెళ్ళనీయ్’ అని ఆఖరి మాటల దాకా వచ్చేసరికి కాస్త కంఠం కటువుగా పెట్టారు.

అమ్మా, బామ్మా ప్రేక్షకపాతే ఇక్కడ. ఎందుకంటే, సినిమాకి తీసుకెళ్తే మంచిదేగా. చక్కని భక్తి సినిమా.

‘కుదర్దు, మీరు ఇలాగే చెప్తారు. నన్ను తీసుకెళ్ళరు. అక్కనీ, అన్నయ్యనీ తాతయ్యగారు మొన్నే తీసుకెళ్ళారంట భీమవరంలో. నేనే ఆఖరు. నన్ను కూడా తీసుకెళ్ళండి.’ అంటూ జాలిగొలిపేలా ఏడుస్తోంది పాపం ఆ పాప.

ఆ సినిమా పాటలు విడుదలైనప్పట్నుంచీ ఎన్నిసార్లు రేడియోలో, టీవీలో విందో. ఆ పాటలకి సొంతంగా కొరియోగ్రాఫ్ చేసుకుని ఎన్నిసార్లు డ్యాన్స్ లు వేసిందో లెక్కే లేదు.

నాన్నగారికి ఇక కోపం వచ్చేసింది. నెమ్మదిగా కంఠంలోకి కోపం, విసుగు వచ్చేస్తున్నాయ్. కాళ్ళ దగ్గర పాపని రెక్కపట్టుకుని కాస్త కోపంగా ఎత్తుకుని, ఆఖరిసారి ముద్దుగా చెప్పబోయారు అల్లరి మానమని.

‘ఆదివారం తీసుకెళ్తానన్నానుగా. అలా అల్లరి చేయచ్చా? అంట వంట అనకూడదు అట అనాలి అని చెప్పానా? తీసుకెళ్ళారట అనాలి. అయినా రిక్షా వచ్చేసింది. పద రిక్షా ఎక్కు. కోపం తెప్పించకూడదు మరి. ఏం కొట్టలేననుకున్నావా?’ అంటూ అరిచేశారు.

పాప ఇంకా ఉక్రోషంగా గింజుకుంటూనే ఉంది. ఇక చిరాకేసి, పాప బ్యాగ్ పట్టుకుని గుమ్మంలో నిల్చున్న రిక్షాలోకి ఎక్కించేశారు.

‘అయ్యో, అది అట్టు పూర్తిగా తినలేదురా. అంత కోపమేమిట్రా. నా కళ్ళెదురుగానే చంటిదాన్ని అలా కొట్టేస్తున్నావేవిట్రా’ అంటూ అరుస్తున్న బామ్మని పట్టించుకోలేదు నాన్నగారు.

‘నువ్వు ఊరుకో అమ్మా. చదువు దగ్గర నిర్లక్ష్యం పనికిరాదు. మేస్టారు, ఆయన కూతురు బడెగ్గొట్టి సినిమాలెమ్మట తిరుగుతున్నారు అని రాజులంతా నవ్వుకోరూ. ఎంత అప్రతిష్ట’ అంటున్నారు నాన్నగారు.

‘మిమ్మల్నే, గింజుకుంటోంది అది. ఏ డొక్కలోనైనా నరం పట్టేస్తే కష్టం. ఒకపూట స్కూలు మానేస్తే కాలువ పొంగిపోతుందా?’ అంటున్న అమ్మ వంక నిప్పులు కురిసేలా చూశారు నాన్నగారు.

పాప ఏడుస్తూ, రిక్షా దిగిపోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. నాన్నగారు, రిక్షా తాత అతి కష్టం మీద కూర్చోబెట్టి బలవంతంగా సందు దాటించేశారు. దగా పడిన మొహంతో నాన్నగార్ని చూస్తూ, కన్నీళ్ళు తుడుచుకోకుండానే మొహం అంతా అలుక్కుపోయిన పాప అయిష్టంగా స్కూలుకెళ్ళిపోయింది. ‘నాన్నగారు అని పిలవకూడదు ఇంక ఆయన్ని, నాన్నా అనేస్తాను సాయంత్రం. పెదనాన్న చెప్పాడుగా, నాన్నకి గార్లూ, గీర్లూ ఎందుకు అని’ అనుకుంది పాప కసిగా.

అయితే సాయంత్రం త్వరగా ఇంటికొచ్చిన నాన్నగారు, ఆరుగంటల షోకి ఆ రాత్రే అందర్నీ సినిమాకి తీసుకెళ్ళారు. సినిమా చూపిస్తూ, అర్ధం అయినా అవ్వకపోయినా, ఫ్రేముల గురించి, టెక్నిక్ ల గురించి, లాంగ్ షాట్, క్లోజప్ ఇలా రకరకాల సినిమా విషయాల గురించి వివరించారు నాన్నగారు. పాపకి ఎంతో అర్ధమైంది, కానీ ఏమీ అర్ధం కాలేదు అప్పుడు. కానీ అన్నీ ఆ బుర్రలో నిక్షిప్తం చేయడమే ఆయన ఉద్దేశ్యం. అది నెరవేరింది. పొద్దున్న భక్త ప్రహ్లాదలో ఎస్వీరంగారావులా కనిపించిన నాన్నగారు, ఇప్పుడు అచ్చం తన ఫ్రెండ్ లాగా, అన్నయ్య అంత మంచిగా కనపడ్డారు. ఊరు తిరిగి వచ్చేటప్పుడు బఠాణి చాట్ ఇప్పించారు కూడా.

ఆ పాపని నేనే. మా చిన్నప్పట్నుంచే మా నాన్నగారి దయవల్ల సాహిత్యంతో పాటు సినిమా కూడా అబ్బింది. అయితే, అదేదో వేలంవెర్రిగా కాకుండా ఒక సబ్జెక్ట్ గా అలవాటైంది. అలా మొదలైన మా జిజ్ఞాసని మా అన్నయ్య పవన్ సంతోష్ మరింత పెంచుకున్నాడు. తన రిసెర్చితో పరిపుష్టం చేసుకున్నాడు. అలా వచ్చిన పుస్తకమే ‘నేడే చూడండి- తెలుగోళ్ళు, సినిమాలు, ఒక చరిత్ర’. 

Tap to Listen

ఈ పుస్తకం మొదటి భాగం మీరు ఇప్పటికే విన్నారు. ఇప్పుడు రెండవ భాగం విడుదల అవుతోంది. అలనాటి తారల గురించి, వారి ఉద్ధాన పతనాల గురించి చాలా వివరంగా, కారణాలతో సహా వివరించిన భాగం ఇది. నింగికెగిసి, నేలకొరిగినవారు కొందరైతే, శాశ్వతంగా తారామండలంలో నిలిచిపోయిన వారు మరికొందరు. వారి ప్రయాణాన్ని పరిశీలిద్దాం రండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :