చోళ శకానికి కాల ప్రయాణం

Ram Kottapalli
April 25, 2023

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. వారి కీర్తులు, అపకీర్తులు జనాల నోటి వెంట పదాలుగా, జనపదాలుగా, పద్యాలుగా మారి తరతరాలుగా, శతాబ్దాలకు పైగా సాగి చరిత్రగా నిలిచిపోయాయి. అలాంటి వాటిని నిజం చేస్తూ ఇప్పుడు తమిళనాడులో శాసనాలు, తాళపత్రాలు, తామ్ర పత్రాలు బయట పడ్డాయి. ఇదే చరిత్ర, విలేఖరి కృష్ణమూర్తిని ఆకర్షించింది. తమిళనాడులో పురావస్తు శాఖవారికి దొరికిన ఎన్నో పత్రాలను ఆయన చదివారు. తిరువాలంకాడులో దొరికిన తామ్ర పత్రాల లో ఉన్న ఒక మాట ఆయన దృష్టిలో పడి ఆసక్తి కలిగించింది. ఆ మాట ఏమిటంటే ...

అసలు కల్కి కృష్ణ మూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలకు బీజం ఎక్కడ పడింది అన్న ప్రశ్నకు తెలుగు అనువాదకులు నాగరాజన్ కృష్ణ మూర్తి గారి సమాధానం. 

అది 1950 జనవరి నెల. 20 వ శతాబ్ధం మొదలై 50 ఏళ్లు కావస్తోంది.  పురావస్తు శాఖ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోంది. తమిళనాట అనేక శాసనాలు లభ్యమవుతున్నాయి. తాళపత్రాలు, కేజీల కేజీల తామ్ర పత్రాలు దొరుకుతున్నాయి. అప్పటి చోళ స్వర్ణ యుగపు రహస్యాలు, అప్పటి నాగరికత, సంస్కృతి, ప్రజల పద్దతులు రాసిన ఇత్తడి రేకుల పత్రాలు  దొరుకుతున్నాయి. అప్పటి రాజులు నిర్మించిన ఆలయాలు, వాటి నిర్వహణ, బాధ్యతలను ఒక పెద్ద అర్చక కుటుంబానికి అప్పజెపుతూ చెక్కిన శిలా శాసనాలు బయట పడుతున్నాయి. 

ఈ పత్రాలు, శాసనాలు చోళుల పాలనలో ఉన్న నేల తిరువారూర్ జిల్లా, మరియూ తంజావూరు చుట్టు పక్కన ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా బయట పడుతున్నాయి. తిరువారూర్ జిల్లాలో ఉన్న తిరువాలంకాడు అనే ఊర్లో త్రవ్వకాలు జరిపినపుడు కొన్ని ఇత్తడి రేకుల తామ్ర పత్రాలు దొరికాయి. అవి మద్రాసులోనున్న పురావస్తుశాఖ కార్యాలయానికి పంపించగా అందులోనుండి కొన్ని వందల ఏళ్ల క్రితం చరిత్ర బయట పడుతూ వచ్చింది. అలా బయట పడిన చరిత్రే మళ్ళీ ఓ రచయితకు చరిత్రను తిరగరాయడానికి ఉపయోగపడబోతుంది.

గురుజాడ అప్పారావుగారి కన్యక పద్య కావ్యంలో చివరి పద్యం ఇలా చెప్తుంది. 

పట్టమేలే రాజు పోయెను,

మట్టి కలిసెను కోట పేటలు,

పదం పద్యం పట్టి నిలిచెను

             కీర్తులపకీర్తుల్.”

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. వారి కీర్తులు, అపకీర్తులు జనాల నోటి వెంట పదాలుగా, జనపదాలుగా, పద్యాలుగా మారి తరతరాలుగా, శతాబ్దాలకు పైగా  సాగి చరిత్రగా నిలిచిపోయాయి. అలాంటి వాటిని నిజం చేస్తూ ఇప్పుడు తమిళనాడులో శాసనాలు, తాళపత్రాలు, తామ్ర పత్రాలు బయట పడ్డాయి. 

ఇదే చరిత్ర, విలేఖరి కృష్ణమూర్తిని ఆకర్షించింది. తమిళనాడులో పురావస్తు శాఖవారికి దొరికిన ఎన్నో పత్రాలను ఆయన చదివారు. తిరువాలంకాడులో దొరికిన తామ్ర పత్రాల లో ఉన్న ఒక మాట ఆయన దృష్టిలో పడి ఆసక్తి కలిగించింది. అది “ యువరాజు ఆదిత్య కరికాలుడు హత్యకు గురై మరణించిన 17 ఏండ్ల తరవాత అతని తమ్ముడు అరుళ్ మొళి వర్మ రాజు అయినాడు “ అని. ఆ మాట ఆయనకి పొన్నియిన్ సెల్వన్ బృహన్నవల రాయడానికి ఊతాన్ని ఇచ్చింది. 

ఈ నవల కృష్ణమూర్తి స్థాపించిన కల్కి వారపత్రికలో ధారావాహికగా 1950 నుండి 1954 వరకు వచ్చింది. ఆ తర్వాత 2210 పేజీలతో 5 భాగాల నవలగా విడుదల అయ్యింది. 

అరవై ఏళ్లు గడిచిపోయాయి. ఈ అరవై ఏళ్లలో ఈ నవల తమిళ ప్రజల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. దాదాపుగా ప్రతి తమిళుడు ఎదుగుతూనే ఆ నవలను తన జీవితంలో ఒక అంతర్వాహినిగా, ఒక భాగముగా చేసుకున్నాడు. ఎన్ని చోట్ల పొన్నియిన్ సెల్వన్ నాటకాలు వేస్తే అన్ని చోట్లకు వెళ్ళి చూశాడు. ఎన్ని చోట్ల పుస్తకాలు అమ్మితే అన్ని పుస్తకాలు కొన్నాడు. నవలను సినిమాగా తీద్దాం అన్న ఆలోచన తమిళదర్శకులకి, కథానాయకులకి కలిగింది. కానీ అది కలగానే మిగిలిపోతూ వచ్చింది. ఇదిలా ఉండగా.... 

2010 బెంగళూరులో ఒక వ్యక్తి తన తల్లిగారి కోసం కొని, పోగు చేసిన కల్కి వార పత్రికలను తెరిచి చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తమిళం చదవడం కష్టమై మళ్ళీ పుస్తకం మూసి పక్కన పెట్టేస్తున్నారు. ఆయన పేరు నాగరాజన్ కృష్ణమూర్తి. వారి తల్లి గారి మాతృ భాష తమిళం. కానీ ఆయన పుట్టి పెరిగింది చిత్తూరులో, చదువుకుంది తెలుగు మాధ్యమం. 

నాగరాజన్ గారి స్నేహితులు ఒకరు సినీ దర్శకుడు. అతను ఒకరోజు పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఇంగ్లీషులో ఉందా? అని అడిగారు. నాగరాజన్ గారు ఇంగ్లీషు అనువాదాన్ని వెతికారు, దొరకలేదు. ఈ ప్రయత్నంలో మళ్ళీ ఆయన అటకపై పెట్టేసిన పొన్నియిన్ సెల్వన్ తమిళ పుస్తకాలు తీసుకుని దులిపి కష్టమైనా మళ్ళీ మాతృభాష తమిళం నేర్చుకుని నవలను చదవడం మొదలు పెట్టారు. అలా 6 నెలల్లో 5 భాగాల నవలను చదివేశారు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న పుట్టగా, అనువాదం చేయాలి అన్న సమాధానం దొరికింది. 2011 లో ఈ నవల అనువాదాన్ని మొదలు పెట్టి నాలుగేళ్ళు ఎంతో శ్రమకోర్చి 2014 లో పూర్తిగా ఈ నవలను తెలుగులోకి అనువదించారు. 

ఒక నవలను ఒక కృష్ణమూర్తి రచించడం, అదే నవలను ఇంకో కృష్ణమూర్తి అనువదించడం, రచనా సమయం కూడా సరిగ్గా నాలుగేళ్ళు పట్టడం అంటే, ప్రధాన రచన 1951 లో మొదలై 1954 లో ముగిస్తే, అనువాదం 2011లో మొదలై  2014 లో ముగియడం అన్నది  ఎంతో అధ్బుతమైన విషయంగా అనిపించడం లేదు ?!. 

పొన్నియిన్ సెల్వన్ రచనలకు సంబందించి ఇలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నాక నాగరాజన్ గారు దర్శకుడు మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ గురించి చర్చించారు. సినిమాకు నవలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి చర్చించారు. ఈ లైవ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ రచయిత పవన్ సంతోష్ సూరంపూడి తెలుగు-తమిళ జాతులకు మనం అనుకున్నంత దూరం ఏమీ లేదని, నిజానికి ఒకరితో ఒకరం ఎంతో చరిత్ర, ఆచార వ్యవహారాలు కలిసి పంచుకున్నాం అని గుర్తు చేశారు. ముఖ్యంగా చోళ చరిత్రలోని ఖాళీలు, ఈ పుస్తక రచనకు ఉపయోగపడిన తీరును వివరించారు. అలాగే పుస్తకంలో విపులంగా రాసిన కొన్ని అద్భుతమైన విషయాలు, సినిమాలో మాయమైన సన్నివేశాలు గురించి చెప్పారు. 

సినిమా గురించి, నవలలో ఆయనకి బాగా నచ్చిన విషయాల గురించి, పాత్రల గురించి నాగరాజన్ గారు మాట్లాడారు. ఇలా గంటన్నర పాటు పొన్నియిన్ సెల్వన్ నవల గురించి, ఆ నవల వెనక ఉన్న రచయిత పరిశ్రమ గురించి, ఇంకా చోళుల చరిత్ర గురించి, ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియ జేస్తూ త్వరలో రాబోతున్న పొన్నియిన్ సెల్వన్-2 సినిమా గురించి మాట్లాడుతూ శ్రోతల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సాగిన ఈ లైవ్ ఈవెంట్ పూర్తి వీడియో పైన చూడవచ్చు. 

మనం కాలంలో ప్రయాణించగలమా? అనే ప్రశ్న పుడితే సహజంగానే భవిష్యత్ లోకి సెకండు వేగముతో ప్రయాణిస్తున్నాము అని చెప్పగలము. కాని గతానికి కాలంలో ప్రయాణం చేయగలమా అంటే అందుకు ఇటువంటి పుస్తకాలే సమాధానం. కల్కి కృష్ణ మూర్తిగారు రాసిన, నాగరాజన్ కృష్ణమూర్తిగారు తెలుగులోకి అనువదించిన ఈ పొన్నియిన్ సెల్వన్ శ్రవణ పుస్తకాన్ని దాసుభాషితం యాప్ లో వినండి. అది మిమ్మల్ని సెకండుకు వంద ఏళ్ల వేగంతో ప్రయాణం చేయించి, నేటికి 1053 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి ఆ చోళ శకంలో విహరించేలా చేస్తుంది. మీ ఊహలకు ఊతం ఇవ్వడానికి ఇప్పుడు సినిమా పాత్రలు కూడా తోడౌతున్నాయి. 

ఇప్పుడే పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ఇక్కడ వినండి. 

https://www.dasubhashitam.com/ab-title/ab-ponniyin-selvan-1

Image Courtesy :