సినిమా పాట ఎలా రికార్డ్ చేస్తారంటే..

Meena Yogeshwar
January 29, 2024

మల్లీశ్వరి, మిస్సమ్మ, విప్రనారాయణ, మాయాబజార్, చెంచులక్ష్మి, అప్పు చేసి పప్పు కూడు, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, పూజా ఫలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, భక్త పోతన, భక్త ప్రహ్లాద… వీటన్నిటికీ ఒక common విషయం ఉంది. అదేమంటే, ఈ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో, ఆ సినిమాలలోని పాటలూ అంతే గొప్పగా నిలిచాయి. వీటన్నిటి సంగీతాన్ని మనకి అందించిన గొప్ప సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు. మన సినీ సంగీత స్థాయిని పెంచినవారిలో ఆయన ఒకరు. ఈ విషయంపై సాధికారికంగా మాట్లాడగలవారిని మేము వెతకాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే ...

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. మల్లీశ్వరి, మిస్సమ్మ, విప్రనారాయణ, మాయాబజార్, చెంచులక్ష్మి, అప్పు చేసి పప్పు కూడు, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, పూజా ఫలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, భక్త పోతన, భక్త ప్రహ్లాద… వీటన్నిటికీ ఒక common విషయం ఉంది. అదేమంటే, ఈ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో, ఆ సినిమాలలోని పాటలూ అంతే గొప్పగా నిలిచాయి.

‘కోతీ బావకు పెళ్ళంట కొండా కోనా విడిదంటా’ అంటూ ఒకరినొకరు ఆటపట్టించుకున్న ప్రేమికులు ఎందరో. ‘తన మతమేదో తనదీ మన మతమసలే పడదోయ్’ అంటూ నిష్టూరాలాడుకున్న దంపతులకూ కొదవ లేదు. ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహో నాకే ముందు’ అంటూ లొట్టలేసిన పెద్దమనుషులు కోకొల్లలు. ‘నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది’ అంటూ విరహంలో మునిగిపోయినవాళ్ళమేగా మనం కూడా. ‘అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే’ అంటూ వాపోయిన వాళ్ళనైతే లెక్కపెట్టడం కష్టం. ‘జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా’ అంటూ ఎన్నిసార్లు మన మనసుని హరికి అర్పించామో కదా.

వీటన్నిటినీ మనకి అందించిన గొప్ప సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు. మన సినీ సంగీత స్థాయిని పెంచినవారిలో ఆయన ఒకరు. వారి పాటలు జీవితంలో ఒక్కసారైనా విని ఉండని తెలుగు వారు ఉంటారంటే నమ్మడం కష్టం. అందుకే వారి గురించి, తెలుగు సినిమా సంగీతం గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటందని మేము అనుకున్నాం. ఈ విషయంపై సాధికారికంగా మాట్లాడగలవారిని మేము వెతకాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే సాలూరి వారి శిష్యులు, ప్రముఖ గాయకులు, స్వరకర్త అయిన శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారి కన్నా మించిన వక్త దొరకరు కదా.

దాసుభాషితం ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9.30గంటలకు తెలుగు సినీ సంగీతం గురించి, వారి గురువుగారు సాలూరి రాజేశ్వరరావు గారి గురించి, ఇతర సంగీత దర్శకులకు సాలూరి వారిపై గల అభిప్రాయం గురించి, ఎన్నో తెలుగు పాత పాటల గురించి రాజగోపాల్ గారు ప్రసంగించబోతున్నారు. తెలుగు సినీ సంగీత సాగరంలో మునకేయడానికి మీరు సిద్ధమేగా..

అన్వేషణ - నవల

Tap to Listen

మనం పుట్టడానికి ముందు ఎక్కడి నుండి వచ్చాం? చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? నిజంగా స్వర్గ, నరకాలు అనేవి ఉన్నాయా? మంచివాళ్ళకి అన్యాయం, చెడ్డవాళ్ళకి అంతా మంచి ఎందుకు జరుగుతున్నాయి? పాప, పుణ్యాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అసలు అవి ఉన్నాయా, మనల్ని భయపెట్టడానికి చెప్పే అబద్ధాలా? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం చూసే విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఎలా? నైవేద్యం సమర్పయామి అంటే అది దేవుడు తినేసినట్టేనా? అసలు విగ్రహ పూజలు ఎందుకు చేయాలి? దాదాపుగా అందరికీ వచ్చే సాధారణ ప్రశ్నలు ఇవి.

చాలామందికి సాధారణ జీవన పయనంలో ఆధ్యాత్మికత చాలా పెద్ద వయసులో వస్తుంది. కానీ, కొందరు జిజ్ఞాసువులు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు. దీనికి కారణం కూడా కర్మ సిద్ధాంతమేనంటారు పెద్దలు. జీవుని వాసనల ఆధారంగా, ఆ జీవితంలో మిగిలిన విషయాలతో పాటు ఆధ్యాత్మికత కూడా ప్రభావితం అవుతుంది. అలా అతి చిన్న వయసులోనే తండ్రి మరణం వలన ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉదయిస్తాయి ఒక అబ్బాయికి. అతను అమెరికాలో పుట్టి, పెరిగినా అతనికి ఉండే ఈ ప్రశ్నలు భారతదేశం వైపు, భారతీయ తత్త్వం వైపు లాగుతాయి. అలా మరణానంతర విషయాల గురించి తెలుసుకోవాలనే కోరికతో భారతదేశం వచ్చిన అతను, తెలుసుకున్న ఆధ్యాత్మిక మార్గ విశేషాలే ‘అన్వేషణ’ నవల.

భారతీయ ఆధ్యాత్మిక మార్గం గురించి ప్రారంభం నుంచి సవిస్తరంగా, ఒక కథ రూపంలో వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత శ్రీ పోడూరి వేంకటరమణశర్మ గారు. ఈ నవల అధ్యాత్మికతలో ఓనమాలు రానివారి దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నవారి దాకా అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో దాసుభాషితంలో విడుదలైన వేంకటరమణ గారి మరో పుస్తకం ‘అరుణాచలం పిలుపు’ నవలలో కూడా అధ్యాత్మిక విషయాలను చర్చించారు రచయిత. అదే కోవకు చెందిన ఈ పుస్తకంలో మరింత సవిస్తరంగా, సవివరంగా ఈ విషయాన్ని వివరించారు. ఈ వారం ఈ పుస్తకం విడుదల అవుతోంది. ఆంగ్లేయుని కథ ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం.

కూటమి కబుర్లు

గతవారం న్యూస్ లెటర్ లో కూటమి విశేషాలు చర్చించుకోలేదుగా, ఇప్పుడు అక్కడి నుంచి మొదలుపెడదాం. కూటమిలో తెలుగులో మాత్రమే రాయలనే ప్రతిపాదన, ఆ సౌకర్యం ఫోన్ లో ఎలా తెచ్చుకోవచ్చో సూచనలు, అసలు తెలుగులో రాయడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి వంటి విషయాలుపై మాంచి చర్చ జరిగింది.

‘వందే సినీ మాతరం’ లెసన్ విడుదల సందర్భంగా నాకు, మా ఇంటాయనకీ జరిగిన సంభాషణను వెటకరిస్తూ పోస్ట్ వేశాను. మాపై రామ్ మీమ్ వేశాడు. నా రాతపై కొందరు ప్రశంసలు చేశారు. మా ఇంటాయనపై రాసినందుకు వారు అలుగుతారనుకుంటే, నన్ను ఆశ్చర్యపరుస్తూ ఆయన ఆనందించారు. కూటమిలో బహిరంగంగా మురిసి ముక్కలవ్వలేదు కానీ, ఆయన సినిమాభిమానాన్ని నేను గుర్తించి, ప్రచురించినందుకు ఆనందించారు. నేను హమ్మయ్యా అనుకున్నాను.

నేను వేసిన #మీ_నా_ప్రశ్న కడు విచిత్రములను చేసినది. నేను అడిగిన ప్రశ్నకి ఎన్నో సరైన సమాధానాలు ఉన్నాయి. పైగా, నేను రచయిత అంటూ అడిగిన ఆ వ్యక్తిని సాధారణంగా రచయితగా పరిగణించకపోవడం వలన సభ్యులు పలువురు రచయితలను సమాధానాలుగా సమర్పించుకున్నారు. నా సమాధానం విన్న తరువాత, నేను పొట్టి చూపుతో అడిగిన ఆ ప్రశ్నను మెలిక పెట్టడానికి అతి తెలివితేటలతో అడిగిన ప్రశ్నగా భావించి, ఆనందించారు సభ్యులు. పాపం, నేనేం చేసిన ఆనందిస్తారు. నాపై ఎంత కరుణ. అదండీ సంగతి అలా మిస్టరీలు, సూచనలు, నవ్వులతో గడిచాయి కూటమిలో గత రెండు వారాలూనూ.. ఇతి వార్తాః శ్రుయంతాం.. ప్రవాచకః మీనా యోగీశ్వరః

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :