#20 “చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన…”

Dasu Kiran
July 24, 2020

ముందుగా దాసుభాషితం అభిమానులు కోరిన విధంగా, శ్రవణ పుస్తకాలను ఇతరులకు బహుకరించే సౌలభ్యం ఇపుడు యాప్ లో అందిస్తున్నాము. శ్రవణ పుస్తకం వివరాలు ఉన్న స్క్రీన్ లోనే Gift అనే లింకును మీరు చూస్తారు. అయితే మీరు యాప్ ను అప్డేట్ చేసుకోవలిసి ఉంటుంది. “కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ” వంటి సూత్రీకరణలు, “రసాస్వాదన చేసే వాళ్ళు రసికులు, నస పెట్టె వాళ్ళు నసికులు” అని చమత్కారాలు, “చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన” పాటలో సంస్కృతసమాసాల వివరణలు వింటుంటే ఆయన విద్యార్థుల మీద ఒకింత ఈర్ష్య కలుగుతుంది తెలుగు భాషాభిమానులెవరికైన...

ముందుగా దాసుభాషితం అభిమానులు కోరిన విధంగా, శ్రవణ పుస్తకాలను ఇతరులకు బహుకరించే సౌలభ్యం ఇపుడు యాప్ లో అందిస్తున్నాము. శ్రవణ పుస్తకం వివరాలు ఉన్న స్క్రీన్ లోనే Gift అనే లింకును మీరు చూస్తారు.

Gift a Title

సింగిరెడ్డి నారాయణ రెడ్డి


కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ” వంటి సూత్రీకరణలు, “రసాస్వాదన చేసే వాళ్ళు రసికులు, నస పెట్టె వాళ్ళు నసికులు” అని చమత్కారాలు, “చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన” పాటలో సంస్కృతసమాసాల వివరణలు వింటుంటే ఆయన విద్యార్థుల మీద ఒకింత ఈర్ష్య కలుగుతుంది తెలుగు భాషాభిమానులెవరికైన. 

ఆయనే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి. సినిమా రంగానికి నేను రాజమార్గంలో మహాద్వారం గుండానే ప్రవేశించాను అని అయన చెప్తుంటే అది గొప్పలు చెప్తున్నట్టు అనిపించదు. కేవలం నిజం చెప్పారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా పాటలు రాసేందుకు రెండు నియమాలు పెట్టుకున్నారు. ఒకటి ఆ ఆహ్వానం పేరెన్నికగన్న సంస్థ నుంచి రావాలని, రెండు సినిమాలో పాటలన్నీ తనే రాయాలని. ‘గులేబకావళి కథ’లో అలానే అయన సినీ రంగ ప్రవేశం చేశారు. విద్య వృత్తిలో, రాజకీయాలలో కూడా అవకాశాలన్నీ ఆయనను వెతుక్కుంటూ వచ్చినవే.

జులై 29న ఆ మహాకవి జన్మదినం. గతంలో ఆయన జన్మదిన సందర్భంగా ఆయన విద్యార్థిని డా. మృణాళిని చేసిన ముఖాముఖీని అందిస్తోంది దాసుభాషితం. నిడివి 20 నిమిషాలే అయినా, తను చిన్నతనంలోనే రాసిన గేయాలు, గేయ కావ్యాలు, గేయ నాటికల గురించి, తన సినీ ప్రస్థానం గురించి, తనలో ఉన్న ప్రతిభని వాడుకున్న ముగ్గురు సినీ దర్శకుల గురించి, తన సమకాలీన కవులైన శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ, దాశరధి, కొసరాజుల గురించి, ప్రస్తుత కథానాయక, నాయకీలకు పాటలో ‘ప్రైవసీ’ లేకపోవడం గురించి ఇంకా చాలా విషయాలు ఆసక్తికరంగా చెప్పటం మీరు వింటే ఆనందిస్తారు.

వినండి సినారె తో ముఖాముఖీ.


తిరుమల చరితామృతం

Tirumala Charitamrutam 1
Tap to listen


కీ. శే. శ్రీ PVRK ప్రసాద్ రాసిన గ్రంధాలన్నీ వినవలసినవే అయినా, వాటిలో ‘తిరుమల చరితామృతానికి’ ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఎందుకంటే ఇది ఆ శ్రీనివాసుని భక్తులందరూ తెలుసుకోవలసిన తిరుమల చరిత్ర. బండ్ల కొద్దీ ప్రాచీన సాహిత్యాన్ని పరిశోధించి, వందల శిలాశాసనాలను అధ్యయనం చేసి, దేవాలయ రికార్డులను పరిశీలించి సేకరించిన సమాచారంతో ప్రతి విషయాన్నీ సాధికారికంగా, ప్రామాణికంగా  వ్రాయబడ్డ గ్రంథం. 

నిజానికి ఇది, ‘దాసుభాషితం’ ప్రారంభించటానికి పూర్వమే 2013లో రికార్డు చేయబడింది. శ్రీ ప్రసాదు గారు దీనిని, దీనితో పాటు మరో మూడు - తిరుమల లీలామృతం, నాహం కర్తా హరిః కర్తా, జ్ఞానజ్యోతి మధ్వాచార్య గ్రంధాల  శ్రవణ రూపాలను ఆడియో డీవీడీలుగా చేయించి శ్రీనివాసుని భక్తులైన మిత్రులకూ, సాహితీ బంధువులకూ అభివందనపూర్వక కానుకగా అందించేవారు.

అయితే ఆ రికార్డింగు ఇప్పుడున్న నాణ్యత ప్రమాణాలకు సరితూగదు. కనుక పాత వాటిని ‘దాసుభాషితం’ కోసం ఒక్కొక్కటిగా రీ-మాస్టర్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ 92 అధ్యాయాలతో  ఆరువందల పేజీలున్న  ఈ  ఉద్గ్రంథ ప్రాముఖ్యత, మరీ ముఖ్యంగా ప్రస్తుత కాల పరిస్థితుల ప్రాసంగితల రీత్యా గ్రంథాన్ని తిరిగి రికార్డు చేసాం. మొత్తం సంచిక నిడివి సుమారు 18 గంటలు. కనుక శ్రవణ సౌలభ్యం కోసం ఆరు భాగాలుగా చేసి  వారానికొక్క భాగం విడుదల చేయడం జరుగుతుంది. 

పురాణ కాలంలో ఈ ఆలయ స్వరూపం, మూలవరుల రూపం గురించి శైవులు, వైష్ణవులు, శాక్తేయులు మధ్య వివాదం మొదలైన ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలున్న మొదటి 23 అధ్యాయాల ఈ మొదటి భాగాన్ని ఈ వారం అందిస్తున్నాము.


కాశీ మజిలీ కథలు 10వ భాగం

Kaasi Majilee Kathalu 10
Tap to listen


కాశీ యాత్రలో 209 మజిలీలు గడిచాయి. అపూర్వ మణి ప్రభావంతో అద్భుతమైన, విచిత్రమైన కథలు చెప్తూ వస్తున్న మణిసిద్ధుడు గోపాలునితో 210 మజిలీ చేరుకున్నాడు. మజిలీ చేరుకుంటూనే, గోపాలుడు ఆ మజిలీ చేసిన గ్రామంలో ఒక గోడ మీద కనిపించిన నారద మహర్షి చిత్రాన్ని చూసి, ఆ కథేమిటో చెప్పమంటాడు. అలా, నారద జన్మ వృత్తాంత్తంతో మొదలై, నారద గర్వభంగమూ మొదలైన కథలతో కొనసాగిన, కాశీ మజిలీ కథల 10వ భాగం 249వ మజిలీలో నారద పంచచూడుల సంవాదంతో ముగుస్తుంది.

Cinare Image Courtesy: Ragalahari

Image Courtesy :