ఫెమినిజం ఆజ్-కల్

Meena Yogeshwar
February 27, 2024

మార్పునైనా, ఒకప్పటి మూఢ ఆలోచనలనైనా కళ చాలా ప్రభావితం చేస్తుంది. సాహిత్యం, మరీ ముఖ్యంగా సినిమా మనపై చాలా బలమైన ముద్ర వేస్తాయి. ఒకప్పుడు అన్ని రకాల ఆరళ్ళు, అవమానాలు భరించి, కుటుంబాన్నో, సమాజాన్నో ఒక తాటిపై నడిపించే స్త్రీ పాత్రలను సృష్టించేవారు సినిమాల్లో. తన కాళ్ళపై తను నిలబడుతూ, తన కలలను సాకారం చేసుకుంటూ, తన గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని ఎదుర్కొంటూ, వివాహం-భర్త అనేవి జీవితంలో ఒక భాగమే తప్ప, వాటి కోసం జీవితాన్ని, ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోకూడదు అనే లాంటి ఆలోచనా ధోరణి ఉండే కథానాయికలు వస్తున్నారు ఇవాళ్టి సినిమాల్లో. ప్రధాన మీడియా అయిన సినిమా ఈ విషయంలో ఎలాంటి దిశలో ఉంది? నేటి తరం ఫెమినిజం, సమానత్వం విషయాల్లో...

“నువ్వు ఫెమినిస్ట్ టైపా?”, “అమ్మో ఈ ఫెమినిస్ట్ లను భరించలేం, ఇంటిని నాశనం చేయడానికే ఉన్నారు వీళ్ళు”, “ఫెమినిస్ట్ లు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఎందుకు తరవాత ఆ మొగుణ్ణి పట్టుకుని కాల్చుకు తినడానికా?”, “ఏమిటి మీ కోడలు ఫెమినిస్టా? ఇంట్లో రోజూ గొడవలేగా అయితే?”, “మీ అమ్మాయి ఏమిటండీ ఆ ఫెమినిజం, సమానత్వం అంటూ తిరుగుతుంది, పెళ్ళవ్వాలని లేదా?”.. ఇవీ ఫెమినిజం అనే పేరు వినగానే సామాన్యంగా మన సమాజంలో వినిపించే మాటలు. “ఏమిటి మీ అమ్మాయికి దెయ్యం పట్టిందా” అన్నంత భయంగా అడుగుతారు “మీ అమ్మాయి ఫెమినిస్టా” అనే విషయాన్ని.

స్త్రీవాదులు అనగానే చాలామందికి గుర్తొచ్చే క్యాటగిరీలు కొన్ని ఉన్నాయి. ‘పురుష ద్వేషి’, ‘అహంకారి’, ‘స్వార్ధపరురాలు’ ఇలా లిస్ట్ పెద్దదే. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే, కొందరు ఫేక్ ఫెమినిస్ట్ లు అని అనిపించింది నాకు. స్త్రీ అంటే ఇలాగే ఉండాలి, పురుషుడు అంటే ఇలాగే ఉండాలి. ఈ పనులు స్త్రీలు చేయాలి, ఈ పనులు పురుషులు చేయకూడదు. ఇంటిపని, పిల్లలు అంటే పూర్తిగా స్త్రీలదే బాధ్యత. అందులో ఏ కొంచెం తేడా వచ్చినా ఆమెను మాటలతోనూ, అవసరమైతే చేతలతోనూ దారిలోకి తీసుకురావచ్చు, కాదు కాదు తీసుకురావాలి అనే ఆలోచనాధోరణి భారతదేశంలో 99శాతం మందికి ఉంది అన్నది చేదు నిజం.

ఇంట్లో పని చేసి, పిల్లల పెంపకంలో భాగం తీసుకుంటూ, భార్యని గౌరవిస్తూ, ఆమెని సలహాలు అడుగుతూ, భార్యని సమర్ధించే మగవారికి తెలుగులో ఒక నీచమైన పదం ఉపయోగిస్తుంటారు. ఆడదానిలా ప్రవర్తించేవాడు అనే అర్ధం వచ్చే అన్యాయకరమైన తిట్టు అది. ఇల్లు అనేది ఆలుమగలు కలిసి నిర్మించుకునే ఒక space, కాబట్టీ బాధ్యతలు, హక్కులు సమానంగా ఉంటాయి అనే common sense కూడా ఉండదు చాలామందికి. 

ఆడపిల్లలా ఆ ఏడుపు ఏమిటి, అసలు మగవాడికి బాధ/నొప్పి అనేవే ఉండవు’, ‘మగవాడు ఎంత గంభీరంగా ఉంటే ఆడవాళ్ళు అంత గౌరవం ఇస్తారు’, ‘ఆ ఆడాళ్ళ పనులు నువ్వు చేయడం ఏమిటీ?’, ‘పిల్లల్ని నీ మీదకి వదిలేసి ఆవిడ ఆఫీస్ కి వెళ్తోందా? అసలు పిల్లల్ని పెంచాల్సింది ఆడపిల్లే కదా?’, ‘ఆవిడ జీతం తెస్తోంటే కూర్చుని తినడానికి సిగ్గులేదా? ఆర్జనం పురుష లక్షణం అన్నారు’, ‘అత్తమామల్ని ఇంట్లో పెట్టుకు చూస్తున్నావా? ఇంక నీకు అత్తారి వైపు గౌరవం ఏముంటుంది? అసలు వాళ్ళ బాధ్యత నీకు ఎందుకు ఉంటుంది?’, ‘మీ ఆవిడ నీకన్నా ఎక్కువ సంపాదిస్తుందా? అదేంటి అలా ఎలా ఉన్నావు నువ్వు?’

ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఇలాంటివి ఎన్నో వినాల్సి వస్తుంది. ఈ తిట్లకి భయపడో, వేరే వాళ్ళపై వాడడం చూసి మనం అలాంటి క్యాటగిరీలోకి రాకూడదు అనే conscious తోనో చాలా మంది మగవాళ్ళు అసలు సమానత్వం అనే పదాన్ని తమ dictionary లో నుంచి తీసేస్తారు. ఈ రకమైన Social Conditioning మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అలాంటి తండ్రులను చూసి పెరిగే కొడుకులు కూడా అదే బాటలో నడుస్తారు. అందుకే ఈ సమానత్వం సాధించలేకపోవడం అనేది తరతరాల జాడ్యంగా మారుతుంటుంది.

కానీ, మార్పు అనేది మాత్రమే మారని సత్యం. కాబట్టే, మన సమాజంలోనూ మార్పు వస్తోంది. సమానత్వం దిశగా ఆలోచించేవారు ఒకప్పుడు అత్యల్ప సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. Parenting అంటే ఆలుమగలు ఇద్దరూ చేయాల్సినది అని తెలుసుకుంటున్నారు. ఆడపని, మగపని అని వేర్వేరుగా ఉండవని అర్ధం చేసుకుంటున్నారు. భార్య అనేది కేవలం పనిమనిషి, పిల్లల్ని కనే మెషీన్, బాధ్యతలు మోసే వ్యక్తి, అవమానాలు భరించే బానిస కాదు అని తెలుసుకుంటున్నారు.

ఈ మార్పునైనా, ఒకప్పటి ఆ మూఢ  ఆలోచనలనైనా కళ చాలా ప్రభావితం చేస్తుంది. సాహిత్యం, మరీ ముఖ్యంగా సినిమా మనపై చాలా బలమైన ముద్ర వేస్తాయి. ఒకప్పుడు అన్ని రకాల ఆరళ్ళు, అవమానాలు భరించి, కుటుంబాన్నో, సమాజాన్నో ఒక తాటిపై నడిపించే స్త్రీ పాత్రలను సృష్టించేవారు సినిమాల్లో. అందులోనూ హీరోగారే ఆమెను ఉద్ధరిస్తారు. తన కాళ్ళపై తను నిలబడుతూ, తన కలలను సాకారం చేసుకుంటూ, తన గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని ఎదుర్కొంటూ, వివాహం-భర్త అనేవి జీవితంలో ఒక భాగమే తప్ప, వాటి కోసం జీవితాన్ని, ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోకూడదు అనే లాంటి ఆలోచనా ధోరణి ఉండే కథానాయికలు వస్తున్నారు ఇవాళ్టి సినిమాల్లో.

అందుకే నేటి తరం ఫెమినిజం, సమానత్వం విషయాల్లో ఏం ఆలోచిస్తోంది? ప్రధాన మీడియా అయిన సినిమా ఈ విషయంలో ఎలాంటి దిశలో ఉంది? లాంటి విషయాలను మహిళా మాసం సందర్భంగా మార్చి నెల మొదటి శనివారం ఉదయం 9.30గంటలకు మన ప్రసంగాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఢిల్లీ లేడీ శ్రీరాం కళాశాలలో హిస్టరీ బి.ఎ చదువుతున్న మౌనిక జగ్గాల ఈ సారి ప్రసంగించబోయే వక్త. బహుశా ఈ న్యూస్ లెటర్ చదువుతున్నవారందరికన్నా చాలా చిన్న వయస్కురాలు కావచ్చు. 

తెలుగు సాహిత్యం, సినిమాలపై మంచి పట్టు ఉన్న ఈ అమ్మాయి Instagram లో విముక్త సుధ పేరుతో ఒక పేజీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమానత్వం గురించి, స్త్రీవాదం గురించి సినిమా, సాహిత్యాలలో ఉండే కాంటెంట్ ఎక్కువగా ఈ పేజీలో పోస్ట్ చేస్తుంటారు. ఎంతో సృజనాత్మకత, ఆలోచనా శక్తి కలిగిన ఈమె వేసే పోస్ట్ లు, చేసే రీల్స్ మనల్ని లోతుగా ఆలోచించేలా చేస్తాయి. ఎక్కువగా సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రల గురించి, హీరోల కన్నా మంచి ఆలోచనా ధోరణి కలిగిన రెండో హీరోల గురించి వేసే రీల్స్ చాలా ప్రఖ్యాతి చెందాయి.

‘యువకులదే భారతం’ అంటారు. కాబట్టీ, ఆ యువత ఏ దిశలో ఆలోచిస్తోందో, సగం జనాభా అయిన స్త్రీల జీవనవిధానంలో ఇప్పటికైనా రావాల్సిన ఆ మార్పులు ఏమిటో,  మన భారత భవిష్యత్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ప్రసంగం విని తీరాల్సిందే.

ఆచార్యదేవోభవ - 6

తల్లిదండ్రుల తరువాత గురువులకే అత్యున్నత స్థానం ఇచ్చింది మన భారతీయ సంస్కృతి. ఒకనాటి గురుకులాలలో గురువు పట్ల ఉండే అంత భక్తి, శ్రద్ధ, గౌరవం నేడు కరువయ్యాయి అన్నది చేదు నిజం. అయితే, నేటికీ తమ జీవితంలో అత్యున్నత స్థానంలో తమ ఆచార్యులను చూసుకునే విద్యార్ధులు, కన్నపిల్లల కన్నా ఎక్కువ ప్రేమగా, బాధ్యతగా విదార్ధులను చూసుకునే గురువులు ఉన్నారు అన్నది కూడా అంతే నిజం.

తక్షశిల, నలంద వంటి ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో అలరారింది భారతదేశం. కానీ, అదంతా గతం. ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ స్థాయి విశ్వవిద్యాలయాల లోటు చాలా ఉంది. ఇక్కడి మోస్తరు స్థాయి విద్యావిధానంలో చదువుకుని, ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన వారికన్నా గొప్ప స్థాయిలో నిలదొక్కుకుంటున్న భారతీయ విద్యార్ధులు కోకొల్లలు. అలాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్నవారికి ఇంకా గొప్ప విద్య అందితే, ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు అందితే, భారతదేశం ఇంకెంత ముందుకు వెళ్తుంది?

Tap to Listen

అయితే, ఇలాంటి విద్యా విధానంలో గొప్ప ప్రతిభ చూపగలిగిన విద్యార్ధులతో పాటు, వారిని అంత గొప్పవారిగా తీర్చిదిద్దగల ఆచార్యులు ఎందరో ఉన్నారు. వారందరికీ సరైన గుర్తింపు రావల్సిన అవసరం కూడా చాలా ఉంది. అలాంటి కొందరు ఆచార్యుల గురించి ఈ లెసెన్ లో నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ఈ వారం ఈ సిరీస్ లో 6వ భాగం విడుదల అవుతోంది. ఈసారి ఏ గొప్ప విశ్వవిద్యాలయాల గురించి, ఏ గొప్ప ఆచార్యుల గురించి తెలుసుకోబోతున్నామంటే… వింటూ రుచెందుకు. వినేద్దురూ..

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :