#13 హరికథా భిక్షువు. బాలుడు.

Konduru Tulasidas
June 5, 2020

మారు 65 ఏళ్ళ కిందటి మాట. ఒక పల్లెటూరు. రాత్రి ఒంటి గంటయింది. భక్త రామదాసు నాటకం అంత్యదశలోకి వచ్చింది. సంకెళ్లతో ఉన్న రామదాసు రాముడుని దెప్పుతున్నాడు, తిడుతున్నాడు, వేడుకుంటున్నాడు. శ్రీ రాముడు మాత్రం సైడ్ వింగ్ లో హాయిగా నిద్ర పోతున్నాడు. ఆఖరుకు రాముడు చేయవలసిన ఘట్టం రానే వచ్చింది. రాముడు కళ్ళు నులుముకుంటూ లేచి...

సుమారు 65 ఏళ్ళ కిందటి మాట.

అది నెల్లూరు టౌన్ హాలు. రాత్రి ఒంటి గంటయింది. భక్త రామదాసు నాటకం ముగింపు దశకు వచ్చింది. సంకెళ్లతో ఉన్న రామదాసు రాముడుని దెప్పుతున్నాడు, నిందిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. శ్రీ రాముడు మాత్రం సైడ్ వింగ్ లో హాయిగా నిద్ర పోతున్నాడు. రాముడు చేయవలసిన ఘట్టం రానే వచ్చింది. రాముడు కళ్ళు నులుముకుంటూ లేచి, భటుల మధ్య సంకెళ్లతో ఉన్న రామదాసును చూసి గాభరా పడిపోయి, పరుగెత్తుకు వెళ్లి రామదాసును గట్టిగా కౌగిలించుకొని, బావురుమన్నాడు.  

కారణం, రాముడు వేషం వేసింది, అప్పుడు ఐదేళ్ల బాలుడు, మన SP బాలు. రామదాసు వేషం వేసింది ఆయన తండ్రిగారు, ప్రఖ్యాత ‘హరికథా భాగవతార్’ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు. ఈ వారం సరస్వతి పుత్రులైన ఆ తండ్రీకొడుకులను గురించి ప్రస్తావించుకుందాం.

సంగీత, సాహిత్య, నృత్య రీతుల మేళవింపుతో, నవరసాలనూ ప్రదర్శించడానికి అనువైన ఏకైక కళా రూపం 'హరికథా గానం’ లేదా హరికథా కాలక్షేపం. ఈ కళారూపంలో కళాకారులు భక్తిరస ప్రధానమైన కథాంశంలో వివిధ పాత్రలను పోషిస్తూ రెండు మూడు గంటలు కథాగానం చేస్తారు.  

ఈ కళలో శ్రీ సాంబమూర్తి గారు ప్రత్యేకంగా పేర్కొనదగినవారు. ఆయన, ఏ విధమైన గురు శుశ్రూష చేయలేదు. స్వతస్సిద్ధమైన కళాభినివేశం, సహజమైన సంగీత జ్ఞానం, అంతకు మించిన నటనాభినివేశం, ధారణా శక్తి  వారికి హరికథకు అవసరమైన ఉత్తమ లక్షణాలన్నింటినీ కలిగించాయి. వారి ఒక్క శ్యామలా దండకం, ప్రేక్షకులను ఎంతదూరమైనా లాక్కుని వెళ్ళేదిట. ఉంచ వృత్తితో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ సుమారు ఇరవై ఏళ్లపాటు రామనామమే శ్వాసగా జీవించారు.

అటువంటి కళాకారుడి ప్రతిభను ఇప్పుడు తెలుసుకోటానికి వీలుగా ఒక్క రికార్డింగూ లేదు. ఉన్నదల్లా ఎన్నో ప్రయాసలకోర్చి, ఏంతో మందితో మాట్లాడి, భక్తితో శ్రీ MS సూర్యనారాయణ వ్రాసిన శ్రీ  సాంబమూర్తి గారి జీవనదర్శనం ‘హరికథా భిక్షువు’ అనే గ్రంధం. శ్రీ సాంబమూర్తి గారి రికార్డింగ్ లేని లోటును ఏ కొంతమేరకైనా తీర్చేవిధంగా, ఈ తరానికి హరికథ కళారూపం గొప్పతనం తెలియజెప్పే విధంగా, వారి జీవన దర్శనాన్ని ఆడియోలో సమర్పిస్తోంది దాసుభాషితం.

Sri Sambamurthy Harikatha Bhikshuvu
Tap to play.

గత యాభై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా రికార్డింగుల ‘రికార్డు’ సృష్టిస్తూ ఉన్న బాలు గారి తండ్రి సాంబమూర్తి గారికి ఒక్క రికార్డింగూ లేకపోవటం, విధి వైచిత్య్రం కాదూ ! ఆయన చిత్రరంగ ప్రవేశం 40వ వార్షికోత్సవం సందర్భంగా డా.మృణాళిని చేసిన ముఖాముఖీని, జూన్ 4న బాలు గారి జన్మదినం సందర్భంగా మీకు అందిస్తున్నది ‘దాసుభాషితం’.
  

SPB Interview
Tap to play.


ఈ ముఖాముఖీలో, తనలో కసిని పెంచిన సందర్భం గురించి, ఒక పదం మార్పు కోసం ఒక ప్రముఖ దర్శకుడితో జరిగిన సంవాదం గురించి, ఒకే రోజు 19 పాటల రికార్డింగ్ రికార్డు నేపధ్యం గురించి, సినిమా సంగీతంలో మనోధర్మం గురించి, తనని పేరు మార్చుకొనమని సూచించినప్పుడు తాను  చెప్పిన సమాధానం గురించి, బాలు గారు  చెప్పిన ఎన్నో ఆసక్తికర విషయాలతో పాటు రెండు అందమైన గొంతుకల్లో స్వచ్ఛమైన తెలుగు మాధుర్యాన్ని పంచే ఈ ముఖాముఖీని మళ్ళీ మళ్ళీ వింటారు. ఎవరికైనా తెలుగు భాష తియ్యదనం తెలపవలసి వస్తే నమూనాగా ఈ ముఖాముఖీ వినిపిస్తే చాలు.

ఇక, ఈ వారం కాశీ మజిలీ కథలు విషయానికి వస్తే, పండితరాయని కథతో ప్రారంభమై 47వ మజిలీలో కళావతి వసుందరుల కథతో ముగిసే ఈ 4వ సంపుటంలో ఎన్ని కథలో, ఎన్ని ఉప కథలో, ఒక్కో గొలుసు కథా ఎన్నెన్ని మజిలీలు దాటి, గొలుసును తెంపుకుని చివరకు ఎలా ముగుస్తుందో మీరు వింటారు.

Kaasi Majilee Kathalu Vol 4
Tap to play.


వచ్చే వారం,

– వంగూరి చిట్టెన్ రాజుగారి అమెరికామెడీ కథలు మొదటి భాగం.

– కాశీ మజిలీ కథలు 5వ సంపుటం.

– జూన్ 14న రచయిత బుచ్చిబాబు జన్మదిన వారిషికోత్సవం సందర్భంగా ఆయన రచనలపై విశ్లేషణ.


Image Courtesy :