ఇల్లేరమ్మ వస్తున్నారు.. పారాహుషార్..

Meena Yogeshwar
May 22, 2023

తెలిసినవారు సరే, తెలియని వారు ‘ఇల్లేరమ్మా? ఏ ఊరికి గ్రామదేవత?’ అంటారేమో. ఆవిడ గ్రామదేవత కాదు తెలుగు సాహిత్య ప్రేమికుల ఇంటి దేవత. ‘ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్టు, రిటైరవ్వవలసిన వయసులో కలం పట్టిన ఆలస్యపు కోకిల ఈవిడ. తన జీవితంలోని బాల్యాన్ని ‘ఇల్లేరమ్మ కథలు’ గా, కెరీర్ ను ‘చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు’ పేరిట, యవ్వన మధ్యవయస్సులో తాను చూసిన, చేసిన పెళ్ళిళ్ళ కబుర్లను ‘పెళ్ళి సందడి’ లోనూ, రిటైర్మెంట్ ప్రాంతంలోని అమెరికా ప్రయాణపు రోజులను ‘ముగ్గురు కొలంబస్ లు’ గానూ రాశారామె. ఆమె....

తెలిసినవారు సరే, తెలియని వారు ‘ఇల్లేరమ్మా? ఏ ఊరికి గ్రామదేవత?’ అంటారేమో. ఆవిడ గ్రామదేవత కాదు తెలుగు సాహిత్య ప్రేమికుల ఇంటి దేవత. ‘ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్టు, రిటైరవ్వవలసిన వయసులో కలం పట్టిన ఆలస్యపు కోకిల ఈవిడ. తన జీవితంలోని బాల్యాన్ని ‘ఇల్లేరమ్మ కథలు’ గా, కెరీర్ ను ‘చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు’ పేరిట, యవ్వన మధ్యవయస్సులో తాను చూసిన, చేసిన పెళ్ళిళ్ళ కబుర్లను ‘పెళ్ళి సందడి’  లోనూ, రిటైర్మెంట్ ప్రాంతంలోని అమెరికా ప్రయాణపు రోజులను ‘ముగ్గురు కొలంబస్ లు’ గానూ రాశారామె. ఆమె డాక్టర్ సోమరాజు సుశీల. తన ఆత్మకథను ఇన్ని పుస్తకాలలో, ఇంత విలక్షణంగా చెప్పిన సాహిత్యకారులు తెలుగులో లేరనే చెప్పాలేమో.

ఆమె రాసిన కథలన్నీ ఆమె చూసినవో, ఆమె జీవితంలో జరిగనవో తప్ప, కల్పిత కథ ఒక్కటీ లేదు. జీవితాన్ని సాహిత్యపు అద్దంతో చూడడం అన్నమాటకు ఇంతకన్నా నిదర్శనం ఏమి ఉంటుంది? పైగా ఇంచుమించుగా అన్ని కథలూ హాస్యం నుండి సరదా మీటరు మీదే సాగిపోతాయి. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, పనివారు, బంధువులే ఆమె పాత్రలు. కాబట్టీ ఆమె కథలన్నీ చదివేసరికి ఆ పాత్రల పూర్తి స్వరూప స్వభావాలు మనకు కంఠో పాఠం వచ్చేస్తాయంటే నమ్మండి.

Solid state chemistryలో Ph.D చేశారు సుశీల గారు. ఆమె చదువుకునేటప్పుడు ఈ రంగంలో Ph.D చేసే ఏకైక మహిళ ఆమే. అందులోని కష్టాలు కుడా తన కథల్లో చెప్పుకున్నారామె. పూణెలోని నేషనల్ కెమికల్ లేబరెటొరిలో డాక్టరేట్ పుచ్చుకుని, కొన్నాళ్ళు అక్కడ పనిచేశాకా, హైదరాబాద్ వచ్చేశారు వారి కుటుంబం. ‘భాగ్యనగర్ లాబొరెటరీ’ అనే చిన్న పరిశ్రమను స్థాపించి, ఎందరో స్త్రీలకు ఆర్ధిక భద్రతను కల్పించారు. ఎన్నో ఏళ్ళు జాతీయ మహిళా సైంటిస్టుల సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారామె. 

ఎవరైనా స్త్రీ సమానత్వం గురించి అడిగితే ఆమె సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఉన్న పెద్ద ప్రశ్న ఇదే. అందరూ ఆడవారు, మగవారూ సమానం అంటుంటారు. అసలు అది ఎలా కుదురుతుంది? మగవారి కన్నా ఆడవారే ఎక్కువ కదా. ఇంటినీ, పుట్టింటి వారినీ, అత్తింటివారినీ, పిల్లల్నీ, ఉద్యోగం చేసేవారైతే ఆఫీస్ నూ ఒంటిచేత్తో నడిపించే ఆడవారు, మగవారితో సమానం అంటే నాకు సుతరామూ నచ్చదు. పైగా మా అమ్మమ్మ దగ్గర నుంచి, అమ్మ, అత్తగారు, నేను ఇంటిని సర్వ అధికారాలతో నడిపించాం. ఏదీ మగవారిని చేయమనండి చూద్దాం. మనం గుర్తింపుని కోరుకోకూడదు. మన విజయాలు వారు గుర్తించనవసరలేనంత ఎత్తుకు ఎదిగాకా, గుర్తించక ఏం చేస్తారు చెప్పండి’ అంటుంటారు ఆమె. ప్రతీ స్త్రీ ఆలోచించదగ్గ మాటలు ఇవి.

ఆమె రాసిన ‘చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు’ పుస్తకం చదివిన అప్పటి R.B.I గవర్నర్(క్షమించాలి పేరు తెలీదు) పరిశ్రమల గురించి అద్భుతంగా వివరించిన ఇంతటి గొప్ప పుస్తకాన్ని దేశంలోని ప్రజలందరూ చదవాలని, అన్ని భాషల్లోకి అనువాదం చేయించమని సుశీల గారితో అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె గొప్పతనం, ఆ కథల గట్టితనం. ఇక అమెరికా యాత్రపై రాసిన ‘ముగ్గురు కొలంబస్’ లోనూ అమెరికా జీవన విధానం గురించి, అక్కడి ప్రజల మనస్తత్వం గురించి, కుటుంబ విలువల గురించి, ఆ దేశపు ఆర్ధిక విధానాలతో సహా మనకి అవగాహన వచ్చేలా రాశారామె. ఇక వివాహలపై రాసిన ‘పెండ్లి పందిరి’ అయితే సంబంధాలు కుదర్చడం దగ్గర నుండి, అప్పగింతల దాకా ఆమె ఏ పెళ్ళిలో ఏ పాత్ర పోషించారో చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకపక్క ఇల్లు, మరో పక్క ఫ్యాక్టరీ, ఇంకో పక్క ఎన్నో సంఘాలలో రకరకాల పదవులు, వచ్చే పోయే చుట్టాలతో పాటుగా ఇన్ని పెళ్ళిళ్ళు ఇంత దగ్గరుండి చేయడానికి ఈవిడి రోజుకు 30గంటలున్నాయేమో అనిపించకమానదు.

ప్రతీ తరంలోనూ ఎందరో పత్రికా ఎడిటర్లు ఎందరో గొప్ప రచయితలను పాఠకులకు పరిచయం చేస్తూ వస్తున్నారు. అదే కోవకు చెందినవారు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు. మహ్మద్ ఖదీర్ బాబు, సోమరాజు సుశీల అనే అనర్ఘ రత్నాలను తెలుగు సాహిత్యానికి అందించిన సాహితీ సాగరం ఆయన. ఒకరకంగా చెప్పాలంటే నామిని గారు లేకపోయి ఉంటే బహుశా సుశీల గారిని మనం ఆలస్యంగా చదవడమో, ఇప్పుడు రాసినంత సాహిత్యం లేకపోవడమో, మన దురదృష్టం బాగోక అస్సలు చదవకపోవడమో అనే అమంగళాలు జరిగిపోయి ఉండేవి. కాబట్టీ వారికీ ఓ నమో నమః వేసుకుని ఈ వారపు విడదలలోకి దిగిపోదాం.

Tap to Listen

ఈవారం విడుదల కాబోతున్న ‘ఇల్లేరమ్మ కథలు’ ఆమె రచనల్లోనే కోహినూర్ వజ్రం అనవచ్చు. సుశీల గారే ఇల్లేరమ్మ. తన వీధిలోని ప్రతీ ఇల్లూ తనదే అన్నంత స్వతంత్రంగా తిరగాలంటే ఎంత కలివిడితనం, చలాకీతనం, ఉత్సాహం ఉండాలో ఈ కథలు చదివితే అర్ధమవుతుంది. తద్వారా అమ్మ దగ్గర ఎన్ని తిట్లూ, దెబ్బలూ తినాలో కూడా తెలుస్తుంది. ఇందులో ఆమె ప్రధాన పత్యర్ధి ఆమె పెద్ద చెల్లెలు చిన్నారి. ఎప్పుడూ పుస్తకం పుచ్చుకుని, ఇంట్లోనే ఉంటూ, అమ్మతో ముద్దులు, మురిపాలూ తింటూ పెరుగుతుంటుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగే పోటాపోటీకి అంతుండదని వేరే చెప్పాలా. మనలోనూ ఒక ఇల్లేరమ్మో, చిన్నారో తప్పకుండా ఉంటారు. లేకపోతే ఈ పుత్రికారత్నాల తల్లి అయినా ఉండి తీరుతుంది. అందుకే ఈ కథలు వింటే మన కథలు ఆవిడవని చెప్పేస్తోందేమిటి చెప్మా అని డౌటనుమానం వచ్చేయగలదు జాగ్రత్త.

ఇంకో ముఖ్య గమనిక, ‘ఈ కథలు ఒకసారి వింటే తనివి తీరడం లేదండీ, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఈ పుస్తకం వలన మేము అట్టే పెట్టుకున్న  వేరే పుస్తకాలు చదవడానికి వీలు అవడం లేదు. మా బుర్రల నిండా ఈ ఇల్లేరమ్మే శుభ్రంగా ఇల్లు అలుక్కుని, మూలలు కలవని ముగ్గులేసుకుని, బాసింపటం వేసుకుని సెటిల్ అయిపోయింది’ అని మాకు complaint చేస్తే, పూచీ మాది కాదు. ముందే చెప్పేస్తున్నాం. అందుకే ముందస్తుగా పారాహుషార్ చెప్పింది. పదండి. పదండి ఇల్లేరమ్మకు స్వాగతం చెప్దాం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :