కాలమే చలనము. చలనమే చిత్రము.

Ram Kottapalli
September 4, 2023

ఒక వ్యక్తి చరిత్రకారుడు అయ్యాడు. అతను వరంతో వెనక్కి వెళ్ళి చరిత్రను మార్చేసే కంటే ఉన్న చరిత్రనే రాసి కొత్త చరిత్రను సృష్టించడం ఎంతో మేలు అని గ్రహించాడు. అప్పుడే కాలం మలుపు తిరగడం ప్రారంభం అయ్యింది. అతని తర్వాత చాలామంది చరిత్రకారులు వచ్చారు. ఒక పక్క చరిత్ర లిఖించబడుతోంది. కాని చదివే వారు ఎవ్వరు? ఇదే సమయంలో చిత్రకారులు పుట్టుకొచ్చారు. వారి అక్షర రూపాన్ని వీరు చిత్రాలుగా గోడలపై గీసారు. గోడలపై చిత్రం కొంతకాలమే నిలబడింది. ఇదే చిత్రం శాశ్వతంగా నిలబడాలి అంటే...

ఒక వ్యక్తికి కాలంలో ముందుకి వెనక్కి ప్రయాణం చేయాలి అనే కోరిక కలిగింది. భూత కాలానికి, భవిష్యత్ కాలానికి ఏ కాలానికి కావాలి అంటే ఆ కాలానికి కోరుకున్న వెంటనే ప్రయాణం చేసి అప్పుడు జరిగిన సంఘటనలు అన్ని చూసి రావాలని అతని కోరిక. ఆ వరం కోసం సుదీర్ఘ కాలం తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే కాల ప్రయాణం చేయాలన్న తన కోరికని కోరాడు. దేవుడు ఏ వరాన్ని అయినా ఊరికే ఇవ్వడు కదా. 

ఒక నియమం పెట్టాడు నువ్వు కాల ప్రయాణం చేయగలవు కాని కాలంలో వెనక్కి మాత్రమే ప్రయాణం చేయగలవు. అలా వెనక్కి ప్రయాణం చేసిన నువ్వు ఒక్క మనిషితో కూడా మాట్లాడకూడదు. అక్కడ చుక్క నీరు కూడా తాగకూడదు. నీ ఉనికి గాలికి ఊగే చెట్టు ఆకు గమనాన్ని కూడా మార్చ కూడదు. ఆఖరికి ఇసుక రేణువుని పక్కకి కూడా జరపకూడదు. చరిత్రలో ఏదీ నువ్వు మార్చకూడదు అని నియమం పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి స్వామి చరిత్రది ఏముంది? చెరిపేస్తే చెరిగి పోతుంది అంటాడు. 

అందుకు దేవుడు అలా చెరిపేస్తే అందులోనే ఉన్న నువ్వు కూడా చెరిగిపోతావ్. ఆ తర్వాత జరిగిన మార్పులతో కొత్త చరిత్ర పుడతుంది కాని అందులో నువ్వు ఉండవు. అప్పుడు ఆ వ్యక్తి ఇన్ని క్లిష్ట నియమాలతో ఆ వరం పొందేకంటే చరిత్రను అధ్యయనం చేసి దాన్ని లిఖించడమే మేలు అనుకున్నాడు. అందుకు తగ్గ జ్ఞానాన్ని ఇవ్వమని కోరగా దేవుడు తథాస్తు అని మాయమైపోయాడు. 

ఆ వ్యక్తి ఒక చరిత్రకారుడు అయ్యాడు. అతను వరంతో వెనక్కి వెళ్ళి చరిత్రను మార్చేసే కంటే ఉన్న చరిత్రనే రాసి కొత్త చరిత్రను సృష్టించడం ఎంతో మేలు అని గ్రహించాడు. అప్పుడే కాలం మలుపు తిరగడం ప్రారంభం అయ్యింది. అతని తర్వాత చాలామంది చరిత్రకారులు వచ్చారు. ఒక పక్క చరిత్ర లిఖించబడుతోంది. కాని చదివే వారు ఎవ్వరు? ఇదే సమయంలో చిత్రకారులు పుట్టుకొచ్చారు. వారి అక్షర రూపాన్ని వీరు చిత్రాలుగా గోడలపై గీసారు. గోడలపై చిత్రం కొంతకాలమే నిలబడింది. ఇదే చిత్రం శాశ్వతంగా నిలబడాలి అంటే గీసిన చిత్రాన్ని బండరాయిపై చెక్కాలి అన్న ఆలోచన పుట్టుకొచ్చింది కొందరికి. ఆ ఆలోచన నుంచి శిల్పులు పుట్టారు. చరిత్రను బండరాయిపై చెక్కడం మొదలు పెట్టారు. చరిత్రలోని ప్రతి పాత్రకి ఒక రూపం వచ్చింది. కాలం పరుగులు తీసింది. 

ఇప్పుడు చరిత్ర ఉంది. చరిత్రను చూపే చిత్రం ఉంది. చిత్రాన్ని మంచి రూప కళగా చూపే శిల్పమూ ఉంది. కాని వీటికి చలనం లేదు. చలనం లేనివి మనిషిలో ఏ చలనమూ తీసుకురావని అనుకున్నారేమో చరిత్రని, చిత్రాన్ని, శిల్పాన్ని కలిపి మనిషే అభినయించడం మొదలు పెట్టాడు. అది నవరసాలు కలిపిన అభినయం అయ్యింది. అభినయానికి నాట్యం, నాట్యానికి సంగీతం తోడయ్యాయి. ఇదంతా కలిసి నాటకం అయ్యింది. చరిత్ర లిఖించ బడుతోంది, చిత్రంగా గీయబడుతోంది, శిల్పంగా చెక్కబడుతోంది, నాటకంగా ప్రదర్శించ బడుతోంది. కాలం పరుగులు తీస్తోంది.

కట్ చేస్తే 19వ శతాబ్ధానికి చేరుకున్నాం. సాంకేతికత విపరీతంగా అభివృద్ది చెందింది. అది చరిత్రకి, చిత్రానికి, శిల్పానికి చలనం ఇచ్చింది. ఆ చలనాన్ని రికార్డు చేసింది ఆ సాంకేతికత. ఆ చలనాన్ని మానవుడు గ్రీకు భాషలో కినెమా (kínēma) అన్నాడు, ఆ చలనాన్ని రికార్డు చేయడాన్ని గ్రాఫీన్ (gráphein) అన్నాడు. ఆ రెండూ కలిగలసిన చలన చిత్రాన్ని సినిమాటోగ్రఫీ అన్నాడు మనిషి. అదే పదం సినిమాగా రూపాంతరం అయ్యింది. 

చలనం మొదలయ్యాక ఆ సినిమా గమనం ప్రపంచం అంతా సాగింది. అలానే నేరుగా మన తెలుగుదేశంలో అడుగు పెట్టిన ఆ సినిమా ఇంకెన్ని రూపాలు ధరించిందో, విశ్వరూపాలు ధరించిందో, ఆ చలనంలో, ఆ గమనంలో ఆ సినిమాను ఏ ఏ పరిస్థితులు ప్రభావితం చేసాయో, కులమతాలు, రాజకీయ అంశాలు నియంత్రించాయో చెప్పాలి అంటే అదంతా మళ్ళీ ఒక చరిత్ర అవుతుంది. అదే శ్రీ పవన్ సంతోష్ సూరంపూడి రాసిన నేడే చూడండి తెలుగోళ్ళు. సినిమాలు. ఒక చరిత్ర అన్న పుస్తకం అవుతుంది. 

Tap to Listen

ఈ పుస్తకం త్వరలో విడుదల అవుతున్న సందర్భంగా శ్రీ పవన్ తెలుగు సినీ చరిత్రని గురించి ఎన్నో చారిత్రక విశేషాలను పంచుకున్నారు. 1920 ల్లో సినిమా తెలుగునాట అడుగు పెట్టిన మొదట్లో మొట్టమొదటి తెలుగు సినిమాకు ఆధ్యుడు అని పిలువబడిన రఘుపతి వెంకయ్య నాయిడు విదేశాల నుంచి వచ్చిన, తెచ్చిన సినిమాలను ఊరూరా ప్రదర్శించడమే కాక ఆఖరికి ఒకప్పుడు  సిలోన్ గా పిలువబడిన శ్రీలంక దేశానికి కూడా వెళ్ళి చిత్రాలు ప్రదర్శించడం గురించి ఈ ప్రసంగంలో మీరు వినచ్చు. ఈ రంగంలో మంచి ఆదాయం ఉంటుంది అని అతని కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ ని యూరప్ దేశాలకు పంపించి మరి సినిమాటోగ్రఫీని నేర్చుకురమ్మన్నారు అంటే 19వ శతాబ్దంలోనే సినిమా తెలుగు నాట ఎంతటి ప్రభావం చూపడం మొదలు పెట్టిందో మీరు ఈ ప్రసంగంలో వినచ్చు. 

1920 లో మూకి సినిమాలకు కాలం చెల్లి సినిమా మాటలు కూడా నేర్చడం మొదలు పెట్టాక తెలుగు సినిమా చరిత్ర ఎంతటి మలుపు తిరిగిందో ఈ ప్రసంగంలో మీరు వింటారు. ఆడవారు బయటకి రావడానికి ఎన్నో ఆంక్షలు ఉన్న ఆ కాలంలో దేవదాసీ స్త్రీలు సినిమాలో పాత్రలు పోషించి తెలుగు సినిమా చరిత్ర మలుపుకి ఎటువంటి కీలక పాత్ర పోషించారో మీరు ఈ ప్రసంగంలో వింటారు. 1929లో ఎక్కడో అమెరికాలోని వాల్ స్ట్రీట్ లో స్టాక్ మార్కెట్ పతనం అవ్వడం అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లోకి రావడానికి ఎలా కారణం అయ్యిందో ఈ ప్రసంగంలో మీరు వింటారు. 

ఒక చరిత్ర రూపు దిద్దుకోడానికి ఒక పరమాణువు లాంటి ఆలోచన నుంచి, అది అమలు పరిచే ప్రక్రియ, దాని ఫలితం వరకూ ఎన్నో ఆసక్తికర తెలుగు సినీ చారిత్రక విషయాలు తెలుసుకోడానికి నేడే చూడండి తెలుగోళ్ళు. సినిమాలు. ఒక చరిత్ర. పూర్తి ప్రసంగం వీడియో పైన చూడవచ్చు.

అభినందనలతో,

రామ్ కొత్తపల్లి.  

Image Courtesy :