నాకు బాగా గుర్తు. అది 2011వ సంవత్సరం. ఓ రోజు మా అన్నయ్య ఓ నవల చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో మొదలుపెట్టిన నవల, రాత్రి 11.30కి పూర్తి చేశాడు. చదువుతున్నంతసేపూ చాలా గంభీరంగా ఉన్నాడు. నవల పూర్తయ్యాకా, చాలా అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ‘12 అవుతోంది ఇక పడుకోరా’ అని నేను ఎంత పిలిచినా, సరిగ్గా పట్టించుకోవట్లేదు. ‘నువ్వు పడుకో, నేను తర్వాత పడుకుంటాలే’ అన్నాడు. నేను తెల్లారి లేచేసరికి వాడి పక్క మీద వాడు లేడు. కూర్చీలో కూర్చుని ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ‘ఏరా రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? పగలు చదువుకోకూడదా పుస్తకాలు. నిద్ర కూడా మానేసి ఇదేం గోలరా?’ అని విసుక్కున్నాను.
ఆ రోజంతా అలానే ఇబ్బందిగా ఉన్నాడు. బయటకి వెళ్ళట్లేదు. గుమ్మం వైపే చూస్తూ కూర్చుంటున్నాడు. రాత్రైంది. మళ్ళీ అదే తంతు. అమ్మా, నాన్నగారూ వాణ్ణి కూర్చోపెట్టి అడిగారు ఏమైందిరా అని. ఏం లేదు, ఏం లేదు అని మాట మార్చేశాడు. వేరే పుస్తకం చదువుతున్నా, చాలా అసహనంగా కాసేపటికి పక్కన పెట్టేస్తున్నాడు. ఆ రాత్రి కూడా వాడు అలానే జాగారం చేశాడు. తరువాతి రోజు పొద్దున్న ఇక వాడి ఒళ్ళు సహకరించలేదు. అప్రయత్నంగా నిద్ర వచ్చేసింది. ఓ అరగంటకి నిద్రలో పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ, రౌద్రం రూపం దాల్చేస్తున్నాడు. మాకెవరికీ ఏమీ అర్ధం కాలేదు. భయం వేసింది. వాణ్ణి కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగించాం. కాసేపయ్యాకా, మేడ మీదకి తీసుకెళ్ళి మాటల్లో పెట్టి విషయం అడిగాను.
అప్పుడు చెప్పాడు, తను చదివినది ‘లజ్జ’ అని ఒక నవల అని. తస్లీమా నస్రీన్ అనే బంగ్లాదేశీ రచయిత్రి రాసిందని. బాబ్రీ మసీదు కూల్చివేత వలన చెలరేగిన మతకల్లోలాలు బంగ్లాదేశ్ ను కూడా ఎలా చుట్టుముట్టాయో, దాని వలన ఏం జరిగింది అనేదే ఈ నవల కథాంశం. ఆ దమనకాండలో మెజారిటీలైన ముస్లీములు, అప్పటివరకూ తమ స్నేహితులైన మైనారిటీ హిందువుల ధన, మాన, ప్రాణాలను ఎలా కాలరాశారో క్షుణ్ణంగా, చాలా వివరంగా రాశారు రచయిత్రి. ఓ హిందూ కుటుంబం వైపు నుంచి ఈ కథను చెప్తారామె. ఈ నవలలో కథానాయకుని స్వంత స్నేహితులలో కొందరు తన చెల్లెల్ని ఇంటి నుండి ఎత్తుకుపోతారు, చివరికి ఆమె ఏమైందో తెలియదు. ఆమె కోసం ఆ అన్నగారు పడే బాధ, ఉక్రోషం, అతని చేతగానితనం మనల్ని మూలాలతో సహా కదిపేస్తాయి.
అదే జరిగింది మా అన్నయ్య విషయంలో. ఆ నవలలో జరిగిన సంఘటనలు తన మనసుపై చెరగని ముద్ర వేసి, ఒక రకమైన భయంలోకి నెట్టివేశాయి. అలాంటి దుస్సంఘటన ఎవరికైనా, ఎప్పుడైనా జరగచ్చు అనే ఊహే వాణ్ణి రెండ్రోజులు నిద్రపోకుండా చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసిన ఈ నవలకు ఆమె దేశంలో దొరికిన బహుమానం - బ్యాన్, ఆమెకు దేశ బహిష్కారం. తస్లీమా తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోయేలా చేసింది ఈ నవల. నిజం నిప్పులాంటిది. చెప్పేవాళ్ళకు, వినేవాళ్ళకూ కూడా సెగ తగులుతుంది అని ఈ ఉదంతం నిరూపిస్తుంది.
మనం చాలా హాయిగా ఓ సమాజాన్ని, ఓ దేశాన్ని, ఓ మతాన్ని తిట్టేసుకుని, చేతులు దులిపేసుకోవచ్చు. కానీ, దీనికి బీజం ఎక్కడ పడింది? ఓ దేశం ఎప్పుడైతే మత ప్రాతిపదిక మీద ఏర్పడుతుందో, మతపు చక్రాలపై నడుస్తుందో, మతం రాజకీయాలకు ఓ పనిముట్టుగా మారుతుందో, మతం వ్యక్తిగత స్థాయి నుండి రాజకీయ స్థాయికి చేరుతుందో అప్పుడు జరిగేది ఇదే. దేశ విభజన సమయంలోనైనా, బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలోనైనా కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధం కోసం, తమ అధికార దాహం కోసం, కొన్ని సంస్థలు ప్రాముఖ్యత కోసం, తమ సిద్ధాంతాలను వ్యాపింపజేయడం కోసం చేసిన తప్పిదాలే దారుణ మతకల్లోలాలకు దారి తీశాయి అన్నది నిర్వివాదాంశం.
రామ మందిరం హిందువుల హక్కు అనడంలో సందేహం లేదు. కానీ దానికి మార్గం బాబ్రీ మసీదు కూల్చివేత కాదు. తరువాతి పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా, ఏం జరుగుతుందో తెలిసినా తమ దాకా రాదులే అనే ధైర్యంతో చేసిన ఈ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమం వలన వీరు కాపాడ పూనుకున్న హిందూ సమాజానికి ఒరిగింది ఏమిటి? పాకిస్థాన్, బంగ్లాదేశ్, యునైటడ్ కింగ్ డం లలో హిందూ దేవాలయాల కూల్చివేతలు, మతకల్లోలాలో కొన్ని వేలమంది హిందూ-ముస్లీంల మరణాలు, కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తుల ధ్వంసం, ఎందరో ఆడపడుచుల మానభంగాలు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో ఉండే ఎందరో హిందువుల దేశ పలాయనాలు, తరువాతి దశాబ్ధం అంతటికీ ముస్లీం ఉగ్రవాదులకు దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు ఓ బలమైన కారణం ఇవ్వడం తప్ప మంచి ఏం సాధించిందో ఆ నిర్మూలన నాకైతే అర్ధం కాలేదు.
‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. అలాగే దేశమంటే మతం కాదు అని, బంగ్లాదేశ్ ఏర్పాటు నిరూపించింది. మత, జాతి, కులాలకతీతంగా తమ భాష కోసం పోరాడి, వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారు. ఓ దేశమంటే, ఓ ప్రాంతం అంటే అక్కడి నేల, నీరు, మనుషులు, వారి భాష, సంస్కృతి తప్ప మతం ఓ దేశాన్ని తయారు చేయలేదు అని చాటి చెప్పారు. భాష వంటి shared culture ఒక ప్రాంతాన్ని కలిపి ఉంచినంతగా, మతం కలిపి ఉంచలేదు అని నిరూపించారు. కానీ అంత గొప్పగా పుట్టిన ఈ దేశం, ఆ సమైక్యతని అతి తక్కువ కాలంలోనే కోల్పోయింది.
తమ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారిలో ముఖ్యుడు, మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత వంటి సమయాలలో తమతో పాటుగా స్వాతంత్రానికి పాటుపడిన అల్పసంఖ్యాకులైన హిందు, సిఖ్ మతస్థులపై దాడులు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ఎన్నోసార్లు ఆర్మీ తిరుగుబాటు, తద్వారా ఆర్మీ పరిపాలన చేయడం జరిగింది. మొన్నీ మధ్య కూడా షేక్ హసీనా వంటి నియంతను గద్దె దించడానికి తమతో కలిసి పోరాటాలు చేసిన హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. ఇదంతా, మత ప్రాముఖ్యాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టాలనుకునే కొన్ని మత సంస్థలు, రాజకీయ పార్టీల వలన జరిగే దారుణాలు.
భారత్ అయినా, బంగ్లాదేశ్ అయినా, పాకిస్థాన్ అయినా, ఒకనాటి జర్మనీ అయినా మనిషిని మనిషిగా చూడకపోవడమే ఇలాంటి దారుణ దమనకాండలకు మూలకారణం. మనిషిని మతంతో, ప్రాంతంతో, కులంతో, భాషతో, రంగుతో, స్థాయితో, డబ్బుతో గుర్తించిన ప్రతీసారీ జరిగేది మారణహోమమే. అతి ముఖ్యంగా, వ్యక్తిగతంగా ఉండాల్సిన మతం రాజకీయ పార్టీలకు ఆయుధంగా, ఎన్నికలకు వెన్నెముకగా, ఓట్లకు సాధనంగా మారితే అది తిరిగి సామాన్యుడినే, ఆ మతస్థుడినే కాలరాస్తుంది అనేది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇప్పటికైనా మతాన్ని, రాజకీయాన్ని, ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడడం నేర్చుకోవాలి. గుడి కట్టడం, మసీదు కట్టడం, చర్చి కట్టడం ఎంత ముఖ్యమో, బడి, ఆసుపత్రి, రోడ్డు, ఉద్యోగకల్పన, నాణ్యమైన చదువు, పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ వంటివి అంతకంటే ముఖ్యమైన విషయం అని దేశ పౌరులుగా మనం తెలుసుకోవాలి. అదే నిజమైన దేశ భక్తి. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు చేసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. వినండి. ఆ పుస్తకాన్ని కూడా కొనుక్కుని చదవండి. మతంపై, వ్యక్తి కర్తవ్యంపై తప్పకుండా మన దృష్టి మార్చే పుస్తకం ఇది.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.