మహోన్నత మూర్తి మత్వం, అద్భుత కార్యదీక్ష

Lakshmi Prabha
August 17, 2023

చదువు, సంపాదన, హోదా, అధికారం ఉన్నవాళ్ళలో చాలామందికి ఎంతో కొంత ఆభరణంగా అహంకారం కూడా ఉంటుంది. చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే తాను నిమిత్తమాతృడిని అని తలంచి, ఆనందానికి ఉప్పొంగక, దుఖాఃనికి క్రుంగిపోక, అధికార దర్పానికి ఆనందపడక, నిబద్ధతతో, ధర్మానికి కట్టుబడి నిరంతర కార్యదీక్షతో అలుపెరుగక పనిచేసినవారు, స్థితః ప్రజ్ఞులు, నిరాడంబరులు, నిరహంకారులు ఈనాటి ఈ దాసుభాషితంకు తొలినాళ్ళలో ఊతం ఇచ్చిన వారు...

చదువు, సంపాదన, హోదా, అధికారం ఉన్నవాళ్ళలో చాలామందికి ఎంతో కొంత ఆభరణంగా అహంకారం కూడా ఉంటుంది. చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే తాను నిమిత్తమాతృడిని అని తలంచి, ఆనందానికి ఉప్పొంగక, దుఖాఃనికి క్రుంగిపోక ,అధికార దర్పానికి ఆనందపడక, నిబద్ధతతో, ధర్మానికి కట్టుబడి నిరంతర కార్యదీక్షతో అలుపెరుగక పనిచేసినవారు, స్థితఃప్రజ్ఞులు, నిరాడంబరులు, నిరహంకారులు ఈనాటి ఈ దాసుభాషితంకు తొలినాళ్ళలో ఊతం ఇచ్చిన వారు కీ.శే .శ్రీ PVRK ప్రసాద్ గారు. 

తాను TTD EO గా ఉన్నప్పుడు వచ్చిన ప్రతీ అవకాశాన్ని, అధికారాన్ని స్వామి సేవకే కైంకర్యం చేశారు. వారు వ్రాసిన "నాహం కర్త హరిః కర్త " ఈవోగా వారి అనుభవాల సారం. ఎంతోమందికి ఆదర్శంగా, వారి జీవితంలోని ఒడిదుడుకులను అధికామించే సాధనంగా ఉండడమే కాక, 80000 వేల కాపీలు అమ్ముడు పోయిన ఈ పుస్తకం ఎన్నో సందర్భాలలో return gift గా కూడా పంచుకునేంతగా ప్రసిద్దికెక్కింది. 

ఈ పుస్తకం ఆవిష్కరింపబడి 20 ఏళ్లు అయిన సందర్భంగా దాసుభాషితం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, ప్రసాద్ గారి సహధర్మచారిణి గోపికప్రసాద్ గారు చాలా emotional గా మాట్లాడారు. ప్రసాద్ గారు ఎవ్వరిని నొప్పించేవారు కాదని, Positive Nature ఉన్నవారని, ప్రతీ పని చేయడానికి, ముఖ్యంగా TTD EO ఉన్న కాలంలో భక్తులకు ఇంకా ఏదో చేయాలని తపన పడేవారని, వారి భార్యగా వారు తిరుపతిలో ఉన్నప్పుడు అత్యంత అదృష్టం గా భావించిన సందర్భాల గురించి చెప్పారు. ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా పెట్టారో కూడా చెప్పారు. అలాగే వారి కుమార్తె శ్రీమతి మాధవిగారు, వారి నాన్నగారు తమతో ఎక్కువ సమయం గడపడంలేదని (సామాన్యంగా ప్రతీ పిల్లలు భావించినట్లే) వారితో దెబ్బలాడే వారని, కానీ ఆయన కోసం వచ్చిన అభిమనులని చూశాక ఆశ్చర్యపోయానని వారిని గురించి తలచుకున్న ఆమెను చూసి మనం కూడా ఉద్వేగానికి గురవ్వకతప్పదు. 

మాజీ CRPF, SSB Director General, విశ్రాంత IPS అధికారి, ప్రసాద్ గారి అభిమాని శ్రీ ఎం.వి.కృష్ణారావు గారు మాట్లాడుతూ 1979 లో TTD EO గా ఉన్న ప్రసాద్ గారు, మామూలుగా దర్శనానికి వచ్చి, క్యూలో ఉన్న తనని గుర్తుపట్టి, స్వయంగా ప్రసాద్ గారే వచ్చి పలకరించారని, వారు అంతటి నిగర్వి అని గుర్తుచేసుకున్నారు. 1988లో ALL INDIA PORT MAN స్ట్రైక్ ఉధృతంగా మొదలైనప్పుడు, విశాఖలో కూడా జరిగే అవకాశాలున్నాయేమో అని, చాలా పెద్ద ఎత్తున భారీ బందోబస్తుకు తయారైన తాను ప్రసాద్ గారు పోర్ట్ కార్మికులతో వ్యవహరించిన తీరుకు అబ్బురపడ్డానని చెప్పారు. అన్నమయ్య, దాస ప్రొజెక్ట్ ల రూపకల్పనలోనూ, త్యాగరాజ ఆరాధానోత్సవాల కమిటీలో పని చేసినప్పుడు, ప్రసాద్ గారి విధేయత, కార్యదీక్ష గురించి వివరించారు. 

అప్పటి తిరుపతి అడిషనల్ ఎస్పీ, విశ్రాంత IPS అధికారి, రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు గారు, ప్రసాద్ గారు తనకి Philosopher, Guide అని తెలిపారు. వేదాంతం పుణికి పుచ్చుకున్న మహోన్నత మనిషి అని వర్ణించారు. ప్రసాద్ గారు వారి కిందవారితో పనిని రాబట్టడంలో, పైన అధికారులను నొప్పించక వారితో మసలిన తీరు, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో వారు వ్యవహరించిన పద్దతి వివరిస్తుంటే వారు ఎంతటి గొప్ప Administrator అన్న విషయం మనకి అర్ధమవుతుంది. ప్రసాద్ గారు ధైర్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ప్రత్యక్ష సాక్షి అయిన ఒకానొక సందర్భం గురించి, ప్రసాద్ గారు రాసిన ఈ పుస్తకాన్ని అడిగి మరీ తెప్పించుకున్న వ్యక్తి గురించి నేను చెప్పడం కన్నా వారి మాటల్లోనే వినాలి. 

ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు, వారు రాసిన పుస్తకాలకు ఒక రూపునిచ్చిన సంపాదకులు, అనువాదకులు వల్లీశ్వర్ గారు, ప్రసాద్ గారు MCRHRDI లో Director గా ఉన్నప్పుడు వారు ఈ పుస్తకం రాయడానికి ఎన్నోసార్లు వారి వెంటపడిన వ్యక్తి గురించి చెప్పారు. తిరుమలలో ప్రతీ భక్తుడు తృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి, సామాన్యుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రతి నిత్యం శ్రమిస్తుండేవారని తెలిపారు. సామాన్యుని కోణం నుండి ఆలోచిస్తూ వారు తీసుకున్న నిర్ణయాలు, పథకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పారు. 

ఇక ఈ పుస్తకం గురించి వివరిస్తూ ఆఖరి భాగాలలో సీతారామారావు గారు, వల్లీశ్వర్ గారు వద్దన్నా ప్రసాద్ గారు పట్టుపట్టి రాసిన విషయం గురించి చెబుతూ, గతం గతః అనుకోకుండా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వారి వ్యక్తిత్వాన్నితలచుకుని, భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వారి పుస్తకం చదివి ప్రభావితమైన ఒక నటుని గురించి, ఒక రచయిత్రి చేసిన పని గురించి చెప్పారు. స్వయంగా ఒక వ్యక్తికి ఈ పుస్తక విషయంలో వల్లీశ్వర్ గారు చేసిన ఒక సహాయం గురించి కూడా చెప్పారు. 

మేము నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మహేష్ బాబు గారు ప్రధమస్థానంలో ఉండగా, సుధీర్ గారు, రాజశేఖర్ గారు ద్వితీయ,తృతీయ స్థానాలలో నిలిచారు. ఈ video మొత్తాన్ని పైన చూడవచ్చు.  

ఒక పరిపూర్ణ వ్యక్తిగా (Complete Man) గా ఒక మనిషిని వర్ణించాలంటే చాలా గుణాలను గుర్తించాలి. పూర్వభాషి, మితభాషి, ప్రియంవదః అని రాముడిని వర్ణిస్తారు. అలాగే ఎంతటి క్లిష్ట సమస్యనైనా నవ్వుతూ ఛేదించేవాడు కృష్ణుడు. వేంకట రామ కృష్ణ ప్రసాద్ అని తన పేరులో ఉన్న ఆ ఇద్దరి గుణాలను కలిగి ఉన్నారు ప్రసాద్ గారు. ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రసాద్ గారే తమ కార్య నిర్వహకులుగా కావాలని, సెలెబ్రెటీలు సైతం ప్రసాద్ గారితో మాట్లాడడం కోసం నిరీక్షించారంటే సామాన్య విషయం కాదు. ఎంతో మందికి వారి జీవితం లో వచ్చిన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనేలా తన రచనని సాగించి, ఇంతమంది అభిమానులను ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిగిన ప్రసాద్ గారు నిజంగా పరిపూర్ణ వ్యక్తి . అటువంటి పరిపూర్ణ మహోన్నత వ్యక్తికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.

అభినందనలు,

ప్రభ పొనుగుపాటి.

Image Courtesy :