మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?

Meena Yogeshwar
December 18, 2023

జీవన్మరణమే ఓ పెద్ద సమస్య అయి కూర్చున్న చాలామంది స్త్రీలు చిన్న చిన్న ఆనందాలు, ఆలోచనలు చేయడం కూడా మానేశారు అంటే అతిశయోక్తి కాదు. సర్దుకుపొమ్మనే పుట్టింటి వారు, సాధించుకు తినే అత్తింటి వారు, వారిని రెచ్చగొట్టే చుట్టాలు, రాజకీయాలు చేసే ఆఫీస్ వారు, తక్కువగా చూడడానికి ఏం దొరుకుతుందా అని కాచుకుని కూర్చునే చుట్టుపక్కల వారు, ఇలా నిత్యం రగిలే అగ్నిగుండంలో గుండెల దాకా కూరుకుపోయిన వారికి తనకంటూ...

చెప్పండి. మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా? విహారయాత్రకి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరకి వెళ్ళినా కొన్ని రోజులకే, అబ్బ మా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానురా బాబూ అని ఎప్పుడైనా అనుకున్నారా? అబ్బా, ఈ ప్రయాణం ఇంకా ఎంతసేపు? త్వరగా ఇంటికి వెళ్ళి, ఇంత తిని, హాయిగా పడుకోవాలి అని అనుకున్నారా? అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఇది కూడా పెద్ద విషయమేనా అంటారా? చాలా చాలా పెద్ద విషయం చాలామందికి. తమకంటూ ఒక ఇల్లు ఉంది. అక్కడికి వెళ్తే ఎంత కష్టమైనా, విసుగైనా, అలుపైనా మర్చిపోతాం అనుకునే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు మనలో.

ముఖ్యంగా స్త్రీలు. అత్తారిల్లు ఎదురు పని చేయించుకుని, కష్టపడి సంపాదించిన జీతం పుచ్చేసుకుని, పనిమనిషి కన్నా హీనంగా, బయటవారికన్నా దూరంగా చూడబడే హాస్టల్. అత్తారింట్లో పడే కష్టాలు చెప్పుకోలేక, తల్లిదండ్రుల వయసుతో, మారిన ధోరణులతో, పుట్టిపెరిగిన పుట్టింట్లో అతిథిలా అయిపోయినప్పుడు ఆ అమ్మాయికి తనకంటూ ఏ ఇల్లు ఉన్నట్టు? తనలా తను ఉండడానికి, తనకు నచ్చినట్టు సర్దుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు బతకడానికి, ఆఖరికి హాలులో సోఫాలో ఆదమరిచి ఓ కునుకు తీయడానికి కూడా స్వేచ్ఛ లేని ఆడవారు ఎందరో. తమకంటూ గది కూడా లేని ఆడవారు సరేసరి.

జీవన్మరణమే ఓ పెద్ద సమస్య అయి కూర్చున్న చాలామంది స్త్రీలు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, ఆలోచనలు చేయడం కూడా మానేశారు అంటే అతిశయోక్తి కాదు. సర్దుకుపొమ్మనే పుట్టింటి వారు, సాధించుకు తినే అత్తింటి వారు, వారిని రెచ్చగొట్టే చుట్టాలు, రాజకీయాలు చేసే ఆఫీస్ వారు, తక్కువగా చూడడానికి ఏం దొరుకుతుందా అని కాచుకుని కూర్చునే చుట్టుపక్కల వారు, ఇలా నిత్యం రగిలే అగ్నిగుండంలో గుండెల దాకా కూరుకుపోయిన వారికి తనకంటూ ఒక ఇల్లు ఉండాలనే ఆశ, అత్యాశ ఏమో అని ఆ ఆలోచన కూడా చేయరు.

‘నీవు మిగిలితివి, నేను మిగిలితిని’ అంటూ ముగుస్తుంది కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ‘వేయిపడగలు’. భారతీయ సంస్కృతికి ప్రాణమైన 999 పడగలు కాలక్రమేణా రాలిపోయినా, దాంపత్యమనే ఒక్క పడగ నిలిస్తే చాలు తిరిగి సంస్కృతి నిలబడుతుంది అని విశ్వనాథ వారి విశ్వాసం. అయితే, అలా సంస్కృతిని నిలబెట్టగలిగే, తమ దాంపత్యంతో సంప్రదాయాన్ని పునఃసృష్టి చేయగలిగే దంపతులు ఎంతమంది అనేది అసలు ప్రశ్న.

ఈ కాలం ఇలా తయారైంది, బొత్తిగా కలికాలం, ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు అని అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. మా నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ కాలం నుంచి ఎందరో స్త్రీల దీనగాథలు వంశపారంపర్యంగా వస్తూనే ఉన్నాయి. కన్యాశుల్కం కోసం పురిటిబిడ్డని అమ్మేసిన తండ్రి దగ్గర నుంచి, తోబుట్టువుల అత్తారిళ్ళలో గొప్పగా కనిపించేందుకు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా, అడ్డు వచ్చిన భార్యను చితగ్గొట్టి మరీ, ఆస్తులు తెగనమ్మిన భర్త దాకా మా వంశంలోనే ఎన్నో గాథలు విన్నాను నేను. అప్పుడు భరించేవారు, ఇప్పుడు భరించలేక బయటకు వస్తున్నారు అంతే తేడా.

ఈ అరాచకం కలకాలంగా వస్తూనే ఉంది. దానితో పాటు నూటికి నాలుగు దాంపత్యాలు విశ్వనాథ వారు కలలుగన్న ఆదర్శానికి ఊపిరిపోసేవారు నాటికి, నేటికీ కూడా ఉన్నారు. అలాగని ఆడవాళ్ళందరూ మంచివారని అనట్లేదు. అత్త కాగానే, ఆడబడుచు కాగానే తాము స్వంతంగా పడిన కష్టాలు మరిచి, ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఆరళ్ళు పెట్టేవాళ్ళు కోకొల్లలు. వీళ్ళందరూ కనిపిస్తారు శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారు రాసిన ‘అందరం ప్రేక్షకులమే’ కథా సంపుటిలో. 

Tap to Listen

సంపుటికి పేరుగా నిలిచిన ఈ మొదటి కథ ద్వారానే ఆమె తేల్చి చెప్పేశారు ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుంది తప్ప, తక్కిన సమాజం అంతా ప్రేక్షకులే అని. కొందరు మాత్రం విలన్లు కాగలరు తప్ప, ఎవరిని ఎవరూ బాగు చేయలేరు. గురజాడ వారు అన్నట్టు ‘స్త్రీలు తమను తామే సంస్కరించుకోవాలి’ అన్నది అక్షర సత్యం. అలా తమను తాము సంస్కరించుకున్న పాత్రలు కూడా వజ్రాల్లా మెరుస్తుంటాయి ఈ కథల్లో. అలాంటి ఆడవారే తమకంటూ ఒక ఇంటిని తయారు చేసుకోగల సమర్ధులు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :