మా పెళ్ళి చూపులు జరుగుతున్నాయి. గెడ్డం పూర్తిగా తీసేసి, కేవలం మీసంతో, జుట్టు బాగా ట్రిం చేయించుకుని, టక్ చేసుకున్న వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నారు. మాకు పంపిన ఫోటోల్లో చాలా సాదాగా, మంచి గెడ్డంతో ఇప్పటి కాలం కుర్రాడిలా ఉన్న వ్యక్తిని చూశా. దాంతో ఇంత formalగా, మర్యాదగా ఉన్న కుర్రాడిపై నాకు పెద్దగా అభిప్రాయం రాలేదు. కానీ మాట్లాడడం మొదలుపెట్టగానే నా మూడ్ మారిపోయింది. చాలా బాగా మాట్లాడారు. మాటల మధ్యలో ఓ బాంబు లాంటిది పేల్చారు.
‘సముద్రం దాటిన వారు పెద్దలకు కార్యక్రమాలు చేయడానికి సరిపోరు అని నేను కొన్ని ప్రవచనాల్లో విన్నాను. నేనే ఇంటికి పెద్దవాణ్ణి. నాకు ఇలాంటి వాటిపై చాలా నమ్మకం ఉంది. కాబట్టీ, ఎప్పటికీ ఈ దేశ సరిహద్దులు దాటి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పేయండి’ అన్నారు. ఓర్నాయనోయ్ ఇవేం భీష్మ ప్రతిజ్ఞలురా నాయనా అనుకున్నాను. ‘పర్లేదు లెండి నన్ను, ఆపకపోతే చాలు. నాకు అన్ని దేశాలూ తిరగాలని కోరిక’ అన్నాను. తనకే ఆ ప్రతిజ్ఞలు తప్ప, నా గురించి ఏమీ వాగ్దానాలు చేయలేదని చెప్పారు. పోన్లేరా బాబూ అనుకున్నాను.
పెళ్ళై ఇన్నేళ్ళల్లో అదే పాట మా నవతరం సత్యహరిశ్చంద్రుడు ఎన్నిసార్లు చెప్పారో. ‘నీకు అవకాశమొస్తే, వెళ్ళాలని ఉంటే నీ అంతట నువ్వెళ్ళు. లేదంటే మీ అన్నయ్యో, మన పిల్లలో తీసుకువెళ్తే వెళ్ళు. నేను మాత్రం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు కూడా రాను’ అని పదే పదే ఆ విదేశ యాత్రా బహిష్కరణం అనే కంకణాన్ని సవరించుకుంటూనే ఉన్నారు. నేనూ ఎన్నో చెప్పి చూశాను.
‘రాముడు సముద్రం దాటి లంకకెళ్ళలేదా? ఆయన పితృకార్యాలకు పనికిరాకుండా పోయాడా? హనుమంతుడు దాటలేదా? దేవుడు అంతర్యామి, ఆయన ఇక్కడా ఉంటాడు, అమెరికాలోనూ ఉంటాడు. కాలిఫోర్నియా అంటే ఏమనుకున్నారు? కపిలాశ్రమం. అక్కడి ash hill అంటే సగరుల బూది కుప్పలు. నారాయణుడి మీద కోపం తెచ్చుకుని లక్ష్మీదేవి ఆ కాలిఫోర్నియాలో కూర్చుని తపస్సు చేసింది. అక్కడి నుండి మునుల కోరిక మేరకు కోల్హాపూర్ వచ్చింది అని ఒకాయన ఈ మధ్య వీడియో చేశారు. పైగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో ఉంది. మరి అది చూడకపోతే ఎలా’ ఇలాంటి బోల్డెన్ని నిజనిర్ధారణ కమిటీలు నిర్విరామంగా నిర్వహించాను.
లాభం శూన్యం. ఆ నిండు కుండ తొణకదు బెణకదు. ‘అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా? ఆశా నిరాశేనా మిగిలేది బెజవాడేనా’ అంటూ పాడుకోవడం అలవాటైపోయింది. ఈలోపు నా కంటపడింది మన సాహితీ హాస్య సూపర్ స్టార్ డాక్టర్ సోమరాజు సుశీల గారు రాసిన ‘ముగ్గురు కొలంబస్’లు. ఆమె కుమార్తె శ్రీమతి శైలజ గారు అమెరికాలో స్థిరపడ్డ పదేళ్ళకు సుశీల గారు అతికష్టం మీద ఆమె భర్త గార్నీ, అత్తగార్నీ తీసుకుని అమెరికా వెళ్ళడం గురించి రాసిన పుస్తకం ఇది.
ఆహా, ఓహో ఏం పుస్తకమండీ బాబూ. ఈ పుస్తకం చదువుతుంటే నా భవిష్యత్ నాకు కనపడింది. ఇప్పటికే మా దేవుడిలో సుశీల గారి భర్త గారి లక్షణాలు చాలా వరకూ కొట్టొచ్చిన్నట్టు తన్నొచ్చినట్టు కనపడ్డాయి. రైలెక్కగానే బెర్తెక్కి గురకెట్టడం. అత్యంత క్లుప్తంగా మాట్లాడినా, చెప్పదలచుకున్నది మొహం బద్ధలయ్యేటంతటి నిజాయితీగా చెప్పేయడం. ఊరు కదిలి, వేరే ఊరు వెళ్ళడానికి సహధర్మచారిణికి ఉన్న సగం ప్రాణాలు తీసేలా బతిమాలించుకోవడం. నీ తిండి నీది, నా తిండి నాది, నాకోసం ఎదురుచూడకు. నన్ను నీ కోసం ఆగమనకు. ఇలా సవాలక్షా విషయాలు.
ఆమె రాసినదాన్ని బట్టీ, సుశీల గారి భర్త గారికీ మా ఆయనకీ ఏదైనా దూరపు చుట్టరికం ఉందేమో అని చాలా పెద్ద డౌటనుమానం వచ్చేసింది. ఎన్ని లక్షణాలు కలిసాయో చెప్పలేను. నేను సుశీల గారిలా అంత చలాకీగా, తెలివిగా, అన్నిచోట్లా తిరగగలిగినంత ఉత్సాహంగా ఉండకపోయినా, మరీ మా ఆయన అంత దారుణం కూడా కాదు. అమెరికాలో ఆకురాలే కాలంలో అక్కడి రోడ్లలో తిరగాలనీ, గాన్ విత్ ద విండ్ లో మార్గరెట్ మిచెల్ రాసిన peach streetలో నడవాలనీ, అందమైన ఇంగ్లీష్ పల్లెటూళ్ళలో వారమైనా గడపాలనీ, ఇటాలియన్ మారుమూల పల్లెల్లో వారి జీవితం తెలుసుకోవాలనీ, రోమ్ నగర వీధుల్లో తిరుగాడాలనీ, ఇలా ఎన్నో కలలు నాకు.
నేను ఓసారి ఈ పుస్తకం చదివేశా. మన లక్ష్మీప్రభ గారు ఈ పుస్తకం చదివారు కాబట్టీ, ఆనవాయితీ ప్రకారం మరలా వినేశాను. ఇదివరకే సుశీల గారి ‘ఇల్లేరమ్మ కతలు’ విని ఉన్నారు కాబట్టీ ఈ ఆడియో పుస్తకం ఎలా ఉందో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పుస్తకం విన్నంతసేపూ ఆనాటి విజయవాడ రోడ్లపై ఇల్లు కోసం వెతికిన ఆ చిన్నారి సుశీల అమ్మ అయి, అమ్మమ్మ అయి అమెరికా విజయయాత్ర చేస్తున్నట్టు కనిపించారు. ఈ పుస్తకంలో సుశీల గారిని నిజంగా ఓ పెద్దావిడలా కాక, చిన్నప్పటి సుశీలగారిలానే ఊహించుకున్నాను. ఇదో ప్రత్యేకమైన అనుభవం నాకు. మీరూ విన్నాకా, మీకెలా అనిపించిందో చెప్పండి. మర్చిపోకండేం.

రిటైర్మెంట్ వయసులో అయినా, మన సుశీల గారి భర్త విదేశీయానానికి ఒప్పుకున్నారు కానీ, మా దేవుడు ఆ వరం ఈ జన్మకు ఇవ్వరని నాకు తెలిసిపోయింది. సర్లే మా పిల్లలు పుట్టుకొచ్చి ఈ మదర్ ఇండియాని ఉద్ధరించకపోతారా? విదేశమాతగా తీర్చిదిద్దకపోతారా అని కలలు కంటున్నాను. చూద్దాం, నందోరాజా భవిష్యతి.
దాసుభాషితం వాట్సాప్ ఛానెల్
ఇప్పుడు వాట్సాప్ లో కూడా మన దాసుభాషితం ఛానెల్ ని ప్రారంభించాము. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈమెయిల్ ఇలా వివిధ మాధ్యమాల ద్వారా యూజర్స్ అందరికీ అందుబాటులో ఉన్న దాసుభాషితం ఇప్పుడు వాట్సాప్ ఛానెల్ ద్వారా మరింత దగ్గర అయింది. ఇప్పుడు దాసుభాషితం నుంచి వచ్చే అప్డేట్స్, కొత్త పుస్తకాల విడుదల వివరాలు ఇంకా ఎన్నో విషయాలు సోషల్ మీడియా కంటే ముందు ఈ వాట్సాప్ ఛానెల్ లో మీకు తెలుస్తాయి. ఈ దాసుభాషితం వాట్సాప్ ఛానెల్ అందరికోసం సృష్టించబడింది. కేవలం శ్రవణ పుస్తకాల గురించే కాకుండా తెలుగు సాహిత్యం, పుస్తకాలు, ఆధ్యాత్మికం, ఇంకా వృత్తి పరమైన, కెరీర్ కి సంబంధించిన విషయాల గురించిన సందేశాలు మీరు ఈ ఛానెల్ లో పొందుతారు. ఎందుకంటే మన నినాదమే సమగ్ర శ్రేయస్సుకి సోపానం.
ఈ వాట్సాప్ ఛానల్ లో చేరడానికి ఈ కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేయండి.
https://whatsapp.com/channel/0029Vb4TJik4o7qTJfb4Rp2N
అభినందనలు,
మీనా యోగీశ్వర్.