గత వారం మీనా పంపిన న్యూస్‌లెటర్ ను దానికి వచ్చిన స్పందనను మా టీమ్ మీటింగ్‌లో విశ్లేషించుకున్నాము.
ఈమెయిల్/వాట్సాప్‌లలో కొందరు ఘాటుగా స్పందించారు. అది మంచిదే. ఆరోగ్యకరమైన చర్చ ఎప్పుడూ అవసరమే. అయితే ఆ విషయంపై ఇక ఎలాంటి వివరణ ఇవ్వవద్దని నేను మీనాకు సూచించాను. ఎందుకంటే, తన అభిప్రాయాలను ఆమె వ్యక్తపరిచింది, ఇతరులూ అదే పని చేశారు. పరస్పర వాదనల వల్ల ఎవరిలోనూ మార్పు వస్తుందని నేను భావించను.
అందుకే, ఈ వ్యాసం ఆ స్పందనలకు సమాధానం కాదు. ఇతరుల ఆలోచనా ధోరణిని మార్చడం నా ఉద్దేశం అంతకన్నా కాదు. మన అనుభవాలు, పక్షపాతాల (biases) ద్వారా మన నమ్మకాలు, దృక్పథాలు ఏర్పడతాయి. వాదనల కన్నా ఆత్మవిమర్శకే వాటిని మార్చగలిగే శక్తి ఎక్కువ.
ఈ రోజు తీవ్రంగా చర్చించబడుతున్న అనేక విషయాలపై ఒకప్పుడు నా అభిప్రాయాలు కూడా ఇప్పుడు ఉన్నవాటికి పూర్తి భిన్నంగా ఉండేవి.
కౌమార దశలో నాకు ప్రపంచంలో అతి ఇష్టమైన దేశం, నేపాల్. ఎందుకంటే అప్పట్లో అదే ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. జనాభాలో 80% పైగా హిందువులు ఉన్న భారతదేశం హిందూ దేశం ఎందుకు కాకూడదు అనే ప్రశ్న నాకు తరచూ వచ్చేది. నాకు రాముడంటే అమితమైన ప్రేమ. ఇప్పటికీ. ఇది కూటమి సభ్యులకు తెలుసు. “సామాన్యులు కాదు సోదరులిరువురు, నిను వెదకుచూ మమ్ము కలిసినారు..” అని సుందరకాండలో హనుమంతుడు సీతకు రామలక్ష్మణుల గుణగణాలను వర్ణిస్తున్న ఘట్టం విన్న ప్రతిసారీ నాకు goosebumps వస్తాయి.
పొద్దున్నే రేడియో వినడం అలవాటు. సోమవారం నుండి శనివారం వరకు భక్తిరంజని బాగా ఉండేది, ఆదివారం మాత్రం బైబిల్ సూక్తులు. నాకు అసహనం కలిగేది కానీ ఎప్పుడూ హిందూ మతం ఉనికి మీద అభద్రత కలగలేదు.
సనాతన ధర్మం ఉనికి ప్రమాదంలో ఉందని నేను మొదట విన్నది, బాబ్రీ మస్జిద్ సంఘటన సందర్భంలో. వందల సంవత్సరాలు సైద్ధాంతిక, భౌతిక దాడులకు గురై, ఇతర మతాల పాలకుల ఏలుబడిలో ఉండి కూడా అస్తమించని సనాతన జీవన విధానం (one of the very few living civilizations), ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద స్వతంత్ర, సార్వభౌమిక దేశంలో మెజారిటీ ప్రజలు పాటించే ధర్మం ఎందుకు ప్రమాదంలో ఉంటుంది? ఈ ప్రశ్న నన్ను తొలిచేయడం మొదలుపెట్టింది. అదే నా అన్వేషణకు నాంది.
ఆ అన్వేషణ నన్ను మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసేలా చేసింది. వారెందుకు మన దేశాన్ని లౌకిక దేశంగా ఉంచాలనుకున్నారు? అప్పుడు నాకు అర్థమైంది, వారు మతం యొక్క శక్తిని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో. మతం అనేది కేవలం పూజలు, ప్రార్థనలు కాదు. అది జీవితంలో సవాళ్లను సులభతరం చేస్తుంది. భజన, ఉపవాసం, దీక్షలు మన నాడీ రసాయన వ్యవస్థను ఉత్తేజం చేస్తాయి. అందుకే మతం మనలో ఉండే అటాచ్‌మెంట్ సిస్టమ్, అంటే ఒక తల్లికి బిడ్డకు మధ్య ఉండే బంధం వంటి బలమైన బంధంతో ముడిపడి ఉంటుంది. అందుకే తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఎంత తీవ్రంగా స్పందిస్తామో, మతం విషయంలోనూ అంతే డిఫెన్సివ్‌గా ఉంటాము.
ఈ గాఢమైన బంధం వల్లే, రెండు మతాల సమూహాల మధ్య ఎప్పుడూ ఒక నిగూఢమైన ఉద్రిక్తత ఉంటుంది. ఇది దేశాలను నాశనం చేయగలదు. శాంతిని ప్రబోధించే బౌద్ధ, హిందూ మతాలున్న చిన్న దేశమైన శ్రీలంక కొన్ని దశాబ్దాలు రావణకాష్టమైంది. దీనికి 'Us vs Them' భావన ఒక ప్రధాన కారణం. అందుకే, పాలన నుండి మతాన్ని వేరుగా ఉంచాలని (Separation of Church and State) మన పెద్దలు భావించారు. సమాజంలో శాంతి లేనిదే ఆర్థిక పురోగతి ఉండదు.
ఈ సిద్ధాంతం అంతా బాగానే ఉంది. కానీ మన చుట్టూ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి కదా? మత మార్పిడులు, కొత్తగా వెలుస్తున్న ప్రార్థనా మందిరాలు మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనడంలో అబద్ధం ఏముంది? ఇది నాకు కలిగిన రెండో సందేహం. ఇది విశ్లేషించుకున్నాను.
ఈ విషయంపై ఉన్న డేటాను పరిశీలించడం మొదలుపెట్టాను. విశ్వసనీయమైన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ప్రకారం, 98% భారతీయులు వారు పెరిగిన మతాన్నే తమ మతంగా పేర్కొంటున్నారు. ఇంకా గర్భధారణ శక్తి అన్ని మతాల మహిళల్లోనూ క్షీణిస్తోంది. వెరసి మత మార్పిడులు కానీ, శిశు జననాలు కానీ, 80% హిందువులున్న భారతంలో మత నిష్పత్తిని గణనీయంగా మార్చబోవు అన్నది నివేదిక సారాంశం.
మరి మనకు కనిపిస్తున్న దానికి, డేటాకు ఎందుకు ఇంత తేడా?
రెండు మానసిక ప్రక్రియల వల్ల. మొదటిది, Availability Bias. మన ఇంటి దగ్గర లేదా మనం రోజూ వెళ్లే దారిలో ఒకటి రెండు కొత్త చర్చిలు కనపడగానే, ఆ చిత్రం మన మనసులో బలంగా నాటుకుపోతుంది. "మత మార్పిడులు ఎంత తీవ్రంగా ఉన్నాయి?" అని ఎవరైనా అడిగితే, మనకు వెంటనే ఆ చర్చిలే గుర్తొస్తాయి. దాంతో సమస్య చాలా పెద్దదని మనం తేల్చేస్తాం. విమాన ప్రమాదం వార్త చూసిన వెంటనే విమాన ప్రయాణం చాలా ప్రమాదకరమని భావించడం లాంటిదే ఇది.
దీనికి తోడు, రాజకీయ నాయకులు, వాట్సాప్ ద్వారా 'హిందూ మతం ప్రమాదంలో ఉంది' అనే భావన మనలో నాటుకున్న తర్వాత, ఇంకో చిత్రమైన అనుభవం మొదలవుతుంది. గతంలో మనం పట్టించుకోని పాత చర్చిలు కూడా మన కంటపడతాయి. 'అవును నిజమే, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి' అని మన నమ్మకం బలపడుతుంది. దీన్నే Frequency Illusion అంటారు. మీరు ఒక రంగు కారు కొందామనుకునప్పుడు, మీకు రోడ్డు మీద ఆ రంగు కార్లే ఎక్కువ కనపడుతూ ఉంటాయి.
ఈ రెండు మానసిక ప్రక్రియలు కలిసి, మనల్ని లోతుగా ఆలోచించకుండా అడ్డుకుంటాయి. ఇక్కడ నాకు ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ కార్ల్ యంగ్ (Carl Jung) మాటలు గుర్తొస్తాయి: "Thinking is difficult, that’s why most people judge." మనం కూడా వాస్తవాలను పరిశీలించకుండా, మనకు కనిపించేదాన్ని బట్టి, వినిపించేదాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చేస్తాము.
సరే, మత మార్పిడుల వల్ల జనాభా నిష్పత్తి మారకపోయినా, అవి జరుగుతున్నది వాస్తవమే కదా. ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా బీద, బడుగు వర్గాలలోనే ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? అని ఆలోచించినప్పుడు నాకు మూడు కారణాలు కనిపించాయి:
- తమ మతం వారే వివక్ష చూపటం.
- హిందూ మతం గొప్పదనం తెలియకపోవటం.
- ఆర్థిక ప్రలోభం.
ఈ కారణాలు తెలిశాక, సహజంగానే మనలో కలిగే స్పందన, ‘ఈ సుద్దులన్నీ ఎప్పుడూ హిందువులకేనా? అవతలి వాళ్ళు మన దేవుళ్ళను దూషిస్తుంటే, మనవాళ్ళను ప్రలోభపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? దీనికి పరిష్కారం హిందూ assertion కాదా? మనల్ని మనం బలంగా చాటుకోవాలి!’
ఈ ప్రశ్నలు కూడా నా ‘పాత నేను' నన్ను అడిగినవే. కానీ ఆవేశాన్ని పక్కనపెట్టి, ‘ఈ మూడు కారణాలలో ఒక అగ్రవర్ణ హిందువుగా నా పాత్ర ఏమిటి?’ అని ప్రశ్నించుకున్నాను.
మా ఇంట్లో కులం గురించి అసలు చర్చ ఎప్పుడూ జరగలేదు. అదేదో గొప్ప విషయమని అనుకునేవాడిని. అది 'upper caste privilege' అని తర్వాత తెలిసింది. బయటకు అనకపోయినా, అగ్రకులాల అంతర్గత సంభాషణలలో నిమ్నవర్గాల వారి గురించి మాట్లాడేటప్పుడు “వాడు మాలోడు”, “వాడు మాదిగోడు” అని వినపడుతూ ఉంటుంది. ఇక్కడ వివక్ష చూపే మనుషుల గొప్పదనం ఏమీ ఉండదు. కేవలం యాదృచ్ఛికంగా ఒక ‘అగ్ర’ కులంలో పుట్టడం తప్ప.
ఇక నా మతం గొప్పదనం గురించి నాకేంత తెలుసు అని ప్రశ్నించుకుంటే... హిందూ మతంలో థియాలజీ (పూర్వ మీమాంస) గురించి అందరికీ తెలుసు. కానీ ఇంకో పార్శ్వమైన ఫిలోసోఫీ (ఉత్తర మీమాంస), సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సకల మనో వికారాలను పరిష్కరిస్తుంది. హిందూ మతంలో అసలైన బలం అక్కడే ఉంది.
అప్పుడు నాకు అర్థమైంది, అసలైన పరిష్కారం ఎదుటివారిపై దాడిలో లేదు, మనల్ని మనం సంస్కరించుకోవడంలో ఉంది. ప్రపంచ దేశాల్లో భారత దేశంపై గౌరవం ఒక రమణ మహర్షి, ఒక పరమహంస యోగానంద తెచ్చినంతగా, అహంకారంతో, ద్వేషంతో హిందూ మతాన్ని assert చేసేవారెవరూ తేలేదు, తేబోరు.
నా ఈ అన్వేషణ, ఈ ఆత్మవిమర్శ నన్ను చివరికి మనం ఎంతో గర్వంగా చెప్పుకునే "వసుధైవ కుటుంబకం" అనే మాట యొక్క అసలైన లోతు దగ్గరికి చేర్చాయి. ఆ పద్యం చిన్నప్పుడు మూడో తరగతిలో మా తెలుగు టీచర్ నేర్పారు.
అయం నిజః పరోవేత్తి గణనా లఘు చేతసాం
ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం
తాత్పర్యం: 'ఇది నాది, ఇది పరాయివాడిది' అని లెక్కించేది సంకుచిత బుద్ధి ఉన్నవాళ్ళు (లఘు చేతసాం). విశాల హృదయం ఉన్న వారు (ఉదార చరితానాం) మాత్రమే ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తారు.
‘వసుధైవ కుటుంబకం’ వాక్యం మనం గర్వపడటానికి దొరికిన ఒక నినాదం కాదు, మనం మోయాల్సిన ఒక బాధ్యత. నిజంగా ఆ గొప్ప సంస్కృతి మన రక్తంలో ప్రవహిస్తుంటే, ఆ "ఉదార చరిత"ను మొదట మనమే చూపాలి. ఆ విశాల హృదయాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఇప్పటివరకు చూపాము కాబట్టే, భారతదేశం ఇంకా నిలిచి ఉంది.
చివరికి, నన్ను నేను కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకున్నాను:
దేవుడు సర్వజ్ఞుడు అయితే, ఈ భిన్న మతాలను, ఈ వైవిధ్యాన్ని ఆయనే సృష్టించి ఉండాలి కదా? ఆయన సృష్టిలోని ఒక నిర్ణయాన్ని ప్రశ్నించడానికి, ఇది తప్పు ఇది ఒప్పు అని తీర్పు చెప్పడానికి నేనెవడిని?
ఆయన సర్వశక్తిమంతుడు అయితే, అలాంటి అనంత శక్తిని, అల్పమానవుడినైన నేను కాపాడాలనుకోవడం నా అహంకారం కాదా?
ఆయన సర్వవ్యాపకుడు అయితే, ప్రతి అణువులో, ప్రతి మనిషిలో ఉండేది ఆయనే అయినప్పుడు, ఎదుటివాడి మీద ద్వేషాన్ని పెంచుకోవడం కాదు, వాడిలో ఉన్న దైవాన్నే కదా చూడాలి?
నా ఈ అన్వేషణ, ఈ ఆత్మవిమర్శ, చివరికి నన్ను ఒక స్పష్టమైన సమాధానం వైపు నడిపించాయి. వందల గ్రంథాలు, వేల ఏళ్ళ తత్వశాస్త్రం, ఋషుల వాక్కులు అన్నీ పదే పదే చెప్పేది ఒక్కటే.
"నిన్ను నువ్వు తెలుసుకో."
అదే ప్రతి మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం అని, ఏకైక ధర్మమని హిందూ మతం బోధిస్తుంది.
మనం బయట చేసే యుద్ధాలన్నీ, మతాన్ని రక్షించాలని చేసే ఆర్భాటాలన్నీ, ఇతరుల విశ్వాసాలను తప్పుపట్టే ప్రయత్నాలన్నీ... నిజానికి మనలోపల పేరుకుపోయిన అహంకారం, అభద్రత, ద్వేషం వంటి వికారాల ప్రదర్శనే తప్ప మరొకటి కాదు. మనలోని ఆ అశాంతిని ఇతరులపై రుద్దడమే తప్ప, దీనివల్ల సాధించేది ఏమీ లేదు.
ఈ భావజాలాన్ని బలహీనతనుకుని లబ్ధి పొందాలనుకునేవారుంటారు. కానీ మన ధర్మానుష్ఠానమే అటువంటి ప్రయత్నాలని ద్వేషంలేకుండా విఫలం చేసే నేర్పు, కౌశలం కల్పిస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదే.
కాబట్టి, నాకు నేను చెప్పుకుంటున్నది ఇదే:
నా కర్తవ్యం ఇతరుల తప్పులు వెతకడం కాదు, నాలోని వికారాలను గుర్తించి జయించడం. నా దేవుడిని నేను కాపాడటం కాదు, అందరిలో నాలో ఉన్న ఆ దైవత్వాన్ని తెలుసుకోవడం.
అదే నేను చేయగలిగిన గొప్ప ధర్మసేవ, దేశసేవ.
మాటలే కాకుండా, ఈ విషయంలో నా చేతలు, అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న దాసుభాషితం సభ్యులకు విదితమే.
అభినందనలు,
దాసుకిరణ్.