నవ్వులో శ్రీరమణున్నాడురా..!

Meena Yogeshwar
July 25, 2023

కాఫీ పొడిలో రాత్రి పోసిన నీళ్ళు, తెల్లార్లూ ఒక్కో చుక్కా, ఒక్కో చుక్కా దిగుతూ పొద్దున్నకి చిక్కటి, కమ్మటి డికాషన్‌గా మారినట్టు, ఎన్నో ఏళ్ళు జాగ్రత్తగా నిలువబెట్టిన ద్రాక్షరసం చక్కటి ఫ్రెంచి వైన్‌గా మారినట్టు, నేలలో పాతిన తాటికాయలు కొన్ని నెలలకు తేగల పాతరగా చేతికి వచ్చినట్టు, కొంతమంది రచయితలు తమ అనుభవాలనూ, అనుభూతులనూ ఎన్నో ఏళ్ళు తమ హృదయంలో ఊరబెట్టి మన ఆజన్మాంతం దాచుకోగలిగిన రచనను చేస్తారు. అలాంటివారిలో ఒకరు..

‘నేనే ప్రధానమంత్రిని అయితే, బాపు కార్టూన్లను కరెన్సీపై ముద్రిస్తాను. టాక్స్ కట్టేవాడు నవ్వుతూ కడతాడు’ అన్నారు శ్రీరమణ మొట్టమొదటి బాపు కార్టున్ల పుస్తకం ముందుమాటలో. అదే బాపుకు రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వచ్చినప్పుడు విశ్వనాథ వారు అభినందన రాసి ఉండి ఉంటే ఇలా ఉండేదంటూ ‘రమణయని వొకడున్నాడు. ముళ్ళపూడి వారు. ఇతని సహపాటి. వీరిద్దరూ మంచి మిత్రులని నాకు తెలియును. స్నేహమనగానేమి? అది యొక అనుబంధము..’ అంటూ అసలు విషయంలో నుండి తన సహజధోరణిలోకి జారిపోయేవారన్నట్టుగా పేరడీ చేశారు ఆయన.

మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడితోనే మొదలుపెట్టాలి కాబట్టీ, గల్లీ రౌడీలు కూడా తమ రౌడీయిజం వినాయక చందాలతోనే మొదలుపెడతారట, అలా కూడా వినాయకుడు మానవసంబంధాలకు పునాదులు వేయడానికి ఉపయోగపడుతున్నాడన్నారు ఆయన. ఎంత దైర్నం..? ఒకానొక రీసెర్చి స్కాలర్ ని ఏం చేస్తున్నావంటే, ‘రీచర్చి’ అన్నాడట గంభీరంగా. దేనిపై అనగా, ‘సోషలు యెవేరునెస్సు యిన్దీ తెలుగూ పొయిట్రీ - విత్తు స్పెషలు రిఫరెన్సు టూ దేవులపల్లి అండ్ కృష్ణశాస్త్రి’ అన్నాడట. పైగా శ, ష, పలు పలకడం రాలేదుట. అంటే ఏమని ఉంటాడో ఎవరి ఊహలు వాళ్ళు ఊహించుకోవచ్చు.

రచయితలందరూ రైలు ప్రయాణం చేస్తున్నట్టు ఓ స్కెచ్ రాశారు శ్రీరమణ. టికెట్ కలెక్టర్ వచ్చి విశ్వనాథను టికెట్ అడిగితే ‘అల నన్నయకు లేదు, తిక్కనకు లేదు’ అంటాడట. ‘వాళ్ళకు లేకపోతే పోయింది, మీ టికెట్ చూపించండి మహాప్రభో’ అంటాడట ఆ టికెట్ కలెక్టర్ గారు. ఇక పై బర్తులో కూర్చున్న కృష్ణశాస్త్రి గారేమో ‘దిగి రాను.. దిగి రాను దివి నుండి భువికి’ అన్నాడట, సరే కానీ పక్క సీటు కూడా ఎందుకు రిజర్వ్ చేసుకున్నారని అడిగితే ‘నా ఊహా ప్రేయసి కోసం’ అన్నాడట. అలా ఓ నవ్వుల బండిలో ప్రయాణం చేయించగలగడం శ్రీరమణ గారికి నవ్వుతో పెట్టిన విద్య.

మిథునంలో మేనల్లుడు, బంగారు మురుగులో మనవడు, షోడా నాయుడులో కుర్రాడు, గుర్రాల మావయ్య మేనల్లుడు శ్రీరమణగారే. తన చిన్ననాట చూసిన, చేసిన అపురూప అనుభవాలని ఇలా బంగారపు పళ్ళెంలో వేడి వేడి పాయసంలా వడ్డించారు మనకి. జుర్రుకున్నవారికి జుర్రుకున్నంత. సింహాచలం సంపెంగల గుబాళింపు ఆస్వాదించినా, దొంగ సాములోరి రహస్యాలు కనిపెట్టినా, జీడిపప్పు పకోడి కరకరలాడటానికి ఏం చేయాలో తెలుసుకున్నా, గుత్తొంకాయకూ మానవసంబంధాలకూ ఉన్న లింకు అర్ధం చేసుకున్నా మనకు కూడా చెప్పాలన్న తాపత్రయంతో, ఉత్సాహంతో రాసినట్టు ఉంటాయి ఆ కథలు, కబుర్లు.

కాఫీ పొడిలో రాత్రి పోసిన నీళ్ళు, తెల్లార్లూ ఒక్కో చుక్కా, ఒక్కో చుక్కా దిగుతూ పొద్దున్నకి చిక్కటి, కమ్మటి డికాషన్‌గా మారినట్టు, ఎన్నో ఏళ్ళు జాగ్రత్తగా నిలువబెట్టిన ద్రాక్షరసం చక్కటి ఫ్రెంచి వైన్‌గా మారినట్టు, నేలలో పాతిన తాటికాయలు కొన్ని నెలలకు తేగల పాతరగా చేతికి వచ్చినట్టు, కొంతమంది రచయితలు తమ అనుభవాలనూ, అనుభూతులనూ ఎన్నో ఏళ్ళు తమ హృదయంలో ఊరబెట్టి మన ఆజన్మాంతం దాచుకోగలిగిన రచనను చేస్తారు.

అలాంటివారిలో ఒకరు శ్రీరమణగారు. పత్రికారంగంలో 40ఏళ్ళ పాటు పనిచేసిన ఆయన వందల కొద్దీ వ్యాసాలూ, కాలమ్ లు, స్కెచ్ లూ, చమత్కారాలూ, పిట్టకథలు, పేరడీలూ రాసినా, కాల్పనిక సాహిత్యంలో ఆయన రాసినవి అతి కొద్ది కథలు, ఒక నవల మాత్రమే. కానీ ప్రతీది ఒక మణిపూసలాగా, ఒక అద్భుత శిల్పంలాగా తన మనసులోనే చెక్కి, చిత్రీపట్టి మన ముందు నిలిపారు ఆయన. మన పనల్లా వాటిని ఆస్వాదించి, ఆనందించడమే.

శ్రీరమణ గారి మరణవార్త విన్నాకా, ‘బంగారం హరించుకుపోయింది, మనం మిగిలాం’ అనిపించింది నాకు. ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత శ్రీ అన్వర్ గారు తన పోస్ట్ లో పాత్రికేయినిగా చేస్తున్నప్పుడు నండూరి, పురాణం, తరువాత బాపు-రమణ వంటి సాహితీ సింహాల మధ్య తన అనుభవాలను ‘సింహాల మధ్య నేను’ అని శ్రీరమణ గారు ఒక పుస్తకం రాయాలని ఉందన్నారని చెప్పినప్పుడు ఒక మంచి పుస్తకం మిస్ అయ్యామన్న వేదన కలిగింది. 

ఇక ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి వి.బి.సౌమ్య గారు ఫేస్ బుక్ లో శ్రీరమణ గారి వ్యాసాలు రెండిటిని పోస్ట్ చేసి, వాటితో పాటు ‘హర్షణీయం’ వారితో శ్రీరమణ గారి ఇంటర్వ్యూ లింక్ ఇచ్చారు. అది విని, ఆయన వాక్ప్రవాహంలో గట్టి మునకలు వేసి ఆనందించాను. వారి నిష్క్రమణ బాధ నుండి కాస్త ఉపశమనం దొరికింది. ఇక మరో కోరా రచయిత శ్రీ నళనీకాన్త్ వల్లభజోస్యుల గారు ‘ఈ బంగారం ఎప్పటికీ హరించదు, ఎందుకంటే ఇది మన ఉనికి’ అన్నారు. అది చదివాకా, ఆ ఇంటర్వ్యూ విన్నాకా, నిజమే ఆయన ఎక్కడికీ పోలేదు. మనందరి నవ్వులో శ్రీరమణున్నాడురా అనిపిస్తోంది.

వరహాల బావి దగ్గర గోళీలు ఆడే పిల్లల ఆరాధ్య దైవం షోడానాయుణ్ణి పరిచయం చేస్తూ, ధనలక్ష్మి కొట్టు గురించి చెప్తూ, గుర్రాల మావయ్య ఇంట్లో జీడిపప్పు పకోడి పెట్టించి, ఆ ఊరు వచ్చిన సాములోరి అరటిపువ్వు వడల వ్యవహారం వివరిస్తూ, బంగారు మురుగున్న బామ్మగారి ఇంట్లో బాదం చెట్టు కిందకి వెళ్ళగా, అక్కడ సత్యవెంకట స్టాలిన్ రవీంద్రనాథ్ ఠాగూర్ తో తనకున్న పరిచయాన్ని వివరిస్తున్న వేళ శ్రీరమణ గారు ఇహలోకపు కలం కాగితాల దగ్గర సెలవు తీసుకుని, సరస్వతీ దేవి అసిస్టెంట్ గా ఆర్డర్ తీసుకున్నారు. కాబట్టీ, ఆవిడకి దణ్ణం పెట్టుకున్నప్పుడల్లా, ఆ పరివారంలో మన శ్రీరమణ గారిని పలకరించచ్చు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :