పాతాళభైరవిలో తోటరాముడికి వచ్చిన సమస్యే నాకూ వచ్చింది. మీతో నిజం చెప్పాలా? వద్దా అని. ఇది తెలిస్తే, ఇంత సాహిత్యం తెలుసంటావు, ఇదా నీ సంగతి అని మీరంటారేమోనని నా భయం. మీకు చూస్తూ, చూస్తు అబద్ధం చెప్పడానికి మనస్కరించడం లేదు. సరే, ఏదైతే అది అయింది మన మధ్య అబద్ధాలు ఎందుకుగానీ, నిజం చెప్పేస్తానండి. నేనింతవరకూ వేరే భాషా సాహిత్య అనువాదాలు కూడా అత్యంత శ్రద్ధగా, పనికట్టుకుని మరీ చదివాను.
కానీ ఏనాడూ కొడవటిగంటి కుటుంబరావు గారంతటి గొప్ప రచయిత సాహిత్యం పనికట్టుకుని చదివిన పాపాన పోలేదు. ఒక్క ‘చదువు’ నవల మినహాయించి. అది మాత్రం మూడుసార్లు చదివాననుకోండి. తెలుగు కథకు తలమానికమైన కొ.కు గారి కథలను నేనెన్నడూ శ్రద్ధగా చదివింది లేదు. అక్కడొకటి అక్కడొకటి చొప్పున చదవడమే తప్ప. అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. అలాగని కొ.కు తెలియకపోవడం లేదు. ఆయన రాసిన వేల కథల్లో నేనో పదో, ఇరవయ్యో చదివి ఉంటానంతే.
ఇన్నాళ్ళూ, కొ.కు గారి సాహిత్యాన్ని ఎందుకు ఒక పట్టు పట్టలేదు చెప్మా అని కొన్ని రోజుల నుండి మనసు పీకేస్తోంది. ఈ లోపు, కొ.కు గారి సాహిత్యం వచ్చే ఏర్పాటు చేయి అంటూ కిరణ్ గారు వారి వారసుల ఫోన్ నెంబరు ఇచ్చారు. వాళ్ళమ్మాయి వరూధునిగారు అనుకుంటూ ఆ నెంబరుకి చేస్తే, వాళ్ళ అల్లుడు గణేశ్వరరావు గారు ఎత్తారు. కరోనాలో ఆవిడ పోయిందమ్మా అని బాధగా చెప్తూ. మేము ఇద్దరం దాదాపు గంటా నలభై అయిదు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆయనకు తెలుగు సాహిత్యంపై ఎంత పట్టు ఉందో, తమ మామగారి సాహిత్యంపై అంతకన్నా ఎక్కువ పట్టే ఉంది.
కొ.కు గారు ఎన్ని కథలు రాశారో, అందులో మిగిలిన వారు ఎన్నిటికి, వేటివేటికి పర్మిషన్ తీసుకుని ఆడియోలు చేస్తున్నారో. ఎవరెవరు, ఏ ఏ కథలు పర్మిషన్ లేకుండా చేస్తున్నారో అన్నీ క్షుణ్ణంగా తెలుసు ఆయనకి. నాకు కళ్ళు తిరిగాయి ఆయన జ్ఞాపకశక్తికి. అంత పెద్ద వయసులో ఆయనకున్న జ్ఞాపకశక్తి ఈ వయసుకు నాకు లేదే అని బాధేసింది కూడాను. ‘వేరే వాళ్ళు చేసినవి మళ్ళా మీరు చేయడం ఎందుకు అనవసరమైన ‘Duplicating’ తప్ప. చక్కగా కావాల్సినన్ని కథలు, నవలలు, ఇతర సాహిత్యం రాశారు పెద్దాయన. అవి చేసుకోండి నిక్షేపంగా’ అన్నారు నోరు నిండా. ఆయనను చూసి, రచయితకు ఇలాంటి వారసుడు దొరికితే అంతకన్నా ఏం కావాలి అనిపించింది.
ఆ తరువాత కారా మాష్టారి పుణ్యమా అని మనకు అందుబాటులో ఉన్న అనర్ఘ రత్నం ‘కథానిలయం’ వెబ్సైట్ దర్శించాను. ఒక వారం నుండి ప్రతిరోజూ కొన్ని గంటలపాటు అచ్చంగా కొ.కు కథలు చదవడమే ఉద్యోగమైపోయింది నాకు. ఏం కథలండీ అవి. వస్తువు, కథనం, భాష ఇంత చక్కాగా కుదిరిన కథా రచయిత కాబట్టే, అంత మాననీయుడయ్యారు కొ.కు గారు. ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన విషయం పేర్లు పెట్టడం. అందులో నా ప్రావీణ్యత మీద నాకు కాస్త నమ్మకం ఎక్కువ. ఆ ఇష్టం వల్లనో ఏమో, ఆయన కథలకు పేర్లు చూస్తే ముచ్చటేసింది పెద్దాయన మీద.
‘పెళ్ళి చేయకుండా చూడు’, ‘దాలిగుంటలో కుక్కలు’, ‘నువ్వులూ-తెలకపిండి’, ‘పైకొచ్చినవాడు’, ‘దేవుడింకా ఉన్నాడు’ ఇలా చెప్పుకుంటూ పోతే వేలకు వేలే. ఆయన పెట్టే పేర్లలో మరో విశేషమేమంటే, చాలాసార్లు పెట్టిన పేర్లు పొరపాటున కూడా కథలో రావు. ఇంకో విశేషమేమంటే కొన్ని మహా వెటకారంగా కూడా ఉంటాయి. ఉదాహరణకి దేవుడింకా ఉన్నాడు కథ మొత్తం చచ్చిపోయిన వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కథలో దేవుడి ప్రస్తావన మచ్చుక్కి కూడా రాదు. దేవుడికన్నా, చచ్చిపోయిన వాళ్ళే మనుషుల్ని నడిపిస్తున్నట్టు భావించే మనుషుల కథకు ఆయన పెట్టిన పేరు దేవుడింకా ఉన్నాడు. చెళ్ళున చెంప మీద కొట్టినట్టు ఉంటుంది ఆ పేరు, ఆ కథకి.
దాదాపుగా కథలన్నీ రచయిత వివరిస్తూ రాసే ధోరణిలోనే ఉంటాయి. ఇది నాకెందుకు నచ్చిందంటే, ఒక్క కథ కూడా రాయని నేను, ఇలా రాస్తే బాగుంటుంది అనుకుంటూ మనఃఫలకంలో కథలు పేజీలకు పేజీలు రాసేస్తూ ఉంటాను కదా. నాకు తెలియకుండానే నాది కూడా అదే ధోరణి. అందుకే కొ.కు గారి కథలన్నీ నాకింకా దగ్గరకు జరిగాయి అనిపించింది. ముప్పైల నుంచి ఎనభైల దాకా ఐదు దశాబ్ధాల పాటు కథలు రాశారు ఆయన. అయితే, ఎక్కడా పాత రోజులు మధురం, కొత్త రోజులు వికలం లాంటి ధోరణి చూడలేదు నేను.
ఆ సమయానికి, ఆ సమాజానికి ఏం జరుగుతోందో, దానిలో లోటు పాట్లేమిటో చెప్పడమే తప్ప, ఈ కాలం ఇలా తగులబడింది కానీ, ఆ రోజుల్లోనైతే.. అనే మనిషి కాదు కొ.కుగారు. ప్రముఖ రచయిత అల్లం రాజయ్య గారు ఒకానొక కొ.కు సమగ్ర సాహిత్యం సంపుటికి ముందుమాట రాస్తూ ఈ విషయాన్ని కొ.కు గారు ఎలా మాట్లాడారో చెప్తారు. ‘సాహిత్యానికి శాశ్వత విలువలు, శాశ్వత ప్రయోజనాలు ఉండవనేవారు వారి ఉత్తరాల్లో’ అంటారు రాజయ్య గారు. అచ్చంగా ధర్మానికి వేదాలు ఇచ్చిన Definition కూడా ఇదేగా. స్థల, కాలాలకు అనుగుణంగా ధర్మం మారుతుంది అని. ఈ రెండూ సమన్వయించుకున్నప్పుడు నాకు భలే కుతూహలం అనిపించింది. ఈ మాట కొ.కు గారితో చెప్తే, ఆయన ఎలా ప్రతిస్పందించేవారో కదా అని.
సమాజ పరిణామాలను, తెలుగు ప్రాంత చరిత్రను తన రచనలలో ఇంతగా ప్రతిబింబించిన మరో తెలుగు రచయిత లేరు అనడంలో నేను వెనకాడలేకపోతున్నాను. సమాజం దోవన సమాజాన్ని వదిలేసి, తనకు తోచిందేదో చెప్పుకుపోవడం అన్నది కొ.కుగారికి రాని పని. బయట జరిగేదాన్ని ఆయన తన కథలకెక్కించిడాన్ని అసిధారావ్రతంలా సాగించారనిపించింది ఆయన కథలు చూస్తే. పైగా అంతకన్నా కష్టమైన విషయం ఏమిటంటే ఇది హితం, ఇది చెడు అనే విషయాన్ని నేరుగా బోధించకుండా, అలాగని మనం పట్టుకోలేనంత గూఢంగా కూడా కాకుండా, ఒక కామెంటేటర్ లాగా చెప్పుకుంటూ పోవడం. చాలా అబ్బురంగా అనిపించింది ఈ లక్షణం నాకు.
‘ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రబోధకుడు కాదు, సమాజ విశ్లేషకుడు’ అన్నాడు పవన్ సంతోష్ నాతో కొ.కు గారి గురించి మాట్లాడినప్పుడు. దానికి అర్ధం ఏమిటో ఆయన కథలు చదివితే, బోధపడింది నాకు. ఇన్ని కథల్లో ఒక్కదానిలోనైనా ప్రబోధించకుండా ఉండగలగడం అంటే అబ్బురమేగా మరి. మనుషుల తర్కవితర్కాలను, వారి ఆలోచనాధోరణిని, వారు మనసుకు సర్దిచెప్పుకునే స్థితిని ఉన్నదున్నట్టుగా చూపించి, నిర్ణయించుకోమని మనకు వదిలేస్తారే తప్ప, ఎక్కడా కూడా Judgements చేయడం ఇన్ని కథల్లో ఒక్క దానిలోనూ చూడలేదు నేను. ఎలా సాధ్యమబ్బా ఈ మనిషికి ఇంత నియంత్రణ. నేర్చుకోవాల్సిన లక్షణం కదా.
కొ.కు అనగానే చాలామంది ఒక కథకుడు గుర్తుకువస్తాడు. కొందరికి గొప్ప పాత్రికేయుడు గుర్తుకువస్తాడు. మరికొందరికి తొలితరం సినిమా జర్నలిస్టు/విశ్లేషకుడు గుర్తుకువస్తాడు. మరికొందరికి ‘చందమామ’ గుర్తుకువస్తుంది. ఇంకొందరికి ‘చదువు’ లాంటి నవలలు గుర్తుకువస్తాయి. నాకు మాత్రం ఎప్పుడూ ఒక కథ గుర్తుకు వచ్చేది. అదేమిటో చెప్తాను అది కొ.కుది కాదో అవునో మీరే చెప్పాలి. నేను చిన్నప్పుడు నా పాఠ్యపుస్తకంలో చదువుకున్నాను ఈ కథ. అప్పట్నుంచి అది కొ.కు గారిదే అనుకుంటున్నాను. పేరు గుర్తు లేదు కానీ, ఆ కథ కొ.కు గారిదే అని ధృడ నిశ్చయం నాకు చిన్ననాటి నుంచి. ఎంత వెతికినా ఆ సాహితీ సర్వస్వంలో ఈ కథ దొరకలేదు. వేరే రచయితది ఏమోలే అంటే నా మనసు వదలట్లేదు. మీరే చెప్పాలి.
ఒక మూడు నాలుగేళ్ళ పిల్ల ఉంటుంది. దానికి తన బాబాయ్ అంటే పిచ్చి ఇష్టం. ఒకరోజు ఆ బాబాయ్ ఊరెళ్ళబోతాడు. పిల్ల వద్దంటే వద్దని నానా గోల చేస్తుంది. వెళ్ళల్సిన పని అని బతిమాలుకుంటే, అయితే తననీ తీసుకువెళ్ళమంటుంది. సరేనని అబద్ధం చెప్పి, తయారవ్వమంటాడు. దూరాభారం కనుక తిని సిద్ధంగా ఉండమంటాడు. తిన్న వెంటనే చిన్నపిల్ల కదా నిద్రపోతుంది. బాబాయ్ గప్ చిప్ గా వెళ్ళిపోతాడు. కాసేపటికి పిల్లకా విషయం నిద్రలోనే తెలిసి ఏడుస్తుంది.
ఇంకాసేపటికి, ట్రైన్ లో ఉండాల్సిన బాబాయ్ ఇంటికొస్తాడు. పిల్ల లేచి కూర్చోకుండానే అంతా గమనిస్తూ ఉంటుంది. విషయమేమిటంటే, ట్రైను లేటు. అందుకని అంతవరకూ ఇంటికొస్తాడు. పిల్లకి మాత్రం పిచ్చ కోపమొస్తుంది. అంత రాద్ధాంతం చేశాకా, వెళ్ళినవాడు వెళ్ళిపోక మళ్ళీ వెనక్కి రావడం ఏమాత్రం రుచించదు. తన ఏడుపంతా వృధా అయినట్టు బాధపడుతూ నిద్రపోతుంది. ఇంతే కథ. ఏ ఏడో తరగతిలోనో, ఆరో తరగతిలోనో పాఠ్యపుస్తకంలో చదివిన కథ. పేరు గుర్తులేదు. కానీ ఎందుకో కొ.కు గారిదే అనే నమ్మకం. మీకు ఈ కథ తెలుసా? తెలిస్తే పేరు, రచయిత చెప్దురూ.. పుణ్యం ఉంటుంది.
సరే, ఇంత చదివాకా, మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ వారం కొ.కు కథలు విడుదల అవుతున్నాయని. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేకుండా అర్ధం చేసేసుకుంటారు మీరు. అయినా నేనేదో పెద్ద సిద్ధాంతిలాగా విడుదల మూహూర్త నిర్ణయం చేశానొహో అంటూ డప్పు కొట్టుకుంటాను. అలవాటేగా మనకి. అదండీ విషయం. ఈ వారం వస్తున్నాయి. వినండి. ఆ కథ గురించి తెలిస్తే మాత్రం చెప్పండి బాబూ. అదే అస్తమానం గుర్తుకొస్తోంది. తెలిస్తే కాస్త మనశ్శాంతి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.