#21 ఒక నిర్యాణం. ఒక జయంతి.

Dasu Kiran
July 31, 2020

జులై 28న పరమపదించిన శ్రీ రావి కొండల రావు గారు, గత ఏడాది డిసెంబర్ 15న దాసుభాషితం నిర్వహించిన సి పి బ్రౌన్ తెలుగు పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆయన ప్రసంగంలో, తెలుగుపదాలున్నా కూడా ఆంగ్లం ఉపయోగించడం పై ఉన్న మోజు గురించి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన పేరు గురించి చెబుతూ, అవకాశం ఉంది కదా అని ప్రతీది మార్చేయకూడదని, కొండల రావుకి బదులు, ...

*శ్రద్ధాంజలి*


జులై 28న పరమపదించిన శ్రీ రావి కొండల రావు గారు, గత ఏడాది డిసెంబర్ 15న దాసుభాషితం నిర్వహించిన సి పి బ్రౌన్ తెలుగు పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆయన ప్రసంగంలో, తెలుగుపదాలున్నా కూడా ఆంగ్లం ఉపయోగించడం పై ఉన్న మోజు గురించి వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

తన పేరు గురించి చెబుతూ, అవకాశం ఉంది కదా అని ప్రతీది మార్చేయకూడదని, కొండల రావుకి బదులు, Mountains Don’t come అంటే బావోదని చమత్కరించారు. హాస్యచతురుల సాంగత్యం ఎప్పుడూ ఆనందమే కలిగిస్తుంది. మేము ఆయనని కలిసిన ప్రతీసారి నవ్వుకుంటూ తిరిగి వెళ్లినవారమే.

యాప్ లో “రావి కొండల రావు కథలు” ప్రవేశం కూడా నాటకీయంగానే జరిగింది. ఒక సందర్భంలో మధురాంతకం నరేంద్ర సంకలనం చేసిన ‘తాత్విక కథలు’ పుస్తకం గురించి గొప్పగా చెప్పారు కొండల రావు గారు. ఆ పుస్తకం కావాలని మేము అడిగితే, ఉన్న వారికి ఫోన్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో అవతలి వ్యక్తికి సమాధానంగా “ నా కథలు చేయమని నేనే ఎలా అంటాను?” అని నవ్వుతూ అన్నారు. అప్పుడు గానీ మేము చేసిన పొరపాటేమిటో అర్ధం కాలేదు. వారి సహాయం కోరి వెళ్లిన మేము, ఆయన అనుమతి తీసుకుని అప్పటికే ఆయన కథలు చేసి ఉండవలసింది కదా!   చాలా సిగ్గుపడ్డాము. ఆఘమేఘాల మీద రికార్డు చేసి వారం  తిరగకుండానే  ‘రావి కొండల రావు కథలు’ యాప్ లో విడుదల చేశాము.



Raavi Kondala Rao Kathalu
Tap to listen


తెలుగు చిత్రసీమలో 50 సంవత్సరాలకు పైబడి అనుభవం ఉండి, స్వర్ణయుగపు కథలను చెప్పగలిగిన వారిని ఇపుడు మనం వేళ్ళమీద లెక్కించవచ్చు. అటువంటిది నాటక రంగం గురించి, సాహిత్యం గురించీ కూడా చెప్పగలిగిన వారిలో బహుశా శ్రీ రావి కొండల రావు గారు చివరి వారై ఉంటారు. ఆయన చెప్పిన ఆయా విషయాలన్నీ, “మన దాసుభాషితం యాప్ లో పాడ్‌కాస్ట్ లా చేద్దామండీ” అంటే ‘ఈనాడు’ వారికీ అటువంటి ఆలోచన ఉన్నదనీ, వారితో ఒప్పందం కూడా ఉన్నదని వివరించారు. దాని మీద కృషి జరిగందనే ఆశిద్దాము, ఎందుకంటే the mountain will not come anymore.


తిలక్


ఆగష్టు 1 ప్రఖ్యాత కవి శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జయంతి. 

భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవులల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త కూడా.

విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికి తురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరాలుగా మలచి అమృత ఝరిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్.

తన కవిత్వాన్ని సుతిమెత్తని వృత్త రీతిలో ప్రారంభించినా సమాజపు ఆధునిక పోకడలను అభివర్ణించడానికి ఆ పరిధి చాలదని గ్రహించి వచన గేయాన్ని అందుకున్నాడు. అది అతని చేతిలో అద్వితీయమైన అందాలను సంతరించుకుని అపురూప సౌందర్యంతో వెలుగొందింది. అదే ఆయనకు అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ‘అమృతం కురిసిన రాత్రి’.  

Amrutam Kurisina Raathri
Tap to listen

ప్రతి నిత్యమూ మన కళ్ళముందే జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించటానికి, ఆయన, కవితలతో పాటు కథలను, నాటక ప్రక్రియలను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. మనకు వీధుల్లో తారసిల్లే బిచ్చగాళ్ళు, ఆనాధలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్లు, పడుపుగత్తెలు  చీకటిబజారు చక్రవర్తులు, ఇలా ఎందరెందరినో పాత్రలుగా మలచి నిజ రూపంలో మనముందు నిలబెడతారు. 

అందుకనే అన్నారు “ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు” అని.

తిలక్ జయంతి సందర్భంగా దాసుభాషితం యాప్ లో ఎక్కువగా వెతకబడిన శీర్షికలలో ఒకటైన ‘అమృతం కురిసిన రాత్రి’ పై డా.మృణాళిని గారి విశ్లేషణను,తిలక్ కథలు’ మూడు సంపుటాలలో మొదటి సంపుటాన్ని శ్రీ తులసీదాస్ గళంలో అందిస్తోంది దాసుభాషితం.

Tilak Kathalu Vol 1
Tap to listen


కాశీ మజిలీ కథలు 11వ భాగం

కాశీ మజిలీ కథలు ఈ 11వ భాగంలో, గోపాలకుడు, మణిసిద్ధులు --

"శ్రీ గౌరీ ధృత కరణా వాగీశాద్యఖిల దేవా వందిత చరణా !
నాగాసుర మదహరణా  భోగింద్రాభరణ  జిత భూధర శరణా  !

అని కాశీ విశ్వేశ్వరుని స్తుతిస్తూ, 250వ మజిలీ చేరుకున్నారు. మజిలీ చేసిన గ్రామంలో పండితులు "ప్రసూత కన్యాత్మజ మవ్యనాథా" అనే అసంపూర్ణ శ్లోక పూరణం గురించి వాదించుకుంటూ ఉండటం  చూచి ఆ వృత్తాంతం గురించిన కథ  చెప్పవలసినదిగా మణిసిద్ధుడిని కోరాడు. అందుకు సంబంధించిన 'అగ్ని శిఖుని' కథ  చెప్పటం ప్రారంభించాడు మణిసిద్ధుడు. అలా మొదలైన 11వ భాగం 300వ మజిలీలో మరో అత్యంత ఆసక్తికరమైన ప్రహ్లాద నారాయణుల యుద్ధానికి సంబంధించిన కథతో ముగుస్తుంది.

Kaasi Majilee Kathalu Vol 11
Tap to listen
Image Courtesy :