మనం ఎన్నో రకాల గిన్నిస్ రికార్డ్ లు విని ఉంటాం. అత్యంత ఎక్కువ push ups చేసిన వాళ్ళు ఉన్నారు. నీళ్ళల్లో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు ఉన్నవాళ్ళు. అత్యంత ఎక్కువ ఆహారాన్ని తిన్నవాళ్ళు…ఇలా ఎన్నో రకాలు. అయితే భక్తిని, అన్నమయ్యని గిన్నీస్ రికార్డ్ లలోకి ఎక్కించినవాళ్ళ గురించి మీరు విన్నారా? 24గంటలపాటు, కేవలం కొన్ని నిమిషాల బ్రేక్ లు మాత్రమే తీసుకుని గంటకి పది నుండి పన్నెండు పాటల చొప్పున పాడుతూ, ఒక్కరోజులో 216 అన్నమయ్య కీర్తనల కచేరీ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు ‘అన్నమయ్య పద సుధ’ బృందం.
దాదాపు 15ఏళ్ళ క్రితం, తాడేపల్లిగూడెంలోని బి.వి. ఆర్ కళాకేంద్రంలో 24గంటలపాటు నిర్వహించిన ఈ కచేరీకి నేను ప్రత్యక్ష ప్రేక్షకురాల్ని. దాదాపు 5, 6గంటలు కుర్చీలోంచి లేవకుండా ఈ కచేరి విన్నానంటే మీరు అర్ధం చేసుకోవచ్చు, ఎంత రసవత్తరంగా, జనరంజకంగా కచేరి సాగిందో. మా ఇంట్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో అన్నమయ్య పద సుధ అనే ఈ కచేరీ ఉండి తీరేది. మా బామ్మగారి సహస్ర చంద్రదర్శనం, మా గృహప్రవేశం, మా నాన్నగారి ఉద్యోగ విరమణ సభ, ఇలా చిన్ననాటి నుండి ఈ కార్యక్రమం చూస్తూ పెరిగాను నేను.
2000వ సంవత్సరం జనవరి 1న మొదలైన ‘అన్నమయ్య పద సుధ’ ప్రయాణం, ఈ సంవత్సరంతో పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. వ్యాఖ్యాతగా తమ్మా సత్యనారాయణ గారు, ప్రధాన గాయకులు దాసరి కాశీ విశ్వనాధం గారు, మృదంగంపై సరస్వతుల హనుమంతరావు గారు, వయోలిన్ పై భాగవతుల సీతాపతిరావు గారు ఒక బృందంగా ఏర్పడి, ఈ కచేరీని నిర్వహించడం మొదలుపెట్టారు. మొట్టమొదటిరోజు ఏ బృందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో, నేటికీ అదే బృందం ఈ కచేరీలు నిర్వహించడం ఒక అపురూపమైన విషయం.
ఈ పాతికేళ్ళల్లో రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని దేవస్థానాలలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. కనీసం పదిసార్లు నేరుగా తిరుమల కొండ మీదే ఈ కచేరీ జరిగింది. సత్యనారాయణ మాస్టర్ గారు వివిధ అన్నమయ్య పద సుధ కార్యక్రమాలలో చేసిన వ్యాఖ్యానాలను సంకలనం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక పుస్తకంగా కూడా విడుదల చేయడం విశేషం. దాదాపు 1200కు పైగా కార్యక్రమాలు జరిగాయి.
అన్నమయ్య భాండాగరం అనే చీకటి గదిలో నుండి వెలుపలకు వచ్చిన క్షణం నుండే ఈ కీర్తనలు పండిత, పామరులందరినీ ఆకర్షించింది. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, తరువాతి కాలంలో బాలకృష్ణ ప్రసాద్ గారు, బాల మురళికృష్ణ గారు, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు వంటి మహామహుల కృషి ఫలితం నేటికీ అన్నమయ్య సామాన్యుల గుండెల్లో నిలిచిపోవడం. ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించనపుడే రాదు’ అన్నట్టు, సుకవి రచనలు చేసినప్పుడు చరితార్ధుడు కాలేడు, అవి అన్ని నోళ్ళలోనూ నాని, వారి గుండెల్లో కొలువై ఉన్నప్పుడే ఆ కవి, రచన కూడా చరితార్ధులవుతారు.
అలా అన్నమయ్యను నెత్తిన పెట్టుకుని, ఊరూరా ఆ సంకీర్తనల సుగంధాన్ని వెదజల్లుతున్నారు ‘అన్నమయ్య పద సుధ’ బృందం. ఆ బృందంలోని ముఖ్య వ్యక్తి, వ్యాఖ్యాత తమ్మా సత్యనారయణ గారి ప్రసంగం నిర్వహించుకోవడం నాకు చాలా తృప్తినిచ్చిన విషయం. అలాంటి ఒక గిన్నీస్ రికార్డ్ సాధించిన వక్తను దాసుభాషితంకు నేను పరిచయం చేయగలగడం నా అదృష్టం. ఆసాంతం ఈ ప్రసంగాన్ని విని, ఆనందించి, కూటమిలో తమ తమ స్పందనలు తెలియజేసిన సభ్యులను చూస్తే, అన్నమయ్య ఇందుకు కాదూ అజరామరంగా నిలిచిపోయాడు తెలుగువారి గుండెల్లో అనిపించింది.?
ఈ ప్రసంగం యూట్యూబ్ వీడియో పైన ఉంది. ఇంతకు మించిన నివాళి ఏమి ఇవ్వగలం ఆ పదకవితా పితామహునికి?
అభినందనలు,
మీనా యోగీశ్వర్.