మావారికి మా చుట్టాలలో కొందరి గురించి చెప్పాలంటే ఎలాగో తెలుసా? మా అమెరికా మావయ్య లేడూ, వాళ్ళ అబ్బాయి ఒడుగు అట. మా అమెరికా బావ లేడూ, వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. మా స్వీడన్ వదిన వస్తోందిట. ఇలా ఉంటుంది సంభాషణ. దాదాపు అందరి ఇళ్ళల్లోనూ ఇలా పడమటి సంధ్యారాగాలు ఆలపిస్తున్న గాయకులు ఉండే ఉంటారు. కొందరు ఇష్టపడి వెళ్తే, మరికొందరు కష్టాలు కడతేర్చుకోవడానికి వెళ్తారు. ఎలా వెళ్ళినా, ఈ నేలలోని మట్టివాసన వారిని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది.
అందుకే కాబోలు, అక్కడి భారతీయులను వెతుక్కుని స్నేహాలు చేస్తారు. వారిలోనే కుటుంబ సభ్యులను వెతుక్కుంటారు. ఈ మధ్య యూట్యూబ్ లో ఇలా వేరే దేశాల్లో ఉంటున్న కొందరు, తమ రోజూవారీ జీవితం, పండుగలు-పబ్బాలు చేసుకునే తీరు, అక్కడి విశేషాలు వంటి వాటితో vlogs చేస్తున్నారు. పిచ్చ following కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళని చూస్తే, ఓ పక్క అయ్యో పాపం అందరికీ దూరంగా ఉన్నారే అనిపిస్తుంటుంది. మరోపక్క పోనీలే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి కూడా తగిన దూరం దొరికిందేమో అని నవ్వు వస్తుంది.
అలా vlogs చూస్తూ, చూస్తూ నాకో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఎప్పుడో 1960లలో అమెరికా దేశానికి వెళ్ళి, స్థిరపడిన మన తెలుగువారు చూసిన మార్పుల గురించి మన శ్రోతలకు వినిపిస్తే భలే ఉంటుంది కదా అనిపించింది. ఇందుకు, అమెరికాలోనే కాక, ప్రపంచదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలుగుదనాన్ని అందిస్తూ, వారికి తమ భాష సాహిత్యాలకు దూరం కాకుండా ఎంతో కృషి చేస్తున్న మన వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి కన్నా సరైన వారు ఎవరు అనిపించింది. ప్రవసాంధ్ర జీవనం గురించి ఎన్నో కథలు రాసినవారి నుంచి వినడం కన్నా కిక్ ఇంకేం ఉంటుంది?
మీకు తెలియనది ఏముంది? తెలుగువారి కోసం అంటే, ఆయన ఎంత దూరమైనా వచ్చేస్తారు. అలాంటిది మన ప్రసంగానికి రాలేరా? తప్పకుండా వస్తా అన్నారు. జనవరి మొదటి శనివారం అంటే 4వతేదీ ఉదయం 9.30గంటలకు ‘అమెరికాలో తెలుగు జీవితాలు’ అనే అంశంపై వారు ప్రసంగించనున్నారు. నేను ప్రత్యేకించి ఈ ప్రసంగం గురించి ఊరించనవసరం లేదేమో. వారి కథలను ఇప్పటికే రుచి చూసి ఉన్నారు మీరందరూ. ఇక ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో నేను వివరించాలా చెప్పండి? సెలబ్రిటీలకు ఆతిధ్యం ఇవ్వడంలోని పదనిసలు, పదనసలు ఆయన నోటెమ్మటా విందాం. వచ్చేయండి ఆరోజు.
రూట్స్ - విశ్లేషణ
‘అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు.. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవరోయ్’ అన్నారు శ్రీశ్రీ. చరిత్రలో చాలా వర్గాలకి తీవ్ర అన్యాయమే జరిగింది. ఎన్నో దశాబ్దాలు అట్టడుగున, చీకటిలో బ్రతికినవారెందరో ఉన్నారు. ప్రపంచానికి ఉత్తమ జీవన ప్రమాణాలు, నైతికత రెండు చేతులా నేర్పే అమెరికా, లండన్ లాంటి దేశాలు ఒకప్పుడే కాదు, ఇప్పటికీ వాళ్ళ దేశంలో ఉండే జాత్యాహంకారాన్ని పట్టించుకోదు. పైగా అదో గొప్ప విషయంగా పరిగణించడం కూడా కద్దు. ఎందరు native americans, ఆఫ్రికన్ నీగ్రో బానిసల సమాధులపై తమ నూతన నైతికతను నిలబెట్టారో అక్కడి ప్రజలకు తెలుసా?
కేజీల చొప్పున పప్పులు, ఉప్పుల్ని కొన్నట్టుగా, రక్తమాంసాలున్న మనుషుల్ని కొన్నారు. ఆ బానిసలు అనుభవించిన హింసకు అంతూ దరి అనేది ఎక్కడా కానరాదు. ఈనాటికీ ఆఫ్రికన్ అమెరికన్లు అనుభవించే జాతి వివక్షకు మూలాలు ఎన్నో వందల ఏళ్ళ క్రితమే పునాదులు పడ్డాయి. వాటిని తవ్వి, అందులో ఎందరో మనుషుల్ని బానిసలుగా పాతిపెట్టిన ఘనత ఆనాటి అమెరికన్లు, ఇంగ్లీషువారు, ఇతర జాత్యాహంకార జాతులకు చెందుతుంది. అవన్నీ నేటి సమాజానికి అతిదగ్గరగా పరిచయం చేసిన పుస్తకం ‘Roots’.
ప్రపంచ సాహిత్యంలోనూ, సమజంలోనూ సంచలనం సృష్టించిన పుస్తకం ఇది. దాదాపు ఆరు నెలల పాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో మొదట నిలిచిన పుస్తకం ఇది. సాటి అమెరికన్లలో ఇతర జాతుల పట్ల sensitivity పెరగడానికి అన్యాపదేశంగా ఉపయోగపడిన పుస్తకం అంటారు విమర్శకులు. నాకు తెలిసి, ఇప్పటికే ఈ పుస్తకాన్ని మీలో చాలామంది చదివి ఉంటారు. నేను మాత్రం చదవలేదు. అంతటి అన్యాయాన్ని చదివి, తట్టుకునే మానసిక స్థితి సంపాదించాకా చదువుదాం అని పక్కన పెట్టాను. కానీ ఎందరో ప్రముఖులు ఈ పుస్తకంపై రాసిన విమర్శలు చదివాను.
ఈ వారం మన దాసుభాషితంలో ఈ పుస్తకంపై ప్రముఖ రచయిత, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన విశ్లేషణ విడుదల అవుతోంది. మీరు పుస్తకం చదివినా, చదవకపోయినా ఈ విశ్లేషణ వినండి. మీకు మంచి దృష్టికోణం దొరుకుతుంది. ఇప్పట్లో పుస్తకం చదివే ఉద్ధేశ్యం లేనందున, నేను ఒకటికి మూడుసార్లు విన్నాను ఈ విశ్లేషణ. అది పుస్తకం మహత్యంతో పాటు ఆమె విశ్లేషణా పటిమ కూడా. మీరు వినండేం.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.