పెట్టుబడుల బడి

Ram Kottapalli
June 5, 2023

ఎవరికో డబ్బులు వచ్చాయి అని అతిగా ఆశపడి, నియమాలు తెలుసుకోకుండా ఆటలో దిగడం కచ్చితంగా జూదమే. ఎంత ఎక్కువ ధనం అని కాదు, ఎంత తక్కువ ధనం ఉన్నా, డబ్బుని కష్టపడి సంపాదించుకున్న మనం దాన్ని గౌరవించుకుని నిర్వహించుకునే తీరు మనల్ని ఎటువంటి ఒడిదుడుకుల్లోనైనా తొణకక, బెణకక నిండు కుండలా నిలబెడతుంది. నియమాలు తెలిసి కూడా...

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం జూదమా? 

ఎవరికో డబ్బులు వచ్చాయి అని అతిగా ఆశపడి, నియమాలు తెలుసుకోకుండా ఆటలో దిగడం కచ్చితంగా జూదమే. నియమాలు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం రిస్క్ తీసుకోవడమే. 

యథా ధనం తథా మనం. డబ్బు ఎలా ఉంటే మనం అలా ఉంటాం.
ఎంత ఎక్కువ ధనం అని కాదు, ఎంత తక్కువ ధనం ఉన్నా, డబ్బుని కష్టపడి సంపాదించుకున్న మనం దాన్ని గౌరవించుకుని నిర్వహించుకునే తీరు మనల్ని ఎటువంటి ఒడిదుడుకుల్లోనైనా తొణకక, బెణకక నిండు కుండలా నిలబెడతుంది.
కానీ చాలామంది కనీస ఆర్ధిక జ్ఞానం లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బును టాక్స్ ఆదా వుతుందనో, అధిక రాబడి వస్తుందనో, తెలిసినవారే కదా అనో, అవగాహనా రాహిత్యంతో  మ్యూచువల్ ఫండ్స్ లోనూ, స్టాక్స్ లోనూ, చిట్ ఫండ్స్ లోనూ పెట్టుబడి పెడతారు. నష్టాలు వచ్చి పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా పోతే అప్పుడు ఈ పెట్టుబడులంతా జూదం అని నిర్ణయానికి వచ్చేస్తారు. లేదా ఇదంతా రిస్క్ అని ఈ ఊబిలో దిగకూడదని ప్రకటిస్తారు. 

డబ్బు సంపాదన ఒక ప్రారంభం. మనం సంపాదించిన డబ్బు కూడా డబ్బు సంపాదించడమే మన అసలైన ఆర్ధిక ఉన్నతి. అలాంటి మార్గాలను స్వానుభవపూర్వకంగా అన్వేషించి, వాటిలో పెట్టుబడి పెట్టి విజయవంతం అవడమే అసలైన ఆర్ధిక జ్ఞానం. అటువంటి అనుభవపూర్వక జ్ఞానాన్నే ఈ ప్రసంగంలో మనతో పంచుకున్నారు అలోక్ నంద ప్రసాద్ గారు. 

"మన పొరపాట్ల నుంచి నేర్చుకోవడం, మంచిది. ఇతరుల పొరపాట్లనుండి కూడా నేర్చుకోవడం మరీ మంచిది" అనే భావన తో ప్రసంగం మొదలు పెట్టిన అలోక్ గారు, వారి జీవితంలో ఆర్ధిక జ్ఞానం లేకపోవడం వల్ల జరిగిన ఎన్నో పొరపాట్లు గురించి చర్చించారు.
ఆరోగ్య బీమా ఉండి కూడా ఆర్ధిక జ్ఞానం లేకపోవడం వల్ల ఆసుపత్రి ఖర్చులు మొత్తం ఎలా ఖర్చు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు. సరైన ఆర్ధిక ప్రణాళికలు లేకపోవడం వల్ల జరిగిన పొరపాట్లు, తర్వాత వారు వేసుకున్న ఆర్ధిక ప్రణాళికలకు ఎలా బాటలు పరిచాయో పంచుకున్నారు. 

అనుభవం నుంచే జ్ఞానం వస్తుంది, ఆ అనుభవాలు గడించడానికి ఆయన ఏ విధమైన పరిశోధన, పరిశ్రమ చేశారో వివరించారు. ఈ ప్రసంగంలో అలోక్ గారు “ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి” అని నిర్దేశాత్మక సందేశాలు ఇవ్వక, పూర్తిగా “ఈ విధంగా చేశాను, ఆ విధంగా జరిగింది, కాబట్టి ఈ పాఠాలు తెలుసుకున్నా” అని వారి అనుభావాలను మాత్రమే  పంచుకున్నారు.

2016 నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి నేర్చుకున్న పాఠాలు, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి నేర్చుకున్న గుణపాఠాలు గురించి వివరించారు. 

మన ఆదాయాన్ని ఏ విధంగా పొదుపు, మదుపు చేయాలో, కరోనా లాంటి విపత్తులు వచ్చి ఉద్యోగం పోయినా, ఒక ఆరు నెలల వరకూ మన నిత్యావసరాలు అన్నీ సమకూరేలా అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలో, మనకు వచ్చే జీతాన్ని విభాగించి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలో ఈ ప్రసంగంలో వివరించారు.

ఈ ప్రసంగంలో అలోక్ గారు ఇచ్చిన ముఖ్యమైన సూచనలు :-

• జీవిత బీమా, ఆరోగ్య బీమా అంటే పెట్టుబడి కాదు, పరిరక్షణ. ప్రతి ఒక్కరూ తప్పకుండా వీటిని కలిగి ఉండాలి. 

• ఖర్చుల అదుపు, సంపద పొదుపు, మదుపు పట్ల ఖచ్చితమైన ఆర్ధిక క్రమశిక్షణ, ఆర్ధిక జ్ఞానం కలిగి ఉంటేనే కుటుంబ భవిత బాగుంటుంది. 

• ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉందో అంతకు మించిన ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడులని అన్వేషించి పెట్టుబడులు పెట్టాలి.

ప్రసంగం అనంతరం శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాటిలో కొన్ని ఆసక్తికర ప్రశ్నలు.

• బంగారం కొనుగోలు చేయడం మంచిదా లేక బంగారం బాండ్లపై పెట్టుబడి పెట్టడం మంచిదా ?

• అద్దె ఇంట్లో ఉండటం మెరుగా ? లేక అదే డబ్బుని ఒక స్వంత ఇంటికి EMI పద్దతిలో కట్టడం మెరుగా ?

• ఫిక్సడ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ మెరుగు అని అంటారు అసలు మ్యూచువల్ ఫండ్లు ఏ విధంగా పని చేస్తాయి? అత్యవసర సమయాల్లో వాటిని విత్డ్ డ్రా చేసుకోవచ్చా?

ఇలా ఆర్ధిక అంశాలకి సంబంధించి ఇంకా ఎంతో విలువైన, అనుభవపూర్వక సమాచారాన్ని మనకి ఈ ప్రసంగంలో అందించారు అలోక్ నంద ప్రసాద్ గారు. వారి పెట్టుబడుల ప్రయాణంలో వారికి బాగా ఉపయోగపడ్డ కొన్ని గొప్ప పుస్తకాలు, Zerodha Company వాళ్ళు ప్రచురించిన కొన్ని పుస్తకాల గురించి చెప్పారు. వాటి వివరాలు ని YouTube లో ఈ ప్రసంగం వీడియో description లో ఉంచుతాము.
మరి ఆర్ధిక ప్రగతిలో ఒక మొదలు చూపించి మనల్ని ఒక మెట్టు ఎక్కించే ఈ పూర్తి ప్రసంగాన్ని పైన YouTube Video లో చూసేయండి మరి. 

అలాగే అలోక నంద ప్రసాద్ గారు తెలుగు Quora లో 'పెట్టుబడుల బడి' వేదికలో రాసిన వ్యాసాలు ఇప్పుడు దాసుభాషితంలో 'ఆర్ధిక ఆరోగ్యం' పేరిట శ్రవణరూపంలో ఉన్నాయి. వాటిని కూడా సావధానంగా వినండి.

Tap to Listen

అభినందనలతో,

రామ్  కొత్తపల్లి.

Image Courtesy :