“దాసుభాషితం ప్రసంగాలు” కు శ్రీకారం.

Meena Yogeshwar
February 27, 2023

నెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత్యాలను పరిచయం చేసే అవకాశాన్ని దాసుభాషితం ఇలా కల్పించుకుంటుంది.

ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కాపీరైట్ లపై అవగాహన పెంచడానికి లైవ్ సెషన్ నిర్వహించిన సంగతి మీకు తెలుసు. దానికి వచ్చిన విశేష స్పందన స్ఫూర్తితో నెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత్యాలను పరిచయం చేసే అవకాశాన్ని దాసుభాషితం ఇలా కల్పించుకుంటుంది. ఇది సమాజానికి అవసరం కూడా.  ఉదాహరణకు, చిత్తూరు జిల్లా మంగళంపాడు అనే కుగ్రామంలో ఒక విశేషమైన వ్యక్తి ఉన్నారు. ఆయన తమిళులు. కానీ ఆయన తెలుగు మాట అతి స్వచ్ఛంగా ఉంటుంది. రెండు భాషలు మీద ఉన్న పట్టుతో ఆయన గోదా దేవి పాశురాలను తమిళం నుండి తెలుగుకు అనువదించారు. ఇప్పటికే  అనువాదాలున్నా ఇంతటి భాషా ప్రావీణ్యంతో చేసిన అనువాదాలు తక్కువ. ఆయన ప్రసంగం ద్వారా మనం పాశురాలలో ఉండే సంగీతం, కవిత్వం, తత్త్వాలను తులనాత్మకంగా తెలుసుకోవచ్చు. ఈ ప్రసంగం జూన్ / జులై నెలల్లో జరగవచ్చు.      

మొదటి దాసుభాషితం ప్రసంగం మార్చి 4వతేదీన జరగబోతోంది. పాడుతా తీయగా విజేత, జీ సరిగమప సెమీ ఫైనలిస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సంగీతంలో బంగారు పతకం అందుకున్న ప్రముఖ గాయని శ్రీ సౌజన్య మాడభూషి గారు ‘పాటే మంత్రము’ శీర్షకన సంగీతంపై ప్రసంగం ఇవ్వబోతున్నారు.

ఈ ప్రసంగాలు దాసుభాషితం కూటమి సభ్యులకు ప్రత్యేకం. వీరు మాత్రమే లైవ్ సెషన్ లో పాల్గొని ప్రశ్నలు అడగవచ్చు, వ్యాఖ్యలు చేయవచ్చు. ఆ తర్వాత వీటిని యూట్యూబ్ లో ఇతరులు చూడవచ్చు.

మీరు సర్వజ్ఞ ప్లాన్ గాని లైఫ్టైమ్ ప్లాన్ గాని తీసుకుని ఉంటే, మీరూ “దాసుభాషితం కూటమి” అనే వాట్సాప్ బృందంలో చేరవచ్చు. చేరదలిస్తే, మాకు జవాబు పంపండి. 

ఇక ఈ వారం విడుదలల విషయానికొస్తే…  

ఆత్మారామం

              

Tap To Listen

తెలుగు సాహిత్యంలో ఈ మధ్యన వస్తున్న మంచి పరిణామం ప్రవాస సాహిత్యం. వేరే దేశాల్లో ఉండే మన తెలుగు వారు రాసే కథలు, నవలలు, వ్యాసాల ద్వారా మన సాహిత్యానికి లోతు పెరుగుతోంది, పాఠకులకు విస్తృతి పెరుగుతోంది. ఇదివరిలో వంగూరి చిట్టెన్ రాజు గారి ‘అమెరికామెడి కథలు’, శ్యామల దశిక గారి ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’ వంటి మంచి పుస్తకాలను మీ ముందుకు తెచ్చాం. అవి మిమ్మల్ని అలరించడంలో మా అంచనాలు మించి పోయాయి. ఈసారి దాసుభాషితం మరో అద్భుతమైన పుస్తకాన్ని మీకు అందించబోతోంది.

ఏదైనా సాహిత్యం గొప్పది అని చెప్పడానికి కొందరు విమర్శకులు చెప్పే గీటురాయి ఏమిటంటే, ‘ఆ ఇది నేను కూడా రాయగలను, నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి’ అని సామాన్య పాఠకులు అనుకోవడమేనట. నిజానికి అలా అనిపించేలా రాయడం అన్నిటికన్నా కష్టమైనది. రాధిక గారి ఈ కథలు వింటే మనకీ అలానే అనిపిస్తుంది. మన జీవితాలలోని అనుభవాలను హృద్యంగా, హాస్యస్ఫోరకంగా చెప్పాలంటే ఎంతో ఒడుపు, నైపుణ్యం కావాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న రాధికగారి కథలు మంచి సాహిత్యం విన్నామనే తృప్తినిస్తాయి.

అమెరికాకు వలస వెళ్ళిన వారి జీవితాలలోని సరిగమలు-అపస్వరాలు, మనిషి జీవితంలోని ఎన్నో ఆటుపోట్లు-సరదా విషయాలు, ఇలా ఆమె కథలలోని ఇతివృత్తాల spectrum చాలా విస్తృతమైనది, లోతైనది. ఆమె శైలి కూడా నదిలా ప్రవహించే లక్షణం కలది. వాటన్నిటినీ తన గాత్ర సహాయంతో మన కళ్ళెదురుగా జరిగాయా అన్నట్టు చూపగల సత్తా కూడా ఆమె స్వంతం. వెరసి, ఈ వారం విడుదలయ్యే రాధిక గారి కథల సంపుటి ‘ఆత్మారామం’ మిమ్మల్ని roller coaster ride లో తిప్పుతుంది అనడం సమంజసం. ముఖ్యంగా సంపుటి పేరుగా పెట్టబడ్డ కథ మాత్రం మనల్ని నవ్విస్తూనే, ఆలోచింపజేస్తుంది. సరే, కథలు చెప్పడానికి రాధిక గారు రెడీ, మరి వినడానికి మీరు?

వెండితెర - 2

Tap To Listen

‘సినిమాని సినిమాలా చూడాలే తప్ప, అవి చూపే ప్రభావాల గురించి మాట్లాడడం అనవసరం, సినిమా ఎవరినీ మార్చదు’ అనేవారు కొందరు. ‘సమాజంలో నుండే సినిమా పుడుతుంది, తిరిగి ఆ సమాజాన్నే అది ప్రభావితం చేస్తుంది’ అనేవారు కొందరు. ఇందులో ఏది నిజం అంటే, కొంతమేరకు రెండూ. మారదలచుకున్నవారు ఖచ్చితంగా మారతారు, వారికి సరైన కాంటెంట్ దొరికితే. మారకూడదు అనుకున్నవారిని ఏం చేసినా మార్చలేం. ఒకటైతే నిజం సినిమా మాత్రం మన సంస్కృతిలో భాగమైపోయింది. విడదీయరాని అవినాభావ సంబంధాన్ని ఏర్పరుచుకుంది మన తెలుగు జాతితో.

చూడవలసిన సినిమాల విశ్లేషణలతో కోరా భాగస్వామ్యంతో మనం తయారు చేసుకున్న వెండితెర మూడవసారి మీ ముందుకు రాబోతోంది. ఈసారి ప్రముఖ కోరన్లు సూరంపూడి పవన్ సంతోష్, అలోక్ నంద ప్రసాద్, రామ్ కొత్తపల్లి గార్లు మంచి మంచి సినిమాల గురించి చేసిన విశ్లేషణలను వినండి. మీకు కొంత లీక్ చేసేస్తున్నాను.. ఇందులో మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి నోట్లోకి లడ్డూలు ఎలా ఎగిరాయో, ప్లేట్లు ఎలా ఖాళీ అయ్యాయో తెలుసుకోవచ్చు. ఆ వింతలు చూద్దాం పదండి, పదండి..

తమోషి - విశ్లేషణ

Tap To Listen

‘బిడ్డను చంపిన కన్నతల్లి’, ‘యువతి అత్యాచారం’ ఇలాంటి వార్తలు మనం రోజూ పేపర్లలో చదువుతూనే ఉంటాం. ఇలాంటి ఉదంతాలు పత్రికలలో ఒక చిన్న మూల పడే వార్తలుగా మారి చాలాకాలం అయింది. వీటిని చదువుతాం, ఒక్క నిమిషం బాధపడతాం, వదిలేసి వేరే వార్తకు వెళ్ళిపోతాం. ఇక ఈ డిజిటల్ కాలంలో అయితే మరీ దారుణంగా క్లిక్ బైట్ లుగా మారిపోయాయి ఈ దారుణాలు.కానీ అత్యాచారానికి గురైన ఒక స్త్రీ మానసిక స్థితి ఏమవుతుంది? ఎన్నాళ్ళకు ఆమె కోలుకుంటుంది? అసలు కోలుకుంటుందా, జీవితాంతం ఆమె పరిస్థితి అంతేనా? ఆమె కుటుంబసభ్యులు ఎలా స్పందిస్తారు? ఆమెకు ఆ ఇంట్లో స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలు కొందరిని మాత్రమే వెంటాడతాయి. వారిలో కొందరు మాత్రమే తాము ఏం చేయగలం అని ఆలోచిస్తారు. అలా ఆలోచించిన వారిలో కొద్దిమంది మాత్రమే ఏదో ఒక మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తారు.బెంగాలీ రచయిత జరాసంధ రాసిన నవల ‘తమోషి’ అంటే ఖైదీ అని అర్ధం. ఈ నవలలోని కథానాయిక అత్యాచార సంఘటన తాలుకూ గాయంలో మాత్రమే కాక, ఆ బాధలో ఆమె చేసిన తప్పు వలన కారాగారంలో కూడా జీవితాంతం ఖైదీగా ఉండిపోతుంది. అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అలా జరగడం వలన ఆమె జీవితం ఎలా మారింది అనేది ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన విశ్లేషణలో వినండి. మన చుట్టూ ఎందరు ఈ పరిస్థితుల్లో అల్లాడుతున్నారో అని కంగారుతో కూడిన బాధ మనందరిలోనూ కలగక మానదు.

అభినందనలతో,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :