అప్పుడే మీరు వెళ్ళిపోయి రెండు నెలలు అయిపోతోంది. ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు నాన్నగారూ. ఇంకా మీరు తాడేపల్లిగూడెంలోనో ఎక్కడో ఉన్నారేమో, ఇహనో ఇప్పుడే ఇంటికి వచ్చేస్తారేమో అనే అనిపిస్తోంది. సర్ ప్రైజ్ గా మా ఇంటి గుమ్మంలో నుంచుని కాళ్ళు కడుక్కుంటూ ‘ఎలా ఉన్నావే బంగారూ’ అని పిలుస్తారేమో అని గుమ్మం వైపే చూస్తున్నాను. ‘మర్యాద చేయవా చిన్నీ నాకు’ అని indirect గా green tea అడుగితే బాగుణ్ణు అని కోరుకుంటున్నాను. ‘ఎలా చేస్తావే ఇంత బాగా. నీలాగా షాప్ లో వాళ్ళు కూడా గ్రీన్ టీ పెట్టలేరు అమ్మా. నీ చేతిలో ఏదో మహత్యం ఉంది’ అని పొగుడుతారేమో అని ఎదురుచూస్తున్నాను. ‘ఇదిగో నీకిష్టమని జాంపళ్ళు, తేగలు, జొన్నపొత్తులు తెచ్చాను. అన్నీ పదునుగా ఉండాలి మా బంగారానికి. ఏ మాత్రం ముదిరినా తినదు’ అని నా ఇష్టాఇష్టాలు లెక్కేస్తారేమో అని వేచి ఉన్నాను.
అన్నయ్యా, అక్కా మిమ్మల్ని గూడెం వెళ్ళనివ్వట్లేదు, విశ్రాంతి తీసుకోమంటున్నారని నాతో complaint చేస్తారేమో ‘వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా నాన్నగారూ, మీరేమైనా చిన్నపిల్లాడా? ఎండా వానకి భయపడకపోతే ఎలా. పాపం వాళ్ళు చెప్పేది కూడా మీ గురించే గానీ మిమ్మల్ని వెళ్ళనివ్వకపోతే వాళ్ళకి ఏం వస్తుంది’ అని మీ దగ్గర వాళ్ళని వెనకేసుకురావాలన్నా ఇప్పుడు ఆ అవసరం లేదు. ‘పోనీలేరా. ఇన్నాళ్ళూ ఉద్యోగాల పరుగులో ఆయన ఇష్టాలు తగ్గించుకున్నారు. Retirement life ని ఎంజాయ్ చేయనివ్వండి. జాగ్రత్తగా వెళ్ళొస్తారులే. నేను చెప్తాను ఆయనకి’ అని అక్క, అన్నయ్యల దగ్గర మిమ్మల్ని వెనకేసుకురావాలన్నా ఇక కుదరదు. ‘పోనీలేమ్మా సైకిల్ మీద తిరిగితే అది కూడా వ్యాయాయమే. ఆయనకి నచ్చింది చేయనీ’ అని అమ్మకి సర్దిచెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా ‘నా ఇష్టాలు, నా ఆలోచనలు బాగా అర్ధం చేసుకున్నది చిన్నోడేనే. అదే నా party. మీ అందరూ ఒక పార్టీ’ అని ఇక అనరు కదా నాన్నగారూ.
‘నేను వెళ్ళను స్కూలుకి. నాకు స్కూలు నచ్చలేదు. నన్ను పంపకండి. ఇలాగే నన్ను బలవంతంగా లాక్కెళ్తే మిమ్మల్ని వెధవ అనేస్తాను నాన్నగారూ’ అని మూడోక్లాసు మీనా అన్నప్పుడు నవ్వేసి ‘నువ్వు చదువుకోవడం ముఖ్యం కానీ నన్ను వెధవా అని పిలిచినా నాకేం ఫరవాలేదు’ అన్న మీ నవ్వు మళ్ళీ చూడగలనా నాన్నగారూ. ‘మిమ్మల్ని నాన్నగారూ అనే ఎందుకు పిలవాలి? అమ్మని అమ్మగారూ అని పిలవట్లేదు కదా. మిమ్మల్ని కూడా నాన్న అనే పిలుస్తాను నాన్నగారూ’ అని అడిగిన నా వంక సరదాగా చూస్తూ ‘పిలువు బంగారం. నువ్వెలా పిలిచినా పలుకుతాను’ అంటే ‘అన్నం తిందామా నాన్నా, నాన్నగారూ’ అంటే పగలబడి నవ్విన ఆ నవ్వు మళ్ళీ నాకు కనపడదుగా.
‘జుట్టు అలా వదిలేసుకున్నావేమ్మా చంటిపాపాయి. రా పిలక వేస్తాను’ అంటూ మిమ్మల్ని పాపాయిని చేసి ఆడుకుంటుంటే, నా చేత పిలక వేయించుకుని, నోట్లో వేలేసుకుని చిన్నపిల్లాడిలా అల్లరి చేసినట్టు నటించిన మిమ్మల్ని ఎప్పటికీ చూడలేనుగా. ‘అమ్మో తల్లో ఎన్ని పేలు ఉన్నాయో. ఉండు ఉండు అలాగే ఉండు పైన ఓ పేను పాకుతోంది’ అంటూ బలవంతంగా కూర్చోబెట్టి నా తల బాగు చేసిన మీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది. సంక్రాంతికి ప్రతీ ఏడూ మీకు నలుగుపెట్టి స్నానం చేయిస్తోంటే ‘మా అమ్మ కన్నా, మీ అమ్మ కన్నా నువ్వే బాగా తలంటుతావే నాకు. కళ్ళల్లోకి కుంకుడుకాయ రసం అస్సలు వెళ్ళదు. ఏం చేసినా తీరువుగా చేస్తుంది నా బంగారం’ అన్న ఆ క్షణాలు తిరిగిరావుగా. ‘నాది మా నాన్నగారి పోలిక. మా నాన్నగారి జుట్టులా నాది కూడా నల్లగా, silkyగా ఉంటుంది’ అని నేను గర్వంగా చెప్పుకుంటోంటే మీ కళ్ళల్లో ఆనందం మళ్ళీ చూడగలనా?
అక్క, అన్నయ్య అమ్మమ్మ దగ్గర పెరిగేటప్పుడు స్కూలుకు కూడా వెళ్ళని అతి చిన్న వయసులో ఒక రెండేళ్ళు నేను ఒక్కదాన్నే మీ దగ్గర పెరిగాను. నేను మీ ఇద్దరిలో ఎవరి దగ్గర నిద్రపోతానో అని మీలో మీరు పందేలు వేసుకునేవారు గుర్తుందా నాన్నగారూ. ఏదో అల్లరి చేశానని నెమ్మదిగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని, కనపడకుండా పిక్క పాశం పెట్టారు. నేను ఏడుస్తోంటే నా ఏడుపు చూసి మీరు కూడా బాధపడిపోయారు గుర్తుందా? రోజూ నా కోసం మీ స్కూల్లో ఉండే బాదం చెట్టు నుండి బాదం కాయ తెచ్చేవారు గుర్తుందా? అక్షరాభ్యాసం కూడా అవ్వని నన్ను మీ క్లాసులో కూర్చోబెట్టుకునేవారు గుర్తిందా? నేను మల్లెపువ్వు, బలపం ముక్కులో పెట్టేసుకుంటే నన్ను తిరగేసి వీపు పై కొడుతూ వాటిని బయటకి లాగారు గుర్తుందా?
‘అమ్మో, నాకు స్వీట్లు వద్దమ్మా. నేను ఇంకా చాలా ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మీ పిల్లల్ని, అన్నయ్య పిల్లల్నీ కూడా ఆడించాలి. ఎంత ఆరోగ్యంగా ఉంటే, వాళ్ళని అంత బాగా చూసుకోగలను’ అన్నారు కదా నాన్నగారూ, కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నా సమయం అయిపోతే ఏదో ఒక మిషతో క్షణంలో లాక్కుపోగలను అని దేవుడు నిరూపించుకున్నాడు. మీ discipline, మీ ఆరోగ్యంపై జాగ్రత్త ఏవీ మిమ్మల్ని మాకు మిగల్చలేదు. ఇంత నిక్కచ్చిగా తీసుకుపోగల దేవుడు, అన్నీ చేయగలను, అన్నింటా నేనే ఉన్నాను అనే దేవుడు, తీసుకుపోయిన మనిషిని తిరిగి అదే రూపంలో ఒక్క క్షణం కూడా మాకు చూపించలేడుగా. అలాంటప్పుడు అన్నీ చేయగల సమర్ధుడు ఎలా అయ్యాడు ఆ దేవుడు?
విచిత్రం ఏమిటో తెలుసా నాన్నగారూ, ఇంత దారుణంగా మిమ్మల్ని మా నుండి అన్యాయంగా లాక్కుపోయిన ఆ దేవుణ్ణే ‘తిరిగి మా నాన్నగారు నాకు బిడ్డగా వచ్చేలా చూడు’ అని నేను రోజూ పూజలు చేస్తున్నాను. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేం ఉంటుంది.
విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ పద్యంలో ఇలా అన్నారు:
నా కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తుకలను కోసి నన్నడిగె న-తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ”
నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి – ప్రాణములు నిల్వునం దీసి యడిగె నను న -తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి
”కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు కుత్తుక నులిమి తా నను నడిగె ,న -తండు ”నే దయాంబుధి ని కాదా ”యటంచు -ఓ ప్రభూ !నీవ య0టి నే నొదిగి పోయి
ఇది మొదటిసారి చదివినప్పుడు వెళ్ళిపోయిన తనవారి కోసం బాధపడుతున్నారు విశ్వనాథ అనుకున్నానే కానీ ఆ బాధలోని లోతు, ఆ నిస్సహాయత, తిరిగి ఆ మోసకారి దేవుణ్ణే నమ్ముకునే మానవ నైజం ఇప్పుడే అర్ధం అవుతోంది. నన్ను తండ్రి లేని బిడ్డని చేసిన దేవుణ్ణే, నన్ను తల్లిని చెయ్యమని కోరుకోవడం ఎంత bizzare గా ఉందో నాన్నగారూ.
నాకు అపండిసైటిస్ ఆపరేషన్ అయినా, కాలు విరిగినా, గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయినా నా నొప్పి గురించి నాకు ఎక్కువ బాధ ఉండేది కాదు నాన్నగారూ. అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు అని అమ్మ బాధపడుతుంది కదా. అమ్మ చేత మంచం మీద ఉండి అన్ని సేవలూ చేయించుకోవాల్సి వస్తుంది కదా. నాన్నగారు నా బాధ చూసి దుఃఖిస్తారు కదా. ఇప్పుడు నా వల్ల నాన్నగారికి extra ఖర్చు పెరిగింది కదా అనే బాధపడేదాన్ని నాన్నగారూ. మీరంటే అంత అపురూపం నాకు. కానీ అది మీకు నేరుగా చెప్పగలిగానో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఈ లేఖ ద్వారా అయినా చెప్పాలనిపించింది.
ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే మీరు, నా అప్పగింతల్లో నా కోసం ఏడిస్తే ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా నాన్నగారూ. నేనంటే నాన్నగారికి ఇంత ఇష్టమా? బామ్మ చనిపోయినప్పుడు తప్ప ఎప్పుడూ కంటనీరు పెట్టని మనిషి నాకోసం ఏడ్చారా అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అలాంటి మిమ్మల్ని మృత్యువు కబళిస్తున్న ఆ అఖరి క్షణంలో ‘నా చిన్నోడు ఎలా ఉంటాడో’ అని ఒక కన్నీరు బొట్టు కార్చారేమో అని నా మనసు పరి పరి విధాల పోతోంది.
మీరు ఇక మాకు లేరు అని నమ్మడానికి మించి నా జీవితంలో జరిగిన అతిపెద్ద tragedy మరేమీ లేదు. మీ absence ని ఒప్పుకోవడం అంటే నా జీవితానికి నేను చేసుకునే ద్రోహంలా అనిపిస్తోంది. అలా ఎలా ఈ అన్యాయాన్ని ఒప్పుకుంటావు అని నా మనసు ఎదురు తిరుగుతోంది.
మనిద్దరం తండ్రీ కూతుళ్ళమే కాదు, గురు శిష్యులము, కొలీగ్స్ కూడా. మీ దగ్గర ఆరేళ్ళ పాటు టైపిస్ట్ గా పనిచేసాను నేను. ఒక పదాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో మీ దగ్గరే నేర్చుకున్నాను. ఒక ప్రెస్ నోట్ ను వార్తగా ఎలా మలచాలో మీరు నాకు నేర్పించారు. శీర్షిక ఎలా పెట్టాలి? ఎత్తుగడ అంటే ఏమిటి? లీడ్ అంటే ఏమిటి? హుక్ అంటే ఏమిటి? వార్త రాసేటప్పుడు పేరు వెనుక గారు ఎందుకు పెట్టకూడదు? చేశారు, నిర్వహించారు, జరిపారు వంటివి ఒకే రకమైన పదాలైనా ఏవి ఎక్కడ వాడాలి ఇలా సవాలక్ష నేర్చుకున్నాను మీ దగ్గర.
చిన్నప్పుడు నాకు ఓనమాలు నేర్పిన మీరు, వ్యాసం రాయడంలో కూడా ఓనమాలు నేర్పారు. అయితే, మీరు వెళ్ళిపోయిన రెండు నెలల తరువాత మొదటిసారి ఈ న్యూస్ లెటర్ రాస్తున్న నాకు ప్రతీ అక్షరం, ప్రతీ పదం అతి కష్టం మీదే వస్తోంది. నాలోంచి ఒకో అక్షరం రావాలంటే ప్రసవవేదనలా ఉంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు తిరిగి నాకు అక్షరాభ్యాసం చేసుకున్నట్టు ఉంది. మీ నుంచి వచ్చిన ఎన్నో మంచి లక్షణాల్లో సమాజానికి, ఆత్మసంతృప్తికి, జీవికకీ అతి ముఖ్యమైన నా రచనా వ్యాసంగాన్ని పైనుంచీ మీరే కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నాన్నగారూ. మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినట్టు, నా చేయి కూడా వదిలేయరు కదా..!?
మీరు ఎప్పుడూ ఒక విషయం చెప్తుండేవారు. ‘నువ్వు ఏడాదిన్నర పిల్లవి. అప్పుడే నడక, మాట నేర్చుకున్నావు. బామ్మకి తీవ్ర అనారోగ్యం చేస్తే, నేనూ అమ్మా హైదరాబాదులో వైద్యం చేయించడానికి ఒక నెల కోసం వెళ్ళాం. నువ్వు, అన్నయ్య, అక్క అమ్మమ్మ దగ్గర భీమవరంలో ఉండేవారు. అన్నయ్య పెద్దవాడు కాస్త అర్ధం చేసుకున్నాడు. అక్క ఊహ అప్పుడే తెలిసిన వయసు. మా కోసం మారాం చేస్తే, పెద్దనాన్న తీసుకువచ్చి మా దగ్గర దింపాడు. మాకే జాగా లేని చోట అక్కని పెట్టుకుని ఉన్నాం. నువ్వు చాలా ఓపిగ్గా అమ్మమ్మ దగ్గర ఉన్నావు. కానీ మేము హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన రోజు గేటులో మమ్మల్ని చూసి, ఒక కాలు ఎగరేసుకుంటూ, వచ్చీరాని అడుగులతో, నాన్నాలూ-అమ్మా అంటూ పరుగెత్తుకుని వచ్చి నా కాళ్ళు చుట్టేసుకున్నావు. అంత చిన్న వయసులో నువ్వు చూపించిన ఓపిక, దాచుకున్న ప్రేమ చూసి కన్నీళ్ళు ఆగలేదు’ అని చెప్పేవారు.
ఇప్పుడు అంతే ఓపిగ్గా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నాలో నేను బాధపడుతున్నాను నాన్నగారూ. అప్పుడు వచ్చినట్టే ఇప్పుడు కూడా నా మీద జాలి, ప్రేమ చూపించి నా దగ్గరకి తిరిగి వచ్చేయండి నాన్నగారూ..
ప్రేమతో,
మీ చిన్ని.
నోట్: వెంకటరమణ గారి మరణం గురించి ఇదివరిలోనే పవన్ న్యూస్ లెటర్ రాశారు. మరలా ఇంకోసారి ఈ న్యూస్ లెటర్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ నా బాధని పంచుకోవడానికి నా కుటుంబం తరువాత నాకు ఇంకెవరున్నారు మీరు తప్ప. ఇన్నాళ్ళూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేకపోవడానికి కారణం కూడా ఈ న్యూస్ లెటర్ ద్వారా తెలియజేయవచ్చు అనే ఉద్దేశ్యంతో రాశాను. మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.