సరసి తో సరదాగా…

Ram Kottapalli
May 8, 2023

కార్టూన్ కొన్ని దశాబ్ధాలుగా సమాజ పరిస్థితులను ఒక్క బొమ్మలో పట్టి చూపే చిత్ర కళగా అభివృద్ది చెందింది. ఎంతో క్లిష్టమైన విషయాలను ఎంతో తేలిగ్గా కార్టూన్ బొమ్మల్లో వివరించేస్తారు కార్టూనిస్ట్ లు . కార్టూనులు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, మనసుని హత్తుకుంటాయి, కొంతమందికి కోపమూ తెప్పిస్తాయి, మనోభావాలు దెబ్బతీస్తాయి, మనసుని ద్రవింపజేసి కన్నీళ్ళు తెప్పిస్తాయి. భవసాగరమైన ఈ జీవితాన్ని...

కార్టూన్ కొన్ని దశాబ్ధాలుగా సమాజ పరిస్థితులను ఒక్క బొమ్మలో పట్టి చూపే చిత్ర కళగా అభివృద్ది చెందింది. ఎంతో క్లిష్టమైన విషయాలను ఎంతో తేలిగ్గా కార్టూన్ బొమ్మల్లో వివరించేస్తారు కార్టూనిస్ట్ లు . కార్టూనులు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, మనసుని హత్తుకుంటాయి, కొంతమందికి కోపమూ తెప్పిస్తాయి, మనోభావాలు దెబ్బతీస్తాయి, మనసుని ద్రవింపజేసి కన్నేళ్ళు తెప్పిస్తాయి. భవసాగరమైన ఈ జీవితాన్ని ఈదుతూ అందులో ఉన్న ఎన్నో సందర్భాలను, సమాజంలోని ఎన్నో పరిస్థితులను ఒక్క చుక్కలోనే కార్టూన్ రూపంలో మనకి ధారబోయడం కార్టూనిస్ట్ లకే చెల్లింది.

అలా మనం గర్వించదగ్గ కార్టూనిస్టులు తెలుగునాట కూడా ఎందరో ఉన్నారు. వారిలో సరసి గారు ఒకరు. సరసి గారితో మే 06, 2023న దాసుభాషితం నిర్వహించిన ప్రసంగంలో వారు గీసిన కార్టూన్ల గురించి, వాటి వెనక ఉన్న కథల గురించి, ఆ కార్టూన్లు పుట్టిన సందర్భాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ఈ సందర్భంగా వారు గీసిన కొన్ని వేలాది కార్టూన్లలో మచ్చుకకి ఒక 20 కార్టూన్లు చూపగా, వాటిపై ఎంతో ఆసక్తికర వ్యాఖ్యానాలు జరిగాయి. కార్టూన్ అంటే కేవలం నవ్వించేదే కాదు మనసుకి హత్తుకుని ఆలోచింపచేసేది కూడా అన్న విషయం వారి కార్టూన్లలో ఎంతో ప్రస్పుటంగా కనిపించింది. 

అలాంటి ఒక కార్టూన్ ఈ విధంగా ఉంది : ఒక ఇల్లాలు ఇంటి వాకిలిని శుభ్రం చేస్తూ ఉంటుంది, భర్త హల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, ఆ సమయంలో ఒక యాచకుడు వచ్చి భిక్ష కోసం అమ్మా అని పిలవగా ఆమె వెళ్ళు బాబూ వెళ్ళు అంటుంది. అప్పుడు ఆమె భర్త “పిల్లలెలాగూ స్టేట్స్ నుంచి రారు, వాడొక్కడే నిన్ను నోరార అమ్మా అని పిలిచేది. వాడిని కూడా దూరం చేసుకుంటావు ఎందుకు ?“ అంటాడు. ఇక్కడ వివరణ పెద్దగా ఉన్నా కార్టూన్ మాత్రం దృశ్యరూపంలో హావభావాలతో చూడగానే నేరుగా మనసుకి గుచ్చుకునేట్లు ఉంటుంది. 

ఇలాంటి కొన్ని ఆసక్తికర సంభాషణలతో పాటు మంచి ప్రశ్నోత్తరాలు కూడా జరిగాయి. 

కార్టూన్లు కళా రూపాలా? కార్టూన్లలో రకాలు, కార్టూన్ల వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ? ఒక కార్టూనిస్ట్ కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి ? మీకు బాగా నచ్చిన వర్ధమాన కార్టూనిస్ట్ మరియూ యువ కార్టూనిస్టులు ఎవరు ? మీ కార్టూనిస్ట్ కెరీర్ లో గొప్ప గౌరవం ఆనందం కలిగిన ఒక సంధర్భం గురించి తెలియజేస్తారా ? సుప్రసిద్ద ఆర్టిస్ట్ బాపు గారికి మీకు ఉన్న అనుబంధం, వారితో మీకు ఉన్న అనుభవాలు తెలియజేస్తారా ? వంటి ప్రశ్నలకీ చాలా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. బాపు గారికి వారికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సందర్భాలు, వారి మొదటి కార్టూన్ పుస్తకానికి బాపు గారు వేసిన కవర్ పేజీ మళ్ళీ మళ్ళీ నాలుగుసార్లు మార్పులు చేసి ఎలా ఇచ్చారో చెప్పారు.

కార్టూన్లు వలన సమాజానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక నిజ జీవిత సందర్భం వివరించి చెప్పారు. ఓసారి సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకుగాను, ఒక విదేశీ కార్ల సంస్థ ఆయనకు కోట్ల రూపాయల విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చింది. ఆ కారును భారతదేశానికి తీసుకురావడానికి కోటి రూపాయల పైనే ఇంపోర్ట్ టాక్స్ కట్టాలి. సచిన్ టెండుల్కర్ భారత ప్రభుత్వానికి ఆ పన్నుని ఉపసంహరించాల్సిందిగా అభ్యర్ధన పెట్టుకోవడం, అందుకు భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. 

ఈ విషయంపై ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్. కే. లక్ష్మణ్ ఒక ఘాటైన కార్టూన్ వేయగా భారత ప్రభుత్వం నాలిక కరుచుకుని  టాక్స్ ఉపసంహరణని రద్దు చేస్తూ భారత పౌరలకు అందరికీ లాగానే సచిన్ కూడా టాక్స్ కట్టాలి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా కార్టూన్లు భారత రాజకీయాలలో, ప్రభుత్వ అధికారులలో మార్పుని తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని సరసి గారు అన్నారు. 

ఇంకా సరసి గారి అనుభవాలతో, వారి సమాధానాలతో సరాదాగా జరిగిన ఈ పూర్తి ప్రసంగం పైన వీడియో లో చూడవచ్చు.  

అభినందనలతో,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :