ఇది సాహితీ సేవ కాదు. ద్రోహం.

Meena Yogeshwar
February 11, 2023

మనం రోజూ టెలీగ్రాం యాప్ లోనూ, ఈ మెయిల్స్ లోనూ, యూట్యూబ్ లోనూ ఎన్నో పుస్తకాల పీడీఎఫ్ లు, ఆడియోలూ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ప్రింటింగ్ లో ఉండి, డిమాండ్ లో ఉన్న పుస్తకాలు ఉచితంగా దొరుకుతుంటాయి. మనం కూడా ఒకోసారి పెద్దగా ఆలోచించకుండా వాటిని చదవడమో, వినడమో, వేరే వారికి పంపడమో చేస్తుంటాం. కానీ, అలాంటి పనుల వల్ల రచయిత కోల్పోయేది ...

మనం రోజూ టెలీగ్రాం యాప్ లోనూ, ఈ మెయిల్స్ లోనూ, యూట్యూబ్ లోనూ ఎన్నో పుస్తకాల పీడీఎఫ్ లు, ఆడియోలూ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ప్రింటింగ్ లో ఉండి, డిమాండ్ లో ఉన్న పుస్తకాలు ఉచితంగా దొరుకుతుంటాయి. మనం కూడా ఒకోసారి పెద్దగా ఆలోచించకుండా వాటిని చదవడమో, వినడమో, వేరే వారికి పంపడమో చేస్తుంటాం. కానీ, అలాంటి పనుల వల్ల రచయిత కోల్పోయేది ఎంత ఉంటుందో తెలుసా? డబ్బులు మాత్రమే కాదు, మార్కెట్ లో వాళ్ళ పుస్తకాలకు డిమాండ్ మాత్రమే కాదు, మనశ్శాంతి కోల్పోతారు. రాయాలన్న ఉత్సాహాన్ని కోల్పోతారు. ఇలా దొంగతనంగా తమ పుస్తకాలను ఉచితంగా పంచిపెట్టే వాళ్ళతో చేసే యుద్ధాల వల్ల సృజనాత్మకత కోల్పోతారు. ఒక రచయిత రాయడం మానేస్తే, వారికి వచ్చే నష్టం కన్నా, ఒక పబ్లిషర్ కు వచ్చే నష్టం కన్నా, పాఠకులుగా మనకి వచ్చే నష్టమే ఎక్కువ.

ఫిబ్రవరి 6వ తేదీన దాసుభాషితం నిర్వహించిన రచయితల కాపీహక్కుల అవగాహనా సదస్సులో ప్రముఖ రచయిత, మనందరికీ ఎంతో ఇష్టుడైన షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు గారు పడిన ఆవేదన మా అందరికీ కన్నీళ్ళు తెప్పించింది. 300కి పైగా పుస్తకాలు రాసిన ఆయన, నేనే మధుబాబుని అని ఒక గ్రంధచోరుడికి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన మనసుకు తగిలిన గాయం వల్ల పాఠకులుగా మనం చాలా పుస్తకాలు కోల్పోయాం. ఇంతకన్నా ఈ అన్యాయం గురించి వివరించలేం. పై వీడియోలో మీరే ఆయన ఆవేదనను కళ్ళారా చూడండి. మనసు ద్రవిస్తుంది.

అయితే, మధుబాబు గారు తన ఆవేదనను అందరికీ వివరించాకా, ప్రముఖ వికీపీడియన్ కృపాల్ కశ్యప్ ఈ విధంగా మేసేజ్ చేశారు.

“ నేను ఇదివరకూ మీ పుస్తకాన్ని టెలీగ్రాం యాప్ లో చూసి, నా స్నేహితులు కొందరికి షేర్ చేశాను. కానీ అదెంత తప్పో ఇప్పుడు తెలిసింది. మధుబాబు గారూ నన్ను క్షమించండి.” నిజానికి ఆయన అంత నిజాయితీపరులు కాబట్టీ, అలా ఒప్పుకున్నారు.

మన రచయితలకు తమకుండే కాపీహక్కులపై పూర్తి అవగాహన ఉండడం లేదు. దానివల్ల వారి సృజనాత్మకతను నలుగురికీ పంచడంలోనూ, తాము కాస్త సంపాదించుకోవడంలోనూ ఎంతగానో నష్టపోతున్నారు. అందుకే రచయితలను గౌరవించే ఒక సంస్థగా దాసుభాషితం వారికి తమ కాపీహక్కులపై అవగాహన కల్పించడానికి పూనుకుంది. 

వికీపీడియా, కోరా వంటి సంస్థలలో కాపీహక్కుల పరిరక్షణపై పని చేసిన అనుభవం కలిగిన సూరంపూడి పవన్ సంతోష్ ముఖ్యవక్తగా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఒక రచన విషయంలో రచయితకు ప్రింట్, ఆడియో, వీడియో, అనువాదం ఇలా ఎన్నో పద్ధతులలో తమ రచనను పబ్లిష్ చేయగల హక్కు ఉంటుందని తెలిపారు. రచయిత బ్రతికి ఉన్నంతకాలం వారి వద్ద, అలాగే వారు చనిపోయిన 60 సంవత్సరాల వరకూ వారి వారసుల వద్ద ఈ కాపీహక్కులు ఉంటాయని తెలిపారు. అయితే, ఒకవేళ రచయిత మరణించిన తరువాత, ఒక రచన ముద్రణకు నోచుకుంటే, అలా ముద్రించబడిన 60 సంవత్సరాల వరకూ రచయిత వారసులకు ఆ కాపీహక్కు ఉంటుందని వివరించారు. భారతీయ చట్టాల ప్రకారం ఒక రచన ఆ రచయిత పేరు మీద పబ్లిష్ అయిన వెంటనే వారికి కాపీహక్కులు వర్తిస్తాయని, అగ్రిమెంట్ లో రాసుకుంటే తప్ప, పబ్లిషర్ కు సర్వహక్కులూ వెళ్ళవని తెలిపారు.

ఒకప్పుడు పుస్తకంగా పబ్లిషింగ్ మాత్రమే ఉండేది, అలాగే సినిమాలకు కథలను తీసుకునేవారు, తరువాత ఈ-బుక్ వచ్చింది, ఆడియో బుక్ వచ్చింది, వెబ్ సిరీస్ లు కథలను తీసుకుంటున్నాయి. ఇలా ఒక రచన ఎన్నో విధాలుగా వినియోగదారులకు చేరుతోంది. ఏమో రేపు Virtual Reality ద్వారా కూడా ఒక రచనను అనుభూతి చెందవచ్చు. వీటన్నిటికీ విడి విడిగా కాపీహక్కులు రచయిత వద్దే ఉంటాయి. వాటిని గంపగుత్తగా ఒకరికి రాయడం అన్నది కరెక్ట్ కాదు అని వివరించారు దాసుభాషితం సహవ్యవస్థాపకులు, సి.ఈ.వో కిరణ్ కుమార్. అలా రాయడం వల్ల రచయిత ఎంతో ఆదాయాన్నే కాక, Reach ను కూడా నష్టపోతారని చెప్పారు. అందుకే మేము డబ్బులు ఇచ్చి రాయించుకునే రచనలకు కాకుండా, ఏ ఇతర పుస్తకాలకూ Solo Rights తీసుకోకూడదని, అలాగే రచయితకు ఆదాయంలో 50శాతం వాటా ఇవ్వాలని, దాసుభాషితం పెట్టినప్పుడే సంస్థాగత నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ న్యాయ సలహాదారు షణ్ముఖ తేజ కాపీహక్కులపై న్యాయపరమైన అవగాహనను అందించారు. నిజానికి ఒక రచన ప్రింట్ అయిన వెంటనే రచయితకు కాపీహక్కులు వచ్చేస్తాయి కానీ, రచయిత తన రచనలను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా, తమ కాపీహక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వాటి పరిరక్షణ కోసం కోర్టు లావాదేవీలు సులభతరం అవుతాయని తెలిపారు. రచయితలు తమ ప్రచురణ సంస్థలతో రాసుకునే అగ్రిమెంట్లు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని వివరించారు తేజ. 

మధుబాబు, మల్లికార్జున్, శ్రీసుధామయి, కల్లూరి భాస్కరం వంటి దిగ్గజ రచయిలతో పాటు, ఈతరం రచయితలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈ పూర్తి వీడియోను ఈ కింద ఉన్న యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు. 

                                                        

శాశ్వత యోగనిద్రకు చేరిన కళా తపస్వికి నీరాజనాలు

దర్శకునికి సినిమాలో ఉపయోగపడే ప్రతీ రంగంపైనా, ఎంతో కొంత అవగాహన ఉండాలి అంటారు సినీ విమర్శకులు. అలాంటివారు తక్కువే అని చెప్పాలి. కానీ కాశీనాధుని విశ్వనాధ్ మాత్రం సినిమాను ఒక కళగా ఎలా చూపించాలి, సినిమాలో కళలను ఎలా చూపించాలి అనే విషయాన్ని అన్ని రంగాల సాయంతో నిరూపించగల సత్తా కల దర్శకుడు. ఆయనలోని సౌండ్ రికార్డిస్ట్ కు తెలుసు, ఎక్కడ సంగీతం రావాలి, ఎక్కడ నిశ్శబ్ధంతో మాట్లాడించాలి అని. ఆయనలోని నటునికి తెలుసు, పాత్రని ఎంతగా జీర్ణించుకుంటే, ప్రేక్షకుల గుండెల్లో అంత కాలం జీవిస్తుందని. ఆయనలోని రచయితకు తెలుసు, ఎక్కడ మెలిక వేయాలో, ఎక్కడ ముడి విప్పాలో. అందుకే ఆయన సినిమాల్లో అగ్రభాగం కళాఖండాలయ్యాయి.

తన స్వరరచనను నిరసిస్తున్న గురువు, నలుగురిలో తన పాటే పాడినప్పుడు అది ఆపేక్షో, అసూయో ఆ శిష్యునికి తెలిసిపోయింది. అందుకే అమ్మగారు అమ్మగా కనిపించింది కానీ, అయ్యగారు తండ్రిగా కనపడలేదు. అలాగే, ఏ శిష్యుని విద్యను తృణీకరిస్తూ వచ్చాడో, అతని పాండిత్యాన్నే నలుగురిలోనూ పాడాల్సి రావడం, దానికి వచ్చిన చప్పట్లలో, ఆ శిష్యుని చప్పట్లు మాత్రమే వినిపిస్తూ పరిహసిస్తున్నటు అనిపించడం తన పొరపాటే అని గురువుకీ తెలుసు. కానీ ఒప్పుకోలేడు. విశ్వనాథ్ లోని సౌండ్ రికార్డిస్ట్ కి ఈ ఒక్క సీనులో మమ్ముట్టికి, ఆ పిల్లాడి చప్పట్లు మాత్రమే రీసౌండ్ లో వినిపించడం అనేది శిఖర స్థాయి అనే చెప్పాలి.

సప్తపదిలో అమ్మలక్కలు తనపై వేసే నిందలకు బాధ, ఉక్రోషంతో హేమ ప్రళయ తాండవం చేసినా, సాగరసంగమంలో బాలూ సినిమాల్లో పిచ్చి గంతులు వేయాల్సి రావడంపై కోపంతో నడిరోడ్డుపై విలయ తాండవం చేసినా, జనమంతా తనను వెలివేసినట్టుగా కచేరీ వదిలి వెళ్ళిపోతే, ‘అవధరించరా.. విని తరించరా’ అని శివుడినే తన పాటతో శంకరాభరణం శంకరశాస్త్రి శాసించినా, ప్రేమ పంచి, పెంచుకున్న కొడుకు తనను బాధపెడితే షూ కంపెనీ ఓనర్ అయిన , తన గదిలో కూర్చుని అందమైన చెప్పుల జతను విరామం లేకుండా కుట్టినా, కొడుకు కలెక్టరైనందుకు మాత్రమే కాక, ఊరిని నిలబెట్టగలిగే ప్రయోజకుడు అయినందుకు సంతోషంతో , ‘కొలిచినందుకు నిన్ను కోదండరామా కోటిదివ్వెల సాటి కొడుకువైనావా’ అంటూ సన్నాయి వాయించి కృతజ్ఞతలు చెప్పినా, విశ్వనాథ్ ప్రేక్షకులకు ఇన్నిటి ద్వారా చెప్పింది ఒకటే. కళాకారుడు/కళాకారిణి తనకు కలిగే ఏ భావోద్వేగాన్నైనా తన కళ ద్వారానే ప్రదర్శిస్తారని. అది తెలియాలి అంటే, అంత ధాటీగా సినిమాలో చూపించగలగాలి అంటే స్వయంగా ఒక కళాకారుడే అయి ఉండాలి.

ఇక ఆయన సినిమాల్లోని సంగీతం గురించి, సాహిత్యం గురించి కొత్తగా చెప్పాల్సినది ఏముంది? సాధారణంగా ఆయన సినిమాల్లోని సన్నివేశ బలం వల్ల చాలా బాగుండే పాటలు అద్భుతాలు, అజరామరాలు అయి కూర్చుంటాయి. ‘సాగరసంగమమే ఒక యోగం’ పాట అయినా, ‘శంకరా.. నాదశరీరాపరా’ అయినా, ‘ఏ కులమూ నీదంటే’ అయినా, ‘కొలిచినందుకు నిన్ను కోదండరామా’ అయినా, ‘ఆనతినీయరా.. హరా’ అయినా, ‘సిన్నీ సిన్నీ కోరికలడగా.. శీనీవాసుడు నన్నడగా’ అయినా, ‘అందెల రవమిది పదములదా’ అయినా, ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు’ అయినా, ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అయినా అవి వచ్చే సన్నివేశం ఆయా పాటల్ని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేశాయి.

ఇలా నటన, పాటలు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, కెమెరా పనితనం ఇలా అన్ని రంగాల్లోని విశ్వనాథ్ గారికి ఉన్న మంచి అభిరుచి, ఆయన సినిమాలను ఈ స్థాయిలో నిలబెట్టాయి. 92ఏళ్ళ పూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆ కళాతపస్వి తన సినిమాల ద్వారా ఎప్పటికీ మనతోనే ఉంటారు. భర్తృహరి వాక్యాన్ని, ఆయన తన సినిమాలో చెప్పినట్టు -

                                      “జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరః

                                 నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం”  

ఆ అద్వితీయమైన కళాకారుని మాటలను దాసుభాషితం కూడా భద్రపరచుకోగలగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు డాక్టర్ సి. మృణాళిని, కె.విశ్వనాథ్ గారిని చేసిన ఇంటర్వ్యూ మన యాప్ లో వినండి. తన సినిమాలపై, జీవితంపై, తన ఆస్థాన కవుల వంటి వేటూరి, సిరివెన్నెల లపై, తన సంగీత రసధుని కె.వి. మహదేవన్, ఇళయరాజాలపై, తన-మన గాంధర్వుడు బాలూపై, ముఖ్యంగా తన పాత్రలపై ఆయన చెప్పిన బోల్డెన్ని సంగతులను వినండి. ఆస్వాదించండి. ఆ దర్శక దిగ్గజానికి నమస్కరించండి.

అభినందనలతో,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :