శ్రీ గురుభ్యో నమః

Ram Kottapalli
May 20, 2024

మన మనసులో ఒక తీవ్రమైన, ధర్మబద్ధమైన కోరిక ఉంటే, అది మనసా వాచా కర్మణా అనుక్షణం మనల్ని ఆలోచింప చేస్తుంటే అది తీరడానికి, అందుకు మార్గం చూపడానికి, మన ముందు ఉన్న చీకటిని తొలగించి దిశా నిర్దేశం చేయడానికి ఒక గురువు మన ముందు మనం ఊహించని విధంగా దర్శనం ఇస్తారు అని గురువు ని కలిసిన వారి వాక్కు. గురువు దర్శనం ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది అని లేదు. మన పురోగతికి, మన ఆత్మ విచారణకి, ఆత్మ పరిశీలనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఘటన, ఒక ధ్వని, ఒక నామ జపం ఇలా ఏదైనా...

నువ్వు దేవుడిని చూసావా ? అని ఎవరినైనా అడిగితే అది ఒక కాంప్లికేటెడ్ ప్రశ్న. అందుకు ఎదుటి వారు సమాధానం అవును అని చెప్పినా మనకు నిరూపణ కావాలి. అందుకు వారు నిరూపణలు చూపినా అవి మన ప్రమాణాలకు తగ్గట్లు లేవని మనం కొట్టి పడేస్తాము. ఇందుకు సమాధానం మనకి ఎప్పటికీ దొరకదు, ఎందుకంటే అసలు ఉన్న దాన్నే మనం అంగీకరించము కనుక. ప్రశ్న “నువ్వు దేవుడిని చూసావా ?” అని కాకుండా “నువ్వు నీ గురువుని కలిసావా ?” అని అడిగి చూడండి. ఇక్కడ ఊహా జనిత సమాధానాలు, స్వంతంగా అల్లిన కథా గానాలు ఉండవు. ఇక్కడ మనకి అసలైన మంచి సంభాషణ మొదలౌతుంది. అయితే గురువును కలిసాను అని, ఆ అనుభవం గురించి, ఆ గురు తత్వం గురించి అవతలి వారి సమాధానంలో దొరుకుతుంది, లేదా ఆ గురువు తనకి తటస్థ పడే విషయంలో అతను ఏ స్థితిలో ఉన్నాడో మనకి అవగాహన వస్తుంది. 

ఇక మనకి శంఖు, చక్ర, గదా పద్మాలతో లేక, పులిచర్మ, జఠాజూఠ, త్రిశూల చంద్ర సర్పాలతో, పంచ ముఖ, చతుర్వేద, కమండలాలతో దేవుళ్ళు, దేవతలూ ప్రత్యక్ష్యం అవడం కంటే, కాషాయ అంగ వస్త్రముతో, చేతిలో ఒక సన్నటి దండముతో, ప్రసన్న వదనముతో ఒక గురవు ప్రత్యక్షమైతే చాలు కదా ?!. నిన్ను నడిపిస్తున్న, మరిపిస్తున్న, మురిపిస్తున్న “నేను” అని నీకు ఇంకా తెలియని పరబ్రహ్మ స్వరూపమై ఉన్న మనః ఫలకంపై సరైన శ్రద్ధా, భక్తి ఆసక్తులు కలిగే విధంగా, దేవుడుని సాక్షాత్కరింప చేయగల శక్తి కలిగిన గురువు నీకు కనబడినాడా ? కనబడితే అతనే దేవుడు.

మన మనసులో ఒక తీవ్రమైన, ధర్మబద్ధమైన కోరిక ఉంటే, అది మనసా వాచా కర్మణా అనుక్షణం మనల్ని ఆలోచింప చేస్తుంటే అది తీరడానికి, అందుకు మార్గం చూపడానికి, మన ముందు ఉన్న చీకటిని తొలగించి దిశా నిర్దేశం చేయడానికి ఒక గురువు మన ముందు మనం ఊహించని విధంగా దర్శనం ఇస్తారు అని గురువు ని కలిసిన వారి వాక్కు. గురువు దర్శనం ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది అని లేదు. మన పురోగతికి, మన ఆత్మ విచారణకి, ఆత్మ పరిశీలనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఘటన, ఒక ధ్వని, ఒక నామ జపం ఇలా ఏదైనా గురవు గా మారి మనల్ని నడిపిస్తుంది. 

ఇప్పుడు మీరు “నీ గురువు ని కలిసావా?” అనే ప్రశ్నతో సిద్ధంగా ఉంటే నడిచే గురు దేవుడిగా కొనియాడబడి భారత జాతి మొత్తమూ ప్రణమిల్లిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి మీకు చెప్పడానికి మేమూ సిద్ధంగా ఉన్నాము. 

Tap to Listen

చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం కంచి కామకోటి పీఠాధిపతి మాత్రమే కారు. వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధకుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక వేత్త ఇలా ఎందరినో దర్శించవచ్చు అని భక్తుల నమ్మకం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రభోదాలు చేసి, అనేక మంది జీవితాలు మార్చి, ధర్మ పునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ‘నడిచే దేవుడి' గా పేరు పొందారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితాన్ని ఒక తరం మొత్తం ఎలా దర్శించిందో, ఆయన కుల మతాలకు అతీతంగా భారత జాతి శ్రేయస్సు కొరకు ఎంత పాటు పడ్డారో వంటి చాలా విషయాలు మనకి తెలియాలంటే స్వామి వారిని దగ్గర నుండి చూసిన వారి ప్రియ శిష్యులు మాత్రమే చెప్పగలరు. ఆ ప్రియ శిష్యులలో ఒకరు నీలంరాజు వెంకట శేషయ్య గారు. ఆయన అలాంటి విషయాలతో రాసిన పుస్తకం నడిచే దేవుడు ఈ వారం దాసుభాషితంలో శ్రవణ రూపంలో విడుదల కాబోతుంది. 76 అధ్యాయాలు ఉన్న ఈ శ్రవణ పుస్తకాన్ని విని వెంకట శేషయ్య గారు పొందిన అదే అనుభూతిని మీరు పొందుతారని ఆశిస్తున్నాము. 

అభినందనలతో 

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :