తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన విదుషీమణి

Meena Yogeshwar
June 20, 2023

మాతామహులు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మాత్రమే కాక, అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, తెలుగువారికి గొప్ప కీర్తనా సంపదను తిరిగి అందించిన వారు, స్వయంగా వాగ్గేయకారులు, వీణా విద్వాంసులు. తల్లి గొప్ప గాయని, వీణా విద్వాంసురాలు. అన్నగారు ఈల కళాకారుడు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను కూడా ఈల పాటలో పాడగల గొప్పవారు. వారిని చూస్తూ పెరిగిన ఈ అమ్మాయి కూడా మంచి వీణా విద్వాంసురాలు అవడమే కాక, కర్ణాటక, హిందుస్తానీ సంగీతంపై ఎంతో మంచి అభిరుచిని పెంచుకున్నారు. ఆయా పద్ధతులలోని అనేక రాగాలను ఎలా ఆస్వాదించాలో తెలిసిన ఆల్కెమిస్ట్ అనదగ్గ గొప్ప శ్రోత అయ్యారు.మేనమామ భార్య అనారోగ్యం కారణంగా, ఆమెకు నవల చదివి, వినిపించడంతో తెలుగు సాహిత్య పఠనం ప్రారంభించింది ఆ చిన్నారి. ఆ సాహితీ ప్రేమ ఎదిగి తెలుగు నవలలపై...

ఇటీవలే తెలుగువారందరూ గర్వించదగ్గ విధంగా కేంద్ర సాహిత్య అకాడెమీకి మొట్టమొదటి మహిళా కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, వీణా విద్వాంసురాలు, పాత్రికేయురాలు అయిన ఆ బహుమఖ రంగాల విదుషీమణి గురించి తెలుగువారైన వారందరూ తెలుసుకుని తీరాల్సిందే. ఆమె ఎవరో ఈ మాంటాజ్ షాట్లతో మీకే తెలిసిపోతుందో, ఆఖరికి నేను పేరు reveal చేశాకా తెలుస్తుందో చూద్దామా!

2, 3 ఏళ్ళ చిన్న పాపాయి, అమ్మమ్మ దగ్గర కూర్చుని పోతన భాగవత పద్యాలు వింటోంది.  కట్ చేస్తే ఇంటర్ స్కూల్ కాంపీటీషన్ లో ‘రుక్మిణీ కళ్యాణం’ పద్యాలు చెప్పి, మొదటి బహుమతి పొందారు. ఇంటి నిండా ఇంగ్లీషు పుస్తకాలు. తమతో పోటీ పడి ఆంగ్ల నవలలు చదివే తల్లి. వార్ అండ్ పీస్ వంటి గొప్ప నవలలు చదవమని, అందులో పరీక్షలు నిర్వహించే అన్నగారు. 

కొన్ని ఏళ్ళు ముందుకు వస్తే భారతీయ సాహిత్యంలోని మకుటాయమానం అనదగ్గ ‘మాల్గుడి డేస్’, ‘గుల్జార్ కథలు’ వంటి వాటిని తెలుగులోకి అనువదించడమే కాక, narrative technique in telugu novel అనే విమర్శ గ్రంధం ఆంగ్లంలో రాసి, తెలుగు సాహిత్య లోతుపాతుల్ని ఇతర భాషలకు పరిచయం చేశారు. తరువాతి కాలంలో ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో, తులనాత్మక పరిశీలన విభాగంలో ఎందరో పి. హెచ్. డి విద్యార్ధులను తీర్చిదిద్దే ఆచార్య పదవిని చేపట్టారు. తన శిష్యులతో గొప్ప గొప్ప సాహితీ పరిశోధనలు చేయించారు.

మూడేళ్ళ ఆ పాప, రేడియోలో రఫీ పాట రాగానే, రేడియోను గాఢంగా హత్తుకునేది, వెన్నెల రాత్రుల్లో తండ్రితో కలసి, రకరకాల ఫలహారాలు తింటూ పంకజ్ మల్లిక్, కె.ఎల్.సైగల్ వంటి గొప్ప గాయకుల పాటలు వినేది. పాత్రికేయురాలిగా ఉద్యోగం చేసేటప్పుడు ఒ.పి.నయ్యర్ వంటి సంగీత దర్శక దిగ్గజం, పర్వీన్ సుల్తానా వంటి మధుర గాయని, మన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఎస్. జానకి వంటివారిని ఇంటర్వ్యూలు చేయగలగడమే కాక, సంగీతంలో ఆమె లోతును ఆ పండితులు, శ్రోతలు కూడా అభినందించారు. రఫీపై ప్రేమతో ‘రఫీకి ఒక ప్రేమపత్రం’ అనే పుస్తకం రాశారు.

7వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి, తెలుగు విమర్శనా రీతులకు మార్గదర్శకుడు అయిన తన మాతామహుల ఇంటికి వచ్చే తిరుమల రామచంద్ర, ఘడియారం వెంకటశేషయ్య, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఆరుద్ర-రామలక్ష్మి దంపతుల వంటి పండితులను చూస్తూ, వారి మాటలను ఒక చెవిలో వేసుకుంది. డా.సి.నారాయణరెడ్డి, జి.వి.సుబ్రహ్మణ్యం, నాయని కృష్ణకుమారి, బిరుదురాజు రామరాజు వంటి సాహిత్య దిగ్గజాల దగ్గర శిష్యరికం చేసే అవకాశం పొందారు. ఎన్నో సాహితీ వ్యాసాలు, ఉపన్యాసాలు, విశ్లేషణలు, విమర్శలు చేసి, తెలుగు సాహిత్యంలో మహిళా విమర్శకుల పట్టిక రాస్తే మొదటి మూడు పేర్లలో ఒకటి అవదగ్గ కృషి చేశారు.

మాతామహులు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మాత్రమే కాక, అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, తెలుగువారికి గొప్ప కీర్తనా సంపదను తిరిగి అందించిన వారు, స్వయంగా వాగ్గేయకారులు, వీణా విద్వాంసులు. తల్లి గొప్ప గాయని, వీణా విద్వాంసురాలు. అన్నగారు ఈల కళాకారుడు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను కూడా ఈల పాటలో పాడగల గొప్పవారు. వారిని చూస్తూ పెరిగిన ఈ అమ్మాయి కూడా మంచి వీణా విద్వాంసురాలు అవడమే కాక, కర్ణాటక, హిందుస్తానీ సంగీతంపై ఎంతో మంచి అభిరుచిని పెంచుకున్నారు. ఆయా పద్ధతులలోని అనేక రాగాలను ఎలా ఆస్వాదించాలో తెలిసిన ఆల్కెమిస్ట్ అనదగ్గ గొప్ప శ్రోత అయ్యారు.

మేనమామ భార్య అనారోగ్యం కారణంగా, ఆమెకు నవల చదివి, వినిపించడంతో తెలుగు సాహిత్య పఠనం ప్రారంభించింది ఆ చిన్నారి. ఆ సాహితీ ప్రేమ ఎదిగి తెలుగు నవలలపై పి. హెచ్. డి చేయడంతో మొదలుపెట్టి, ‘సాంఘిక నవలలో కథన శిల్పం’ అనే పుస్తకం రాయడం, కేవలం పాటలు మాత్రమే ప్రసారం చేసే ఒక రేడియో ఛానెల్ లో ‘భావ వీచికలు’ పేరుతో ప్రపంచ సాహిత్యాన్ని, అందులోని లోతుపాతులను తెలుగు శ్రోతలకు అందించే అంతగా సాహిత్యంపై మమకారాన్ని పెంచుకున్నారు.

ఇప్పటికే చాలామంది ఆమె ఎవరో కనిపెట్టేసి ఉంటారు. దాసుభాషితం పురిటి దశలో ఉన్నప్పటి నుంచే, తన సాహిత్య, సంగీత, సినిమా, రచయితల, కవుల పరిచయ ఆడియోలు, ఇంటర్వ్యూలనే జీవనాధారాన్ని అందించి, ఈనాడు ఇంత పరిపుష్టంగా తయారవడానికి మూలం అయిన ఆ మాతృమూర్తి డాక్టర్ సి.మృణాళిని గారు. మాతామహులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి నుండి సంగీత, సాహిత్య, విమర్శనా పటిమను పుణికి పుచ్చుకున్నారు ఆమె. అన్నగారు అయిన ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారుడు శ్రీ కె.బాలగోపాల్ నుండి స్వతంత్ర భావాలు, పఠనాసక్తిని అందుకుని తెలుగు సాహితీ చరిత్రలో నిలిచిపోదగ్గ మహిళా విమర్శకురాలిగా ఎదిగారు.

ఇలా చెప్పుకుంటూ పోతే, వచ్చే వారం కూడా ఆమె పైనే వ్యాసం రాయాలి. అన్ని పుస్తకాలు రాశారు, అన్ని అవార్డులు సంపాదించారు, ముఖ్యంగా జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని ప్రాతినిధ్యం వహించి, కీర్తి గడించారు. అలాంటి మన మృణాళిని గారు రాసిన ‘ప్రేమలేఖలు’ కథా సంపుటి ఈ వారం విడుదల అవుతోంది. 

Tap to Listen

ఎక్కువ శాతం Non fiction సాహిత్యం రాసిన వారు కాల్పనిక సాహిత్యం రాయాలంటే చాలా కష్టం. అందులోనూ అంతటి విమర్శకురాలు, తను రాసే ప్రతి పదాన్నీ, వాక్యాన్నీ తానే విమర్శిస్తుంటే ఆ సాహిత్యం ముందుకు వెళ్ళడం ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. అనవసరమైనవి రాసేటప్పుడే ఎడిట్ చేయబడి, అద్భుతమైన సారం మనకు అందుతుంది అనడంలో సందేహం లేదు. ఈ కథల గురించి ఇంతకన్నా చెప్పడం కష్టం. విని మీరే చెబుతారు ఎంత అమృతతుల్యంగా ఉన్నాయో.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :