వెంకన్నను చేరిన బాలకృష్ణుడు

Meena Yogeshwar
March 22, 2025

మొదట్లో లలిత సంగీత గీతాలు, సినీ గీతాలు పాడుకుంటూ పెరిగారు ప్రసాద్ గారు. సంగీతంపై మక్కువతో ఒకసారి ఇంటి నుండి, మరో రెండుసార్లు ఉద్యోగం నుండి పారిపోయి గురువుల వద్ద శిష్యరికంలో చేరి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. పెదతండ్రి హరికథా కార్యక్రమాలకు, తండ్రి శాస్త్రీయ సంగీత కచేరీలకు మృదంగ విద్వాంసునిగా వెళ్ళేవారు. తండ్రి రాసిన కృతులను పుస్తకం వేసేందుకు సరిచూస్తూ 21ఏళ్ళ వయసులో కృతులు రాయడంలో ఇష్టాన్ని పెంచుకుని 23ఏళ్ళ వయసు వచ్చేసరికి దాదాపు ...

పితామహులు మంచి గాత్ర కళాకారులు, పెదతండ్రి హరికథా కళాకారులు, తండ్రి వాగ్గేయకారులు, మాతామహులు గొప్ప సంగీత విద్వాంసులు, 8భాషలలో ప్రావీణ్యం కలవారు, తల్లి మంచి గాయని, పినతల్లి ప్రముఖ సినీ నేపధ్య గాయిని. ఇలాంటి నేపధ్యం కలిగిన బాలుడు ఏమవుతాడు ‘అచట పుట్టిన చివురు కొమ్మ అయిన చేవ’ అన్నట్టు సంగీతంలో వట వృక్షం అవుతాడు. వాగ్గేయకారుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, మృదంగ వాద్య కళాకారుడు, అపారమైన భక్తి సముద్రుడు అవుతాడు. అన్నమయ్య కీర్తనలనే బృహత్ రథానికి సారథి అవుతాడు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అవుతాడు.

తన ఇష్టాలు, అల్లర్లకు విసుగు చెందని తండ్రి నరసింహారావు గారికి, చిన్నతనం నుంచి తనపై అపారమైన నమ్మకం పెట్టుకుని, తప్పటడుగు వేసినా దాని నుండి బయటకు వచ్చి మంచి మార్గంలో నడవగలడు అనే నమ్మకం పెట్టుకుని తనను ప్రోత్సహించిన తల్లి కృష్ణవేణమ్మ గారికి, సంగీతంలో ఉగ్గుపాల నుండి నేర్పించి, తనను ఇంతవాడిగా నిలిపి, తనను శిష్యునిగా కాక, స్నేహితునిగా చూసి, తన అభిప్రాయాలకు విలువనిచ్చిన సంగీత కళానిధి, తన పట్ల దయానిధి అయిన నేదునూరి కృష్ణమూర్తి గారికి, పిన్నిగా కాక, ఒక అభిమానురాలిగా తనని ఇష్టపడి, క్షణం తీరికలేనప్పుడు కూడా, అడిగినప్పుడల్లా అన్నమయ్య కీర్తనల రికార్డింగులకో, తన స్వంత కృతుల రికార్డింగులకు వచ్చి పాడిన తన పినతల్లి, సుప్రసిద్ధ సినీ నేపధ్య గాయిని ఎస్. జానకి గారికి, తనను మనసా వాచా అర్ధం చేసుకుని, తన ప్రతి అడుగులోనే వెన్నంటే ఉన్న తన శ్రీమతి రాధ గారికి, ఆ దేవదేవుని స్వరపుష్పాలతో అర్చించి, తాము కూడా ఆ బాటలోనే తరించేందుకు ఇన్ని వేల సంకీర్తనలనిచ్చిన అన్నమయ్యకు, తన భుక్తి, ముక్తి, జీవం, జీవితం అంతా నిండి, పండిన ఆ ఏడుకొండలవాడికీ బాలకృష్ణప్రసాద్ గారు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెబుతారు తన ఇంటర్వ్యూలలో.

ఆయన చిన్నతనంలో తన స్నేహితుల ఇంటిలోని పెద్దవారు, బంధువులలోని వారు అనారోగ్యంగా ఉంటే ప్రసాద్ గారిని పిలిపించుకుని పాటలు పాడించుకుని వినేవారట. ‘నువ్వు పాడితే ప్రశాంతంగా ఉంటుంది బాలకిషన్. మాకు అనారోగ్యం తగ్గినట్టే అనిపిస్తుంది’ అనేవారట. కట్ చేస్తే 40 ఏళ్ళ తరువాత వెంకటరమణ గారు అనే ఒక న్యూరోసర్జెన్, రోజుకు కనీసం 6 శస్త్రచికిత్సలు చేస్తారాయన. 

తన ప్రతి శస్త్రచికిత్సకు ముందు బాలకృష్ణప్రసాద్ గారి అన్నమయ్య సంకీర్తనల ప్లేలిస్ట్ పెట్టుకుంటారట. ఆ ప్లేలిస్ట్ లో ఆఖరి పాట పూర్తి అయ్యేసరికి యాదృచ్ఛికంగా ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తి అవుతుంటుంది. ఆయన చేసే 6 శస్త్రచికిత్సలో సగానికి పైగా మెదడుకు సంబంధించినవే ఉంటాయి. రోగి స్పృహలో ఉండాల్సిన ఆపరేషన్ లు అవి. ఆ సమయంలో బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం ద్వారా, ఆ అన్నమయ్య పదాల తోడుగా వేంకటేశ్వరుడు ‘మ్యూజిక్ థెరపీ’ ఇస్తున్నట్టుగా భావిస్తారట డాక్టర్ గారు. 

చిన్నప్పటి నుండి ఒకరి అజమాయిషీ, పెత్తనాన్ని భరించలేని స్వభావం ప్రసాద్ గారిది. ఒకరిని నోరు విడిచి ఏదీ అడగడం రాదు. ఎవరి విషయాలలోనూ తలదూర్చేవారు కాదు, అలాగని తన జోలికి వస్తే ఊరుకునే వారు కాదుట. ఒకరి అదుపాజ్ఞలలో ఉండటం ఇష్టం లేక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రెండు సార్లు, తితిదే ఉద్యోగానికి రెండు సార్లు రాజీనామా ఇచ్చేసారట. అయితే కోపం తెప్పిస్తే ఇలా రాజీనామాలిచ్చేస్తారే కానీ, నిజానికి చాలామంచి ఉద్యోగస్థుడు, నెమ్మదస్తుడు అని ఆయన మీద అభిమానం ఉన్న పైఅధికారులు ఆయన రాజీనామాని ఎన్నడూ అంగీకరించలేదు. ఎవరి కిందా పని చేయడం ఇష్టం లేదని గ్రహించిన వేంకటేశ్వరుడు, తనను ఆయన కింద ఉద్యోగస్థునిగా నియమించుకున్నాడు, ఆయన భక్తికి బానిసను చేశాడు అని భావిస్తారు ప్రసాద్ గారు.

మొదట్లో లలిత సంగీత గీతాలు, సినీ గీతాలు పాడుకుంటూ పెరిగారు ఆయన. సంగీతంపై మక్కువతో ఒకసారి ఇంటి నుండి, మరో రెండుసార్లు ఉద్యోగం నుండి పారిపోయి గురువుల వద్ద శిష్యరికంలో చేరి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. పెదతండ్రి హరికథా కార్యక్రమాలకు, తండ్రి శాస్త్రీయ సంగీత కచేరీలకు మృదంగ విద్వాంసునిగా వెళ్ళేవారు. 

తండ్రి రాసిన కృతులను పుస్తకం వేసేందుకు సరిచూస్తూ 21ఏళ్ళ వయసులో కృతులు రాయడంలో ఇష్టాన్ని పెంచుకుని 23ఏళ్ళ వయసు వచ్చేసరికి దాదాపు 100 శాస్త్రీయ సంగీత కృతులు, 100 లలిత సంగీత గీతాలు రాశారు. 25ఏళ్ళ వయసులో టిటిడి నిర్వహించే పాటలపోటీ కోసం మొదటిసారి జీవితంలో అన్నమయ్య పేరు విన్న ప్రసాద్ గారికి, ఆ తరువాత జీవితం మొత్తం అన్నమయ్యే నిండిపోయాడు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నమయ్య ప్రాజెక్ట్ లో 1978 నుండి 2006 వరకూ స్పెషల్ గ్రేడ్ గాయకునిగా పనిచేశారు. తితిదే, అహోబిలం దేవస్థానాల ఆస్థాన గాయక పదవిని కూడా చేపట్టారు. దాదాపు 150 రాగాలలో 800 అన్నమాచార్య కీర్తనలను స్వరపరిచారు. అందులో 12 రాగాలు ఆయన స్వంతంగా సృష్టించినవి కావడం విశేషం. అంజనేయస్వామి మీద, వినాయకుని మీద, నవగ్రహాల మీద అనేక కృతులను రచించి, స్వరపరిచారు. 

ఇప్పటివరకూ ఆయన స్వయంగా రచించిన సంగీత కృతుల సంఖ్య 400కు పైచిలుకు ఉంటుంది. ఆరోగ్య, ఆర్ధిక, కుటుంబపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సమయాలలో ఎక్కువగా ఆయా దేవీ దేవతలపై కీర్తనలు చేయడం విశేషం. అంతే కాక, దాదాపు 2000 అన్నమయ్య కృతులను గానం చేసి, రికార్డు చేశారు. 7 నగరాలలో 8 అన్నమయ్య సంకీర్తన మహాయజ్ఞాన్ని నిర్వహించారు. 

వీరు స్వరపరచిన అన్నమయ్య కృతులలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘చూడరమ్మ సతులాల’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’, ‘ఆదిమూలమే మాకు అంగరక్ష’, ‘జగడపు చనువుల జాజర’, ‘తిరువీధుల మెరిసీ దేవదేవుడు’, అంతయు నీవే హరి పుండరీకాక్ష’, ‘ఏమని పొగడుదునే ఇతనిని ఆమని సొబగుల అలమేల్ మంగ’, ‘అన్ని మంత్రములు ఇందే ఆవహించెను’ వంటివి జగద్ప్రసిద్ధి చెందాయి. నేటికీ ఇతర గాయనీ, గాయకులలో ఎక్కువ మంది ప్రసాద్ గారు స్వరపరచిన బాణీలలోనే ఈ పాటలు పాడుతుండటం వారి స్వరరచనా శైలికి ఉండే ప్రామాణికత, మాధుర్యమే ప్రధాన కారణాలు.

గత ఆదివారం మార్చి 9వ తేదీన వారు వేంకటేశ్వర సన్నిధిని చేరుకున్నారు. వారిపై కేంద్ర సాహిత్య అకాడెమీ కన్వీనర్, ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు డాక్టర్ సి. మృణాళిని గారు చేసిన విశ్లేషణ 2022 ఏప్రిల్ 29న మన దాసుభాషితంలో విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బాలృకృష్ణ ప్రసాద్ గారి స్మృతికి నివాళిగా ఈ వారం మరే ఇతర విడుదలలు చేయకూడదు అని మా బృందం నిర్ణయించుకున్నాం. వారికి అంజలి ఘటిస్తూ ఆ విశ్లేషణనే తిరిగి స్మరించుకుంటున్నాం.

మన యాప్ లోని Spotlight లో మీరు ఈ విశ్లేషణను వినచ్చు. ఆ సంగీత సరస్వతిని గురించి, మన సాహిత్య సరస్వతి డాక్టర్ సి. మృణాళిని గారు చెప్పిన విశేషాలు, వారి స్వరరచనా శైలి గురించి, గాన పద్ధతుల గురించి ఈ విశ్లేషణలో విందాం. అన్నమయ్యనే బాటగా చేసుకుని, శ్రీవేంకటేశ్వరుని చేరుకున్న బాలకృష్ణప్రసాద్ గారికి స్వరాంజలి ఘటిస్తోంది దాసుభాషితం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :