చాలా కాలం ఎంతోమందిలానే నేను కూడా బాపూగారి ప్రాణమైన వెంకటరమణగారే ఈ శ్రీరమణ అనుకునేదాన్ని. బాపూగారి సినిమాలలో కూడా బాపూరమణ అనేకదా ఉంటుంది. రమణ గారి హాస్య చతురతని, భార్యాభర్తల బంధంలో ఉన్న ఆప్యాయతని, అనురాగాన్ని, ఆ బంధానికి ఉన్న బలాన్ని మొట్టమొదటిసారి "మిథునం"నవలికలో చూశాను. వ్యాసాలు , కాలమ్స్ రాసే నేను ఒక నవలని, కథని రాయలేక పోయాను అంటారు గానీ రమణగారు వారు రాసిన మిథునం నవలిక అనేకుల హృదయాలను దోచుకుంది. పెద్ద నవలా రచయితకు వచ్చినంత పేరును తెచ్చిపెట్టింది.
ఈ మిథునం ఆధారంగా తీసిన సినిమాలో మన సాంప్రదాయపు రుచులు, పై చదువులకని, ఉద్యోగాలకని తల్లిదండ్రులను వదిలేసిన పిల్లల కోసం వారు పడే ఆరాటం ఇవే కాక చక్కటి, అందమైన జీవితాన్ని ఏవిధంగా జీవించవచ్చో కూడా తెలిపారు. వీరు రాసిన ఈ నవలికలోని దాసు, బుచ్చి మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే వృద్దదంపతుల మధ్యన తారసపడుతూనే ఉంటారు.
ఇక వీరి మిగతా రచనల విషయానికి వస్తే వ్యాసాలు వ్యంగ్యాస్త్రాలని, శీర్షికలు ఎదుటివారి ప్రవర్తనపై శీలమేసినట్లు ఘాటుగా, సూటిగా ఉండేవి. వీరి “మొదటిపేజీ” అనే శీర్షికల సమాహారం చూసి ఎడిటింగ్ చేసే నాకు బాబోయ్ ఇన్నా అనిపించింది. కానీ వింటున్నప్పుడు ఆ రచనలోని వారు విషయాన్ని సున్నితంగా చెప్పడానికి ఎంతో కాంటెంట్ ను సేకరించి చాలా కొద్ది మాటలతో నాలుగు లేదా 5 నిముషాలలో చెప్పడం ఆసక్తి రేకెత్తించింది.
ఇక కథా కాదు నవల కూడా కాని నవలిక "ప్రేమపల్లకి" లో చురుకైన బాపు బొమ్మలాంటి రాధకి, సిగ్గు బిడియంతో కూడిన, భర్తని అనే అహంకారం జోడైన రాంపండుకు పెళ్లి జరుగుతుంది. భార్య కళ్ళల్లో నీరు చూడలేని రాంపండు లో భార్యమీద ప్రేమ కనబడుతుంది. లౌక్యం తెలియని రాంపండు పడిన కష్టాలు ఈ నవలికలో మనకు ఆసాంతం నవ్వు తెప్పిస్తాయి.
సింహాచలం సంపెంగలు, మిథునంకథలు ఇవన్నీ మనచుట్టూ జరిగినట్టుగానే ఉంటాయి. సోడానాయుడు, బంగారు మురుగులో మామ్మగారూ...ఇలా మనకు తెలిసిన, పరిచయమున్న వారిలా అనిపిస్తాయి ఆ పాత్రలు.
పేరడీల విషయానికి వస్తే ప్రతీ రచయిత యొక్క రచనా శైలిని ఉటంకిస్తూ వారి రచనలలో భావం పోకుండా రమణ గారి శైలిని జొప్పిస్తూ చేసిన పేరడీల గారడీ అద్భుతంగా ఉంటుంది. అందులో శ్రీశ్రీ గారిని పరిచయం చేస్తూ రాసిన వాక్యాలు తెలుగు అక్షరాలలో ఉన్న చమత్కారాలని, సాహిత్యంలో రమణగారు చేసిన శివతాండవాన్ని చూడచ్చు.
ఇవన్నీ ఇప్పటిదాకా మన దాసుభాషితంలో మీరు మెచ్చిన రమణగారి వ్యాసాలు, శీర్షికలు, కథలు, నవలికలు. మరి ఇప్పుడు ఈ వారం విడుదల అవుతున్న “నిన్నటి పరిమళాలు” లో వీరు మనకు తెలిసిన ఎందరో మహానుభావుల జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను వ్యాసాలుగా చెబుతారు. ఇవి విన్నాకా రమణ గారికి ఆ మహనీయులతో ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం తేటతెల్లమవుతాయి.

రమణగారు మన ఇల్లేరమ్మ కథలకు బొమ్మలు వేసిన చిత్రకారుడు అన్వర్ గారితో అనేవారట నేను ఇంకొన్ని వ్యాసాలను "సింహాల మధ్యన నేను" అని ఒక పేరుతో సంకలనం చేయాలని. కానీ వారి అనారోగ్యం కారణంగా ఆ వ్యాసాలు మనకు చేరకుండా పోయాయి. 18 జులై 2023 శ్రీరమణ గారి అస్తమయం సాహితీలోకానికి తీరని లోటుగా మిగిలిపోయింది. సాహితీ లోకం ఒక ప్రముఖ కాలమిస్ట్ను కోల్పోయింది.
ఈ నిన్నటి పరిమళాలని చేర్చికూర్చి మనకు అందించిన వారిని స్మరించుకుంటూ, ఆ సాహితీ వ్యాసాల వాల్మీకికి అంజలి ఘటిస్తూ..
అభినందనలు,
ప్రభ.