196 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం

Meena Yogeshwar
March 25, 2024

“కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం” అని ఒకప్పటి సామెత. బహుదూరపు ప్రయాణం. అందులోనూ ఎన్నో ఊళ్ళల్లో మజిలీలు, ఆ ఊళ్ళలోని అంటువ్యాధ్యుల దగ్గర నుంచి, మోసాల వరకూ అన్నీటినీ తట్టుకోవాలి. అడవుల్లో ప్రయాణం. క్రూరమృగాల దాడుల నుండి బందిపోట్ల బెడద వరకూ అన్నిటినీ ఎదుర్కోవాలి. భాష కాని భాష, ఊరు కాని ఊరులో ఏదైనా ఇబ్బంది వస్తే అంతే సంగతులు. అప్పటికి రైళ్ళు కాదు కదా, రోడ్లు కూడా లేవు. సరిగ్గా 196 ఏళ్ళ క్రితం ఒక పెద్దమనిషి...

“కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం” అని ఒకప్పటి సామెత. బహుదూరపు ప్రయాణం. అందులోనూ ఎన్నో ఊళ్ళల్లో మజిలీలు, ఆ ఊళ్ళలోని అంటువ్యాధ్యుల దగ్గర నుంచి, మోసాల వరకూ అన్నీటినీ తట్టుకోవాలి. అడవుల్లో ప్రయాణం. క్రూరమృగాల దాడుల నుండి బందిపోట్ల బెడద వరకూ అన్నిటినీ ఎదుర్కోవాలి. భాష కాని భాష, ఊరు కాని ఊరులో ఏదైనా ఇబ్బంది వస్తే అంతే సంగతులు. 

అప్పటికి రైళ్ళు కాదు కదా, రోడ్లు కూడా లేవు. సరిగ్గా 196 ఏళ్ళ క్రితం ఒక పెద్దమనిషి, 100మంది బంధువులు, స్నేహితులతో మద్రాసు నుండి, కాశీ దాటి, కాశ్మీరం దాకా వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, సురక్షితంగా తిరిగి వచ్చాడు కూడా. ఎంత సాహస యాత్రో ఇప్పటివాళ్ళు ఊహించడం కష్టం. ఆయనే ఏనుగుల వీరాస్వామయ్య గారు. 

అతి చిన్న వయసులోనే, ఇంకా దేశంలోకి ఇంగ్లీషు భాష విరివిగా అందుబాటులోకి రాని కాలంలోనే, ఆ భాషపై గొప్ప పట్టు సాధించారు వీరాస్వామయ్య గారు. ఇక కొన్ని తరాల నుండి చెన్నైలో ఉండడం వలన తమిళం, తెలుగువారు కావడం వలన స్వచ్ఛమైన తెలుగు, వేదాధ్యాయి కనుక సంస్కృతం.. ఇలా బహు భాషా పండితులు ఆయన. చెన్నై సుప్రీం కోర్టులో ఉద్యోగం. ఇటు స్వదేశస్తులు, బంధువులు, స్నేహితుల నుండి, అటు పాలకులైన పరదేశస్తుల నుండి అన్ని రకాల గౌరవ మర్యాదలు అందుకొన్నవారు. దానికి కారణం స్వధర్మ పాలనం, పరధర్మ గౌరవమే.

చిన్ననాడే తండ్రిని పోగొట్టుకుని, ఇంటికి ప్రధాన పోషకులు అయిన వీరాస్వామిగారు ఎన్నో గొప్ప ఉద్యోగాలు చేశారు. సమాజంలోనూ, బంధువర్గంలోనూ ఎంతో గౌరవం సంపాదించారు. తన 50వ ఏటకు దగ్గర్లో ఈ బృహత్ ప్రయాణం తలపెట్టి, విజయవంతంగా సాధించి చూపించారు. కాశీకి వెళ్ళడం అంటే ఎంత కష్టమో వారు రాసిన travelogue చదివితే తెలుస్తుంది. ఇప్పట్లా దారిలో హోటళ్ళలో విడిది చేసి, దొరికిన రెస్టారెంట్లలో తిని, కారులోనో, బస్సులోనో, రైలులోనో వెళ్ళడం కాదు.

మడి, ఆచారం, నియమ నిష్ఠలు కలిగిన పెద్దవారు, ఆడవాళ్ళతో ప్రయాణం. అప్పట్లో పూర్వ సువాసినులకు ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. వారు తీపి పదార్ధాలు, కొన్ని రకాల కూరలు, కొన్ని రకాల పప్పు దినుసులు, కారం ఎక్కువ ఉండే పచ్చళ్ళు తినరాదు. ఏకాదశి వంటి పవిత్ర తిథుల్లోనూ, ప్రతిరోజూ రాత్రి పూటా అన్నం తినరాదు. ఫలహారం మాత్రమే. ఇక అగ్నిహోత్రం పాటించేవారి నియమాలు అదనం. ఎవరి వంట వారే చేసుకునేవారు కొందరు. ఇది తిండి సంగతి.

ఇక ప్రయాణానికి అన్నీ పల్లకీలు. ఆ బోయీలు జబ్బుపడితే, వారిని మోయడానికి మరో పల్లకీ, బోయీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి, వారిని కూడా యాత్ర చేయించిన సాధుమూర్తి వీరాస్వామయ్య గారు. కొన్ని ఊళ్ళల్లో యాత్రికుల కోసం ప్రత్యేకించి సత్రాలు సులువుగానే దొరికేవి. కొన్ని ఊళ్ళు దొంగల భయంతో అలమటించిపోయేవి. అలాంటి చోట్ల యాత్రికుల విడిది పరిస్థితి ఏమిటో ఈ విశ్లేషణలో మాలతీ చందూర్ గారు వివరిస్తోంటే ఒళ్ళు గగుర్పొడిచింది. 

Tap to Listen

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి యాత్రా సాహిత్యం రాసిన ఏనుగుల వీరాస్వామయ్య గారి ‘కాశీ యాత్రా చరిత్ర’ పుస్తకంపై ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన విశ్లేషణ విడుదల అవుతోంది. ఇప్పటివరకూ ఈ శీర్షికలో ఎక్కువగా పరభాషా, అందులోనూ ముఖ్యంగా విదేశీ నవలలపై విశ్లేషణ వింటూ వస్తున్నాం. ఈసారి మన తెలుగు సాహిత్యంలో గొప్ప పుస్తకం గురించి తెలుసుకుందాం. ట్రంకు పెట్టెలు, వంట సామాను సిద్ధమా? వీరాస్వామయ్య గారు కాశీ ప్రయాణం మొదలుపెట్టేస్తున్నారు. పదండి.. పదండి..

పురాణయానం - 3

భారతీయ సమాజంలోని ఎన్నో విలువలకు మన పురాణేతిహాసాలు వెన్నుముకలాగా నిలిచాయి. మనిషి ఎలా ఉండాలి? ఎలా తన బంధాలను నిలబెట్టుకోవాలి? మనిషి తన ధర్మాన్ని పాటించడం అంటే అర్ధం ఏమిటి? ఒక ధర్మనిష్టుడైన మనిషి ఉండడం వలన సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అలా లేకపోవడం వలన ఆ సమాజానికి కలిగే నష్టాలు ఏమిటి? భారతీయ వివాహ వ్యవస్థ మూలాలు ఏమిటి? దాని వలన భారతీయ సమాజం ఎలాంటి సుస్థిరతను సాధించింది?

ఇలా జీవితంలోని ప్రతి విషయానికి సగటు భారతీయ వ్యక్తి మన పురాణేతిహాసాల వైపే తిరిగి చూశాడు. అక్కడి నుండే నేర్చుకున్నాడు. అయితే, వాటిని సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం అంత సులువైన పనేమీ కాదు. పైకి కథల్లా చెబుతూ, అంతర్లీనంగా ఎన్నో సామాజిక, రాజకీయ, ఆర్ధిక, ఆధ్యాత్మిక అంశాలను చెప్పారు మన ఋషులు. మరి వాటిని వివరించాల్సినది ఎవరు? ఒకప్పుడు గురుకులాల్లో ఇవన్నీ నేర్చుకునేవారు కాబట్టీ, గురువు కథ చెప్పాల్సిన వయసులో కథ, మర్మం చెప్పాల్సిన వయసులో ఆ లోతైన విషయాలు వివరించేవారు.

Tap to Listen

ఈనాటి కాలంలో ఎందరో గురువులు రకరకాల మాధ్యమాల ద్వారా ఆ జ్ఞానాన్ని మనకి పంచుతున్నారు. కొందురు పుస్తకాల ద్వారా, కొందరు ప్రవచనాల ద్వారా, మరికొందరు కోరా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా. అలా కోరాలో ఎన్నో ఆధ్యాత్మిక, పురాణేతిహాసాలపై సామాన్యంగా మనకు ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మాజీ తెలుగు అధ్యాపకులు శ్రీ శివరామప్రసాద్ మాచవోలు గారు. పురాణయానం శీర్షికలో ఈ వారం మూడవ భాగం విడుదల చేస్తున్నాం. 

మహాభారతానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వారం తెలుసుకుందాం. పై కాశీ యాత్ర పూర్తి అయిపోయాకా, అలా ద్వాపర యుగానికి వెళ్ళొద్దాం. సరేనా?

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :