అందీ అందని అందమె ముద్దు..

Meena Yogeshwar
June 24, 2025

తన పాత్రలపై ఆవిడకి ఉండే అపారమైన ప్రేమ, కరుణ, empathy ప్రతీ అక్షరంలోనూ మనకి తెలిసిపోతాయి. అలాగని కష్టాలు, కన్నీళ్ళు లేని కల్పిత గాథలు కావవి. నేలలోంచి పుట్టుకొచ్చిన అసలుసిసలైన పాత్రలు. వేర్లు ఈ భూమిలో పాతుకుపోయిన నిజమైన పాత్రలవి. ప్రతీవారికీ ఉండే సందిగ్ధాలూ, సందేహాలు, ఆటుపోట్లు, ఇక్కట్లు, మానసిక సంఘర్షణలు అన్నీ వాటికి ఉంటాయి. కానీ ఆ చిక్కుముళ్ళను విడదీసుకోవడానికి తన పాత్రలకు మైథిలీ గారు ఇచ్చే వీలు గొప్పది. తన పాత్రలను అనంతమైన భవసాగరాల్లో కొట్టుకుపోయేలా చేసి, ఆనందించే...

మాది తాడేపల్లిగూడెం. మా ఊర్లో ‘అమృత హాస్పిటల్స్’ ప్రముఖ ప్రసూతి ఆసుపత్రి. దాని యజమాని డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారు. వారి భర్త డాక్టర్ శ్రీనివాస్ గారు, మా నాన్నగారు మంచి స్నేహితులు. మా పెద్దనాన్న గారి అమ్మాయి ప్రసవం మైథిలి గారే చేశారు. అలా చిన్నప్పటి నుంచి నాకు, మా అక్కకి మైథిలి గారు బాగా తెలుసు. మేమూ ఊరికే అటువైపుగా వెళ్తూ ఆ హాస్పిటల్ లోకి వెళ్ళేవాళ్ళం. నర్స్ ని అడిగి ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి ‘ఎలా ఉన్నారు ఆంటీ?’ అంటూ పలకరించేవాళ్ళం. నిజానికి నాకు మొహమాటం ఎక్కువ నేనలా చూస్తూ నిలబడిపోయేదాన్ని అంతే. మా అక్క ఎవరి దగ్గరైనా త్వరగా చనువు తీసుకుంటుంది. తనే ఆవిడతో ఓ ఐదు నిమిషాలు కబుర్లు చెప్పేది.

ఎక్కువగా ఆపరేషన్ సమయంలో వేసుకునే స్క్రబ్స్ వేసుకునేవారు. ఎప్పుడు ఎవరికి పురుడు పోయాల్సి వస్తుందో తెలీదు కాబట్టీ ఎప్పుడూ తయారుగా ఉండాలి కదా అందుకని చెవి దుద్దులు, మెళ్ళో గొలుసులు, గాజులు ఇలా హడావిడి ఉండేది కాదు. మొహాన చిన్న బొట్టు, మెళ్ళో ఒక నల్లపూసల దండ అంతే. పాల నురుగులాంటి తెల్లటి మనిషి. హాయైన నవ్వు. కాటుక పెట్టకపోయినా నిండైన కళ్ళు. ఎంత అలసటగా ఉన్నా ఆ కళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవి. అసలు ఆవిడతో మాకేం కబుర్లు ఉంటాయి. కేవలం ఆవిడ మొహం చూడడానికి, కాసేపు ఆ చల్లదనాన్ని అనుభవించడానికే అలా వెళ్ళేవాళ్ళం. మాకు తెలిసిన ఒక డాక్టర్ ఆవిడ, అప్పటికి మాకు అంతే తెలుసు.

మేం పెద్దవాళ్ళం అయ్యాకా, facebook లు, blogల లోకంలో పడ్డాం. అప్పట్లో అన్నయ్యే ఈ social media లోకంలోకి నాకు ప్రవేశం చేయించాడు. చాన్నాళ్ళు నేను, అన్నయ్య ‘సాహిత్యం’ అనే ఒక FB group ని బాగా ఫాలో అయ్యేవాళ్ళం. అందులో వచ్చే పోస్ట్ లు ఎంత అద్భుతంగా ఉండేవో. పాశ్చాత్య సాహిత్యం దగ్గర నుండి ప్రాచీన సాహిత్యం దాకా అన్నిటినీ స్పృశించే పోస్టులు అవి. తీరా చూస్తే group పెట్టిన ఆమె పేరు ‘మైథిలి అబ్బరాజు’. ఎక్కడో విన్నామే ఈ పేరు అని చూస్తే మా డాక్టర్ మైథిలీ ఆంటీనే ఈ మైథిలి అబ్బరాజు. చిన్నప్పుడు ఆవిడ రూం తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి ఆవిడ లావణ్యాన్ని తిలకించే నేను, ఇప్పుడు ఆవిడ FB wall తెరిచి ఆవిడ సాహితీ లావణ్యాన్ని చదివేదాన్ని.

ఇప్పుడు కూడా నాకు మొహమాటమేగా. అన్నయ్య ఆవిడను తిరిగి ఓ సాహితీవేత్తగా పరిచయం చేసుకున్నాడు. వాళ్ళు గంటలు గంటలు మాట్లాడుకునేవారు. అవి తిరిగి వచ్చి నాకు చెప్పేవాడు. నేను మురుసుకునేదాన్ని. మైథిలి గారంటే ఎంత ఇష్టమో, దగ్గరకి వెళ్ళాలంటే అంత మొహమాటం నాకు. ఆవిడే కాదు, ఆవిడ రాతలు కూడా నాకు అందీ అందనట్టే ఉంటాయి. ఎంతో అర్ధమైనట్టు అనిపిస్తుంది, కానీ ఆ శైలిలో ఏదో ఒక మెలిక అల్లంత దూరాన ఇంకా ఉంది అని చూపెడుతుంది. ఆ అర్ధోక్తులు, ఆ విరుపులు అన్నీ ఆవిడకీ నాకూ ఉన్న అనుబంధంలాగానే ఆకర్షణీయంగా ఉన్నా, ఎదురుపడలేనంత మొహమాటంలా అనిపిస్తాయి.

నాకు చాలామంది రచయితలు ఇష్టం. ప్రతీ సందర్భానికి, ప్రతీ mood కి నాకు నిర్దుష్టమైన రచయితలు ఉంటారు. అయితే ఎప్పుడైనా మనసు భారంగా అనిపించినప్పుడు, నవ్వుకోగలిగిన హాయి లేదనిపించినప్పుడు, కానీ ఏదైనా సాంత్వన కలిగించేవి చదవాలనిపించినప్పుడు, ముఖ్యంగా బయట చక్కటి వాన పడుతున్నప్పుడు నాకు చదవాలనిపించే రచయితలు ముగ్గురే. ఒకరు వంశీ, రెండు సత్యం శంకరమంచి, మూడు మైథిలీ గారు. ఆవిడ కథలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఇప్పటికి కొన్ని పదులసార్లు ఆ కథల్ని చదివాను. చదివిన ప్రతీసారీ ఇదే మొదటిసారి ఈ కథ చదువుతున్నానా అనే భావన నన్ను చుట్టుముట్టేస్తుంది. మొట్టమొదటిసారి కలిగిన విస్మయం, ఆనందం, ఉద్వేగం ఎన్నిసార్లైనా నన్ను అల్లుకుపోతాయి.

తన పాత్రలపై ఆవిడకి ఉండే అపారమైన ప్రేమ, కరుణ, empathy ప్రతీ అక్షరంలోనూ మనకి తెలిసిపోతాయి. అలాగని కష్టాలు, కన్నీళ్ళు లేని కల్పిత గాథలు కావవి. నేలలోంచి పుట్టుకొచ్చిన అసలుసిసలైన పాత్రలు. వేర్లు ఈ భూమిలో పాతుకుపోయిన నిజమైన పాత్రలవి. ప్రతీవారికీ ఉండే సందిగ్ధాలూ, సందేహాలు, ఆటుపోట్లు, ఇక్కట్లు, మానసిక సంఘర్షణలు అన్నీ వాటికి ఉంటాయి. కానీ ఆ చిక్కుముళ్ళను విడదీసుకోవడానికి తన పాత్రలకు మైథిలీ గారు ఇచ్చే వీలు గొప్పది. తన పాత్రలను అనంతమైన భవసాగరాల్లో కొట్టుకుపోయేలా చేసి, ఆనందించే గుణం ఆమెకి లేదు. ఆ సాగరాలు ఎదురీదగలిగే శక్తి, సామర్ధ్యాలు ఆమె ప్రసాదిస్తారు వాటికి. ‘సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత’ అయిన అమ్మవారి శక్తి ఈ రచయిత్రిలోకి ఆవహించిందేమో.

ఆమె పాత్రలు నవనీతంతో చేసినంత మృదువుగా ఉంటాయి. ఆమె పదాలు సన్నజాజి రేకులంత సున్నితంగా ఉంటాయి. ఆమె కల్పన సంపెంగ తావి అంతటి మధురంగా ఉంటుంది. ఆమె పాత్రలకి పెట్టే పేర్లు అంత నాజూకుగానూ, అంత అందంగానూ ఉంటాయి. అచ్చంగా మన పిల్లలకి తెచ్చి పేర్లు పెట్టుకోగలిగినంత అద్భుతంగా ఉంటాయి. ఆమెకు సంగీత, సాహిత్య, చిత్రకళా రంగాల్లో ఉన్న ప్రవేశం ఆమె కథలు చదివితే అర్ధమైపోతుంది. నిజ జీవితంలో మానసిక సంఘర్షణలు ఎంతటి ధృడమైనవో, అవి జీవితంలో ఎంతటి సమయాన్ని తీసేసుకుంటాయో ఆమె కథల్లో మనం చూడవచ్చు. 

నేను చదివినంతలో మానసిక సమస్యలకు అందునా, స్త్రీల అంతరంగంలో దాగిపోయే మానసిక సంఘర్షణలకు ఒక అద్దంలా నిలిచిన రచనల్లో మైథిలిగారి కథలు నాకు చాలా ఇష్టమైనవి. వీణని మీటి ఆపేసిన తరువాత కూడా తంత్రులు ఎలా అయితే నాదం చేస్తూనే ఉంటాయో, ఆమె కథలు చదివి పక్కన పెట్టేశాకా కూడా మనలో ప్రకంపనలు అలా వస్తూనే ఉంటాయి. ఇక విశ్వనాథ సత్యనారాయణ గారిని తాతగారిగా గౌరవించుకునే ఆమె శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, పోతన, జగన్నాథ పండితరాయల వంటి చరిత్ర పురుషుల జీవితాలను కథలుగా మలిచిన తీరు చూస్తే అబ్బురపడాల్సిన పనిలేదు. విశ్వనాథ వారి నుండే ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారని చక్కగా చెప్పచ్చు. 

విశ్వనాథ వీర భక్తులు, నాకు అన్నయ్య అనదగ్గ వారు డాక్టర్ కౌటిల్య చౌదరిగారిని ప్రధాన పాత్రగా ఊహించి, విశ్వనాథ వారికి జీవితం చేసిన అన్యాయం, ఆయన ధర్మపత్నీ వియోగాన్ని తప్పించే ప్రయత్నం ‘సంజీవరాయుడు’ కథలో చేసిన మైథిలి గారికి విశ్వనాథ అభిమానులందరూ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. కనీసం కథలోనైనా విశ్వనాథ వారి కష్టాన్ని తీర్చినందుకు. ఇలా ఎన్ని కథల గురించి చెప్పగలను. ఎంత చెప్పినా నాకు తనివి తీరదు. మీకూ తీరదు. కాబట్టీ, ఈ వారం తన్మాత్ర కథల సంపుటి విడుదల అవుతోంది మన దాసుభాషితంలో. మీరూ విని చూడండి. మీకు సాంత్వన కావాల్సినప్పుడు ఈ కథల పుస్తకం మరోసారి వినాలనిపించకపోతే పైసా వాపస్.

Tap to Listen

ఈ పుస్తకం ఎలా తీసుకురాగలిగానో అది కూడా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా. ఓరోజు మైథిలి ఆంటీకి ఫోన్ చేశా. నేను ఇలా దాసుభాషితంలో పనిచేస్తున్నాను. మీ కథలన్నిటినీ కలిపి సంపుటిగా మా దాసుభాషితంలో తెచ్చుకోవచ్చా అని అడిగాను. ‘నిక్షేపంగా తీసుకో, అయితే వాటిని మొదట పుస్తకరూపంలో చూడలన్నది నా కోరిక. కానీ చేసే తీరిక లేదు. త్వరలోనే పుస్తకంగా తెస్తాను. వెంటనే నువ్వు ఆడియో పుస్తకంగా తెచ్చెయ్. కానీ ఒక్కోటీ ఒక్కో చోట ఉన్నాయి. చాలా సమయం పట్టేలా ఉంది’ అన్నారు. నేను రెండురోజుల్లో ఎక్కడెక్కడో ఉన్న కథలన్నిటినీ ఒక ఫోల్డర్ లో వేసి, ఆవిడకి పంపాను. నా శ్రద్ధకి ఆవిడ చాలా మురుసుకున్నారు. పుస్తకం ప్రింట్ అయ్యింది, విడుదల అయ్యింది. కాపీ చేతిలోకి తీసుకున్న వెంటనే నాకు ఓ surprise.

మొదటి పేజిలోనే ‘చి. మీనా గాయత్రికి కృతజ్ఞతలు’ అని ప్రింట్ చేసి ఉంది. నేను చేసిన ఉడుత సాయానికి అక్షరాల చారలతో అలా బదులిచ్చారన్నమాట. అదీ ఆమె ప్రేమ. గోడ పక్కన నుంచుని ఆమె అందం, నవ్వు, మాటలు వినే చిన్నారి మీనా, FB గోడపై ఆమె రాతలు, కథలు, ఆమెకి ఇష్టమైన పెయింటింగ్ లూ చూస్తూ గడిపేసిన ఒకనాటి మీనా, ఆమె పుస్తకంలో పేరు సంపాదించి, ఆమె పుస్తకాన్ని ఆడియో రూపంలో విడుదల చేస్తూ ఈ వ్యాసం రాసిన మీనాని చూస్తే ఎంత గర్విస్తారో తెలుసా? ఇప్పటికీ నేను ఆవిడతో అన్నయ్యలాగా, అక్కలాగా బోలెడు కబుర్లు చెప్పలేదు. ఓ పక్కన నుంచుని గమనించడంలోనే నాకు బోలెడు శాంతినిచ్చారు కనుక ఆ అవసరం లేదు. 

ఎంతైనా ఆత్రేయగారు అన్నట్టు ‘అందీ అందని అందమె ముద్దు’.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :