సినీ సారస్వతాక్షర సారథులు

Meena Yogeshwar
October 4, 2023

బతుకు నుంచి చావు దాకా, ప్రేమ నుంచి విరహం దాకా, నవ్వు నుంచి విషాదం దాకా, విప్లవం నుంచి శాంతి దాకా దేని మీదైనా వాళ్ళ అభిప్రాయం వెలువడని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు. కథా గమనానికే కాదు అప్పుడప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో మన జీవితం ఇరుక్కుపోయినప్పుడు కూడా తమ అక్షరాలతో ముందుకు నడపడానికి సారధ్యం వహించడమే వాళ్ళ పని. మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందర్భాలలోనూ ఆ సినీ సాహిత్య కర్షకుల ఫలాలను ఉపయోగించుకున్నవాళ్ళమే మనమందరం. సాహితీ లోకంలో ఇప్పటికీ చాలా చిన్న చూపు చూడబడుతున్న....

తెలి మంచు కరిగిందని ప్రభు తలుపులు తీసేదీ వాళ్ళే. అదే చేత్తో తెల్లారింది లెగండో కొక్కొరొకో అని పల్లెను లేపేదీ వాళ్ళే. మనసుల మల్లెల మాలలు ఎలా ఊగుతాయో ముందు తెలిసేది వాళ్ళకే. చందమామ తొంగి తొంగి చూసి, సరసను ప్రియుడు లేడని ఎలా అలకలు బూనాడో వాళ్ళే చెప్పగలరు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు కలలే ఫలం అని ఘంటా బజాయించి చెప్పగల నిపుణులు వాళ్ళు.

మిన్నేటి సూరీడు వస్తే పల్లె కోనేటి తామర్లు ఎలా విచ్చుతాయో వాళ్ళ దగ్గర పేజీ థీసిస్ ఉంటుంది. పరువాలే ప్రణాయలవుతాయని, స్వప్నాలే స్వర్గాలవుతాయని, అసలు ఆకాశం ఏనాటిదో అనురాగం అనాటిదని నిరూపించి చూపించే సైంటిస్ట్ లు వాళ్ళు. తెల్లారిపోతున్నా లోకాన చీకటి, వాసనలు వీచే ఆమె కురులలో ఉందని ఒకరు అంటారు. పట్టపగలు ఎవరైనా రాతిరిని చూస్తానంటే తన కురులు చూపిస్తే చాలు అంటారు మరొకళ్ళు.

బిడ్డడి చిరు బోసి నవ్వు అమ్మకి జాజి పువ్వు అనీ, వీధినే పడి వాడిపోతుందో - దైవ సన్నిధి చేరుతుందో చెప్పలేమంటూ ఆడజన్మకు ఎన్ని శాపాలో తలుచుకుని బాధపడతారు. కలవని జంటల మంటలలో కనిపించే ప్రేమ, కలిసిన తరువాత ఏమౌనో ఆలోచించమని హెచ్చరిస్తారు. ముందు తరాలకు చితుల స్మృతులు ప్రేమికులు అందించనవసరం లేదు అని గుర్తుచేస్తారు వాళ్ళు. ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో, ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో అంటూ ప్రోత్సహిస్తారు. ఇదంతా కాదు, రేయింతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ క్రాంతే నువ్వు వెతికే సంక్రాంతి అని మనం గుర్తించేలా చేస్తారు.

బతుకు నుంచి చావు దాకా, ప్రేమ నుంచి విరహం దాకా, నవ్వు నుంచి విషాదం దాకా, విప్లవం నుంచి శాంతి దాకా దేని మీదైనా వాళ్ళ అభిప్రాయం వెలువడని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు. కథా గమనానికే కాదు అప్పుడప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో మన జీవితం ఇరుక్కుపోయినప్పుడు కూడా తమ అక్షరాలతో ముందుకు నడపడానికి సారధ్యం వహించడమే వాళ్ళ పని.

మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందర్భాలలోనూ ఆ సినీ సాహిత్య కర్షకుల ఫలాలను ఉపయోగించుకున్నవాళ్ళమే మనమందరం. సాహితీ లోకంలో ఇప్పటికీ చాలా చిన్న చూపు చూడబడుతున్న ఆ సినీ సరస్వతి ముద్దుబిడ్డలు వారు. అలాంటి మన సినీ కవుల గురించి, వారి పాటల గురించి మనతో ముచ్చటించేందుకు, రచయిత, ప్రముఖ కోరన్ శ్రీ నళినీకాన్త్ వల్లభజోస్యుల గారు అక్టోబరు మొదటి శనివారం ఉదయం 9.30గంటలకు మన దాసుభాషితం ప్రసంగాలులో రాబోతున్నారు. 

తెలుగు ప్రేక్షకుని నాడి తెలిసి, కవిత్వాన్ని సామాన్యుని స్థాయికి దించగలిగే పరుసవేది విద్య తెలిసిన మన సినీ కవులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటారుగా.

ది లాస్ట్ డేస్ ఆఫ్ పాంపేయ్ - విశ్లేషణ

Tap to Listen

చారిత్రిక కాల్పనిక సాహిత్యం అనేది చాలా ఆసక్తికరమైనది మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా రాయవలసినది కూడా. చరిత్ర, సంఘటనలు, పాత్రలు, మలుపులు, ముగింపులు ఇలా ఎన్నో విషయాలు స్థిరపడిపోయిన పునాదుల మీద, వాటి అందం చెడకుండా సాహిత్య సృష్టి చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. అలా వచ్చిన ఎన్నో నవలలు, నాటకాలు, కథలు క్లాసిక్స్ స్థాయిని అందుకున్నవి కొన్ని. వెంట్రుకవాసి తేడాలో పుక్కిటి పురాణాలన్న పేరును మూటగట్టుకున్నవి కొన్ని. 

మానవ చరిత్రలో ఎన్నో నగరాలు, జాతులు, నాగరికతలు, దేశాలు, ఖండాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందరో ప్రేమికులు, రాజులు, పేదలు, జగజ్జేతలు, ధర్మాత్ములు, రాక్షసులు ఈ మట్టిలో కలిసిపోయారు. అప్పుడప్పుడు వాళ్ళ కథలు, ఆ ప్రాంతాల చరిత్ర బయటపడుతుంటాయి. మునిగిపోయిన మన ద్వారక కథలు మనకి తెలిసినట్టే, గడిచిపోయిన మన హంపి వైభవం మనకు గుర్తున్నట్టే, ఇటలీ ప్రాంతంలో అగ్నిపర్వతపు బూడిదలో మసైపోయిన పురాతన నగరం ‘పాంపేయ్’ గురించి, ఆ నగరవాసుల కథల గురించి అక్కడి వారు కూడా గుర్తుపెట్టుకున్నారు.

ఇంగ్లండులో ప్రముఖ రాజకీయనాయకుడు, రచయిత అయిన లార్డ్ ఎడ్వర్డ్  లిట్టన్ రాసిన ఈ నవల పాంపేయ్ నగరపు ఆఖరి రోజుల్లో జరిగిన ఒక ప్రేమ కథను చిత్రిస్తుంది. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. ఈ నవల వెంట్రుకకు అటు ఉందా, ఇటు ఉందా అని ఈ విశ్లేషణ విని మీరే తెలుసుకోండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :