దీనికన్నా సిగరెట్లు కాల్చడం నయం ఏమో..!?

Meena Yogeshwar
December 4, 2025

అలవాటుకి, వ్యసనానికి తేడా ఏమిటీ? మనల్ని మనం ఎలా అంచనా వేసుకోవాలి? గీతకి ఇటు ఉన్నామా, అటు ఉన్నామా అనేది ఎలా తెలుసుకోవాలి? అసలు ఒక వ్యసనం అవ్వడానికి మన మెదడు ఎలా పనిచేస్తుంది. వ్యసనంలో ఉన్నప్పుడు మెదడు ఎలాంటి మార్పులకు లోనవుతుంది? ఈ కాలంలో చిన్నా పెద్దా తేడాలేకుండా ఆబాలగోపాలం పడి ఈదుతున్న వ్యసనం ఫోన్ అని మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి మానసిక వ్యసనాలు ఇంకెన్ని ఉన్నాయి? ఇలాంటివన్నీ...

నేను పొద్దున్నే 4గంటలకి లేస్తాను. ఇల్లు, వాకిలి, అంట్లు బయట వేయడం, స్టౌ గట్లు తుడవడం, డైనింగ్ టేబుల్ తుడవడం, చెత్త బయటపెట్టడం లాంటి పన్లు అయ్యేటప్పటికీ 5 అవుతుంది. స్నానం చేసి 5-6 పూజ. 6గంటలకి చేతిలో వేడినీళ్ళ కప్పుతో నా రిక్లైనర్ కుర్చీలో కూలబడతాను. అప్పుడు అతుక్కుంటుంది అది నా చేతికి. శివుడి చేతికి బ్రహ్మగారి కపాలం అతుక్కున్నట్టు. ఫోన్ అనే బ్రహ్మ పదార్ధం. పనికిమాలిన వీడియోలు మొదలుకొని geopolitical విషయాల దాకా అన్ని రకాల వీడియోలూ మనకే కావాలి.

అక్కణ్ణుంచి బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసేటప్పుడు, టిఫిన్ వండేటప్పుడు, తినేటప్పుడు, బట్టలు ఆరేసేటప్పుడు, పనమ్మాయి తోమిన అంట్లు సర్దేటప్పుడు, కూరలు తరిగేటప్పుడు, వండేటప్పుడు చెవిలో జోరీగ మోగుతూనే ఉంటుంది. ఏదోటి వినాల్సిందే, చూడాల్సిందే. ఆఫీస్ పనిలో కూడా సగం ఈ వినే పనే కాబట్టీ ఇంక చెప్పక్కర్లేదు మన సంగతి. అన్నం తినేటప్పుడు ఎలానూ టీవీ ఉండాలి మా దేవుడికి. ఆయన వెళ్ళాకా, కాస్త నడుం వాలిస్తే ఫోన్ గారు కూడా ఉండాల్సిందే. చూస్తూ చూస్తూ చంటిపిల్లలా పడుకోవడం. లేచాకా, ఆఫీస్ పని వలన కాస్త ఫోన్ కీ, నాకూ ఎడబాటు.

మళ్ళీ సాయంత్రం పని, వంట సమయాల్లో చేవిలో ఉప ఆయుధం, ఎదురుగా అసలు ఆయుధం ఉండాల్సిందే. పూజ దగ్గర కూడా స్తోత్రాలు sponsor చేసేది ఫోన్ మేడమే. ఇక పడుకునే ముందు మా ఇద్దరి favorite hobby, రీల్స్ చూసి నవ్వుకోవడం. కర్ణుడి కవచకుండలాల్లా ఈ ఫోన్ నాకు అతుక్కుపోయింది. ఎంతలా అంటే, చెప్పాలంటే అసహ్యంగా ఉంటుంది కానీ, బాత్ రూమ్ కి వెళ్ళాలన్నా, ఏదో ఒక పాడ్ కాస్ట్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ లో వింటున్నాను. అంత నీచానికి దిగజారిపోయాను నేను. దుబాయ్ శీను సినిమాలో సునీల్ లాగా ‘బాబోయ్.. ఆపేయ్ ఆపేయ్.. ఏముంది ఇందులో నీ దైద్రం తప్ప’ అని మీరు తిట్టుకుంటున్నారని నాకు తెలుసు.

ఇంత దైద్రంలోనూ నాకున్న ఒకే ఒక మంచి లక్షణం ఏమిటంటే, నన్ను నేను బండబూతులు తిట్టుకోవడం. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో బంట్రోతులా బూతులు తిట్టుకోవడం కాదు, మామూలు మనుషులు తిట్టుకునే విధానంలో తిట్టుకోవడం. అదే లెండి దాన్నే పెద్ద చదువులు చదువుకున్నవారు ‘self analysation’, ‘self assessment’ అంటుంటారు. ఇంత ఘోరంగా ఫోన్ కి బానిస అవ్వడం అనేది నా జీవితంలో కొన్ని దశల్లో పెరుగుతుంది, కొన్ని దశల్లో తగ్గుతుంది. ముఖ్యంగా నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నాతో నేను మాట్లాడే ధైర్యం లేనప్పుడు ఎక్కువగా ఇలా ఫోన్ కి addict అవుతాను అన్నది నన్ను నేను పరిశోధించి, శోధించి, దించి, ఛీ ఛీ అనుకున్నప్పుడు అర్ధమైన విషయం.

నేను ఇంతగా ఫోన్ చెప్పు చేతల్లో బతికి, ఇది పద్ధతి కాదని తెలుసుకుని, గొప్ప ప్రయత్నం చేసి, విఫలం అయ్యి, మళ్ళీ ప్రయత్నించి దాని నుండి బయటకి వచ్చి ఓ రెండేళ్ళు అవుతోంది. ఈ రెండేళ్ళలో నేను యోగిని ని అయిపోలేదు కానీ, ఫోన్ నన్ను శాసించడం కాకుండా, నేను ఫోన్ ని ఉపయోగించడం నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో అంతకు ముందు నా daily screen time రోజుకి 7గంటలు ఉండేది. కష్టపడి దానిని 2గంటలకు తేగలిగాను. ఇప్పటి స్క్రీన్ టైం చెప్తే మీరందరూ చందాలు వేసుకుని మరీ నన్ను de-addiction centerలో చేర్చేస్తారేమో వద్దులే. 

4నెలల క్రితం ఎప్పుడైతే నాన్నగారు వెళ్ళిపోయారో, నా మానసిక ఆరోగ్యంపై గట్టిదెబ్బ తగిలింది. ఎన్నో ప్రశ్నలు, ఎంతో కోపం, ఎంతో వేదన, విపరీతమైన బాధ. నాలో నేను ఒక 5 నిమిషాలు అస్సలు సంబంధంలేని ఏదో విషయం గురించి మాట్లాడుకుంటే, ఆరో నిమిషం నాన్నగారి దగ్గరే తేలుతున్నాను. 

ఉదాహరణకి, ‘బాబోయ్ చెప్పులు ఘోరంగా ఉన్నాయి. మార్చేయాలి. బాటాలో clearance sale అన్నారు చూస్తే పోలే. నా బొందలా ఉంటాయి అక్కడ మోడల్స్. దానికన్నా సూర్యారావుపేటలో లోకల్ చెప్పుల షాపులో బ్రాండ్ లేని మామూలు చెప్పులు నయం. మోడల్ కి మోడలు, రేటు తక్కువ, మన్నిక ఎక్కువ. ఆ.. నా మొహం బయటకి వెళ్ళేవాళ్ళకి చెప్పులు కావాలి కానీ, గుమ్మం దాటని నాకెందుకు లే. ఏమో ఏ క్షణం ఏం అవసరం ఉంటుందో ఏం చెప్పగలం. మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా? నాన్నగారి కోసం అర్ధరాత్రి 11గంటలకి పరుగులు పెడుతూ వెళ్తానని, జీవం లేకుండా చూస్తానని అనుకున్నానా?’ ఇలా ఉంది పరిస్థితి.

అందుకే, ఆటోమేటిగ్గా నా బుర్ర నన్ను ఈ లూప్ లో నుండి కాపాడడానికి తీసుకున్న నిర్ణయం Phone Addiction. సాధారణంగానే నేను addictionsకి త్వరగా addict అయ్యే మనిషిని. ఒకప్పుడు thumps up ని మంచినీళ్ళలా తాగి, gallbladder తీయుంచుకునే స్థితికి తెచ్చుకున్న ఘనురాల్ని. అప్పుడప్పుడూ అనిపిస్తుంది, నేను ఆడపిల్లని కాబట్టీ సరిపోయింది, అదే మొగపిల్లాణ్ణి అయితే, సిగరెట్లకి, మందుకి అలవాటు పడి ఇంకా ఘోరంగా తయారయ్యేదాన్నేమో అని. నాలో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటో పైన చెప్పాను కదా. దాని దయవల్ల నన్ను నేను assess చేసుకుని, మారగల శక్తి నాలో ఉంది. కాకపోతే ఆ శక్తి ఎప్పుడూ గురకపెట్టి నిద్రపోతుంది అనుకోండి కుంభకర్ణుడిలా. లేపడం చాలా కష్టం.

ఆరోగ్య సమస్యల కారణంగా చాలా త్వరగా లావు అవ్వగల నేను, తలుచుకుంటే ఒళ్ళు తగ్గడం కూడా బాగా తెలుసు. అలాగే ఇలాంటి addiction లలోకి త్వరగా వెళ్ళే నేను, బయటకి రావడం కూడా నాకు వచ్చిన పనే. ప్రస్తుతానికి రోజుకి ఒక అరగంట పుస్తకం చదవడం అనే పని పెట్టుకుని, నా phone addiction పై పని చేస్తున్నాను నేను. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు. అవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే, ఏదైనా త్వరగా జరిగితే, అది reverse అవ్వడానికి కూడా అట్టే సమయం పట్టదు. పైగా ఇంకా నేను పూర్తిగా నాన్నగారి నిష్క్రమణం నుండి కోలుకోలేదు. కోలుకునేందుకు ప్రయత్నించడానికి కూడా నేను సిద్ధంగా లేను. కాబట్టీ ఈ మీనా యోగీశ్వరికి కాశీ పోయినా, చేతిలోని ఈ ఫోను కపాలం ఊడిపడడం కష్టం.

నేనంటే మహానుభావురాల్ని కాబట్టీ, నేనెంత గోతిలో దిగిపోయానో నాకు తెలుసు. కానీ అందరూ అలా కాదు కదా పాపం. చాలామంది అలవాటు నుండి వ్యసనంలోకి ఎప్పుడు దిగిపోయామన్నది తెలియకుండానే గడిపేస్తారు. కొన్నాళ్ళకి ఆ అలవాటు మనల్ని మొత్తంగా ముంచేసేదాకా మేలుకోలేరు. కొందరు ముంచేసాకా కూడా లేవరు అనుకోండి, వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. 

Tap to Listen

అయితే, అలవాటుకి, వ్యసనానికి తేడా ఏమిటీ? మనల్ని మనం ఎలా అంచనా వేసుకోవాలి? గీతకి ఇటు ఉన్నామా, అటు ఉన్నామా అనేది ఎలా తెలుసుకోవాలి? అసలు ఒక వ్యసనం అవ్వడానికి మన మెదడు ఎలా పనిచేస్తుంది. వ్యసనంలో ఉన్నప్పుడు మెదడు ఎలాంటి మార్పులకు లోనవుతుంది? ఈ కాలంలో చిన్నా పెద్దా తేడాలేకుండా ఆబాలగోపాలం పడి ఈదుతున్న వ్యసనం ఫోన్ అని మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి మానసిక వ్యసనాలు ఇంకెన్ని ఉన్నాయి? ఇలాంటివన్నీ ఈవారం విడుదల అవుతున్న ‘వ్యక్తిత్వ వికాసం’ లెసెన్ లో రచయిత్రి, గాత్ర కళాకారిణి శ్రీమతి ఏలూరిపాటి అనుపమ గారు వివరిస్తారు. దీనితో పాటు ఆత్మక్రమశిక్షణ గురించి కూడా మరో లెసెన్ విడుదల అవుతోంది. తప్పకుండా వినండి. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి.

P.S. ఈ న్యూస్ లెటర్ రాసేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చూశావ్ అని అడిగేవాళ్ళకి -10మార్కులు. మారే వాళ్ళని encourage చేయండమ్మా, వెటకారం కాదు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :