కాశీకి పోయాడు రామా హరి..!

Meena Yogeshwar
February 19, 2024

కాశీకి శిష్యసంచారం చేసుకుంటూ వెళ్ళిన వ్యాసుడికి అన్నం దొరకక కాశీనే శపించబోతే, సాక్షాత్తూ అన్నపూర్ణమ్మే వచ్చి అన్నం పెట్టిందని ఐతిహ్యం. కాశీని చెరబట్టిన ఒక రాజును నిర్మూలించి, శివుడి కోసం కాశీ గెలిచిపెట్టిన సూర్యుడు, కాశీపై ప్రేమతో లోలార్కుడిగా(ప్రేమలో పడ్డ సూర్యుడు అని అర్ధం) కాశీలో స్థిరపడిపోయాడని చెప్తారు.ఒకరికి ఒకలా, మరొకొరికి మరోలా కనిపించడంలో అంతరార్ధం ఏమిటి? కొందరికి తనపై ప్రేమ పెరిగేంతలో, కొన్ని చేదు అనుభవాలు రుచి చూపిస్తుంది కాశీ. ఆ అనుభవాలు ఎంత ఎక్కువ ఉంటే ఆ నగరంపై మోహం అంత తక్కువ అవుతుంది. మరి మన కొత్తపల్లి సీతా రాముడికి ఎలా కనిపిడింది?

కాశీకి శిష్యసంచారం చేసుకుంటూ వెళ్ళిన వ్యాసుడికి అన్నం దొరకక కాశీనే శపించబోతే, సాక్షాత్తూ అన్నపూర్ణమ్మే వచ్చి అన్నం పెట్టిందని ఐతిహ్యం. కాశీని చెరబట్టిన ఒక రాజును నిర్మూలించి, శివుడి కోసం కాశీ గెలిచిపెట్టిన సూర్యుడు, కాశీపై ప్రేమతో లోలార్కుడిగా(ప్రేమలో పడ్డ సూర్యుడు అని అర్ధం) కాశీలో స్థిరపడిపోయాడని చెప్తారు. 

సూర్యుణ్ణి అధిగమించేంతగా ఎదిగిపోతున్న వింద్యపర్వతాన్ని వంచేందుకు దక్షిణానికి ప్రయాణమవ్వమని శివుడు ఆజ్ఞాపిస్తే, కాశీని వదిలి వెళ్ళిపోతున్నందుకు కుమిలి కుమిలి బాధపడ్డాడట అగస్త్య మహర్షి. అంత దూరం ఎందుకు? మొన్నీ మధ్య ప్రముఖ షహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ ను అమెరికాలో ఉండిపొమ్మని అక్కడి వారు అడిగితే, నా కాశీలో ప్రవహించే గంగను కూడా ఇక్కడికి తెచ్చేయండి, అలాగే ఉండిపోతా అన్నారట.

ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా కాశీ ఘాట్ లు తనకి ఇచ్చే స్ఫూర్తితోనే ఎన్నో డాక్యుమెంటరీలు తీశానని, అమెరికాలో ఉన్నా కాశీ ఎప్పుడూ తనతోనే ఉంటుందనీ చెప్పుకున్నారు. ఇంకో షెఫ్ రణ్ వీర్ బ్రార్ కూడా కాశీ గాలీ, నీరు, మట్టి ఎన్నో రెసిపీల ఐడియాలు ఇస్తుంది అని చెప్పారు. ఇలా పురాణకాలం నుండి నేటివరకూ ఎందరినో కాశీ తన ప్రేమలో పడేసుకుంది. ఎందరినో తన పిచ్చివాళ్ళను చేసుకుని, తన చుట్టూ తిప్పించుకుంది. మరి అందరికీ ఇదే అనుభవం ఉంటుందా? ఆ ప్రశ్నకి సమాధానం కాదు అనే చెప్పాలి. కాశీ ఒక్కొరికి ఒక్కో అనుభవం ఇస్తుంది.

ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండే ఏకైక ప్రదేశం కాశీ నగరం అంటున్నాయి మన పురాణాలు. భారతీయులందరికీ కాశీ చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలని ప్రతీవాళ్ళూ కోరుకుంటారు. కాశీకి వెళ్ళొచ్చిన వారికి ఊరి చివరే పాద పూజ చేసి ఇంటికి తీసుకువెళ్ళేవారట ఒకప్పుడు. ఇప్పటికీ కాశీ నుండి వచ్చే ట్రైన్ దగ్గర ఇలా పాద పూజ చేసే కుటుంబాలు కనీసం ఒకటి, రెండైనా కనపడడం పరిపాటి. 

కాశీలో మరణించేవారికి స్వయంగా శివుడే చెవిలో తారకమంత్రం చెప్తాడని నమ్ముతారు మనవాళ్ళు. అలా అక్కడే మరణించేందుకు వృద్ధాప్యం వచ్చాకా, కాశీకి మకాం మార్చి అక్కడే చనిపోయినవారు ఎందరున్నారో, మనవడు/మనవరాలి పెళ్ళి చూసి, తిరిగి కాశీ వెళ్ళిపోదాం అని ఊరు వచ్చి, ఇక్కడ చనిపోయినవారూ అందరే ఉంటారు.

అక్కడి సన్నటి సుందులు కొందరికి సరదా కలిగిస్తే, కొందరికి ఆ సందులలోని అశుభ్రత విసుగు పుట్టిస్తుంది. కొందరికి గంగ ప్రశాంతతనిస్తే, మరికొందరికి అందులోని బురద, చెత్త ఇబ్బంది పెడుతుంది. కొందరికి విశ్వనాథుడు విరాట్ స్వరూపంలో దర్శనమిస్తే, మరికొందరికి ఆ దర్శనం కనిపించనీయకుండా దళారులు, అంగడివాళ్ళు, పాన్ పరాగ్ లు, ఆటోల వాళ్ళు అడ్డుకుంటారు. 

ఒకరికి ఒకలా, మరొకొరికి మరోలా కనిపించడంలో అంతరార్ధం ఏమిటి? కొందరికి తనపై ప్రేమ పెరిగేంతలో, కొన్ని చేదు అనుభవాలు రుచి చూపిస్తుంది కాశీ. ఆ అనుభవాలు ఎంత ఎక్కువ ఉంటే ఆ నగరంపై మోహం అంత తక్కువ అవుతుంది. ఇందులో కాశీ తప్పూ లేదు, వ్యక్తి తప్పూ లేదు, అక్కడి ప్రజల తప్పూ లేదు. ఎప్పుడు, ఎలా కాశీపై మమకారం పెరగాలో ఆ విశ్వనాథుడి సంకల్పం అంతే. మనకి ఆయన దయ ఉంటే మొదటి చూపులోనే కాశీతో ప్రేమలో పడతాం. లేకుంటే కొన్ని ప్రయాణాల తరువాత ఇష్టపడడం మొదలుపెడతాం. ఎలా అయినా ఆ అతి పురాతన నగరాన్ని విస్మరించడం మాత్రం అసాధ్యం. ఎవరికి ఎలా కనపడాలో, అలా కనపడడంలో కాశీకి మించిన ప్రదేశం మరోటి లేదు. అదో mystical place. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నగరం కాశీ.

Tap to Listen

మరి మన కొత్తపల్లి సీతా రాముడికి ఎలా కనిపిడింది? అతని అనుభవంలో కాశీ, షిరిడి, పూరీ క్షేత్రాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈవారం విడుదలయ్యే యాత్రానుభవాలు వినాలి. ఉత్తర, పడమర, తూర్పు భారతదేశాలకు చెందిన ఈ మూడు పుణ్యక్షేత్రాల ప్రయాణాలలో రామ్ కు మధుర, చేదు అనుభవాలు రెండూ ఉన్నాయి. వాటిని చవులూరేలా రాసి, చదివాడు. కాశీ ప్రయాణానికి బయలుదేరుదాం పదండీ.

వంగూరి వారి సభ విశేషాలు

ఆ విధంగా మన కథానాయకుడు అయిన రాజకుమారుడు రాముడు(రామ్ కొత్తపల్లి)తో కలిసి నేను చేసిన ఓ చిరు ప్రయాణం విశేషాలు ఈ సందర్భంగా చెప్పుకోవడం అత్యవసరం.  ఫిబ్రవరి 13వ తేదీన చిక్కడపల్లి శ్రీత్యాగరాయగాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 30వ వార్షికోత్సవం సందర్భంగా 4 పుస్తకాలను విడుదల చేశారు. ప్రముఖ కథానాయిక రేఖ జీవితం ఆధారంగా ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాన్ని తెలుగులో శ్రీదేవి మురళీధర్ గారు అనుసృజన చేసిన ‘స్వయం సిద్ధ’ పుస్తకం, వంగూరి చిట్టెన్ రాజు గారు రాసిన ‘అమెరికాకరకాయ కథలూ-కమామిషులూ’, ‘డయాస్ఫోరా తెలుగు కథానిక- 2023’, ‘అర్ధ శతాబ్ధిలో అమెరికా తెలుగు కథలు’ అనే రెండు కథా సంకలనాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటులు, రచయిత, దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, ప్రముఖ సినీ నేపధ్య రచయిత, కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ అధ్యక్షులు, ప్రముఖ రచయిత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, ప్రముఖ రచయిత డాక్టర్ వోలేటి పార్వతీశం గారు, గురుసహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారు పుస్తకావిష్కరణలు చేసి, వాటిపై ప్రసంగించారు. దాసుభాషితం తరఫున నేను, రామ్ వెళ్ళాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు వంగూరి వారు, రాధిక మంగిపూడి గారు.

నేనేమో రాముడు నన్ను ట్రైన్ ఎక్కించి, తిరిగి తన ఇంటికి వెళ్ళాలి అంటే 10గంటలకు నా ట్రైన్ ఉండాలి అనుకుని, టికెట్లు తీసుకున్నాను. కార్యక్రమం ముగింపుకు వచ్చేసరికి 9 కావస్తోంది. నా నరనరాల్లో బీపీ ఉరకలెత్తుతోంది. సరే వంగూరి వారు హడావుడిలో ఉన్నారు, వారిని ఇబ్బంది పెట్టకూడదు అని, మేము మెల్లగా జారుకోబోయాం. కానీ స్టేజిపై నుంచే మమ్మల్ని గుర్తుపట్టి, వెళ్ళకండి అని ఆపేశారు వంగూరి వారు. దాసుభాషితం సంస్థను వేదికపై పరిచయం చేయాలని వారి సంకల్పం. వెంటనే సంస్థ తరఫున నన్ను వేదికపైకి పిలిచి, నా స్పందన మాట్లాడమని అడిగారు.

నా నోరు మాట్లాడేస్తోంది, నా బుర్ర పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే, వేదికపైకి ఎక్కడానికి నేను ముందుగానే ప్రిపేర్ అయ్యాను కానీ, మాట్లాడే అవకాశం వస్తుంది అనుకోలేదు. సరస్వతీదేవి దయవల్ల నా నాలుక నా బుర్రని వదిలేసి, నా హృదయాన్ని పట్టుకుంది. ఆ ఒక్క నిమిషంలో నేను నిజంగా నా హృదయంలో వచ్చిన మాటల్నే మాట్లాడాను. అందరు పెద్దలు ఉన్న వేదికపై దాసుభాషితం తరఫున నాకు అవకాశం ఇవ్వడం అన్నది నిజంగా వంగూరి వారి సహృదయతకు నిదర్శనం.

రామ్ తో కలిసి చేసిన ప్రయాణం విశేషాలు చెప్తా అన్నాను కదా. ఇక్కడ కాదు, కూటమిలో చెప్తాను. ఇక్కడ చెప్పగలిగే అంత చిన్నది కాదు మరి మా సాహసకృత్యం. ఆ రైలోపాఖ్యానం కోసం ఎదురుచూస్తూ ఈలోపు, మా రామ్ యాత్రానుభవాలను వినేసి, ఆనక వంగూరి వారి వేదికపై నేను లెక్కపెట్టుకుని మరీ మాట్లాడిన పది ముక్కల్నీ, ఈ కింది వీడియోలో చూసేయండి.

https://www.youtube.com/live/wINCi7YD7_Q?si=P6MjM7qdw7ef8WqE&t=16292

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :