‘కొన్నాళ్ళు ఇవన్నీ వదిలేసి పారిపోవాలనిపించింది’

Meena Yogeshwar
June 9, 2025

అసలు happy ending అనేదేం ఉండదు.ఇది ఒక learning process. ఎప్పటికప్పుడు కొత్త skills నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. ప్రతీ రోజూ కొత్తే. ప్రతీ రోజూ ఫోన్ వాడకాన్ని బేరీజు వేసుకోవాల్సిందే. ప్రతీరోజూ చేసే పనిపై శ్రద్ధ పెట్టడాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే, ఒకసారి ఇలాంటి break down వచ్చి, మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో నేర్చుకున్న తరువాత దానిని...

దాదాపు మే మొదటివారం నుండి నేను చాలా డల్ గా ఉంటున్నాను. చేసిన పనినే రిపీట్ లో, ఒక లూప్ లో చేస్తున్న భావన. ఇంటి పని అయినా, ఆఫీస్ పని అయినా ఎంత చేసినా ఏమీ సాధించలేదు అన్న ఫీలింగ్. నేను సరిపడినంత పని చేయట్లేదు అని ఒక వైపు అనిపిస్తోంటే, మరో వైపు ఇంత చేసినా లాభం ఏమిటి? రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఇదే చేయాలిగా అనిపిస్తోంది. దానికి తోడు రకరకాల ఆశయాలు. ఈ పని చేసేయాలి, అలా సర్దేయాలి, ఇవి కొనేయాలి, ఆ రచయితని పుస్తకం అడగాలి అని ఏవేవో ఆలోచనలు. అవి సాధించిన తరువాత ‘అబ్బే, ఇది సరిపోదు. ఇంకా చేయాలి’ అని మళ్ళీ డీలా పడిపోవడం.

అసలు ఈ లాప్ టాప్, ఈ పుస్తకాలు, ఈ ఫోన్, ఈ గరిటలు, ఈ చీపుర్లు అన్నీ పాడేసి, ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. కనీసం ఒక వారం వీటన్నిటినీ వదిలేయాలనిపించింది. కానీ ఎక్కడికి కదలాలన్నా మనసు, శరీరం ఒప్పుకోవట్లేదు. ఎక్కడికో పారిపోయి, తిరిగి ఇక్కడికే ఈ పనులకేగా రావాల్సింది అనిపించింది. ఏమిటో ఒక డబ్బాలో ఇరుక్కుపోయి, గాలి ఆడని పరిస్థితి. నేను రాసే ప్రతి professional content స్క్రిప్ట్ వారం రోజులు టైం తీసుకుంటోంది. మేము వెళ్ళాలనుకున్న ట్రిప్ ఆగిపోయింది. ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా మారిపోయి, నన్ను మూలకు నెట్టేస్తోన్న భావన. ఈ ఆలోచనలు రాకుండా నేను తీసుకున్న దారి? ఫోన్. Instagram, Youtube, నేను ఆడే ఒక గేమ్. ఖాళీ ఉంటే తల ఫోన్ లో దూర్చడం. దానివలన నేను సాధించింది? Regret. ఫోన్ ఎక్కువ చూస్తున్నాను అన్న బాధ.

ఇక నేను రాస్తున్న professional Content, Self-help Content విషయంలో నా stress వర్ణనాతీతం. ఎంతో నేర్చుకుని, ఎన్నో చోట్ల చదివి, అనుభవజ్ఞులను ఒకటికి పదిసార్లు అభిప్రాయం తీసుకుని ఒక్కో స్క్రిప్ట్ రాస్తున్నాను. అలా రాసిన తరువాత టీం, ముఖ్యంగా కిరణ్ గారి నుండి approval పొందుతున్నాను. అంతా అయ్యాకా, అహా ఇది నేను రాశాను అనే భావన బదులు నేను fake చేస్తున్నాను అనే ఫీలింగ్. ఇదంతా నా నుంచి రావట్లేదు, ఎక్కడెక్కడో చదివి, ఎవరో చెప్పినది రాస్తున్నాను, దీనిపై నా అధికారం ఏమిటి? నా authenticity ఏమిటి? ఆత్మజ్ఞానం పొందకుండా అదేంటో రకరకాలుగా వర్ణించి చెప్పే ‘fake baba’లా నాకు నేను కనిపించాను.

నా పరిస్థితి చెప్పగానే మా అన్నయ్య చెప్పిన ఒక మాట నాకు చాలా ఊరటనిచ్చింది. ‘ఈ వ్యాసాల్లో ఎక్కడా ఇది నా అనుభవం, నేను ఇవి సాధించాను అని చెప్పట్లేదే. ఇదంతా నువ్వు ఒక learning curve దృష్టితో రాస్తున్నావు. ఎక్కడెక్కడ నుండి ఈ సమాచారం సేకరించావో కూడా అందులో వివరిస్తున్నావు. మరి నువ్వు ఎక్కడ ఫేక్ చేశావు? ఒక న్యూస్ లెటర్ ఒక రచయిత పై రాయాలంటే అంతా నీకు ధారణగా వచ్చేస్తుందా? నాలుగు చోట్ల చదివి, వాళ్ళ రచనలు చదివి ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని, నీ ఉద్దేశ్యం రాస్తావు కదా? ఇదీ అంతే, నువ్వేం నేర్చుకున్నావో రాస్తున్నావు. అందులో తప్పేం ఉంది’ అని అన్నాడు. 

విచిత్రం ఏమిటంటే కిరణ్ గారితో ఈ విషయం చెప్పినప్పుడు ఆయనా అదే అన్నారు. నా పనిని కొలత వేసే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇచ్చిన ఈ ఊరట నాపై ఎంతో ప్రభావం చూపింది. ఒక నాలుగు రోజులు శెలవు కావాలని కిరణ్ గారిని అడిగాను. ఆయన ఆనందంగా శెలవు ఇచ్చారు. ఈ నాలుగు రోజులు నా మానసిక స్థితి మీద నేను పని చేశాను. ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటున్నాను. నా ఉద్యోగానికి సంబంధంలేని, నాకిష్టమైన పుస్తకాలను తిరిగి చదవడం ప్రారంభించాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఫోన్ చూడాలనిపించినప్పుడు కిరణ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్న ‘Shreyam’ వీడియోలు చూడడం మొదలుపెట్టాను.

ముఖ్యంగా Deep Peace గురించి, ధ్యానంలో ఫోకస్ ఎలా పెంచుకోవాలి అనే వీడియోలు నాకు చాలా చాలా ఉపయోగపడ్డాయి. ఎప్పుడూ చెవులో ఏదో ఒక ఆడియో మోగుతూ ఉంటే తప్ప ఒక బట్ట కూడా ఆరేయలేని నేను, నా పంథా మార్చుకుంటున్నాను. ఏ పని చేస్తున్నా పూర్తి శ్రద్ధతో చేయడం ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. పాట వినాలనిపిస్తే, అదొక్కటే తప్ప మరేమీ చేయకుండా ఉండడం నేర్చుకుంటున్నాను. ఈ పద్ధతి నా మానసిక ఆరోగ్యానికి ఒక మంచి మందులా అనిపిస్తోంది. నాకు తెలుసు, ఇది నాకు happy ending ఏమీ కాదు. అసలు happy ending అనేదేం ఉండదు.

ఇది ఒక learning process. ఎప్పటికప్పుడు కొత్త skills నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. ప్రతీ రోజూ కొత్తే. ప్రతీ రోజూ ఫోన్ వాడకాన్ని బేరీజు వేసుకోవాల్సిందే. ప్రతీరోజూ నేను చేసే పనిపై శ్రద్ధ పెట్టడాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే, ఒకసారి ఇలాంటి break down వచ్చి, మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో నేర్చుకున్న తరువాత దానిని continue చేయడమే మన పని. ‘ఏ పూటకి ఆ పుట పరగడుపే’ అన్న సామెత విన్నాంగా, ఇదీ అంతే. ఏ పూటకి ఆ పూట మనల్ని మనం సంతోష పెట్టుకోవడం, క్రమశిక్షణలో ఉండడం ప్రాక్టీస్ చేయాల్సిందే.

ఆధ్యాత్మిక వీడియోలు ఈ mental break downలో నాకు ఒక దారి చూపించడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. అవి ఒక జోనర్ కు చెందినవి కాదు, అన్ని రకాల phases లోనూ ఉపయోగపడతాయి అని అర్ధం అయింది. అందుకే నాకు ఉపయోగపడిన శ్రేయం వీడియోలు మీకూ మీ జీవితంలో మరేదో phaseలో ఉపయోగపడవచ్చు. శ్రేయం యూట్యూబ్ ఛానెల్ ఈ కింది లింకులో ఉంది. Subscribe చేసుకుని పెట్టుకోండి. మీకున్న ఏ ప్రశ్నకి ఏ వీడియో సమాధానమిస్తుందో చెప్పలేం.

కౌముది కిరణాలు

Tap to Listen

ప్రముఖ రచయిత, కౌముది వెబ్ పత్రిక నిర్వాహకులు కిరణ్ ప్రభ గారు వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిగత జీవితంలోనూ మనం సానుకూలమైన మార్పులు ఎలా  తెచ్చుకోగలమో వివరిస్తూ రాసిన కాలమ్ ‘కౌముది కిరణాలు’ మొదటి భాగం ఇదివరిలో విడుదల చేశాం. ఈ వారం రెండో భాగం విడుదల అవుతోంది. చిన్న చిన్న భాగాల్లో పెద్ద పెద్ద విషయాలు ఇమిడ్చిన కిరణ్ ప్రభ గారి ఈ వ్యాసాలు ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి.

గమనిక: దాసుభాషితం గత రెండేళ్ళగా ప్రతి నెల మొదటి శనివారం ప్రసంగాలు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఎన్నో రంగాల్లోని నిష్ణాతులతో, ఎంతో జనరంజకంగా ఈ కార్యక్రమం నడిచింది. ఈ ప్రసంగాలకు హాజరయ్యే మన కూటమి సభ్యుల సహకారం, ఉత్సాహం కూడా ఈ కార్యక్రామనికి ముఖ్య కారణాలు.

అయితే, యూట్యూబ్ లో దాసుభాషితం మొదలుపెట్టిన మరో కార్యక్రమం ‘ఒక సెలబ్రిటీ ఒక పుస్తకం’ శీర్షికలో ఉన్నవి మూడే వీడియోలు అయినా, దానికి మంచి views వచ్చాయి. అసలు దాసుభాషితం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో నన్ను గుర్తుపట్టి, ‘ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేసింది మీరే కదండీ’ అని పలకరించారు. దాసుభాషితాన్ని మరింత మందికి దగ్గర చేసేందుకు ఈ కార్యక్రామానికి చాలా potential ఉంది అని మాకు తెలుస్తోంది.

దానిపై సరిగ్గా దృష్టి సారించాలని మా బృందం నిర్ణయించుకున్నాం. మా ఆలోచనలు, బలం అంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం పై పెడితే, దాసుభాషితం కొత్త ప్రేక్షకులను, శ్రోతలను చేరుతుందని మా నమ్మకం. అందుకే కొన్నాళ్ళు దాసుభాషితం ప్రసంగాలకు విరామం ఇచ్చి, ‘ఒక సెలబ్రిటీ ఒక పుస్తకం’ కార్యక్రమంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఈ ప్రయాణంలో కూడా మాకు తోడుగా మీరు ఉంటారని ఆశిస్తున్నాం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :