అక్టోబర్ 7, 2023 నుండి జూన్ 25, 2025 మధ్యలో గాజాలో దాదాపు 17,400 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇజ్రాయిల్ సైన్యం కన్ను మిన్ను కానకుండా చేస్తున్న ఈ దాడులలో సంవత్సరం లోపు పిల్లల దగ్గర నుంచి 16-17 ఏళ్ళ యుక్తవయస్కుల వరకూ నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నారు. రోజుకు 30మంది పిల్లల చొప్పున చనిపోతున్నారు. ఇక స్త్రీలు, వృద్ధులు, సామాన్య ప్రజలు కలిపి మృతుల సంఖ్య 55వేలు దాటేసింది. క్షతగాత్రులు లక్షల్లో ఉన్నారు. తిండి, నీళ్ళు, కనీస మందుల సరఫరా కూడా అందకుండా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ముట్టడించింది.
వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇరాన్ లోని నాలుగంతస్థుల భవనంలో, పడకగదిలో పడుకున్న సైంటిస్ట్ ని, డిప్లొమేట్ ని ఇజ్రాయిల్ లో కూర్చునే, precision striking తో చంపగల దేశం, తన పక్కనే ఉన్న ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులను పోల్చుకోలేక సాధారణ ప్రజలు నివసించే భవనంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తలచుకుంటే, ఏరి ఏరి హమాస్ ఉగ్రవాదలను చంపగల సత్తా, సామర్ధ్యం ఉన్న ఇజ్రాయిల్, వారాల తరబడి తిండి లేక రేషన్ కోసం లైనులో నుంచున్న సామాన్య జనాలని చంపుతోంది.
ఒకప్పుడు హిట్లర్ తమ దేశంలోని అత్యాధికులైన యూదులపై చేసిన దాడిని తలపించేలా, ఈ అమాయక ప్రజలను హింసిస్తోంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. పాలస్తీనాలోని సామాన్యులపై జరుగుతున్న ఈ దాడిని యూదు సమాజంలోని అత్యధిక భాగమే వ్యతిరేకిస్తోంది. తమపై జరిగిన దమనకాండ గాయాల మచ్చలు వారు ఇంకా మోస్తూనే ఉన్నారు కాబట్టే ఇలా వ్యతిరేకించగలుగుతున్నారు. కానీ, మనలో ఎవరికైనా చీమ కుట్టినట్టైనా అనిపిస్తోందా? హమాస్ చేసిన ఒక్క ఉగ్రవాద దాడిని ఆసరాగా తీసుకుని ఓ దేశాన్ని, ఓ జాతిని నేలమట్టం చేయడానికి ఇజ్రాయిల్ చేసే ఈ genocide ని మనలో చాలామంది సమర్ధించడం మరింత సిగ్గుచేటు.
మరో వైపు హమాస్ కూడా తమ స్వంత ప్రజల్నే human shield లాగా ఉపయోగించుకుంటోంది. ఆసుపత్రులు, స్కూళ్ళ కింద బంకర్ లు సృష్టించుకుని వాటిలో దాక్కుని, బయట అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఇజ్రాయిల్ హమాస్ దాకా రావాలంటే అమాయక ప్రజల్ని, స్త్రీ బాలాది వృద్ధులను చంపి కానీ చేరలేని విధంగా దాక్కుని అరాచకం సృష్టిస్తున్నారు. ఇంకా హమాస్ దగ్గర ఇజ్రయిలీ hostages ఉన్నారు. వారి పట్ల చేసే అకృత్యాలను వీడియోలు తీసి సామాన్య ఇజ్రయిలీ ప్రజల్లో భయాన్ని, ఇజ్రయలీ ప్రభుత్వంలో ప్రతీకారాగ్నిని రగులుస్తున్నారు. వీరిని సమర్ధించేవారు మన దేశంలో కోకొల్లలు.
మన జాతి కాకపోతే వాడి బతుక్కి పెద్ద లెక్క లేదు. మన శత్రు దేశంలో ఉండే స్త్రీ బాలాది వృద్ధులు సైతం మనకి శత్రువులే. కాబట్టీ వాళ్ళని హింసించినా, చంపేసినా అది సబబే. వాడు మనది కాని మతంలో, మనది కాని జాతిలో, మన దేశానికి హితవు కాని దేశంలో పుట్టడమే వాడు చేసుకున్న పాపం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? మనలో Empathy ఎందుకు నీచ స్థాయికి దిగజారుతోంది? భారతదేశానికి మూలస్తంభమైన మానవత్వం ఎక్కడికి పోతోంది? తన భార్యను ఎత్తుకుపోయి, లోకాలను పీడిస్తున్న రాక్షసుడైనా సరే, తప్పు ఒప్పుకుని శరణుజొచ్చితే క్షమిస్తాను అన్న రాముడికి మనం వారసులమని చెప్పుకోవడానికి ఏ మాత్రమైనా పనికి వస్తామా?
చెట్టుని, జంతువుని కూడా పూజించమని నేర్పించిన మన సంస్కృతి పక్క మనిషిని చంపమని చెప్పింది అంటూ వక్రార్ధాలు తీసే propaganda మనుషుల కుళ్ళు ప్రవచనాలను బాగా ఎక్కించుకుంది మన ప్రజ. నీ దేశానికి వ్యాపారంలోనో, రాజకీయ పరంగానో ఉపయోగపడే దేశం చేసే ఎలాంటి అరాచకాన్నైనా గుడ్డిగా సమర్ధించడం, ఆ దేశం చేసే అత్యాచారాలను ఎలుగెత్తి పొగడడం, ఆ దేశాలు గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం.. ఎంత నీచానికి దిగజారిపోతున్నాం మనం? Empathy, Ethics లాంటి పదాలను పనికిమాలిన వాళ్ళు, చేతగానివాళ్ళు వాడే పదాలుగా తయారు చేశాయి మన ప్రభుత్వాలు, మీడియా.
మొన్న ఒక రీల్ చూశాను. పాలస్తీనాలోని ఒక బజారులో జనాలు తిరుగుతున్నారు. అప్పటివరకూ మామూలుగానే ఉంది ఆ ప్రదేశం. ఉన్నట్టుండి వారి పక్క వీధిలో బాంబు పడింది. ఆ వేసేవాడు ఒక్క మీటరు పక్కకి వేసి ఉంటే అక్కడి ప్రజలు, ఆ వీడియో తీసేవాడు కూడా మిగిలేవారు కాదు. అలాంటివే మరో నాలుగు వీడియోలు కలిపిన రీల్ అది. ఇలాంటి ప్రదేశంలో ఓ రోజు ఉండడాన్ని ఊహించుకోండి అని టైటిల్ పెట్టారు. నేను 10నిమిషాలు కూడా అక్కడ ఉండడాన్ని ఊహించలేకపోతున్నాను.
వేరే దేశం వరకూ ఎందుకు మన దేశంలోనే మణిపూర్ రెండేళ్ళ నుండి అగ్నికీలల్లో మండిపోతోంది. మనకి ఆ ధ్యాస ఉందా? మూడు వారాల క్రితం ఆ విషయంపై నేను న్యూస్ లెటర్ రాశాను. మిమ్మల్ని అంటున్నాను అని అనుకోకండి. ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతిగా ఆ న్యూస్ లెటర్ కు నాకు స్పందన పంపలేదు. నాకు చాలా నిరాశగా అనిపించింది. నేను రాయడంలోనే ఏదైనా లోపం ఉందేమో, మీదాకా ఈ విషయం చేర్చలేకపోయానేమో అనిపించింది.
ఇదంతా సరే. ఏం చేయమంటావ్ అమ్మాయ్? మన చేతిలో ఉన్నాయా ఈ యుద్ధాలు? అవన్నీ తెలుసుకుని, బాధపడి, భయపడి ఏం ప్రయోజనం? మన ఆరోగ్యం, సమయం వృధా అవ్వడం తప్ప అని మీరు నన్ను అడగవచ్చు. ఉంది. మన ప్రభుత్వంపై మనం ఒత్తిడి తేగలం. మణిపూర్ ను పరిష్కారం దిశగా నడపమని మన ప్రభుత్వాన్ని మనం నిలదీయవచ్చు. ఇక పాలస్తీనాలో జరిగేదానికి మనం చేయగలిగింది సానుభూతి చూపడం. చూశారా ఇజ్రాయిల్ ఎంత బలమైన దేశమో, ఉగ్రవాదాన్ని అణచడానికి పాలస్తీనాని ఎలా నాశనం చేస్తోందో అంటూ గర్వంగా మెసేజ్ లు మనకి forward చేసేవాళ్ళని అలా చేయద్దని చెప్పగలం. మనం ఆ మెసేజ్ ని వేరొకరికి పంపకుండా ఆపగలం. మన మతం కానివాణ్ణి ఉత్తిపుణ్యానికి చితక్కొడుతుంటే ఆనందంగా ఆ వీడియో చూడకుండా ఉండగలం. మొత్తంగా కాస్త సున్నితంగా ఆలోచించగలం. సున్నితత్వం కోల్పోతే కొన్నాళ్ళకి మనమందరం రోబోట్లు అయిపోవడం ఖాయం.
ఇలా ఆలోచించడం వలన మనమేదో యుద్ధాలను ఆపేయలేకపోవచ్చు. ఇంకో మతంపై జరిగే దాడులనూ ఆపేయలేకపోవచ్చు. మణిపూర్ ని కాపాడలేకపోవచ్చు. కానీ empathy, sympathy లాంటివి పెంపొందించుకోవడం మన నిత్య జీవితానికి కూడా చాలా అవసరం. మనం అన్ని రకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు నిండిన సమాజంలో బతుకుతున్నాం. ఎవడేమైపోతే నాకేం అన్నట్టుగా బతికితే, రేపు మనకి ఇబ్బంది వచ్చినా అందరూ అదే అనుకుంటారు. కాబట్టీ, మన చుట్టూ ఉన్నవారిని అర్ధం చేసుకోవడం, వారి కష్టం పట్ల సానుభూతి చెందడం, వాళ్ళ జీవితం గురించి, బాధల గురించి చెప్తే వినకుండానే లెక్చర్లు, సలహాలు ఇవ్వకుండా మనసుపెట్టి వినడం మన వ్యక్తిగత ఎదుగుదలకు ముఖ్యమైన పనిముట్లు.

కానీ వినడం, అర్ధం చేసుకోవడం చెప్పినంత సులువు కాదు ఆచరించడం. ఈవారం మన ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ లలో ఒకరు, రచయిత శ్రీమతి అనుపమ ఏలూరిపాటి గారు రాసిన వ్యక్తిత్వ వికాసం లెసన్ లో సానుభూతి గురించి, వ్యసనాల గురించి రాసిన భాగాలు విడుదల అవుతున్నాయి. మనం పాటించగలిగిన చిట్కాలతో, చక్కటి పాయింట్లతో వివరంగా అర్ధమయ్యే శైలిలో చెప్పారు అనుపమ గారు. మనకి ఆచరించడానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో ఆమే గుర్తించి, దానికి సరైన సలహాలు కూడా ఇచ్చారు. బంగారానికి తావి అద్దినట్టు తన రాతకి, మాట కూడా కలిపారు. జీవనానికి అత్యంత ముఖ్యమైన ఈ పనిముట్ల గురించి ఆమె గళంలోనే విందాం.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.