మా కిరణ్ గారిలా మీ బాస్ ఉంటారా?

Meena Yogeshwar
July 9, 2025

మా కిరణ్ గారిలా అందరి బాస్ లు ఉండరు. విపరీతమైన toxic గా, తమ కింది వారిని granted గా తీసుకునేవారే ఎక్కువ. అలా ఇబ్బందిలో ఉన్నవారికి “work-life balance is a myth. దేశం కోసం 90గంటలు, 70 గంటలు, ఆదివారాలు పని చేయండి” అని మనం Iconsగా, Idealsగా పెట్టుకున్నవాళ్ళు మాట్లాడడం ఎంతవరకూ సమంజసం. వారు తమ కంపెనీ కోసం, తమ లాభాల కోసం ఉద్యోగులకు ఇలాంటివి నూరిపోయడం, ఎదురు జీతం గట్రా పెంచకుండా గంటలు గంటలు పని చేయించుకోవడానికి దేశం అంటూ మాట్లాడడం అనేది emotional blackmail చేయడమే. ఈసారి విడుదల అయ్యే...

ప్రతీ ఏడాది నేనూ, మా వారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఓ పదిమంది ఏదో ఒక ట్రిప్ కి వెళ్తాం. ఓ ఏడాది కులూ-మనాలీ వెళ్ళాం. ఓ ఏడు కర్ణాటకలోని ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళాం. గతేడాది కేదార్ నాథ్, భద్రీనాథ్ వెళ్ళాం. ఈసారి ఆగస్ట్ లో అమర్నాథ్ వెళ్ళాలని ఫిబ్రవరీలోనే నిర్ణయించుకుని, టికెట్లు తీసేసుకున్నాం. తీరా చూస్తే ఏప్రిల్ లో కాశ్మీర్ లో ఘోరమైన ఉగ్రదాడి జరిగింది. నిజానికి ఆ దాడి జరిగినప్పుడు నాకు panic attack లాంటిది వచ్చేసింది. ఓ వారం రోజులపాటు ఒక రకమైన anxiety లో బతికాను నేను. మా వాళ్ళందరూ ఎప్పుడో ఆగస్ట్ లో వెళ్తాంగా మనం, ఏం ఫరవాలేదు అన్నారు. అతి జాగ్రత్తో, అతి భయమో నా వల్ల కాదని చెప్పేశాను. ఆ ట్రిప్ క్యాన్సిల్.

ఇక మే లో ఈ బెజవాడ ఎండలు తట్టుకునే శక్తి లేక, స్త్రీలు-పిల్లలు అందరం నిరాహార దీక్షకి కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వయనాడ్, ఊటీ ట్రిప్ కి తీసుకెళ్ళమని. అసలే అమర్నాథ్ క్యాన్సిల్ అయిన కక్షలో ఉన్నారేమో రెండు రోజులు బాగా మారాం చేశారు. మా మొగాళ్ళు సెలవు లేదు, డెడ్ లైన్ లు ఉన్నాయి అంటూ వంకలు పెట్టారు. ఈ లోపు పిల్లలకి స్కూళ్ళు, కాలేజిలు తెరిచేశారు. ఆ ట్రిప్ కూడా గంగార్పణం.

సరిగ్గా నాలుగు రోజుల క్రితం మా సహనం అట్టడుగుకు చేరుకుంది. ఏడాది అంతా కాచుక్కూర్చునే ట్రిప్ ను వదులుకోవడానికి ఎవరం సిద్ధంగా లేం. పైగా అటు ఆఫీస్, ఇటు ఇంటిపనులతో రొటీన్ బాగా విసుగొచ్చేస్తోంది. ఇలా కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నాం, వేరే రాష్ట్రం కూడా కాదు కదా అని అహోబిలం తీసుకెళ్ళమని మారాం మొదలుపెట్టాం. సరేనంటే సరేనన్నారు. ఎల్లుండే బయలుదేరదాం అన్నారు. బట్టలు సర్దుకోండి అన్నారు. ఎగురుకుంటూ రెడీ అయిపోయాం. నేను ఎప్పుడు బట్టలు ముందు సర్దినా ఆ బ్యాగ్ ఇంట్లోనే పడి ఏడుస్తుంది. ఏదో ఒకటి అయ్యి మా ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అని నా నమ్మకం. అందుకే ఎప్పుడూ ఇంకో నాలుగు, అయిదు గంటల్లో బయలుదేరతాం అనగా బ్యాగ్ సర్దుతా.

అలాంటిది పనులు ఎక్కువగా ఉన్నాయి కదా, రేపు ఊరెళ్ళడం పక్కా, ఫిక్స్, లాక్ కియా జాయ్ అని నేను అతి తెలివితో పొద్దున్న 11గంటలకే బ్యాగ్ సర్దేశా. నా దరిద్రం నన్ను మామూలుగా తన్నదుగా. సాయంత్రం 3 గంటలకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరి బంధువు చనిపోయారు. మా ట్రిప్ మళ్ళీ హర హర మహాదేవ శంభో శంకర అయింది. ఇందులో అత్యంత అన్యాయం ఏమిటో చెప్పనా? మా ఆయన ఈ మధ్యే నాతో సహా కాశీ టికెట్లు తీసుకుని, నాకు కుదరక నేను ఆగిపోతే, టికెట్ డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు అని ఆయన వెళ్ళి వచ్చేశారు.

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా తిరుమల దర్శనం దొరికింది అని, తిరుమల, కంచి చూసి వచ్చారు. ఇందులో అందరికన్నా దరిద్రమైన జాతకం ఎవరిది? ఇంకెవరిది నాదే? నేను విజయవాడ సరిహద్దు కూడా దాటలేదు. అప్పుడు అనిపించింది దేవుడు నాపై ఈ ఏడాది బాగా కక్ష కట్టేశాడు అని. ఈ కష్టాలన్నీ ఎప్పటికప్పుడు కిరణ్ గారికి తెలుసు. నేను anxiety తో ఇబ్బంది పడినప్పుడు నేను అడగకుండానే నాకు నాలుగు రోజులు శెలవు ఇచ్చారు. నాకు ధ్యానంలో టిప్స్ చెప్పారు. నాకు కౌన్సిలింగ్ కూడా చేశారు ఓ therapist లాగా.

ట్రిప్ ప్లాన్ చేసిన ప్రతీసారీ వెంటనే సెలవలు కూడా తీసుకోమని చెప్పారు. Of Course మనం వెళ్ళక, సెలవలు కూడా తీసుకోలేదనుకోండి. నాకు ఎప్పుడు ఇంటి విషయంలోనైనా, ఆఫీస్ విషయంలోనైనా ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం అనిపించినా మా ఆయన, అన్నయ్య, మా వదిన గారు, రామ్, ప్రభ గారులతో పాటు నా బాధ విని ఊరడించడానికి కిరణ్ గారు కూడా సిద్ధంగా ఉంటారు. ఎన్నిసార్లు నాకు ఆయన therapy sessions ఫ్రీగా చేశారో చెప్పలేను. ఆ సమయంలో నాకు బాస్ గా కాకుండా మా అన్నయ్యలాగా ప్రవర్తిస్తారాయన.

ఈసారి ట్రిప్ క్యాన్సిల్ అయింది, నేను అడిగిన సెలవలు నాకు అవసరం లేదు, నేను మామూలుగానే పనిచేస్తున్నాను అని మెసేజ్ పెట్టిన తరువాత కిరణ్ గారి నుండి నాకు కాల్ వచ్చింది. “నువ్వేం బాధపడకు మీనా. ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఏం ఫీల్ అవ్వకు. ఓ పని చెయ్. నువ్వు, రామ్, వస్తే ప్రభ, కుదిరితే మీ ఆయన మా ఇంటికి వచ్చేయండి. బెంగుళూరు అనేగాని మాది పల్లెటూరి వాతావరణం ఉంటుంది. పక్కనే అడవి ఉంటుంది. హాయిగా వండుకు తిని, కబుర్లు చెప్పుకుందాం. అసలు ఆఫీస్ గురించి మాట్లాడుకోను కూడా మాట్లాడుకోవద్దు. సరేనా? వీలు చూసుకుని ఓ వారం వచ్చేయండి. మీకెన్నాళ్ళుండాలన్నా ఫరవాలేదు” అన్నారు.

ఇదే వారంలో నేను Time Management భాగంలో Work-Life Balance గురించి రాశాను. పైగా infosys నారాయణమూర్తి, L&T సుబ్రహ్మణ్యన్, Ola భావేష్ అగర్వాల్ లాంటి వాళ్ళు 70 గంటలు పని చేయండి, 90 గంటలు పని చేయండి అన్నమాటలు అప్పట్లో విన్నా, ఈ భాగం రాయడానికి పదే పదే వినడం వలన భలే కోపం మీద ఉన్నాను.  ఈ భాగం కోసం నేను చాలామందితో మాట్లాడా, చాలా మంది వీడియోలు చూశా. ముఖ్యంగా The Deshbhakt ఛానెల్ లోని ఆకాశ్ బెనర్జీ వీడియో చూసి ఇంత Toxic work culture లో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని పిచ్చి కోపం వచ్చింది నాకు. ఆ ఫైర్ మీదున్నప్పుడే ఆ script కూడా రాశా. అసలే నేను ఇలాంటి సామాజిక, రాజకీయ విషయాల్లో when fire fires the fire, fire will be fired, I am fire, I am the fire టైపు. విని చూడండి ఆ సెగ బా…గా తగులుతుంది.

Tap to Listen

అలాంటి సమయంలో నా బాస్ ఇలా మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. నా మీద దేవుడు కక్ష కట్టలేదు, ఎంతటి ఇబ్బందిలో ఉన్నా, నాకు తోడుగా ఉండే మంచి స్నేహితుణ్ణి, సోదరుణ్ణి బాస్ రూపంలో పంపాడు అనిపించింది. నన్ను చాలామంది అడుగుతారు, ‘నువ్వు ఉద్యోగం చేస్తున్నావంతే, దాసుభాషితం ఏమీ నీ సొంత కంపెనీ కాదు. ఎందుకు అంతగా అందులో నీ సమయం, తెలివి, కష్టం, మనసు అన్నీ invest చేస్తున్నావ్’ అని. ఇంత మంచి బాస్, కొలీగ్స్, మంచి work culture, మంచి శ్రోతలు ఉంటే ఎవరైనా ఎందుకు తమని తాము పూర్తిగా ఒకే ఉద్యోగానికి ఇచ్చుకోకుండా ఉండగలరు చెప్పండి. నాలాంటి వారికి work-life balance పెద్ద విషయం కాదు.

కానీ, చాలామంది ఉద్యోగస్తులకు అది కటిక నిజం. మా కిరణ్ గారిలా అందరి బాస్ లు ఉండరు. విపరీతమైన toxic గా, తమ కింది వారిని granted గా తీసుకునేవారే ఎక్కువ. అలా ఇబ్బందిలో ఉన్నవారికి “work-life balance is a myth. దేశం కోసం 90గంటలు, 70 గంటలు, ఆదివారాలు పని చేయండి” అని మనం Iconsగా, Idealsగా పెట్టుకున్నవాళ్ళు మాట్లాడడం ఎంతవరకూ సమంజసం. వారు తమ కంపెనీ కోసం, తమ లాభాల కోసం ఉద్యోగులకు ఇలాంటివి నూరిపోయడం, ఎదురు జీతం గట్రా పెంచకుండా గంటలు గంటలు పని చేయించుకోవడానికి దేశం అంటూ మాట్లాడడం అనేది emotional blackmail చేయడమే.

ఈసారి విడుదల అయ్యే professional contentలో Time management, Productivity వంటి విషయాలపై లెసన్స్ ఉన్నాయి. చాలా చోట్ల రీసెర్చి చేసి, చాలామందిని కనుక్కుని, ఒక script పై వారంపైగా పని చేసి రాసినవి. తప్పకుండా మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. నోము పట్టినట్టు professional content ఏ ఎందుకు విడుదల చేస్తున్నాం అంటే, మేము ఓ గోల్ పెట్టుకున్నాం జులై కల్లా మన దగ్గర ఈ కాంటెంట్ ఎక్కువ ఉండాలి అని. దట్టన్నమాట పాయింటు. ఇక గతవారం విషయానికొస్తే, చాలామంది ఆ న్యూస్ లెటర్ పై స్పందించి, నాకు మెయిల్స్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. నేను రాసిన ఓ వ్యాసం ఇంతమందికి చేరుతోంది, ఇందరిని కదిలిస్తోంది అని. అది నా గొప్ప కాదు, చదివి తిరిగి నాకు తెలియజేస్తున్న మీ గొప్ప.

Tap to Listen

మా కిరణ్ గారిలా మీ బాస్ ఉన్నారా? ఉంటే, నాకు మెయిల్ చేసి చెప్పండి. ఉన్నా, లేకపోయినా ఈ వారం విడుదల అయ్యే భాగాలు వినండి. ఇంతే సంగతులు.. చిత్తగించవలెను. ఇతి వార్తాః శ్రుయంతాం ప్రవాచకః మీనా యోగీశ్వరః

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :