#10 మనం గౌరవించుకోని విదుషీమణి.

Dasu Kiran
May 16, 2020

కళాకారులు రెండు రకాలు. ఒకరు, ఒక కళా రూపంలో ప్రావీణ్యం సంపాదించి, ఆ రంగం మీద తమ ముద్ర వేసి, పేరు ప్రఖ్యాతులు గడించినవారు. వీరికి వారి రంగం వల్ల కీర్తి లభిస్తుంది. రెండో రకం కళాకారుల వల్ల, వారి రంగానికే కీర్తి వస్తుంది. ఇటువంటి కళాకారులు బహుకొద్ది మాత్రమే ఉంటారు...

కళాకారులు రెండు రకాలు. ఒకరు, ఒక కళా రూపంలో ప్రావీణ్యం సంపాదించి, ఆ రంగం మీద తమ ముద్ర వేసి, పేరు ప్రఖ్యాతులు గడించినవారు. వీరికి వారి రంగం వల్ల కీర్తి లభిస్తుంది. రెండో రకం కళాకారుల వల్ల, వారి రంగానికే కీర్తి వస్తుంది. ఇటువంటి కళాకారులు బహుకొద్ది మాత్రమే ఉంటారు.

ఎందుకంటే ఒక రంగానికి పర్యాయపదంగా మారాలంటే ప్రతిభ, దక్షత, అంకితభావంతో పాటు, పూర్ణాయుష్షు, కడదాకా చైతన్యవంతులై ఉండటం కారణాలై, సుదీర్ఘ కాలం ఆ రంగం మీద ప్రభావం చూపి ఉండాలి. 

అటువంటి ప్రజ్ఞశాలురలో ప్రప్రధములు 'తెలుగు జానపద గీత పితామహి' శ్రీమతి వింజమూరి అనసూయ దేవి. ఆమె గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఆమె, ఆమె సోదరి వింజమూరి సీత, కృషి లేనిదే మనకి జానపద కళల వారసత్వం అందేది కాదు. తన 6వ యేట నుంచి పాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి, 95వ యేట తన ఆత్మకథ వ్రాసుకునే వరకు, ఆ తరువాత తన మరణం వరకూ అనసూయ దేవి చైతన్యవంతులై ఉన్నారు.

"నేను నేర్చింది, నన్ను తీర్చింది శాస్త్రీయ సంగీతం, నన్ను వరించి వచ్చింది లలిత సంగీతం, నన్ను తరించింది జానపద సంగీతం" అని ఎప్పుడూ చెప్పిన శ్రీమతి వింజమూరిని పూర్వం డా. మృణాళిని ఇంటర్వ్యూ చేశారు. 

ఆ ముఖాముఖిని మే 12 న వింజమూరి గారి పుట్టిన రోజు సందర్భంగా తిరిగి మీకు సమర్పిస్తున్నది దాసుభాషితం. ఈ ముఖాముఖీలో, బాల్యం నుంచే తనకి జానపదాల మీద కలిగిన ఆసక్తి గురించి, మేనమామ 'భావ కవి' శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో అనుబంధం గురించి, పొందిన విజయాలు, తెలుగు చిత్ర సీమలో జరిగిన అవమానాల గురించి, ఉత్సాహంగా, నిర్మొహమాటంగా పంచుకున్నారు.

మీరూ వినండి. విన్న తరువాత తెలుగు సమాజం ఆమెను సరిగ్గా గౌరవించుకోలేదేమో అనిపిస్తే, ఆ సందేహం సహేతుకమే.

ఇక ఈ వారం విడుదలైన శ్రవణ పుస్తకాలు.


కాశీ మజిలీ కథలు – శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు 

Kaasi Majilee Kathalu 1


ఆంధ్ర దేశాన్ని ఒకప్పుడు ఒక ఊపు ఊపిన కాశీ మజిలీ కథలను, అప్పటికీ ఇప్పటికీ భాషలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని సామాన్యులు సైతం చదివి ఆనందించేలా తెలుగు వారందరికీ నిత్య వాడుక భాషలో అందుబాటులోకి తేవాలని రాజమండ్రి కేంద్రంగా ఎనభై ఏళ్లకు పైగా ప్రచురణ రంగంలో ఉంటూ వేలాది పుస్తకాలను ప్రచురించి తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గొల్లపూడి వీరాస్వామి సన్ సంస్థ వారు సంకల్పించారు.

తదనుగుణంగా, తెలుగు భాషా ప్రవీణులు శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఆ కథలను సుమధురమైన సరళ వచనంలో తిరిగి వ్రాయించి పన్నెండు భాగాలలో ఆరు సంపుటాలుగా ప్రచురించారు. 

ఈ కాశీ మజిలీ కథలలోని అసలు విషయానికి వస్తే, విద్యావంతుడైన మణిసిద్ధుడు అనే ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి, కాశీ వెళ్లేందుకు సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోగా, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండటంతో, ఎవరైనా తోడు ఉంటె బాగుంటుందని భావిస్తాడు. ఎందరిని అడిగినా వారు ఏదో ఒక కారణంతో మణిసిద్ధుడితో రావటానికి సిద్ధపడరు. చివరకు శ్రీరంగపురం అనే గ్రామంలో పశువులు కాసుకునే ఒక అనాధ, కోటప్ప తాను వస్తానని, అయితే మార్గం పొడవునా తనకు ఆహ్లాద కరమైన వింత వింత కథలు చెపుతూ అలసట లేకుండా చేయాలని నిబంధన విధిస్తాడు. అందుకు మణిసిద్ధుడు అంగీకరిస్తాడు. అలా ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కథలు చెప్పుకుంటూ మజిలీలు చేసుకుంటూ కాశీ ప్రయాణం చేయటం 'కాశీ మజిలీ కథల' ప్రధాన ఇతివృత్తం.

ఈ వారంతో మొదలుపెట్టి 12 వారాలు ఒకో భాగం అందిస్తాము. విని ఆనందించండి.

కాశీ యాత్ర – శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి.

Kaasi Yatra Chellapilla Venkata Sastri.

శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి 18 ఏళ్ళ వయసులో కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కోసం వెళ్లారు. ఆ అనుభవాలను 1934లో తన 64వ ఏట రాశారు.

రచనా, శైలి విషయానికి వస్తే చెళ్ళపిళ్ళ వచనంలో ఒక విలక్షణత ఉంది. పదాలు మెత్తగా ఉంటాయి. చెప్పడంలో చమత్కారం ఉంటుంది. వాక్య నిర్మాణంలో సౌందర్యం ఉట్టి పడుతూ ఉంటుంది. అన్నీ కలిపి  పాఠకుడిని అనిర్వచనీయమైన ఒక మోహావేశంలో కట్టిపడేస్తాయి. అందుకే జంట కవులుగా  ప్రసిద్ధిచెందిన తిరుపతి వెంకట కవులలో  రెండవ వారైన  దివాకర్ల తిరుపతి శాస్త్రి పద్యంలో సొగసరి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గద్యంలో గడసరి అంటారు.

తెలుగు సాహిత్యాన్ని భావి తరాల వారికి శ్రవణ రూపంలో అందించడానికి ‘దాసుభాషితం’ చేస్తున్న కృషిలో భాగంగా పుస్తకాలను అన్వేషిస్తున్న క్రమంలో కాశీ యాత్రకు సంబంధించిన రెండు పుస్తకాలు లభించాయి. రెండూ ప్రముఖమైనవే. ఒకటి శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య గారు వ్రాసిన కాశీ యాత్ర చరిత్ర, మరొకటి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు వ్రాసిన కాశీ యాత్ర.

చెళ్ళపిళ్ళ వారి రచన ఈనాటి పాఠకులకు ఆసక్తిదాయకంగానూ ఆమోద యోగ్యంగానూ తోచటం చేత వారి ‘కాశీ యాత్ర’ నే ఎంచుకోవడం జరిగింది.

విని ఆనందించండి.

Image Courtesy :