#11 నవల = పెద్ద కథ?

Konduru Tulasidas
May 22, 2020

ముళ్ళపూడి వెంకటరమణ గారు : “సులోచన గారు, మా ‘జ్యోతి మాస పత్రిక’ కి మీరు నవల వ్రాయాలి” అప్పటివరకు కథలే వ్రాసిన సులోచన గారు: “అమ్మో నవలా, నా వల్ల కాదు.” రమణ గారు: “మీరు ఇప్పటివరకు తీసుకున్న ఇతివృత్తాలు నవలకి సరిపోయేవే. మీరు వ్రాయగలరు.” సులోచన గారు: “ఏమోనండి. నాకు ధైర్యం చాలట్లేదు. నేను వ్రాయలేను.” ఈ సంభాషణ ఒక గంట సేపు విన్న బాపు గారు: “అయితే ఓ పని చేయండి. మీరు నవల రాయద్దు. మా కోసం ఓ పెద్ద కథ వ్రాయండి” సులోచన గారు: అలా అయితే సరే.

ముళ్ళపూడి వెంకటరమణ గారు : “సులోచన గారు, మా ‘జ్యోతి మాస పత్రిక’ కి మీరు నవల వ్రాయాలి”

అప్పటివరకు కథలే వ్రాసిన సులోచన గారు: “అమ్మో నవలా, నా వల్ల కాదు.” 

రమణ గారు: “మీరు ఇప్పటివరకు తీసుకున్న ఇతివృత్తాలు నవలకి సరిపోయేవే. మీరు వ్రాయగలరు.” 

సులోచన గారు: “ఏమోనండి. నాకు ధైర్యం చాలట్లేదు. నేను వ్రాయలేను.”

ఈ సంభాషణ ఒక గంట సేపు విన్న బాపు గారు: “అయితే ఓ పని చేయండి. మీరు నవల రాయద్దు. మా కోసం ఓ పెద్ద కథ వ్రాయండి”


సులోచన గారు: అలా అయితే సరే.


ఇలా మొదలైంది నవలా సామ్రాజ్ఞి నవలా ప్రస్థానం. పెద్ద కథగానే పాఠకులకి పరిచయమై సంచలనం సృష్టించిన ఆ సీరియల్ (తరువాత నవల) ‘సెక్రటరీ’.

రచయిత్రిగా ఆమె స్థానం ఎంతటిదంటే, తన మొదటి కథ మినహా, ఆమె కరీర్ లో మళ్ళీ రచన చేసేసి ప్రచురణకర్తను చూసుకున్నది లేదు. తెలుగులో పాపులర్ రచయిత్రి ఎవరంటే ఘంటాపధంగా చెప్పవలసిన పేరు యద్దనపూడి సులోచనారాణి. ఆమె చాలా రచనలు సినిమా/టీవీ రంగానికి ఎగుమతి అయ్యాయి. ఎంతగా అంటే, ఇప్పుడు 35 సంవత్సరాల వయస్సు పైబడి ఆమె గురించి చూచాయగా తెలిసున్నవారికి, “ 'ఫలానా' సినిమా/సీరియల్ కూడా ఆమె కథేనా!!” అని ఆశ్చర్యపోతారు.  


ఆమె గత సంవత్సరం సరిగ్గా ఈవారం లోనే స్వర్గస్తులయ్యారు (మే 18న, వికీపీడియాలో పేర్కొన్నట్టు మే 24 న కాదు). ఆ సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం ఆమెతో డా.మృణాళిని పూర్వం జరిపిన ముఖాముఖీని ఈ వారం దాసుభాషితం యాప్ లో విడుదల చేస్తున్నాము. 


పైన ఇచ్చిన సంభాషణతో పాటు, అనేక ఆసక్తికర విషయాలను మీరు ఈ ముఖాముఖీలో వింటారు. 

జీవితాన్ని సులోచనారాణి గారు ఎంతగా ప్రేమించేవారో ఆమె మాటల్లోనే తెలుస్తుంది. నేటి యువతలో పఠనాసక్తి ఎందుకు తగ్గిందో ఆమె విశ్లేషణ నిజమనిపిస్తుంది. సమాజం సాహిత్యానికి దూరమైతే ఎంతగా నష్టపోతుందో ఆమె చెప్పినప్పుడు, ముఖ్యంగా మాకు, దాసుభాషితం స్థాపన లక్ష్యం పునరుద్ఘాటిస్తున్నట్టు అనిపించింది.


ముఖాముఖీ ని వినటానికి ఈ లింకును టాప్ చేయండి.

ఆమె వర్ధంతి సందర్భంగా, మొదటి సారిగా, ఆమె వ్రాసిన ఓ నవలని, శ్రవణ రూపంలో రెండు భాగాల్లో అందిస్తున్నది దాసుభాషితం. ఆ నవల పేరు 'గిరిజా కళ్యాణం'.

గిరిజ కళ్యాణం – మొదటి భాగం 

Girijaa Kalyanam Part 1


వివాహమూ, వైవాహిక జీవితమూ అంటే భిన్న అభిప్రాయాలున్న ఇద్దరు యువతీ యువకుల చుట్టూ అల్లిన కథ ఇది. పెళ్లి అంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితమంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలంటాడు తాడు చందూ. 

విచిత్రంగా విధి వీరిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్లయిన మొదటి  రాత్రే, "ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్లి. నీకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. త్వరలో నీకు డివోర్స్ ఇచ్చేస్తాను" అని చెప్పేసి గిరిజను నిశ్చేష్టురాలిని చేశాడు.

విభిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది?

రమణీయమైన శైలిలో పాఠకులను ఉత్కంఠతతో ఉక్కిరి బిక్కిరి చేసి తన్మయంలో ముంచెత్తిన సులోచనారాణి నవల, ‘గిరిజా కళ్యాణం’ మొదటి సారి శ్రవణ రూపంలో, ఆమె కుమార్తె శ్రీమతి శైలజ, అల్లుడు శ్రీ రవి నూకల సౌజన్యంతో మీ ముందుకు తెస్తోంది దాసుభాషితం.


వినండి. గిరిజ కళ్యాణం మొదటి భాగం.


కాశీ మజిలీ కథలు - రెండవ భాగం

Kaasi Majilee Kathalu Vol 2


గత వారం ప్రారంభమైన 12 సంపుటాల కాశీమజిలీ కథల మొదటి సంపుటంలో, కాశీ మజిలీ కథలు ఎలా పుట్టాయో, ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారో మనం తెలుసుకున్నాం. 


ఈ రెండవ భాగం, 12 మజిలీలు దాటి 13 మజిలీలో, మణిసిద్ధుడు గోపకుడికి చెప్పే ఇంద్రద్యుమ్నుని కథతో పాటు మరో మూడు కథలతో ప్రారంభమై, ఆరు మజిలీలపాటు కొనసాగి, 18 మజిలీలో సునంద కథతో ముగుస్తుంది. ఇవన్నీ ప్రధాన కథలు, వాటిల్లో మళ్ళీ అంతర కథలు, ఉపకథలు, సన్నివేశాలు, గోపకుని సందేహాలూ మామూలే.  


వినండి. కాశీ మజిలీ కథలు రెండవ భాగం.

Image Courtesy :