పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..!

Meena Yogeshwar
July 31, 2023

1980లకు ముందు తిరుమల మాఢ వీధులు రకరకాల చిల్లర కొట్లతో, బిచ్చగాళ్లతో, పూసలు, దండలు అమ్ముకునేవాళ్ళతో, నకిలీ కాసులు అమ్ముకునేవాళ్ళతో, ఆలయానికి సంబంధం లేని క్షురకులతో, ఆవులు-దూడలతో కిక్కిరిసిపోయి ఉండేవి. వీటికి దగ్గరలోనే గుడిసెలు, మురికి వాడలు దర్శనమిచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది. దీంతో దొంగలు, యాత్రికులను బురిడీ కొట్టించి సొమ్ము దండుకునే దళారులు రెచ్చిపోయేవారు. ఇవి 1980వ దశకం ముందు వారి తిరుమల యాత్రా అనుభవాలు. ఇప్పటి వారు ఆ తిరుమలను కలలో కూడా ఊహించలేరేమో కదా. అలా మార్చినది ఎవరో తెలుసా?

1980లకు ముందు తిరుమల మాఢ వీధులు రకరకాల చిల్లర కొట్లతో, బిచ్చగాళ్లతో, పూసలు, దండలు అమ్ముకునేవాళ్ళతో, నకిలీ కాసులు అమ్ముకునేవాళ్ళతో, ఆలయానికి సంబంధం లేని క్షురకులతో, ఆవులు-దూడలతో కిక్కిరిసిపోయి ఉండేవి. వీటికి దగ్గరలోనే గుడిసెలు, మురికి వాడలు దర్శనమిచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది. దీంతో దొంగలు, యాత్రికులను బురిడీ కొట్టించి సొమ్ము దండుకునే దళారులు రెచ్చిపోయేవారు.

తమ కష్టం తీరితే ఏడుకొండలు నడిచి వస్తాం అని మొక్కుకునే భక్తులు వేంకటేశ్వరునికి కోకొల్లలు. రెండు భుజాల నిండా బ్యాగులు, చంకలో పిల్లలు, ఎండ వస్తే కాళ్ళు కాల్చుకుంటూ, వాన వస్తే తడుచుకుంటూ, నానా అగచాట్లూ పడి కొండ ఎక్కేవారు ఒకప్పుడు. తీరా కొండెక్కి, తలదాచుకుందామంటే కాటేజీల కొరత, ఫలితంగా పిల్లలతో సహా, నడిరోడ్డుపై పడుకోవాల్సిన పరిస్థితి. సరే, ఇన్ని కష్టాలూ దాటుకుని క్యూ లైన్ లోకి వెళ్తే కొన్ని గంటల వరకూ తాగడానికి నీళ్ళు, ఇబ్బంది వస్తే బాత్రూంలు కూడా లేక ఇక్కట్లు పడడమే.

ఇక ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని కళ్ళారా చూసుకుందాం అంటే బంగారు వాకిలి నుండి కొన్ని గడపల అవతల దీపాల కాంతిలో కనిపించే స్వామి వారి దర్శనం ప్రతీ వారికీ తృప్తినిచ్చేంతగా ఉండేది కాదు. మరోపక్క నడవండి నడవండి అంటూ వాలంటీర్లు, ఇంకో పక్క తీర్ధం, శఠారి ఇస్తూ పూజారులు, ఈ లోపు పిల్లలకు దర్శనం చేయించాలన్న హడావిడిలో అప్పటి భక్తులకు స్వామి దర్శనం అయ్యేది 2, 3 సెకన్లు మాత్రమే. ఇది 1980వ దశకం ముందు వారి తిరుమల యాత్రా అనుభవాలు. ఇప్పటి వారు ఆ తిరుమలను కలలో కూడా ఊహించలేరేమో కదా. అలా మార్చినది ఎవరో తెలుసా? 1978 నుండి 1982 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వాహణాధికారిగా ఉన్న శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు.

అన్నమయ్య భండాగారం బయటపడి, ఆ సంకీర్తనలను ప్రముఖ విద్వాంసులు, పండితులు పరిష్కరించి, సంగీతపరచిన తరువాత కూడా రాని పూర్తిస్థాయి ప్రచారం, ప్రసాద్ గారు చేపట్టిన అన్నమయ్య ప్రాజెక్ట్ తరువాత వచ్చింది. శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్, శ్రీమతి శోభారాజ్ వంటి ఎందరో గాయకుల చేత అన్నమయ్య పాటలను రికార్డు చేయించి, దక్షిణ భారతంలో విస్తృత ప్రచారం చేసిన ఘనత వారు రూపకల్పన చేసి, అమలుపరచిన అన్నమయ్య ప్రాజెక్ట్ కే దక్కుతుంది.

నేడు మనకి తిరుమల యాత్ర ఇంత ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మార్చాలనే, ఆ శ్రీనివాసుడు ప్రసాద్ గారిని ఈ పోస్టులో నియమించుకున్నాడేమో అనిపిస్తుంది. తిరుమల పవిత్రతను, ఆలయ ఆచారాలను, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని తన Administration skills తో ఆలయాన్ని నడిపించినప్పటి వారి అనుభవాలు ప్రతీ వారికీ అవసరమే. ఒక administrator గా, ఒక భక్తునిగా ప్రసాద్ గారు ఈ పదవిని అత్యంత సమర్ధవంతంగా చేపట్టారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే, తిరుమలలోని చాలా చోట్ల ప్రసాద్ గారి హస్తం కనిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ తన సమర్ధతగా కాక, శ్రీవేంకటేశ్వరుని బృహత్ సంకల్పంలో భాగంగా ఆయన చూసేవారు. అందుకే అన్నమయ్య ‘దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే’ అంటూ తన కీర్తనలను ఆ దేవదేవునికి సమర్పించినట్టు, ప్రసాద్ గారు కూడా తిరుమల అభివృద్ధికి తాను చేసిన పనులను ‘నాహం కర్తా, హరిః కర్తా’ అంటూ స్వామివారికే కర్తృత్వం అప్పగించారు. 

అలా నాలుగేళ్ళ కాలంలో తిరుమలలో తనకు జరిగిన అనుభవాలను, వాటిని శ్రీవేంకటేశ్వరుని సాయంతో గట్టెక్కిన విధానాన్ని ‘నాహం కర్తా, హరిః కర్తా’ అనే వ్యాస పరంపరగా స్వాతి వీక్లీలో ప్రచురించారు ప్రసాద్ గారు. సరిగ్గా 20ఏళ్ళ క్రితం ఈ వ్యాసాలు పుస్తకంగా వెలువడ్డాయి. ఈ వ్యాసాల రూపకల్పనలో, ఎడిటింగ్ లో ప్రముఖ పాత్రికేయులు, రచయిత, అనువాదకులు శ్రీ గుండు వల్లీశ్వర్ గారి సహాయం ఎంతో అమూల్యమైనది. ముందు సమస్య ను పాఠకులకు పరిచయం చేసి, తరువాత వివరాల్లోకి లాక్కుపోయి, తుఫాను వేగంతో వ్యాసాన్ని చదివించేలా రూపొందించారు వల్లీశ్వర్ గారు.

దాసుభాషితంలోకి వచ్చిన మొట్టమొదటి రచయిత ప్రసాద్ గారు కాగా, మొదటి పుస్తకాలలో నాహం కర్తా కూడా ఒకటి. అలా మన సంస్థ తొలి పుస్తకాలలో ఒకటి అయిన ఈ పుస్తకాన్ని, రచయితనూ celebrate చేసుకోవడం మన అదృష్టం. అందుకే ఈ పుస్తకం విడుదలై 20ఏళ్ళు అయిన సందర్భంగా ఈసారి ఈ పుస్తకంపైనే ప్రసంగం ఉండాలని భావించాం. మన దురదృష్టం 2017 లోనే ప్రసాద్ గారు వేంకటేశ్వరుని చేరుకున్నారు. కానీ వారి సహధర్మచారిణి శ్రీమతి గోపిక గారు, ఈ పుస్తకం రూపకర్తలలో ముఖ్యులైన శ్రీ జి.వల్లీశ్వర్ గారి ద్వారా ఆ విశేషాలు వినడం మన అదృష్టం.

ఆగస్టు మొదటి శనివారం అయిన 5వ తేదీ, ఉదయం 10గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ పుస్తకంపై క్విజ్, ఈ పుస్తకంపై గోపిక గారు, వల్లీశ్వర్ గార్ల ప్రసంగం జరుగుతుంది. కాబట్టీ, ఈ వారం రోజుల్లో ఈ పుస్తకాన్ని మన దాసుభాషితంలో విని, క్విజ్ కు తయారవ్వండి. ఆ తరువాత ఈ పుస్తకం విషయంలో వక్తలిద్దరి first hand information ను విని ఆనందిద్దాం. త్వరగా వినండి మరి.

ఓవర్ యువర్ డెడ్ బాడీ - విశ్లేషణ

Tap to Listen

‘అతి సర్వత్ర వర్జయేత్’ అని నానుడి. జీవితంలో లక్ష్యం లేక, గాలి తిరుగుళ్ళు తిరుగుతూ, రేపటి కోసం జాగ్రత్త పరుచుకోనివారి కంటే, ధనంపై అత్యాశ గల వాళ్ళే సమాజానికి అత్యంత ప్రమాదకరం. అత్యాశ, అసూయ మనిషి దిగరాని స్థాయికి దిగజార్చే రెండు అగాధాలు. మనం సంపాదించుకోవాలి, బాగుపడాలి అనుకోవడం ఎంత ముఖ్యమో, ఆ సొమ్ము ఇతరుల నాశనం నుండి వచ్చినా ఫరవాలేదు అనుకోకుండా, నిజాయితీగా సంపాదించడం అంత కన్నా ముఖ్యం.

ఎదుటివారి ప్రాణాలకన్నా తమ సుఖం, డబ్బే ముఖ్యం అనుకునేవారు ప్రతీ సమాజంలోనూ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలా అనుకునే మనిషే షైలా. ఈ నవలలోని ప్రధాన పాత్ర. నిజానికి ఈ నవలలో కథానాయకులు కానీ, కథానాయికలు కానీ ఉండరు. దాదాపుగా అందరూ grey characters. ముఖ్యంగా షైలా, తాను డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా, ఎదుటివారు చనిపోతున్నా పట్టించుకోని అత్యాశాపరురాలు. పైగా ఆ డబ్బులేమీ తన కష్టార్జితం కాదు. ఎదుటివారి నమ్మకాన్ని సంపాదించి, సరైన సమయం చూసుకుని మోసగించి, ఆ డబ్బులతో పరారైపోయి, జీవితాన్ని నిర్మించుకునే పాత్ర.

ఉర్సులా కర్టీస్ రాసిన ‘ఒవర్ యువర్ డెడ్ బాడీ’ అనే ఈ నవల మానవ నైజాన్ని పరిచయం చేస్తుంది. కేవలం తను తప్ప, మరే ఇతర ప్రాణి ముఖ్యం కాని షైలా అనే అమ్మాయి జీవితం ఎలా మొదలైందో, చివరకు ఎక్కడకు చేరుకుందో వివరించే ఈ నవల పరిచయాన్ని మనకు అందించారు ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ గారు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అనే సామెత బహుశా ఈ పాత్రను చూసే వచ్చిందేమో అనిపిస్తుంది ఈ నవల గురించి వింటే. 

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :